భద్రాచలం నేటి ధాత్రి
ప్రభుత్వం స్పందించి నష్టపోయిన వరి పంటను అంచనావేసి మట్టినే నమ్ముకున్న రైతులను కాపాడుకోవాలి.
వరి పంట ఎకరాకు సుమారు 50 వేల చొప్పున 8 ఎకరాలకు నాలుగు లక్షల నష్టం వాటిల్లింది.
ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాలు తప్పవు.
నష్టం వాటిల్లిన క్రమంలో హరిగోశపడుతూ, నరకం అనుభవిస్తున్న రైతన్నలకు ప్రభుత్వం ఆర్థిక నిధిని అందించి నష్టపోయిన రైతుల కుటుంబాలకు అండగా నిలవాలి.
అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం చర్ల మండల నాయకులు కొండా కౌశిక్ డిమాండ్.
చర్ల మండల పరిధిలోని గుంపెనగూడెం గ్రామాన్ని సోమవారం అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం మండల నాయకులు కొండా కౌశిక్ సందర్శించడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ రైతుల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో ఉన్న గుంపెనగూడెం గ్రామంలో ఇటీవల కురిసిన భయంకరమైన వర్షాల తుఫాన్ల కారణంగా భారీ వరదలు రావడంతో సుమారు 8 ఎకరాలు వరి పంటలు మొత్తం నీట మునిగి రెండు మూడు రోజులు నీరు నిల్వ ఉండడంతో వరి పంటల మొత్తం సర్వనాశనం అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తిని తినక కష్టం చేసి చెమటోడ్చి వ్యవసాయమే ఊపిరిగా చేసుకొని బ్రతుకుతుంటారని ఆయన తెలిపారు. ఇప్పటికే దుక్కులపేరిట, కూలీలా పేరిట, ఎరువుల పేరిట, పై మందుల పిచికారీ పేరిట, వరి పంట ఎకరాకు సుమారు 50 వేల రూపాయలు ఖర్చు చేశామని అలా ఎనిమిది ఎకరాల వరకు నష్టం వాటిల్లిందని రైతుల క్లుప్తంగా తెలిపారు అన్నారు. ఈ పెట్టుబడి నగదును బయట ఐదు రూపాయల వడ్డీలకు తీసుకొచ్చి వరి పంట వ్యవసాయానికి పెట్టుబడిగా పెట్టామని తీరా చూస్తే వరదల కారణంగా పంటలు మొత్తం సర్వనాశనం అయ్యాయని రైతన్నలు గోడువెళ్ళబుచ్చారన్నారు. తక్షణమే ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నష్టపోయిన రైతాంగాన్ని గుర్తించి వారిని ఆదుకోవాలని తద్వారా రైతంగాన్ని కాపాడుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నష్టపోయిన రైతులు బంటు ఏడుకొండలు, మెంతుల సత్యనారాయణ, సోడి భద్రమ్మ, బంటు వెంకటేశ్వరరావు, బంటు మల్లయ్య, బంటు మల్లికార్జునరావు, బంటు చిన్న వెంకన్న, సోడే బాలరాజు, మెంతుల శ్రీను, మెంతుల వెంకటేశ్వర్లు, కోరం శ్రీను, ఆంద్రన్న, రవి,తదితరులు ఉన్నారు.