ప్రభుత్వ టీచర్ల ప్రైవేట్ దందా?

రోజు రోజుకు పెరుగుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రైవేట్ వ్యాపారాలు?

చేసేది ప్రభుత్వ టీచర్ ఉద్యోగం, నెల నెలా జీతం తీసుకుంటూ, కొందరు చిట్టీల పేరుతో అక్రమ దందా?

వేలల్లో జీతం సరిపోనట్టు.., మరికొందరు మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం, చిట్స్ దందా, ఎలక్ట్రానిక్ వాహనాల మల్టీ మార్కెటింగ్, వాటర్ మిషన్ల ప్రమోట్, ఇంట్లో వాళ్ల పేరుతో ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా చలామణి

ప్రభుత్వ స్కూల్స్ లో కొరవడిన పర్యవేక్షణ, పాఠాలు బోధించే ఉపాధ్యాయులు వ్యాపారంలో దూసుకెళ్తున్న వైనం?

కొందరు టీచర్లకు సైడ్ వ్యాపారంలో ఉన్న ఆసక్తి,.. తాను పనిచేసే స్కూల్లో, స్కూల్లో బోధించే పాఠాల మీద, స్కూల్ లో చదివే పిల్లల భవిష్యత్ పై లేదు అనే చెప్పొచ్చు

జిల్లా స్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, వార్తలు రాసే జర్నలిస్టుల పైన తమ అక్కసు వెళ్ళగక్కడం తప్ప చర్యలు శూన్యం

ప్రైవేట్ స్కూళ్లలో పెట్టుబడులు..? యూనియన్ల ముసుగులో స్కూళ్లకు డుమ్మా.., మామూళ్ల మత్తే కారణమా..?

నగరంలో ప్రభుత్వ టీచర్ చిట్టీల పేరుతో ఘరానా మోసం, కేసు నమోదు

బాధితుడి పిర్యాదు మేరకు, టీచర్ కటకటాల పాలు. తాజాగా హనుమకొండ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఘటన

నేటిధాత్రి, వరంగల్

వారంతా ఉపాధ్యాయులు, చేసేది ప్రభుత్వ ఉద్యోగం, నెల నెలా జీతం తీసుకుంటూ స్కూల్ కొరకు, స్కూల్లో ఉన్న పిల్లల భవిష్యత్తు కోసం ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడుతూ, వారు పనిచేసే స్కూల్ కు పేరు తీసుకొచ్చే విధంగా కష్టపడుతూ, సొంత డబ్బులు సైతం ఖర్చు చేసి పిల్లలకు సహాయం చేస్తున్న ఉపాధ్యాయులు కొందరు ఉన్నారు. ఇలాంటి ఉపాధ్యాయులు నిత్యం బోధించే విధానం, రోజు చెప్పే పాఠాలు, వారు బోధించే విధానం కాలానికి అనుగుణంగా నేర్చుకుంటూ నిత్యవిద్యార్థి లాగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు కొందరు ఉన్నారు వరంగల్లో…, కానీ మరో వైపు “చిట్టీ”ల వ్యాపారం పేరుతో కొందరు మాత్రం అక్రమ దందా చేస్తున్నారు. వేలల్లో వీళ్లకు వచ్చే జీతం సరిపోనట్టు.., ఇంకొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం, చిట్స్ దందా, ఎలక్ట్రానిక్ వాహనాల మల్టీ మార్కెటింగ్, వాటర్ మిషన్ల ప్రమోట్, ఇంట్లో వాళ్ల పేరుతో ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా చలామణి అవుతూ, వారు వ్యాపారులా? లేకా ప్రభుత్వ టీచర్లా? అనే విషయం కూడా మర్చిపోతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ స్కూల్స్ లో కొరవడిన పర్యవేక్షణ, జిల్లా స్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, వార్తలు రాసే జర్నలిస్టుల పైన తమ అక్కసు వెళ్ళగక్కడం చేస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది వాస్తవం. ఇలాంటి అధికారులు ఉన్నంతవరకు ప్రభుత్వ పాఠశాలలో విద్య మెరుగుపడదు. పాఠాలు బోధించే ఉపాధ్యాయులు, వ్యాపారంలో దూసుకెళ్తున్న వైనం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా వినిపిస్తున్నాయి. కొందరు టీచర్లకు సైడ్ వ్యాపారంలో ఉన్న ఆసక్తి, తాను పనిచేసే స్కూల్లో, స్కూల్లో బోధించే పాఠాల మీద, స్కూల్ లో చదివే పిల్లల భవిష్యత్ పై లేదు అనే చెప్పొచ్చు. ఇలాంటి వారి పట్ల తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

#####@###

యూనియన్ల ముసుగులో స్కూళ్లకు డుమ్మా..

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో యూనియన్ల పాత్ర అత్యంత కీలకమైంది. విద్యాశాఖలో యూనియన్లు ఎక్కువగానే ఉండగా ఈ సంఘాలు అన్ని ఎక్కువగా సమస్యల పరిష్కారానికి ఫైట్ చేస్తూ వస్తున్నాయి. అయితే కొంతమంది టీచర్లు ఈ సంఘాల ముసుగులో స్కూళ్లకు డుమ్మా కొడుతున్నట్లు తెలుస్తోంది. యూనియన్ల పేరు చెప్పి కనీసం పాఠశాలల వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఒకవేళ వచ్చినా థంబ్ వేసి వెళ్లిపోతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా సంఘాల ముసుగులో కొందరు చదువులు చెప్పడం మానేసి సొంత వ్యాపారాల్లో బిజీ అవుతున్నారు. మరికొందరు టీచర్లు అయితే ఏకంగా సెలవు పెట్టకుండానే పొలిటికల్ ప్రోగ్రామ్స్ లో ప్రత్యక్షమవుతున్నారు.

###@@###

ప్రైవేట్ స్కూళ్లలో పెట్టుబడులు..?

ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో కొంతమంది ప్రభుత్వ టీచర్లు బినామీల పేరుతో ప్రైవేట్ స్కూల్స్ నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచాల్సిన బాధ్యతను మరచి, వారికున్న పలుకుబడితో సొంత స్కూళ్లలో అడ్మిషన్లు పెంచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి వారికి కొంతమంది రాజకీయ నాయకుల అండదండలు కూడా తోడవడంతో మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా వీరి వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి స్కూళ్లలో నిబంధనలకు విరుద్ధంగా నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్ వంటివి ప్యాకేజీ రూపంలో అమ్ముతున్నట్లుగా సమాచారం. అయితే ఇదంతా సంబంధిత అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

##@##

మామూళ్ల మత్తే కారణమా..?

హనుమకొండ జిల్లాలో ఓ ప్రభుత్వ టీచర్ అక్రమ చిట్టి వ్యాపారం చేస్తూ పోలీస్ కేసు నమోదు అయి రిమాండ్ కి వెళ్ళిన విషయం వరంగల్ ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉంటే, మరొక ఉపాధ్యాయుడు అయితే పొలిటికల్ పార్టీలో తిరుగుతుండడం పలు వివాదాలకు తావిస్తోంది. గతంలో ఒక ఉపాధ్యాయుడు ఏకంగా చిట్ ఫండ్ సంస్థ ఓపెన్ చేసి కొన్ని రోజులకే మూసి వేసిన ఘటనలు చర్చనీయంశంగా మారాయి. ఇటువంటి ప్రైవేట్ దందాలు చేసే టీచర్లు నెల నెలా మామూళ్లు ఇవ్వడంతో వారి వైపు కన్నెత్తి చూడరనే విమర్శలు ఉన్నాయి. అయితే వెలుగులోకి వచ్చిన ఘటనలలో కూడా అధికారులు చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువంటి సంఘటనలపై విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

####@@@####

ప్రభుత్వ టీచర్ చిట్టీల పేరుతో ఘరానా మోసం, కేసు నమోదు

బాధితుడి పిర్యాదు మేరకు, టీచర్ కటకటాల పాలు. తాజాగా హనుమకొండ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఘటన

వరంగల్ నగరంలోని, రాంనగర్ ప్రాంతానికి చెందిన కామ మాధవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ప్రస్తుతం హనుమకొండ జిల్లా దామెర స్కూల్ లో పని చేస్తోంది. ఆమె తన విధి నిర్వహణలో భాగంగా 2011 నుంచి 2021 వరకు హసన్ పర్తి మండలం, మడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేసింది. ఆమె పని చేస్తున్న కాలంలోనే ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న దుగ్గొండి మండలం, తొగర్రాయి గ్రామానికి చెందిన అమ్మ కృష్ణ తో, “లక్ష్మీసాయి చిట్స్” అనే తన సంస్థలో చిట్టీ వేయించింది. అంతే కాకుండా ఆమె వద్ద చిట్టీ వేస్తే ఒక నెల (చివరి నెల) డబ్బులు కట్టనవసరం లేదని, మంచి లాభంతో చిట్టి డబ్బులు ఇస్తానని నమ్మ బలికింది. దీంతో కృష్ణ ప్రతి నెల రూ.12,500 చొప్పున మొత్తం 22నెలల పాటు రూ.2.75 లక్షలు ఆన్ లైన్ పేమెంట్ ద్వారా మాధవి, ఆమె అసిస్టెంట్ వెంకట్ కు చెల్లించాడు. చిట్టీ కమిట్ మెంట్ ప్రకారం జూన్ 2023 నాటికి రూ.3.95 లక్షలు తిరిగి ఇవ్వాల్సి ఉంది. కానీ కృష్ణకు ఇవ్వాల్సిన డబ్బులు ఇంతవరకు తిరిగి చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేసింది. దీంతో తాను మోసపోయినట్లు తెలుసుకున్న కృష్ణ, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మాధవితో పాటు ఆమె అసిస్టెంట్ వెంకట్ ను పలుమార్లు నిలదీశాడు. అయినా వారి నుంచి సరైన సమాధానం లేకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాధితుడు కృష్ణ చివరకు పోలీసులను ఆశ్రయించాడు. తనను మోసం చేసిన మాధవితో పాటు, అసిస్టెంట్ వెంకట్ పై చట్ట పరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని హసన్ పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిట్టీ పేరుతో మోసానికి పాల్పడిన కామ మాధవి, ఆమె అసిస్టెంట్ వెంకట్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు హసన్ పర్తి సీఐ జవ్వాజి సురేష్ తెలిపారు. కాగా అక్రమంగా చిట్టీ వ్యాపారం నిర్వహించడం నేరమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ సురేష్ అన్నారు. అక్రమంగా చిట్టీలు, వడ్డీ వ్యాపారం పేరున మోసాలకు పాల్పడిన ఘటనలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!