కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని రేకుర్తి శివారులో గల సర్వేనెంబర్ 55లో అన్యాక్రాంతంగా కబ్జాలకు గురైందని దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ప్రభుత్వ భూమి కాపాడాలని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు ఒకసంయుక్త ప్రకటనలో డిమాండ్ చేశారు. కరీంనగర్ మేయర్ సునీల్ రావు తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని సర్వే నెంబర్ 55లోని ప్రభుత్వ భూమిని అదేవిధంగా స్మశాన వాటికకు సంబంధించిన భూమిని కబ్జా చేశాడని ఆరోపణలు వస్తున్నాయని ఇది దుర్మార్గమని కబ్జాదారులు ఎంతటి వారైనా శిక్షించాలని వారు కోరారు. మేయర్ ఈసర్వే నంబర్ లోని భూమిని కబ్జాకు పాల్పడనట్లయితే పత్రికా ముఖంగా వచ్చి ప్రజలకు వివరణ ఇవ్వాలని అన్నారు. ఈయొక్క సర్వే నంబర్లు స్మశాన వాటిక స్నానాపు గదులు, బోరు ఇతర పనుల కోసం గత గ్రామపంచాయతీ పదిహేను లక్షల రూపాయలను కూడా మంజూరు చేసిందని దీనిని కూడా లెక్క చేయకుండా కబ్జాలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఎక్కడ చూసిన ప్రభుత్వ భూములను ప్రజా ప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు గత ప్రభుత్వ హాయంలో దిగమింగారని చెరువులను, కుంటలను, పరం పోగు, ఎస్ఆర్ఎస్పి భూములను సైతం వదలకుండా అక్రమలకు గురి చేశారని కరీంనగర్ ఆనుకుని ఉన్న బొమ్మకల్, సీతారాంపూర్, ఆరేపల్లి, తీగల గుంటపల్లి, నగునూరు, చింతకుంట, కమాన్ పూర్, కొత్తపెళ్లి, పద్మనగర్ గ్రామాలను పూర్తిగా కబ్జాలమయం చేసి దిగమింగారని ఆరోపించారు. కరీంనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా అక్రమనకు గురైన భూములను వెంటనే రెవెన్యూ అధికారులు పర్యవేక్షించి ప్రభుత్వ భూమిని కబ్జాదారులనుండి లాక్కొని పేద ప్రజలకు పంచాలని కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. లేనిపక్షంలో ప్రజలను ఐక్యం చేసి ప్రభుత్వ భూములను సిపిఐ ఆధ్వర్యంలో అక్రమించి ఇండ్లు లేని పేద ప్రజలకు పంచుతామని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజులు హెచ్చరించారు.