రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో నేచర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 56 ఫీట్ల అతిపెద్ద జాతీయ జెండాను కరీంనగర్ ఎంపీ, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ భారత జాతి స్వాతంత్య్రానికి గుర్తింపు ఈజెండా అని ఎన్నో మహత్తర ఆశయాల సంకేతంగా ఏర్పడిన ఈత్రివర్ణ పతాకం డెబ్బై ఏడు ఏళ్లుగా స్వతంత్ర్య భరత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతూ రెపరెపలాడుతోందని అన్నారు. ఈజెండాను చూస్తే గాంధీ, బోస్, భగత్ సింగ్, సావర్కర్ వంట. స్వతంత్ర సాధన కోసం ఉద్యమించిన నేతల త్యాగం గుర్తొస్తుందని అన్నారు. ఈమువ్వెన్నెల జెండా రూపొందించిన పింగళ వెంకయ్య మన తెలంగాణ వాడు కావడం గర్వకారణం అని అన్నారు. ఎవరెస్టు ఎక్కినా, చంద్ర మండలంపై అడుగు పెట్టినా, అంతర్జాతీయ స్థాయిలో ఆటల్లో రాణించినా, ఇలా విజయం సాధించిన ప్రతి సందర్భంలో కళ్ల ముందు కనిపించేది దేశపు జెండాయే. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే జాతీయ పతాకంను ఎగరేయకపోతే ఆవిజయానికి విలువే ఉండదని బలంగా విశ్వసిస్తారని ఆత్రివర్ణ పతాకం అంతెత్తున రెపరెపలాడుతుంటే ఏదో తెలియని భావోద్వేగం కలుగుతుంది అన్నారు. ముఖ్యంగా బానిసత్వాన్ని ఎదిరించి గెలిచిన భారత్ లాంటి దేశాల్లో జాతీయ జెండాకున్న ప్రాధాన్యత వెలకట్టలేనిది. భారతదేశ జాతీయ పతాకం గొప్పతనం ఇప్పుడు మరింత రెట్టింపైంది. మన జెండా పవర్ ఏంటో రష్యా, ఉక్రెయిన్ యుద్దం నిరూపించింది. ఆయుద్దంతో ఆయా దేశాల్లో నివసించే విదేశీ పౌరులంతా తమ తమ దేశాలకు ఎట్లా వెళ్లాలో తెలియక అల్లాడుతుంటే ఉక్రెయిన్ లో నివసించే తమ దేశ పౌరులను పంపించాలని ఆయా దేశాలు మొత్తుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కానీ ఆసమయంలో మన ప్రధాని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ ప్రధానులతో మాట్లాడి ఒప్పించి ప్రత్యేక విమానాన్ని పంపించి ఉక్రెయిన్ లో ఉన్న మన పౌరులందరినీ సురక్షితంగా తీసుకురాగలిగారు. ఇతర దేశాల పౌరులు సైతం మన జెండా చేతపట్టి అక్కడింది సురక్షితంగా బయటపడ్డారు. ఏదేశ జాతీయ జెండాకు ఎక్కువ గౌరవమిస్తారో తెలుసా? ఏదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందో, ఏదేశంలో ఆర్దిక ప్రగతి వేగం పుంజుకుంటుందో, ఏదేశంలో సమానత్వం వెల్లివిరుస్తుందో ఆదేశ జెండాను యావత్ ప్రపంచం గౌరవిస్తోందని, ఆర్దిక ప్రగతిలో పదవ స్థానంలో ఉన్న భారత్ నేడు ఐదవ స్థానానికి చేరుకుందని, ప్రపంచ దేశాలన్నీ గర్వపడేలా అత్యున్నత ప్రజాస్వామ్య పాలన మన దేశంలోనే కొనసాగుతోందని, మన పక్కనే ఉన్న పాకిస్తాన్ కు కూడా మనతోపాటే స్వాతంత్ర్యం వచ్చింది. ఆదేశానికి జాతీయ జెండా ఉంది. కానీ ఆదేశాన్ని, ఆదేశ జెండాను ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయా? లేదు. ఎందుకంటే ఆదేశంలో అసలు ప్రజాస్వామ్యమే లేదు. ఆదేశంలో హిందువులు బతకగలరా?.లేదు. ఆదేశంలో మహిళలకు స్వేచ్ఛ ఉందా? లేదు. పేరుకే ప్రజాస్వామ్యం కానీ అంతా మిలటరీ చెప్పినట్లు పాలన కొనసాగాల్సిందే, లేకుంటే ప్రధాని అయినా దేశాధ్యక్షుడినైనా జైల్లో వేస్తారు లేదా ఆదేశం వదలి పారిపోతారు. జనరిక్ ఔషధాల తయారీలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో భారత్ ను నిలిపారని, ప్రపంచ డిమాండ్‌లో యాభై శాతానికి పైగా భారత్ వ్యాక్సిన్లు తయారు చేస్తోందని, కరోనా వ్యాక్సిన్ ను ప్రపంచానికి అందించి ప్రాణాలను కాపాడారని కొనియాడారు. సిమెంట్, బొగ్గు, ఉక్కు ఉత్పత్తిలోనే ప్రపంచంలోనే భారత్ రెండవ స్థానంలో, విద్యుత్ ఉత్పత్తిలో మూడవ స్థానంలో నిలిపారని, మరో ఐదేళ్లలో ప్రపంచంలోనే భారత్ ఆర్దిక ప్రగతిలో మూడవ స్థానానికి చేర్చబోతుందన్న చర్చ జరుగుతుందని, 2047 నాటికి మొదటి స్థానం చేరే దిశగా మోడీ పాలన కొనసాగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన జాతీయత భావను స్ఫూర్తి నింపుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండాను హృదయపూర్వకంగా గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఈసందర్భంగా నేచర్ యూత్ క్లబ్ సభ్యులను వారు అభినందించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్, బిజెపి పార్టీల మండల అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, ఒంటెల కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీలు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, ఎడవెల్లి కరుణశ్రీ, మడ్డి శ్యాంసుందర్ గౌడ్, జవ్వాజి హరీష్, మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ, నేచర్ యూత్ క్లబ్ అధ్యక్షులు కాసారపు పర్షరాం గౌడ్, మాజీ సర్పంచ్ లు నేరెళ్ల అంజయ్యగౌడ్, కళ్ళెం సత్తమ్మ, దాసరి సత్తమ్మ, కర్ర సత్య ప్రసన్న, చుట్టుపక్కల గ్రామాల మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామ స్పెషల్ ఆఫీసర్, ఎంపీవో బండ రాజశేఖర్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ పాషా, అక్షర, ఆల్ఫోర్స్, శ్రీప్రగతి పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, నేచర్ యూత్ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.