టీజేఎస్ గుండాల మండల అధ్యక్షుడు గొల్లపల్లి రమేష్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన 2023 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. అయితే ఈ సారి కాంగ్రెస్ విజయం సాధించడంలో అనేక మంది కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, అవినీతి జరిగిదంటూ కోదండరాం వంటి మేధావులు చేసిన కృషి ఫలించింది. అంతేకాక కేసీఆర్ ను ఓడించేందుకు అందరూ కలిసి పోటీ చేయాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలోనే 2023 ఎన్నికల్లో టీజేఎస్ పోటీకి దూరంగా ఉండటమే కాకుండా.. కాంగ్రెస్ కు పూర్తి మద్దతు కూడా ప్రకటించింది అని గుండాల మండల టీజేఎస్ అధ్యక్షుడు గొల్లపల్లి రమేష్ పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ విజయంలో టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పాత్ర కూడా ఉంది. టీజేఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పనిచేయమని పిలుపునిచ్చి..హస్తం విజయానికి చేసిన కృషి ఫలించింది అని తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆయన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వాలని మండల అధ్యక్షుడు గొల్లపల్లి రమేష్ తెలిపారు. ఇటీవల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎంతో కృషిచేసిన ప్రొఫెసర్ కోదండరాం ను కేబినెట్ లోకి తీసుకొని విద్యాశాఖ మంత్రిగా నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ కోదండరాం క్రియాశీలక పాత్ర పోషించారని, ప్రజా శ్రేయస్సుకై ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విద్యావేత్త, తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విద్యాశాఖ మంత్రి పదవికి అన్నివిధాలుగా అర్హులు అని పేర్కొనడం జరిగింది. కాంగ్రెస్ హయాంలో కోదండరాంకు పూర్తి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు టీజేఎస్ గుండాల మండల నాయకులు గడ్డం రాములు, గడ్డం భద్రం మరియు వట్టం కృష్ణ తదితరులు తెలియజేశారు.