లీడ్ లైబ్రరీ అధ్వర్యంలో వినూత్న కార్యక్రమం.
నర్సంపేట,నేటిధాత్రి :
లీడ్ లైబ్రరీ అండ్ లిటరరీ సెంటర్ అధ్వర్యంలో ఉగాది పండుగను పురస్కరించుకుని బాల కవి సమ్మేళనం అనే కార్యక్రమాన్ని నర్సంపేట పట్టణంలోని సంజీవని ఆశ్రమంలో లీడ్ లైబ్రరీ అండ్ లిటరరీ సెంటర్ వ్యవస్థాపకులు, కవి కాసుల రవికుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా సంజీవిని ఆశ్రమం చైర్మన్ డాక్టర్ వినోద మోహన్ రావు,సీనియర్ కవి కేతిరెడ్డి యాకూబ్ రెడ్డిలు పాల్గొన్నారు. తల్లిదండ్రులు, ప్రకృతి, సెల్ ఫోన్ ల ప్రభావం గురించి విద్యార్థులు తాము రాసిన కవితలను చదివి వినిపించారు.
కవి కేతిరెడ్డి యాకూబ్ రెడ్డి ‘సృజనాత్మక ప్రక్రియ- కవిత్వం అనే అంశం గురించి విద్యార్థులకు వివరించారు. కాళోజీ, అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితలను ఉదాహరణలుగా వివరించారు. కవితలు రాసి వినిపించిన విద్యార్థులు ప్రయాంక, శిరీష, సింధూ, భరత్ కుమార్, పవిత్రలను నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. కవితాగానం చేసిన విద్యార్థులందరికీ పుస్తకాలను బహుమతులుగా అందజేశారు.ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ మోహన్ రావు మాట్లాడుతూ ఉగాది పర్వదినం సందర్భంగా సంజీవని ఆశ్రమంలో ప్రత్యేకంగా విద్యార్థులతో నిర్వహించిన బాల కవి సమ్మేళనం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని రూపొందించిన కాసుల రవికుమార్ ను అభినందించారు.