సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు
సిరిసిల్ల(నేటి ధాత్రి):
ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేసిన సంస్థలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. సిరిసిల్లలోని సిపిఐ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్లోబల్ ఫౌండేషన్ అనే సంస్థ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఒక్కో ఉద్యోగానికి రెండు నుండి మూడు లక్షల వరకు రూపాయలు వసూలు చేసి బోగస్ నియామక పత్రాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ దృష్టి సారించి చట్ట పరిధిలో వారిని కఠినంగా శిక్షించి మోసపోయిన బాధితులకు తిరిగి డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ చైర్మన్ ఎండి బాబర్ ఈ వసూళ్లతో ఎలాంటి సంబంధం లేదని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని, ఈ అక్రమ వసూళ్ల వెనుక ఎవరున్నా సిబిఐ చేత విచారణ జరిపించి ఈ కుంభకోణంలో ఉన్న వారందరినీ వెలికి తీసి కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు మంద సుదర్శన్, పంతం రవి, సోమ నాగరాజు, అంగూరి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.