ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్ అభివృద్ధికై చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీ, కెజిబివి, మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టేందుకు ఇంజినీరింగ్ అధికారులు వాస్తవ నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీ, కేజిబివి, మోడల్ రెసిడెన్షియల్ వసతి గృహాల్లో మరమ్మతులు, ప్రాథమిక, కమ్యూనిటి ఆసుపత్రులు నిర్మాణ ప్రగతి పనులపై పంచాయతి రాజ్, గిరిజన సంక్షేమ, టీజి డబ్ల్యూఐడిసి, టిజిఎంఐడిసి, వైద్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎస్సి, ఎస్టీ, మైనార్టీ, కెజిబివి, మోడల్ రెసిడెన్షియల్ వసతి గృహాలు 55 ఉన్నాయని, అట్టి వసతి గృహలు మరమ్మతులు చేపట్టేందుకు సోమవారం వరకు అంచనా నివేదికలు అందచేయాలని టిజి డబ్ల్యూఐడిసి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఉప ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల నిర్మాణ ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిలో సిటీ స్కాన్ యంత్రం ఏర్పాటుకు అయ్యే ఖర్చులకు ప్రతిపాదనలు ఇవ్వాలని తెలిపారు. మూడు నెలల వ్యవధిలో సిటీ స్కాన్ సేవలు అందుబాటులోకి తేవాలని అందుకొరకు యంత్రం ఏర్పాటుకు రూములో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. వసతి హృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు ఇదివరకే ఆయా శాఖల అధికారులు, విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి మరమ్మతులు నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఆయా శాఖల ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో వసతిగృహాలను తనిఖీ చేసి వినియోగంలో ఉన్న ఆర్ ఓ ప్లాంట్లు, నూతనంగా ఏర్పాటు చేయాల్సిన ఆర్ ఓ ప్లాంటులపై ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు.
మరుగుదొడ్లు మరమ్మతులు, అదనపు మరుగుదొడ్ల నిర్మాణం, తలుపులు, కిటికీలు ఏర్పాటు, రక్షిత మంచినీటి కోసం ఆర్వో వాటర్ ప్లాంట్, సోలార్ వాటర్ హీటర్, విద్యుత్ హీటర్లు ఏర్పాటు, కోతుల బెడద నివారణకు ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు లాంటి అవసరాలకు అంచనాలు ఇవ్వాలని అన్నారు.
జిల్లాలో నిర్మాణం పూర్తయిన ఆరోగ్య కేంద్రాలకు రంగులు వేయు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఇంకా నిర్మాణంలో ఉన్న సబ్ సెంటర్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కొన్నిచోట్ల నిర్మాణం మొదలు పెట్టని హెల్త్ సెంటర్ల నిర్మాణం చేపట్టాలని టిజిఎంఐడిసి అధికారులను ఆదేశించారు.
జిల్లాలో పూర్తిస్థాయిలో హెల్త్ సబ్ సెంటర్లు అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రజలకు వైద్య సేవలు అందుతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్యాధికారి డా మధుసూదన్
పీఆర్ ఈ ఈ దిలీప్, టీజడబ్ల్యూఐడిసి ఈ ఈ నరేందర్ రెడ్డి, టిజిఎంఐడిసి ఈ ఈ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!