# ఏఐఎఫ్డీఎస్ జిల్లా కార్యదర్శి జన్ను రమేష్
నర్సంపేట,నేటిధాత్రి :
ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు కల్పించాలని ఏఐఎఫ్డీఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి జన్ను రమేష్ అన్నారు. నర్సంపేట పట్టణంలో అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో డివిజన్ కార్యదర్శి మార్త నాగరాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. జన్ను రమేష్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్న ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం వల్ల ప్రభుత్వ విద్యా సంస్థలను కాపాడడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభమై 15 రోజులు ఐనా ఇప్పటివరకు కనీస సౌకర్యాలు, సరైన భవనాలు, మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, సరిపడా ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని దీంతో ప్రభుత్వ విద్య విధానం కనుమరుగు అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థులకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు రాక గోడలను చూడాల్సిన పరిస్థితి ఉన్నదన్నారు.రెగ్యులర్ ఎంఈఓ లు లేక ప్రభుత్వ విద్య విధానం వెనుకబడిపోతున్నదని, గురుకులాలకు అద్దె భవనాల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.మోడల్ స్కూల్లో పూర్తిస్థాయి ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు కూడా అమ్మాయిలకు,అబ్బాయిలకు ప్రత్యేక హాస్టల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.కస్తూర్భా గురుకులాల్లో అదనపు సీట్లు కేటాయించాలని అన్నారు.ప్రైవేట్ విద్యా సంస్థలను రద్దు పరచి ప్రభుత్వ విద్యా విధానాన్ని పెంపొందించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని అలాగే కంప్యూటర్ విద్య విధానాన్ని అమలు పరచాలని కోరారు.గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకొని ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు పరచాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు రాకేష్, వంశీ, శివ, శ్యామ్, అజయ్, అంజి తదితరులు పాల్గొన్నారు.