చిల్పూర్,(జనగాం),నేటిధాత్రి:
హోలీ పండుగ సంబరాలను చిల్పూర్ మండలంలోని మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలు లింగంపల్లి, వెంకటాద్రి పేట, నష్కల్, కృష్ణాజి గూడెం, మల్కాపూర్, రాజవరం గ్రామంతో పాటు చిన్న పెండ్యాల గ్రామంలో ప్రజలు సోమవారం హోలీ పండుగను పురస్కరించుకొని హోలీ సంబరాలను చిన్న పెద్ద తేడా లేకుండా యువతి యువకులు ఒకరికి ఒకరు రంగులను చల్లుకుంటూ హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా ఆనందంగా నిర్వహించుకున్నారు.
హోలీ పండుగ వస్తుందంటే చాలు. చిన్నలు పెద్దలు హోలీ సంబరాల్లో మునిగిపోతారు.దీపావళి పర్వదినం అనంతరం దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పర్వదినాల్లో హోలీ ఒక వేడుక.ఈ పర్వదినం సత్య యుగం నాటి నుండి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం అంటారు.హోలీని ‘హోళికా పుర్ణిమ’ గాను వ్యవహరిస్తారు.ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి కాముని దహనం మరుసటి రోజున వచ్చే ఈ పండుగను హోలీ కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా పిలుస్తుంటారు.హోలీ పండుగ సోమవారం ఉదయం ఇళ్ల నుంచి బయటకు వచ్చి పిల్లలు,యువతతో పాటు కుటుంబ సభ్యులు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ రంగు రంగుల నీళ్లు చల్లుకుంటూ ఎంతో ఆనందంగా హోలీ పండుగ జరుపుకున్నారు.చిన్నా పెద్దా అంతా కలిసి రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా, సంబరంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.దీంతో పలు గ్రామాల్లో వాడవాడల్లో ఇంటి ముంగిళ్ళు రంగుల మయంగా మారాయి.ఆట, పాటలతో యువత కేరింతల కొడుతూ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకున్నారు. దీంతో గ్రామాలలో వీధులు సందడిగా మారాయి. హోలీని ఎంతో హుషారుగా నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా తమ హోలీ సెలబ్రేషన్స్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒకరికి ఒకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.