ప్రభుత్వం మారినా ఆగని అక్రమ ఇసుక దందా

అక్షయపాత్ర పొత్కపల్లి ఇసుక క్వారీ..

క్వారీ ల వద్ద,మెయిన్ రోడ్డు పై వందలాది లారీలు..

వాహనదారులకు ప్రజలకు తప్పని తిప్పలు..

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:-

గత రెండు సంవత్సరాలుగా మానేరు నది అక్రమార్కులకు వరంగా మారింది. దోచుకున్నోళ్లకు దోచుకున్నంతగా ఇసుకాసురుల పంట పండింది. ప్రభుత్వం మారినా ఇసుక మాఫియా అక్రమాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని మడక గ్రామ సమీపంలో గల పొత్కపల్లి2 ఇసుక క్వారీని నేడు విలేకరుల బృందం సందర్శించగా విస్తుగొలిపే వాస్తవాలు బహిర్గతమయ్యాయి. ఇటీవల కరీంనగర్ జిల్లా కలెక్టర్ తమ జిల్లా పరిధిలోని 8 ఇసుక క్వారీలను రద్దు చేయగా పెద్దపల్లి జిల్లాలో మాత్రం ఇంకా నడుస్తుండడం వెనుక గల మతలబు ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
గత ప్రభుత్వం హయాంలో రైతుల జీవనోపాదులను దెబ్బతీస్తూ మానేరు నదిలో డీసిల్టేషన్ పేరుతో అక్రమంగా ఏర్పాటు చేసిన ఇసుక క్వారీలు ఇంకా కొనసాగుతున్నాయి.
పొత్కపల్లి 2 స్టాక్ యార్డ్ లో ఎప్పుడు చూసినా ఇసుక అంత ఎత్తున గుట్టలుగా పేరుకొని ఉంటుంది. ఒకవైపు ప్రతిరోజు వందలాది లారీలలో ఇసుక రవాణా జరుగుతున్నా అక్షయపాత్ర లాగా అంతే మొత్తంలో ఇసుక నిల్వలు పేరుకొని పోవడం వెనుక కారణాలను విశ్లేషిస్తే ఆశ్చర్యకరమైన నిజాలు వెళ్లడైనాయి. డీసిల్టేషన్ ఇసుక క్వారీలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ లో పిటిషన్లు దాఖలు అయినాయి. ఎన్జీటీ మద్యంతర ఉత్తర్వుల ద్వారా ఇసుక త్రవ్వకాలను మరియు రవాణాను నిషేధించినప్పటికీ గత ప్రభుత్వం వాటిని బేఖాతరు చేస్తూ ఇసుక మాఫియాకు అండగా నిలవడంతో యదేచ్చగా ఇసుకాసురులు తమ అక్రమాలను కొనసాగిస్తున్నారు. మానేరు నది గర్భంలో ఇసుక త్రవ్వకాలను నిలిపివేశామని, కేవలం స్టాక్ యార్డులలో నిలువ చేసిన ఇసుకను మాత్రమే ప్రజా అవసరాల దృష్ట్యా రవాణా చేస్తున్నామని ఎన్జీటీలో నమ్మబలికిన టిఎస్ఎండీసి అధికార యంత్రాంగం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై త్రవ్వకాలు మరియు రవాణాలను యదేచ్చగా కొనసాగిస్తున్నాయి. రాత్రి వేళలో రహస్యంగా ఇసుకను తోడి స్టాక్ యార్డులు నింపుతూ ఎప్పుడూ నిల్వలు తగ్గకుండా కాంట్రాక్టర్ జాగ్రత్త పడుతున్నారు. లెక్కల లోకి రాని అక్రమ ఇసుక రవాణాను కొనసాగిస్తూ కోట్లు దండుకుంటున్నారు. విలేకరులు సందర్శించిన సమయంలో క్వారీ వద్ద వందలాది లారీలు ఇసుక లోడింగ్ కోసం క్యూలో ఉన్నాయి. పొత్కపల్లి, కనగర్తి, గుండ్లపల్లి క్వారీల వద్ద గల వేచి ఉండే లారీల సంఖ్యను లెక్కిస్తే కిలోమీటర్ల మేరకు నిలిచిపోయి ఉన్నాయి. జీరో దందాతో నడిచే ఇసుక లారీలు మాత్రం డైరెక్ట్ గా క్వారీల్లోకి వెళ్లి ఇసుకను లోడ్ చేసుకొని వెళ్ళిపోతున్నాయి.
35 టన్నుల పరిమాణం గల ఇసుకను మాత్రమే నింపుకోవడానికి ఒక లారీకి అనుమతి ఉండగా అంతకంటే మరెన్నో రెట్లు అధికంగా ఇసుకను లారీలలో నింపుకొని క్వారీ యజమానులకు అమ్యామ్యాలు సమర్పించుకొని ఓవర్ లోడింగ్ లతో లారీలు వెళుతున్నాయి. ఒక బకెట్ అనగా సుమారు మూడు టన్నుల ఇసుకను లారీలో అదనంగా నింపుతే 2000 రూపాయల చొప్పున క్వారీ యజమానులు చార్జి చేస్తున్నారు. ప్రతి క్వారీలో తూకం యంత్రాలు, సీసీ కెమెరాలు విధిగా ఉండాలి. కానీ ఇవేమీ లేకుండానే ఇసుక యార్డులు నడుస్తున్నాయి. లోడింగ్ మరియు రవాణా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే జరగాలి. ఇసుక లారీలు ప్రయాణించే గ్రామీణ రోడ్ల మార్గాల వెంబడి దుమ్ము రేగకుండా నిత్యం రోడ్డుపై నీరు చల్లుతూ ఉండాలి. కానీ గత కొద్దిరోజులుగా అలాంటి జాడ లేకపోవడంతో రోడ్డు పక్క నివాసం గల ప్రజలు దుమ్ము దూళితో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఇక్కడ క్వారీలలో సెలవు. నిబంధనలు విధిగా అమలు పరచాల్సిన టిఎస్ఎండిసి అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో మునిగి ఇసుకా సురులకు వత్తాసు పలుకుతున్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఇసుక అక్రమాలపై సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు .ప్రస్తుతం జిల్లాలో ఓదెల మండలం పరిధిలోని క్వారీలలో జరుగుతున్న అక్రమాలపై ఎవరు నోరు విప్పడం లేదని ప్రజలు వాపోతున్నారు.
డీసిల్టేషన్ పేరిట మానేరులో కొనసాగుతున్న ఇసుక క్వారీలు పర్యావరణ చట్టాలకు విరుద్ధమని ఎన్జీటీలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన పిటిషన్ దారుడు చిటికేసి సతీష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతున్న ఇసుక క్వారీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఇప్పటికే రద్దు చేశారని ఆ దిశగా ఇక్కడ సైతం ఎమ్మెల్యే చొరవ తీసుకొని క్వారీలను రద్దు చేయించాలని సూచించారు. అంతేకాకుండా ఎన్జీటీలో విచారణలు ముగిసాయని అతి త్వరలో ఇసుక క్వారీలను రద్దు చేస్తూ సంచలన తీర్పు రాబోతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా టిఎస్ఎండిసి అధికారులు మామూళ్ల మత్తును వీడి నిబంధనలకు విరుద్ధంగా క్వారీ లలో కొనసాగుతున్న వివిధ అక్రమాలపై స్పందిస్తూ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version