బీఆర్ఎస్ మెనిఫెస్టోతో కాంగ్రెస్, బీజేపీల్లో గుబులు

కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లు

అమరజ్యోతి వద్దకు వచ్చి రాహుల్ గాంధీ నివాళులర్పించగల ధైర్యం ఉందా ?

అమరులకు నివాళులర్పిస్తే కాంగ్రెస్ చేసిన పాపాలు కొన్నయినా తొలుగుతాయి

ఆత్మహత్యలకు కారణమే కాంగ్రెస్

అబద్దాలు చెప్పడంలో ఆరితేరిన బీజేపీ

ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి ?

రాష్ట్ర విభజన హామీలు అమలు ఏది ?

గత పదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు

ఒక్క సీటులో కూడా బీజేపీకి డిపాజిట్ రాదు

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేసేలా బీఆర్ఎస్ మెనిఫెస్టో

బీఆర్ఎస్ మెనిఫెస్టో పేదల వర్గాల అభ్యున్నతికి బాటలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ మెనిఫెస్టోను చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో గుబులు మొదలైందని, ఆ పార్టీల మైండ్ బ్లాంక్ అయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అందుకే ఆ రెండు పార్టీల నేతల అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లని, అబద్దాలు చెప్పడంలో బీజేపీ ఆరితేరిందని విమర్శించారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా తమ పార్టీ మెనిఫెస్టో ఉందని, అన్ని వర్గాలకు మరింత అభ్యున్నతి కలిగేలా ఉందని తెలిపారు.

ఇటువంటి మెనిఫోస్టో కలలో కూడా ఊహించలేదని, కేసీఆర్ ఇన్ని రకాల హామీలను ప్రకటిస్తారని కాంగ్రెస్ నేతలు భావించలేదని చెప్పారు. బీఆర్ఎస్ మెనిఫెస్టోను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చిత్తుకాగితంతో పోల్చడం పట్ల కవిత మండిపడ్డారు. చిత్తుకాగితం కాంగ్రెస్ పార్టీదా తమ పార్టీదా అని ఎన్నికల్లో ప్రజలు తేల్చుతారని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న పార్టీ అన్ని లెక్కలు తీసుకొని సహేతుకంగా ప్రకటించిన మెనిఫెస్టోను చిత్తుకాగితమంటే… ఎటువంటి బాధ్యత, తాడూ బొంగరం లేని కాంగ్రెస్ చెప్పే మాటలు ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. కర్నాటకలో హామీలు అమలు చేయలేమని అక్కడి మంత్రలే ప్రకటిస్తున్న ఉదంతాలను చూస్తున్నామని, కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లని విమర్శించిరు. “అంశాలవారీగా మాట్లాడకుండా అమరవీరుల స్థూపం వద్దకు రండి… ప్రమాణం చేయండని సవాలు చేయడం రేవంత్ రెడ్డి స్థాయికి తగదు. అనేక మంది అమరులయ్యారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే. నిజంగా దమ్మూ ధైర్యం ఉంటే రాహుల్ గాంధీని అమరజ్యోతి వద్ద అమరవీరులకు నివాళులర్పించమని చెప్పండి. అప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలు ఏమన్న తొలగిపోతాయో చూద్దాం” అని సవాలు విసిరారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు తెలంగాణ స్థితిగతులపై ఎటువంటి అవగాహన లేదని విమర్శించారు. ఏమి తెలియని స్థానిక నేతలు రాసిచ్చే స్క్రిప్ట్ ను చదవడం కాంగ్రెస్ జాతీయ నాయకులు మానుకోవాలని సూచించారు.

అబద్ధాలు చెప్పడంలో బీజేపీ ఆరితేరిందని, రూ. 15 లక్షలు ఒక్కో ఖాతాలో వేస్తామని చెప్పి విస్మరించారని, ఏటా 2 కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణలో 2 లక్షల 21 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ప్రైవేటు రంగంలో 30 లక్షలకుపైగా ఉద్యోగాలు సృష్టించి యువతకు భరోసా కల్పించామని వివరించారు. గత పదేళ్ల కాలంలో తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలు ఏమయ్యాయో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ 105 చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని, ఈ ఎన్నికల్లో మొత్తం 119 సీట్లలో డిపాజిట్ కోల్పోతుందని స్పష్టం చేశారు.

 

తెలంగాణ ప్రజల కోసం సీఎం కేసీఆర్ మంచి మెనిఫెస్టోను విడుదల చేశారని తెలిపారు. ప్రగతి పథంలో దూసుకెళ్తన్న తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లేలా మెనిఫోస్టో ఉందని అన్నారు. సంపదను సృష్టిస్తూ ఆ సృష్టించిన సంపదను పేద ప్రజలకు పంచుతూ దేశంలోనే తెలంగాణను ప్రత్యేక మోడల్ ను సృష్టించామని స్పష్టం చేశారు. మనం సృష్టించిన మోడల్ గురించి దేశ ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. 2014లో రూ. లక్షా 12 వేలుగా ఉన్న తలసరి ఆదాయం ఈనాడు రూ. 3 లక్షల 15 వేలకు చేరిందంటేనే తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో తెలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ అందరినీ సమానంగా చూసే వ్యక్తి కాబట్టి పారిశ్రామికవేత్తలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో పాడి పరిశ్రమదారులకూ అంతే ప్రాధాన్యత ఇస్తారని వివరించారు. భూమి లేని పేదలు, పేద మహిళలను అభివృద్ధి చేసేలా మెనిఫోస్టో ఉందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా మెనిఫెస్టో ఉందని తెలిపారు. తమ పార్టీ మెనిఫెస్టోను ప్రజలు ఆమోదిస్తారన్న విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version