రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలో మంగళవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆల్ఫోన్సా పాఠశాలలో బతుకమ్మ సంబరాలను పురస్కరించుకొని తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు.పాఠశాల ఆవరణలో విద్యార్థినిలు రంగురంగుల దుస్తులు ధరించి బతుకమ్మ,డీజే పాటలకు నృత్యాలు చేశారు.తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిభంభించేలా నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మిస్ట్రెస్ సిస్టర్ బెస్సి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర సంప్రదాయాన్ని గౌరవిస్తూ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. కులమతాలకతీతంగా బతుకమ్మ వేడుకలను పాఠశాలలో నిర్వహించుకోవడం జరిగిందని,విద్యార్థులకు అన్ని పండుగల పైన అవగాహన కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు.పట్టణ ప్రజలందరికీ ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ జీనా రోస్,ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.