సర్వేలన్నీ హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డికి మొదటి స్థానం ఇస్తున్నాయి
కేసిఆర్ కారు గుర్తుకు ఓటు వేయండి
కౌశిక్ రెడ్డి ప్రజా జీవితంలో ఆల్ రౌండర్ గా పనిచేస్తాడు
ముఖ్యమంత్రికి కౌశిక్ రెడ్డి అంటే ఇష్టం, అభివృద్ధి కోసం సహాయం అందిస్తారు
మోసపోతే గోసపడతాం
జమ్మికుంటలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి తన్నీరు హరీష్ రావు
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
హుజురాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం జమ్మికుంటలోని గాంధీ చౌక్ వద్ద జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. అనునిత్యం ప్రజల కోసం తాపత్రయపడే ముఖ్యమంత్రి ఉండడం మనందరి అదృష్టమని చెప్పారు. కాంగ్రెస్, బిజెపి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేం లేదని, ఈ రెండు పార్టీల్లో ఏది గెలిచిన తెలంగాణ మరోసారి అంధకారంలోకి వెళ్లిపోతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పేద ప్రజల కోసం కొత్త మేనిఫెస్టో తయారు చేశారని తెలిపారు. మేనిఫెస్టోలో ముఖ్యంగా సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 3000 రూపాయలు అందించనున్నట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి 15 లక్షల పెంచామని, గ్యాస్ సిలిండర్ను కూడా కేవలం 400 కి అందిస్తామన్నారు. దీంతోపాటు కేసీఆర్ ధీమా ఇంటింటికి బీమా అని రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబం ఆగం కాకుండా ఉండేందుకు ఐదు లక్షల కూడా ఇస్తామన్నారు. కాంగ్రెస్ పెట్టిన ఆరు గ్యారెంటీలకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాల మేనిఫెస్టో గొప్పగా ఉందన్నారు. హుజురాబాద్ లో పేదలకిచ్చిన అసైన్డ్ భూములన్నిటికీ బిఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత పట్టాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఏది కావాలన్నా ఢిల్లీ దగ్గర మోకరిల్లాల్సిందేనని దుయ్యభట్టారు. మొన్న కర్ణాటక నుంచి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వచ్చి కర్ణాటకలో రోజుకు 5 గంటల కరెంటు ఇస్తున్నాం. ఇక్కడ కూడా ఇస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారని, తెలంగాణలో 24 గంటల కరెంటు ఉన్నది అనే విషయం కూడా తెలియదా అని ఎద్దేవ చేశారు. తెలంగాణలో మల్లి కాంగ్రెస్ వస్తే మోటర్లు జీపులో వేసుకొని పోతారని, దొంగ రాత్రులు కరెంటు వస్తుందని అన్నారు. కాంగ్రెసోళ్లు కర్ణాటకలో ఆరునెల్లు గడవకముందే ఇచ్చిన హామీలను ఎగకొడుతున్నారని అన్నారు. తెలంగాణలో కెసిఆర్ చెప్పినవన్నీ చేశారని ఇక మీరే ఆలోచించుకోవాలని అన్నారు. హుజురాబాద్ లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాయని కాంగ్రెస్ కు రెండవ స్థానం బిజెపి మూడో స్థానానికి పడిపోయిందని సర్వేలు చెప్పుచున్నాయన్నారు. కౌశిక్ రెడ్డి ప్రజా జీవితంలో ఆల్ రౌండర్ అని ఒకవైపు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ మరోవైపు ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటారని అన్నారు. కౌశిక్ రెడ్డి అంటే ముఖ్యమంత్రికి చాలా ఇష్టమని, కౌశిక్ రెడ్డి గెలిచిన అనంతరం ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి నియోజకవర్గం కోసం నిధులు తీసుకొస్తాడని, మేమంతా తన వెంట ఉంటామని అన్నారు. ఉప ఎన్నికల సమయంలో ఇక్కడ ఓడిపోయిన కూడా ముఖ్యమంత్రి గెలు శ్రీనివాస్ ని ఆదరించి టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఇచ్చారని అన్నారు. ఉప ఎన్నికల సమయంలో ఈ ప్రాంతం నుంచి గెలుపొందిన ఈటల రాజేందర్ గెలిచిన అనంతరం ఈ నియోజకవర్గంలో తట్టెడు మన్ను కూడా పోయలేదని, ఇక్కడ ప్రజలను కూడా పూర్తిగా విస్మరించారని అన్నారు. నిజం గడప దాటకముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అన్న చందాన ఉప ఎన్నికల సమయంలో ఎన్నో అబద్ధాలు చెప్పి ఈటెల రాజేందర్ గెలిచారని గుర్తు చేశారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని అని అందుకే ఇప్పుడు నియోజకవర్గ ప్రజలందరికీ ఎవరేంటో నిజం తెలిసిందని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు న్యాయం, ధర్మం ఆలోచించి బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కౌశిక్ రెడ్డికి భారీ మెజార్టీ ఇవ్వాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకొని బిజెపి కాంగ్రెస్ లు ఆపాయని, అయినా ఎన్ని రోజులు ఆపుతారు ఇంకో 20 రోజుల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఎవరు ఆపుతారో చూస్తామన్నారు. కాంగ్రెస్ నాయకుడు ఉత్తంకుమార్ రెడ్డి రైతుబంధిస్తే రైతుబంధు దుబారా అని మాట్లాడారని, రైతుకు రైతుబంధు ఇవ్వడం దుభారా అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. అలాగే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చే రైతు బంధును బిచ్చమేస్తున్నావని రైతుబంధు తీసుకునే రైతులను బిచ్చగాళ్ళతో పోలుస్తూ మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. రైతులను బిచ్చగాళ్ళతో పోల్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తే మూడెకరాలకు నీళ్లు పారుతాయని తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ప్రజల పరిస్థితి అదోగతి అవుతుందని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలకు మోసపోయి ఓటేస్తే గోసపడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గెలు శ్రీనివాస్ యాదవ్, మాజి ఎస్సి కార్పొరేషన్ చెర్మైన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, జమ్మికుంట టౌన్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, హుజరాబాద్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, జమ్మికుంట ఎంపీపీ దొడ్డే మమత, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.