బ్లాక్ మెయిలర్ కావాలా..గోల్డ్ మెడలిస్ట్ కావాలా.. మీరే తేల్చుకోండి.

# కాంగ్రెస్ అభ్యర్థి అఫిడవిట్ లో 56 క్రిమినల్ కేసులు..
# రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం..
# గెలిచిన తర్వాత రైతు రుణమాఫీపై మొదటి సంతకం ఏమైంది.
# కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వేస్తే 50 వేల మెగా డీఎస్సీ అన్నారు ఎటు పోయింది.


# ప్రభుత్వంపై విరుచుకుపడ్డ బీ అర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్.
# పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న కెటిఆర్..


# రాకేష్ రెడ్డి,తీన్మార్ మల్లన్న మధ్య తేడా చూడాలి.
# గతంలో నేను చేసిన అభివృద్ధి కనబడుతున్నది.
# నేను తెచ్చిన అభివృద్ధి నిధులు ఖర్చులు కావాలి.
# నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.
# సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి,ఎన్నికల పరిశీలకులు రవీందర్ రావు,
# భారీగా హాజరైన గ్రాడ్యుయేట్స్..

నర్సంపేట,నేటిధాత్రి :

బిట్స్ బిలానిలో గోల్డ్ మెడల్ సాధించి, అమెరికాలో మాస్టర్ పూర్తి చేసుకొని గూగుల్ లాంటి అగ్రగామి సంస్థలో ఉద్యోగిగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కావాలా లేక నిత్యం అబద్దాలు బూతు మాటలతో రాజకీయాలు చేస్తూ అందరిని బ్లాక్ మెయిల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కావాలో గ్రాడ్యుయేట్ సభ్యులు ఒకసారి ఆలోచించి మీరే తేల్చుకోండి అని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు ఎద్దేవా చేశారు.
వరంగల్,ఖమ్మం,నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బాగంగా సన్నాహక సమావేశం నర్సంపేట పట్టణంలో ఆ నియోజకవర్గం పట్టభద్రులతో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలో బీఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా జరిగింది.ముఖ్య అతిథిగా బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మాజీ మంత్రి కెటిఆర్ హాజరైనారు.రైతుల‌ను న‌ట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రైతుభ‌రోసా, రుణ‌మాఫీ లాంటి హామీల‌ను తుంగ‌లో తొక్కి.. తాజాగా బోన‌స్‌పై మాట త‌ప్పిన సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
ప్రస్తుతం ఈ ప్ర‌భుత్వం అల‌విగానీ హామీలిచ్చి వంద రోజుల్లో అమ‌లు చేస్తామ‌న్నారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఐదు అమ‌లు చేశాన‌ని చెబుతున్నాడు. ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా అమ‌లు కాలేదని ఆరోపించారు. ఫ్రీ బ‌స్సులో ఆడోళ్లు కొట్టుకుంటున్న‌రు.సీట్లు దొర‌క‌ట్లేద‌ని పురుషులు బాధ‌ప‌డుతున్నారు. ఫ్రీ బ‌స్సు కూడా ఫెయిలైందన్నారు. క్వింటాల్‌కు వరి ధాన్యానికి 500 బోన‌స్ ఇస్తా అన్నడు. నిన్న చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పిండు. స‌న్న వ‌డ్ల‌కే బోన‌స్ ఇస్త‌డంట‌. అప్పుడేమో అన్ని వ‌డ్లు అన్నడు.. ఇప్పుడేమో సన్నవ‌డ్లు అంటున్నారు అని ఆ బోనస్ మాట కాస్తా బోగస్ అయ్యింది అని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
ఇదే బోనస్ మాట ఎల‌క్ష‌న్లు ముందు చెప్పి ఉండాలి క‌దా.. అని రాష్ట్రంలో రైతుకు 95 శాతం దొడ్డు బియ్యం పండిస్తున్నారు. స‌న్న వ‌డ్లు పండించే 5 శాతం మంది కూడా బోన‌స్ తీసుకోరు. ఎందుకంటే స‌న్న వ‌డ్ల‌కు ప్ర‌యివేటు మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ. 2,500 నుంచి రూ. 3 వేల వ‌ర‌కు ధ‌ర ఉంది. కాబ‌ట్టి గ‌వ‌ర్న‌మెంట్ ఇచ్చే బోన‌స్ వైపు ఎవ‌రూ చూడ‌రని, మోసం చేయ‌డ‌మే కాంగ్రెస్ పార్టీ ప‌ని అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ నేత‌లు అర‌చేతిలో వైకుంఠం చూపించారన్నారు. కేసీఆర్ ఉన్న‌ప్పుడు క‌రెంట్ బాగుండేది. ఇవాళ క‌రెంట్ కోత‌లు ఉన్నాయి. విత్త‌నాలు దొర‌క‌డం లేదు. ఎరువులు లేవు. నాట్లు వేసేట‌ప్పుడు ప‌డాల్సిన‌ రైతుబంధు ఓట్లు వేసేట‌ప్పుడు ప‌డుతున్న‌ది. డిసెంబ‌ర్‌లో ప‌డాల్సిన రైతు బంధు మేలో ప‌డుతుంది. ఇది కాంగ్రెస్ తీసుకొచ్చిన మ‌హా మార్పు అని కేటీఆర్ విమ‌ర్శించారు. ఉత్త‌ర తెలంగాణ‌కు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్ప‌త్రిలో ఐదు గంట‌ల పాటు సాయంత్రం 4.30 నుంచి 9.30 దాకా క‌రెంట్ లేదు. ఐదు గంట‌లు క‌రెంట్ పోతే ఒక్క జ‌న‌రేట‌ర్ కూడా ప‌ని చేయ‌లేదు. మ‌రి న‌వ‌జాత శిశువుల ప‌రిస్థితి, ఐసీయూలో ఉన్న పేషెంట్ల ప‌రిస్థితి ఏంటి..? ఇదేనా మార్పు అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కేటీఆర్ నిల‌దీశారు.
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి గెలిస్తే టెట్ ఫీజు రూ. 20 వేలు
చేస్త‌రని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మీ ఓటుతో ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే ఒక గ‌ళాన్ని మండ‌లికి పంపించాలి అని కేటీఆర్ కోరారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇస్తా అన్నాడు. 50 వేల‌తో మెగా డీఎస్సీ అన్నాడు. ఈ రెండు అమ‌లు కాలేదు. కానీ 30 వేల ఉద్యోగాలు ఇచ్చాను అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అవి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు. లీగ‌ల్ స‌మ‌స్య‌ల వ‌ల్ల ఆగిపోయాయి. కేవ‌లం కాగితాలు ఇచ్చి తాను ఇచ్చాన‌ని ఊద‌ర‌గొడుతున్నారు.నోటిఫికేషన్ విడుదల చేయకుండా,పరీక్షలు నిర్వహించకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారు అని ఇలాంటి మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్రాడ్యుయేట్ ఓటర్లు ఆలోచించాలని ఈ సందర్భంగా కెటిఆర్ సూచించారు.
ఈ ఎన్నిక‌ల‌ ఫ‌లితంలో ప్ర‌భుత్వం కూలిపోయేది లేదు. తారుమారయ్యేది లేదు. 6 నెల‌ల క్రితం అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రిగాయి. కేసీఆర్‌తో స‌హా అంద‌రం ప్ర‌తి నియోజ‌వ‌ర్గంలో ప‌ర్య‌టించాం. ఇప్పటికైనా ద‌య‌చేసి మోస‌పోకండి.. గోస‌ప‌డుతామ‌ని చెప్పాము. కానీ ప్ర‌జ‌లు కాంగ్రెస్ వాగ్దానాలు న‌మ్మి కాంగ్రెస్ పార్టీకి అవ‌కాశం ఇచ్చారు. ఇప్పుడు బాధ‌ప‌డుతున్నార‌ని కేటీఆర్ పేర్కొన్నారు.చ‌దువుకున్న విద్యావంతులు కాంగ్రెస్ పాల‌న గురించి ఆలోచించాల‌ని కోరుతున్నాను. ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయం ప‌రిస్థితి ఏంటో ఆలోచించండి. ఎన్నిక‌ల‌ప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంద‌మైన నినాదాలు ఎక్క‌డున్నాయో ఆలోచించండి. నాకు ఓటు వేస్తే 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ ద‌స్త్రంపై డిసెంబ‌ర్ 9న తొలి సంత‌కం చేస్తాన‌ని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు. అర్జంట్‌గా బ్యాంక్‌కు వెళ్లి 2 ల‌క్ష‌ల రుణం తెచ్చుకోవాల‌ని కూడా సూచించారు. డిసెంబ‌ర్ 9 పోయింది.. మ‌రో ప‌ది రోజులు అయితే జూన్ 9 వస్త‌ది. ఆరు నెల‌లు గ‌డిచిపోత‌ది. తొలిరోజే సంత‌కం చేస్తాన‌ని మోసం చేసిన రేవంత్ రెడ్డి నిల‌బెట్టిన అభ్య‌ర్థి ప‌ట్ల ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాలో ఆలోచించాల‌ని గ్రాడ్యుయేట్ల‌ను కేటీఆర్ కోరారు.రైతు భ‌రోసా 15 వేలు ఇస్తా, భూయ‌జ‌మాలకు కాదు కౌలు రైతుల‌కు కూడా రైతుభ‌రోసా ఇస్తాన‌ని రేవంత్ న‌మ్మ‌బ‌లికాడు. రైతు కూలీల‌కు ఏడాదికి 12 వేలు ఇస్తాన‌ని అన్నాడు. కౌలు రైతుల‌కు రైతు భ‌రోసా రాలేదు. తొలిసారి మోస‌పోతే మోసం చేసినోడిది త‌ప్పు. రెండోసారి కూడా వాడి చేతిలో మోస‌పోతే మ‌న‌ది త‌ప్పు అయిత‌ద‌ని కేటీఆర్ అన్నారు.
వైట్ కాల‌ర్ వ‌ర్క‌ర్ ఉండాల్నా.. బ్లాక్ మెయిల‌ర్ ఉండాల్నా..
తెల్లారి లేస్తే బూతులు తిట్టుడు, వెకిలి ప‌నులు చేసుడు కాంగ్రెస్ అభ్య‌ర్థి ల‌క్ష‌ణం. దందాలు చేయ‌డం, బెదిరించ‌డం వంటి కేసులు న‌మోదైన‌ట్లు కాంగ్రెస్ అభ్య‌ర్థి అఫిడ‌విట్‌లో ఉన్నాయి. తీన్మార్ మ‌ల్ల‌న్న‌ అఫిడ‌విట్‌లో 56 క్రిమిన‌ల్‌ కేసులు ఉన్నాయి. ఆడ‌పిల్ల‌ల ఫొటోలు మార్ఫింగ్ చేసిన కేసులు, అనుమ‌తి లేకుండా అమ్మాయిల‌ ఫోన్ నంబ‌ర్ల‌ను ఫేస్‌బుక్‌లో పెట్టిన కేసులు, బ్లాక్ మెయిల్ చేసిన కేసులు.. ఇలా 56 క్రిమిన‌ల్ కేసులు ఉన్న మ‌హానుభావుడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాబ‌ట్టి అభ్య‌ర్థుల గుణ‌గ‌ణాలు చూడాలి. మండ‌లిలో వైట్ కాల‌ర్ వ‌ర్క‌ర్ ఉండాల్నా.. బ్లాక్ మెయిల‌ర్ ఉండాల్నా ఆలోచించండి. ఈ ఒక్క సీటుతో గ‌వ‌ర్న‌మెంట్ రాదు.. పోదు. కానీ బీఆర్ఎస్ అభ్య‌ర్థి గెలిస్తే న‌ర్సంపేట యువ‌త త‌ర‌పున రేపు మండ‌లిలో గ‌ల్లా ప‌ట్టి అడిగే ప‌రిస్థితి మాత్రం ఉంట‌ది. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు, నోటిఫికేష‌న్లు ఎక్క‌డా అని అడిగే హ‌క్కు ఉంట‌ది. నిరుద్యోగ భృతి ఎక్కడా అని ప్ర‌భుత్వాన్ని నిల‌దీసే వాయిస్ ఉంట‌ది అని కేటీఆర్ పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని రైతు బిడ్డ‌లుగా, విద్యావంతులుగా గ్ర‌హించి బీఅర్ఎస్ అభ్యర్థికి ఓటేయ‌క‌పోతే న‌ష్ట‌పోయేది మీరే అని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో నోటిఫికేష‌న్లు ఇవ్వ‌క‌పోపోయిన,జాబ్ క్యాలెండ‌ర్, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి ఇవ్వ‌క‌పోయినా ప‌ట్ట‌భ‌ద్రులు మాకు ఓటేశారని ప్రభుత్వం అనుకుంతుందని తెలిపారు.ఎన్నికల హామీలో ఒక్క ప‌రీక్షకు కూడా ఫీజు ఉండ‌ద‌న్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు టెట్ ఫీజు రూ. 400 ఉండే. ఇప్పుడు రూ. 2 వేలు అయింది. మ‌ళ్లీ వాళ్ల‌కు ఓటేస్తే టెట్ ఫీజు రూ. 20 వేలు చేయ‌రా..? ఆలోచించండి గ్రాడ్యుయేట్ మేధావులను అడిగారు. ప‌దేండ్ల‌లో తెలంగాణ‌లో ఎంతో ప్ర‌గ‌తి సాధించాం. కొత్త జిల్లాలు, మండ‌లాలు, రెవెన్యూ డివిజ‌న్లు, తండాలు గ్రామ‌పంచాయ‌తీలు అయ్యాయి. ఐటీ ఎగుమ‌తులు పెరిగాయి. ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయని తెలంగాణ తొలి ఐటి పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

#రాకేష్ రెడ్డి,తీన్మార్ మల్లన్న మధ్య తేడా చూడాలి.

ప్రస్తుతం జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, నిత్యం పచ్చి అబద్దాలతో బూతులు తిడుతూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ల మధ్య ఉన్న తేడాను గ్రాడ్యుయేట్స్ గుర్తించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వంలో
గతంలో నేను చేసిన అభివృద్ధి కనబడుతున్నదన్నారు.నేను తెచ్చిన ఆ అభివృద్ధి నిధులు ఖర్చులు చేయకుండా వృదా చేస్తున్నారని, నిధులు లాప్స్ కాకముందే పనులను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు, బీఆర్ఎస్ నాయకులు రవీందర్ రావు,
నాయకులు సతీష్ రెడ్డి,జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న,ఓడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి,మున్సిపల్ చైర్మన్ రజినీ కిషన్,వైస్ చైర్మన్ వెంకట రెడ్డి,రాయిడి రవీందర్ రెడ్డి, ఎన్ఆర్ఐ శానబోయిన రాజ్ కుమార్, సుంకరి సంతోష్ రెడ్డి, ఎంపీపీలు, జెడ్పిటిసిలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, గ్రాడ్యుయేట్స్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version