రాష్ట్ర అడవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోదెం వీరయ్య
భూపాలపల్లి నేటిధాత్రి
అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నట్లు రాష్ట్ర అటవీ, అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పొదెం వీరయ్య తెలిపారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన పోదెం వీరయ్య ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ నాటి హైదరాబాదు సంస్థానం భారతదేశంలో ఐక్యమై 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజును తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. 1948, సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర్య భారతావనిలో అరవై ఏండ్ల స్వీయ అస్థిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్నదని అన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి శఎనుముల రేవంత్రెడ్డి దార్శినిక పాలనలో విద్యుత్తు, నీటిపారుదల, వ్యవసాయ, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధికల్పన, వైద్య, విద్య అభివృద్ధి సంక్షేమంతో పాటు ఐటి నుండి అగ్రికల్చర్ వరకు అన్ని రంగాల్లో ఘణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ అనతికాలంలోనే సంక్షేమ కార్యక్రమాలు అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు హామీలను అమలు చేసి ప్రజల పట్ల తమకు గల అంకితభావాన్ని చాటుకున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ సేవలను 10 లక్షలకు పెంచడం, రైతు రుణమాఫీ, గృహాజ్యోతి, గృహాలక్ష్మి వంటి పథకాలు అమలు పట్ల ప్రజలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ప్రజాపాలన పేరిట అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీ వార్డులకు అధికారులను పంపి గత సంవత్సరం డిసెంబర్ 28 నుండి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించామని, సుపరిపాలనపై దృష్టి సారించిన ప్రజా ప్రభుత్వం తొలుత వనరులు, పథకాల అమలుతీరును విశ్లేషించుకుని, గత ప్రభుత్వ పాలనలో కుప్పకూలిన వ్యవస్థలను చక్కదిద్దే పనిని ప్రారంభించినట్లు తెలిపారు. వాస్తవ పరిస్థిని ప్రజలకు వివరించాలన్న లక్ష్యంతో పారదర్శక పాలన అందించడంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగాలపై శ్వేత పత్రాలను విడుదల చేశామన్నారు. ఇంతకాలం ప్రజలకు అందుబాటులో లేని ప్రగతిభవన్ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ముళ్లకంచెల చెర నుంచి విముక్తి కలిగించి జ్యోతి రావు పూలే ప్రజాభవన్ గా నామకరణం చేసి ప్రజల కోసం ద్వారాలు తెరిచామని అన్నారు.
ప్రజాపాలన కార్యక్రమం
ఆరు గ్యారంటీలను ఈ రాష్ట్రంలో ఉన్న పేదలు, నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని మాట ఇవ్వడం జరిగిందని, ఈ ఆరు గ్యారంటీలను నిక్కచ్చిగా అమలు చేసి తెలంగాణ ప్రజలకు ఒక సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ ఎనుముల రేవంత్ రెడ్డి అహర్శిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. చివరి వరుసలోని పేదలకు కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి దరఖాస్తులు స్వీకరించామని, ప్రతి పథకానికి వేర్వేరు దరఖాస్తులు అవసరం లేకుండా ఏ పథకానికి అర్హులైన వారు ఆ పథకానికి దరఖాస్తు చేసేందుకు వీలుగా ఒకే దరఖాస్తును అందుబాటులోకి తెచ్చామని అన్నారు. పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్న ప్రభుత్వ ఆలోచన మేరకు గత సంవత్సరం డిసెంబర్ 28 నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లాలో 137454 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.
మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం
మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ ఆడబిడ్డలు రాష్ట్ర నలుమూలలకు ఎక్కడి నుండి ఎక్కడికైనా అణాపైసా ఖర్చు లేకుండా ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించడానికి అవకాశం కల్పించామని, జిల్లాలో ఇప్పటి వరకు 5930322 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించగా 310567172
రూపాయలు మహిళలకు ఆదా జరిగిందని పేర్కొన్నారు.
రాజీవ్ ఆరోగ్య శ్రీ
ఆరోగ్య తెలంగాణగా ఈ రాష్ట్రం ఉండాలని, ప్రజలకు మెరుగైన కార్పోరేట్ వైద్య సేవలు అందించేందుకు రాజీవ్ ఆరోగ్య శ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నామని, జిల్లాలో ఇప్పటి వరకు 5187 మందికి ఈ పథకం ద్వారా వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. ఇందుకు గాను 105059744 రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ఇంటింటి జ్వర సర్వే నిర్వహిస్తూ వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు.
వ్యవసాయశాఖ::-
దేశానికి పట్టెడు అన్నం పెట్టే అన్నదాత సుఖసంతోషాలతో ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని ప్రగాఢంగా విశ్వసించిన రాష్ట్ర ప్రభుత్వం రైతును రుణ విముక్తి చేసేందుకు రుణమాఫి చేపట్టామన్నారు. రైతును రాజును చేయడం మా సంకల్పమని… రైతు బాగుంటేనే రాష్ట్రం పచ్చగా ఉంటుందని విశ్వసించిన ప్రభుత్వం రైతుకు రుణమాఫీ చేశామని, రుణభారాన్ని మాఫి చేయడంతో రైతన్నలు నేడు సంతోషంగా ఉన్నారని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని, నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతున్నామని, విత్తనాలు బ్లాక్ మార్కెట్ చేస్తే పిడి చట్టం క్రింద కేసులు నమోదు చేస్తున్నామన్నారు. అన్ని రకాల పంటల విత్తనాలు, అదేవిధంగా ఎరువులు కొరత లేకుండా సరిపడా సమృద్ధి నిల్వలు రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జిల్లాలో 22357 మంది రైతులకు 277 కోట్ల 31 వేల రూపాయలు రుణమాఫీ చేసి రైతన్నలను అప్పుల భాద నుండి విముక్తి కలిగించామని అన్నారు. అన్నదాత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు వార్షిక ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తూ రైతు బీమా అమలు చేస్తున్నామని, జిల్లాలో 72766 మంది రైతులకు రైతుబీమా చేసినట్లు తెలిపారు. అకాల మరణం చెందిన 402 మంది రైతు కుటుంబాలకు 20 కోట్ల 10 లక్షలు ఆర్థికసాయాన్ని అందచేసినట్లు తెలిపారు.
గృహాజ్యోతిః:- అల్పాదాయ వర్గాల వారికి విద్యుత్ బిల్లులు భారం తగ్గించి, వారి గృహాలలో చీకట్లును పారద్రోలి, విద్యుత్ కాంతులను నింపేందుకు గృహాజ్యోతి అమలు చేస్తున్నామని తెలిపారు. 200 యూనిట్లు కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు అందిస్తున్నామని, ప్రస్తుతం 51628 మంది ఈ పథకం ద్వారా లబ్దిపొందుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ పథకానికి 7562138 రూపాలు సబ్సిడి చెల్లించామని తెలిపారు.
మహాలక్ష్మి పథకం ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించిన పథకం మహాలక్ష్మి పథకమని, ఈ పధకం ద్వారా 500 రూపాయలకే వంట గ్యాస్ ఇస్తున్నామని, 66019 మంది లబ్దిదారులను గుర్తించామన్నారు. ఇప్పటి వరకు 126808 సిలెండర్లు సరఫరా చేసి 3.51కోట్లు సబ్సిడి చెల్లించామని అన్నారు.
ఈ కార్యక్రమాల్లో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.