ఎన్నికల ప్రవర్తన నియామవళిని పకడ్బందీగా అమలు చేయాలి-జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, నేటిధాత్రి:

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఎన్నికల నియమావళిపై జిల్లా అధికారులతో బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తేదీ నుంచి ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోటోలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు వంటివి తొలగించాలని, బస్టాండ్, పబ్లిక్ పార్క్ వంటి ప్రజలు సందర్శించే చోట్లలో ఉన్న హోర్డింగులు, బ్యానర్లు, స్టిక్కర్లు తీసివేయాలని, ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసేలా గోడలపై ఉన్న రాతలను చేరిపివేయాలని, ప్రజలను ప్రభావితం చేసే దేశ, రాష్ట్ర, స్థానిక రాజకీయ నాయకులకు సంబంధించిన విగ్రహాలను కవర్ చేయాలని ఆదేశించారు. జిల్లాలో బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నా మూసివేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భవనాలను రాజకీయ సమావేశాలకు ఉపయోగించరాదని, ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి రాజకీయపరమైన సమావేశాల్లో పాల్గొనరాదని సూచించారు. సరైన పత్రాలు లేకుండా యాబై వేల రూపాయల కంటే ఎక్కువ నగదును తరలిస్తే సీజ్ చేయాలని అన్నారు. అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నియమనిబంధనలు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. దేవాలయాలు, చర్చిలు, మసీదులు తదితర ప్రార్థన మందిరాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించకూడదన్నారు. ప్రైవేట్‌ భవనాల యాజమానుల అనుమతి లేకుండా పోస్టర్లు అంటించడం, రాయడం చేయకూడదన్నారు. స్థానిక అధికారుల అనుమతులు లేకుండా పార్టీలు కానీ, అభ్యర్థి గాని బహిరంగ సమావేశాలు నిర్వహించరాదన్నారు. కొత్త పథకాల ప్రకటన, ప్రాజెక్టుల శంకుస్థాపన, కొత్త పనుల మంజూరు, ఆర్థిక గ్రాంట్లు ప్రకటించడం చేయరాదన్నారు. ఈసమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయి, డిఆర్ఓ పవన్ కుమార్, ఆర్డీవో మహేశ్వర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version