భూపాలపల్లి నేటిధాత్రి
హైదరాబాద్ బేగంపేటలోని, సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కనగల టూరిజం ప్లాజాలో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు వికలాంగుల పోస్టల్ బ్యాలెట్ రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు జిల్లా ఎన్ పి ఆర్ డి( దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక)జిల్లా అధ్యక్షులు గుండెబోయిన నీలాంబరం, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాసాని నర్సింగరావు ఎనమిది మండలాల అధ్యక్షులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాసాని నర్సింగరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఈసారి పోస్టల్ ఓట్లు నమోదు కావడంతోపాటు అభ్యర్థుల గెలుపోటముల్లో ఇవి కీలకపాత్ర పోషించనున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి దాదాపుగా 13 లక్షల మందిని పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గుర్తించారు. దివ్యాంగులు,80 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ కు అవకాశం కల్పించడమే దీనికి ప్రధాన కారణం. రాష్ట్రంలో దివ్యాంగులు 5.06 లక్షలమంది ఉన్నారు.గతంలో కేవలం ఎన్నికల విధుల్లో ఉన్నవారికి,సర్వీసు ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉండేది. కానీ కరోనా నాటి నుంచి దివ్యాంగులు,80 ఏళ్లు పైబడిన వారికి ఈ అవకాశం కల్పించారు. దీంతో పోస్టల్ ఓట్లు ఉపయోగించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. లక్షల్లో ఓట్లు ఉండడంతో అభ్యర్థుల గెలుపోటముల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ రాష్ట్రస్థాయి సదస్సులో జిల్లా అధ్యక్షులు గుండెబోయిన నీలాంబరం, రేగొండ మండల అధ్యక్షులు పోగు రవీందర్ , గోరి కొత్తపల్లి మండల అధ్యక్షులు మెరుగు చంద్రమౌళి, చిట్యాల మండల అధ్యక్షులు గూట్ల ప్రభాకర్, మొగుళ్లపల్లి మండల అధ్యక్షులు గంజి రమేష్ పాల్గొన్నారు.