రామడుగు, నేటిధాత్రి:
విద్యార్థులు సాయికిరణ్ ను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని సరస్వతి హైస్కూల్ కరస్పాండెంట్ ఉప్పుల శ్రీనివాస్ అన్నారు. యూపీఎస్సీ ఫలితాల్లో గ్రామానికి చెందిన నందాల సాయికిరణ్ జాతీయస్థాయిలో ఇరవై ఏడవ ర్యాంకు సాధించినందుకు పాఠశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సాయికిరణ్ అంచెలంచెలుగా ఎదిగి ఆన్ లైన్ కోచింగ్ తో జాతీయస్థాయిలో ర్యాంకు సాధించడం గర్వకారణమన్నారు. తన ప్రతిభకు పేదరికం అడ్డుకాదని, కష్టపడి చదివితే ఎంతటి ఉన్నత స్థాయికైనా ఎదగవచ్చని నిరూపించారన్నారు. ఈకార్యక్రమంలో స్కూల్ కోకరస్పాండెంట్ ఉప్పుల సత్యం, తేజ స్కూల్ కరస్పాండెంట్ దేవేందర్రావు, సామాజిక కార్యకర్త కల్లెపల్లి పర్శరాం, తదితరులు పాల్గొన్నారు.