వైద్యుల నిర్లక్ష్యం.. బాలుడికి ప్రాణాపాయం!

తల్లిదండ్రుల చాకచక్యంతో తప్పిన ప్రమాదం!

“అనుభవంలేని వైద్యులచే అపెండిక్స్ ఆపరేషన్లు” అని గతంలో ప్రచురించిన “నేటిధాత్రి” పత్రిక

హనుమకొండ డీ.ఎం.హెచ్.ఓ కు ఫిర్యాదు చేసి 7నెలలు అవుతున్న వారి నుండి ఎలాంటి స్పందన లేదని వాపోతున్న తల్లిదండ్రులు.

బాలసముద్రంలోని శ్రీ ఉదయ్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోండి. బాలుడి తల్లిదండ్రుల వేడుకోలు

నేటిధాత్రి, వరంగల్

వైద్యుల నిర్లక్ష్యంతో నగరంలో మరో అపెండెక్స్ ఆపరేషన్ ఫెయిల్యూర్ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం, గురజాల గ్రామానికి చెందిన కొక్కు సదానందం, సునీతల ఏకైక సంతానం కొక్కు తనీష్ (13 సంవత్సరాలు). నిరుపేద కుటుంబానికి చెందిన బాలుడి తల్లిదండ్రులు కూలికి వెళ్తే కానీ ఇల్లు గడవని పరిస్థితి. తమ ఒక్క కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అతడికి ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.

అకస్మాత్తుగా కడుపులో నొప్పి, తనీష్ ఆపరేషన్:

ఒకరోజు అనుకోకుండా తనీష్ కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు హుటాహుటిన వారికి తెలిసిన పిల్లల డాక్టర్ వద్దకు వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం అపెండిక్స్ అని తేలడంతో పెద్ద ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించమని సలహా ఇచ్చాడు. ఆ వైద్యుడి సలహా మేరకు 02-07-2023 రోజున హనుమకొండ లోని బాలసముద్రం, కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న “శ్రీ ఉదయ్ మల్టీ స్పెషాలిటీ” ఆసుపత్రికి బాలుడిని తీసుకెళ్లగా, డాక్టర్ జితేందర్ బాలుడిని పరీక్షించి వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పినట్లు తెలిపారు. తల్లిదండ్రులు, తమకు తెలిసిన ఇతర డాక్టర్లను సంప్రదించాలనుకుంటున్న సందర్భంలో, డాక్టర్ జితేందర్ జోక్యం చేసుకొని సమయం వృధా చేయవద్దని, ఆపరేషన్ అత్యవసరమని చెప్పడంతో, కొడుకు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా 40వేలకు ఆపరేషన్ తో పాటు, అన్ని మెడికల్ చార్జీలు భరించేందుకు ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకొని ఆపరేషన్
చేపించినట్లు తెలిపారు. ఆ తర్వాత డాక్టర్ సూచన మేరకు రెండు రోజుల అబ్జర్వేషన్ అనంతరం తేదీ. 06-07-2023 రోజు డిశ్చార్జి చేసి ఇంటికి తీసుకెల్లామని తెలిపారు.

డాక్టర్ నిర్లక్ష్యం, బాలుడికి ప్రాణాపాయం..!

డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తనీష్ కు, మళ్ళీ ఆరోగ్య సమస్యలు రావడంతో మరోసారి ఉదయ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు. ఆపరేషన్ తర్వాత వచ్చే చిన్న సమస్య మాత్రమే అని డాక్టర్ జితేందర్ చెప్పడంతో, తేదీ 17-07-2023 వరకు ఆసుపత్రిలోనే చికిత్స చేయించి 50 వేల రూపాయల బిల్లు ఆసుపత్రికి చెల్లించి, డిశ్చార్జ్ చేయించుకుని ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. అనంతరం రోజురోజుకు తనీష్ ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో, తేదీ 01-08-2023 రోజున మరోసారి ఉదయ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించగా, డాక్టర్ జితేందర్ చికిత్స చేశాడు. తల్లిదండ్రులు డాక్టర్ జితేందర్ ను వారి కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి గట్టిగా నిలదీయగా, డాక్టర్ జితేందర్ చేతులెత్తేశాడని, వారి కుమారుడికి సీరియస్ గా ఉందని, వెంటనే మరింత పెద్ద ఆసుపత్రికి తరలించి అధునాతన చికిత్సను అందించాలని చెప్పడంతో, దీంతో హుటాహుటిన డిశ్చార్జ్ చేయించుకుని హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్ల బృందం పరిశీలించి డాక్టర్ జితేందర్ బాలుడికి చేసిన అపెండిక్స్ ఆపరేషన్ వికటించిందని చెప్పడంతో ఆందోళనకు గురైనట్లు తెలిపారు. చిన్న ఆపరేషన్ వికటించడంతో పెద్ద సమస్యగా మారడంతో పాటు, ఆర్థిక భారంగా మారిందని యశోద వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఇదంతా తెలుసుకున్న డాక్టర్ జితేందర్ అనుచరుడు ఒకరు యశోద ఆసుపత్రికి వచ్చి, డాక్టర్లతో మరియు తనీష్ తల్లిదండ్రులతో రాయబారం నడిపించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆసమయంలో డాక్టర్ జితేందర్ ను ఏమీ అనలేకపోయమని పేరెంట్స్ తెలిపారు. తమ కుమారుడి ఆపరేషన్ కొరకు, వారు తమ స్నేహితులు, బంధువుల దగ్గర అప్పు చేసి, 8లక్షల రూపాయలు యశోద యాజమాన్యానికి చెల్లించినట్లు తెలిపారు. వారి కుమారుడిని డిశ్చార్జ్ చేయించుకుని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లామని మీడియాతో తెలిపారు. శ్రీ ఉదయ్ హాస్పిటల్ లో ఆపరేషన్ చేసిన డాక్టర్ జితేందర్, హైదారాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులతో నిరంతరం సంభాషిస్తూ, తనీష్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, వారి కుమారునికి ప్రాణాపాయం తప్పింది కనుక తనను విడిచిపెట్టాలని వారిని బ్రతిమిలాడినట్లు పేరెంట్స్ తెలిపారు.

తల్లిదండ్రుల ఫిర్యాదు.. స్పందన కొరవ?

బాలుడు తనీష్ తల్లిదండ్రులు, డాక్టర్ జితేందర్ మరియు శ్రీ ఉదయ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యొక్క నిర్లక్ష్యాన్ని వివరిస్తూ.. వారిపై వెంటనే ఎంక్వయిరీ చేసి, చర్యలు తీసుకోవాలని కోరుతూ హనుమకొండ డీ.ఎం.హెచ్.ఓ కు తేదీ31-06-2024 రోజున
పిర్యాదు చేసినట్లు తెలిపారు. మూడు నెలల అనంతరం అనగా తేది 13-11-2024 రోజున, డా.ఎస్. విజయ కుమార్ (డిప్యూటీ డీ.ఎం.హెచ్.ఓ) ని, ఎంక్వైరీ ఆఫీసర్ గా నియమిస్తున్నట్లు డీ.ఎం.హెచ్.ఓ కార్యాలయం ప్రకటన జారీ చేసింది. అనంతరం, విచారణ పురోగతి గురించి తనిష్ తల్లిదండ్రులు డీ.ఎం.హెచ్.ఓ ను సంప్రదించగా తాము శ్రీ ఉదయ్ హాస్పిటల్, హనుమకొండ మరియు యశోద హాస్పిటల్, సికింద్రాబాద్ నుండి కేసు షీట్స్ తెప్పించుకున్నామని లిఖితపూర్వకంగా తేది 12-12-2024 రోజున సమాధానం ఇచ్చిన లేఖను పేరెంట్స్ చూపించారు. డీ.ఎం.హెచ్.ఓ కు ఫిర్యాదు ఇచ్చి 7నెలలు అవుతున్న కూడా, విచారణ ఇంకా నత్తనడకన జరుగుతూ ఉండడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డీ.ఎం.హెచ్.ఓ చర్యలు శూన్యంగా ఉండడంతో, విచారణలో జాప్యం జరగకుండా ఉండేందుకు తేది23-03-2024 నాడు, వరంగల్ పోలీసు కమిషనర్ కు పోస్టు ద్వారా ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. వారి నుండి కూడా స్పందన కొరవవడంతో, తేది 04-12-2024 రోజున స్వయంగా వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసిన పేరెంట్స్, వెంటనే స్పందించిన పోలీసు కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, హనుమకొండ ను విచారించాలని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. హనుమకొండ ఎసిపి కార్యాలయం అధికారులు, అబ్బాయి తనీష్ తల్లిదండ్రులమైన మమ్మల్ని మాత్రమే విచారణకు పిలుస్తున్నారని, కానీ సంఘటనకు కారణమైన డాక్టర్ జితేందర్ ను, లేదా సదరు ఆసుపత్రి యాజమాన్యాన్ని పిలిచి విచారించడం లేదు అని బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యాయం చేయండి, తనీష్ తల్లిదండ్రుల వేడుకోలు

తాము డీ.ఎం.హెచ్.ఓ కు, పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన వారి నుండి ఎలాంటి స్పందన లేదని, విచారణ శూన్యంగానే ఉందని, తాము మానసికంగా కృంగిపోయామని, ఆర్థికంగా చితికిపోయామని, వారిపై చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయడంతో పాటు తమకు జరిగిన అన్యాయం మరి ఇంకే కుటుంబానికి జరగకుండా చూడాలని తనీష్ తల్లిదండ్రులు సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version