– కమ్మగోని చైర్మన్ గా ఐలోని మల్లన్న ఆలయ తాత్కాలిక కమిటీ
– మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే, టీజీ క్యాబ్ చైర్మన్
ఐనవోలు/హన్మకొండ:-
ఐనవోలు మల్లిఖార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు (జాతర 2025) పురస్కరించుకొని ప్రతీ ఏటా నియమించే ఆలయ అభివృద్ధి కమిటీ ఎట్టకేలకు బ్రహ్మోత్సవాలకు ఒక రోజు ముందు కొలువుదీరింది. వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. ఆర్. నాగరాజు కమిటీ సభ్యులకు కండువాలు కప్పి ఆహ్వానించారు. అయితే ఈ కమిటీ కేవలం మూడు రోజుల అధికారంతో తాత్కాలికంగా నియమించబడటం నాయకులు ఆలయ అధికారులకు మధ్య సమన్వయం కొరవడింది అనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఆలయ విధి విధానాలు బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఏమాత్రం అవగాహన లేని స్థానికేతరులకు కమిటీలో అవకాశం ఇవ్వడం సర్వత్ర విమర్శలకు తావిస్తోంది. మొన్నటికి మొన్న సంబంధిత మంత్రి లేకుండానే తూ తూ మంత్రం గా జాతర రివ్యూ నిర్వహించి విమర్శలు ఎదుర్కొన్న నాయకులు ఈసారి జాతరకి కనీసం పదిహేను రోజుల ముందు నియమించాల్సిన కమిటీ కేవలం ఒక రోజు ముందుగా నియమించి జాతర నిర్వహించడంలో తమ డొల్లతనాన్ని బయట పెట్టుకున్నారు. ఒకవేళ కమిటీకి పూర్తి అధికారాలు అందిస్తే తమ పప్పులు ఉడక్కపోవచ్చు అని తాత్కాలిక కమిటీయే నయం అని కొందరు ఆలయ అధికారులు బావిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కమిటీ ప్రకటన అనంతరం తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు మరియు నూతన కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ సందర్బంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామి వారి ఆశీర్వచనాలు అందజేశారు..అనంతరం ఎమ్మెల్యేకి మరియు ఆలయ ఉత్సవ కమిటీకి చైర్మన్ ప్రభాకర్ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.