మంచిర్యాల,నేటి ధాత్రి:
సికింద్రాబాద్- నాగ్ పూర్ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ బుధవారం రోజున ఢిల్లీలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ మరియు బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది.కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నివేదిక మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే లో ఆదాయ పరంగా మంచిర్యాల రైల్వే స్టేషన్ ఎన్ఎస్ జి 4 జాబితా లో 30 వ స్థానంలో ఉందని అత్యధిక ఆదాయం ఉన్న మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత రైలు నిలుపుదల చేయడం లేదని కిషన్ రెడ్డి కి తెలిపారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క రైల్వే స్టేషన్ లో కూడా వందే భారత్ హాల్టింగ్ లేదని వారి దృష్టికి తీసుకెళ్లారు.మంచిర్యాల రైల్వే స్టేషన్ నుండి నిత్యం అనేక మంది వ్యాపారస్తులు,విద్యార్థులు మరియు ఉద్యోగులు హైదరాబాద్ మరియు నాగ్ పూర్ వెళ్తుంటారని మంచిర్యాల రైల్వే స్టేషన్ లో రైలు నిలిపితే రైల్వే సంస్థకు అధిక ఆదాయం రావడంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది కావున ఈ విషయం సంబధిత రైల్వే అధికారులు దృష్టికి తీసుకువెళ్లి మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలు హాల్టింగ్ కల్పించే విధంగా కృషి చేయాలని వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వర్ రావు,మంచిర్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్,రవీందర్ రావు,బెల్లంకొండ మురళీధర్,జయరామ రావు పాల్గొన్నారు.