కొమురవెల్లి నేటిధాత్రి….
మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. సిద్ధిపేటలోని శైవ క్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
లింగోద్బవ సమయాన స్వామి వారికి ఆలయ అర్చకులు… మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అర్థరాత్రి సమయాన ఆలయ తోటబావి వద్ద పంచవర్ణాలతో 42 వరుసలతో ఆలయ ఒగ్గు పూజరులచే పెద్ద పట్నం నిర్వహణ జరుగనుంది. పెద్దపట్నం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
అటు సంగారెడ్డి జిల్లా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఝరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర భక్తులు తెల్లవారుజాము నుంచి భారీగా తరలివస్తున్నారు.