జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని గంగిపల్లి గ్రామాన్ని శనివారం రోజున జైపూర్ ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ సందర్శించారు. గంగిపల్లి గ్రామపంచాయతీ లోని అమ్మ ఆదర్శ పాఠశాలను సందర్శించి పాఠశాల మరమ్మత్తు పనులను పర్యవేక్షించారు. పెయింటింగ్ పనులను, నీటి సదుపాయానికి అవసరమైన పైప్ లైన్లను,నల్లాలను బిగించే పనులను, గదులలో మరమత్తులను పర్యవేక్షించి తగు సూచనలు తెలియజేశారు. అలాగే గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి మొక్కలకు ప్రతిరోజు నీరు పోయాలని, అవసరమైన జాగ్రత్తలను వహించి మొక్కలన్ని పెరిగేలా చూసుకోవాలని, సేంద్రీయ ఎరువులను ఉపయోగించుకోవాలని తెలియజేశారు. డంపింగ్ యార్డ్ సందర్శించి ప్రతిరోజు గ్రామాల్లో చెత్త సేకరణ తప్పకుండా నిర్వహించాలని, ప్లాస్టిక్ వ్యర్ధాలను రోడ్లపై లేకుండా చూసుకోవాలని, తడి చెత్తను ,పొడి చెత్తను వేరువేరుగా సేకరించి సేంద్రీయ ఎరువులను సమృద్ధిగా తయారు చేసుకోవాలని సూచించారు. వైకుంఠధామం పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచాలని చుట్టూ మొక్కలు నాటాలని నీటి సదుపాయాన్ని అన్నివేళలా ఉండేలా చూసుకోవాలని గ్రామపంచాయతీ సెక్రటరీకి, పారిశుద్ధ్య సిబ్బందికి తెలియజేయడం జరిగింది. అనంతరం గ్రామ సచివాలయంలోని రికార్డులను తనిఖీ చేయడం జరిగింది.
మొక్కలను పిల్లల మాదిరి చూసుకోవాలి
జైపూర్ మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ సందర్శించారు. ఉద్యానవనంలోని మొక్కలను చిన్నపిల్లల మాదిరిగా శ్రద్ధ చూపిస్తు ప్రతిరోజు నీటిని అందిస్తూ సమృద్ధిగా మొక్కలన్ని పెరిగేలా చూసుకోవాలని, తగినంత పెరిగిన మొక్కలను నాటడానికి పంపించాలని, ఉన్న వాటిలో మేలు రకం మొక్కలను వాటి ఎదుగుదలను బట్టి గ్రేడింగ్ ద్వారా వాటిని అభివృద్ధి చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ కి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామపంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.