సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా
భూపాలపల్లి నేటిధాత్రి
దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతుందని ప్రజల్లో చీలిక తీసుకువస్తూ మతతత్వ రాజకీయాలను పెంచి పోషిస్తుందని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజు అన్నారు.
జిల్లా కేంద్రంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరిగిన సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా సదస్సుకు పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అధ్యక్షత వహించారు.
ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా పాల్గొని మాట్లాడుతూ.
దేశ రాజకీయాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆయన తెలిపారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బిజెపి ప్రభుత్వం గౌరవించడం లేదని ప్రజల హక్కుల్ని నిరాకరిస్తుందని సామ్రాజ్యవాదులకు దాసోహమై పరిపాలన చేస్తుందని ఆరోపించారు. తెలంగాణలోనూ మద్దతు శక్తుల ప్రమాదం జరిగిందని అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే దానికి నిదర్శనం అన్నారు. బిజెపి ఎదుగుదలకు బిఆర్ఎస్ పార్టీ అనుసరించిన విధానాలు ఉపయోగపడ్డాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ అనుసరించిన ఆర్థిక విధానాలను రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తుందని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజా సంక్షేమ కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు. విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం యువత నైపుణ్యాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రజలు తిరస్కరించే అవకాశం ఉందన్నారు. తెలంగాణ అంటేనే కమ్యూనిస్టులు, గుర్తుకు వస్తారని అలాంటి ఈ గడ్డపై వామపక్ష శక్తులు బలహీన పడడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. కమ్యూనిస్టులు బలోపేతం కావాలని, లిబరేషన్ ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆ విధమైన కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్లాలని రమేష్ రాజా అన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసే చర్యలు మానుకోవాలని ప్రజా అనుకూల పరిపాలన చేయాలని ఏఐసీసీటియు రాష్ట్ర కార్యదర్శి రొయ్యల రాజు అన్నారు. స్వరాష్ట్ర ఏర్పడి పదేళ్ల కాలం పూర్తయిందని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా నష్టపరిచిందని, సుమారుగా 8 లక్షల కోట్ల అప్పు పెరిగిందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం చేయకూడదని, రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బిజెపి ప్రమాదాన్ని ప్రజా పోరాటాల ద్వారా అడ్డుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
ఈ సమావేశంలో జిల్లా నాయకులు చంద్రగిరి శంకర్, ప్రజా సంఘాల నాయకులు శీలపాక నరేష్, రవి, రాకేష్, ప్రకాష్, రాము, లక్ష్మణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు