వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్న కేంద్ర బడ్జెట్‌

 రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపెల్లి బాబు

నర్సంపేట,నేటిధాత్రి :

2024 – 25 కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి రూ.2,22,281 కోట్లు కేటాయించినట్లు ప్రకటించినప్పటికీ వాస్తవంగా కేటాయించింది రూ.1,17,528.79 కోట్లు మాత్రమేనని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపెల్లి బాబు అన్నారు.కేంద్ర బడ్జెటుకు నిరసనగా శుక్రవారం నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
వ్యవసాయరంగాభివృద్ధికి నిధులు, మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఆర్థిక మంత్రి పదే పదే బడ్జెట్‌ ఉపన్యాసంలో చెప్పినా వాస్తవ బడ్జెట్‌లో అందుకు సంబంధించిన కేటాయింపులు చేయకపోగా కార్పొరేట్లకు వ్యవసాయరంగాన్ని కట్టబెట్టేందుకు పూనుకున్నదని బాబు విమర్శించారు.దేశం బాగుకు పేదలు, యువకులు, మహిళలు, రైతులు మాత్రమే కీలకమని చెప్తూ రైతులకు అనేక లాభాలు, రాయితీలు కల్పించినట్లు బడ్జెట్‌లో ప్రకటించారు కానీ పి.యం కిసాన్‌ నిధి కింద 11.8 కోట్ల మందికి సంవత్సరానికి రూ.6,000ల చొప్పున ఇస్తున్నట్లు బడ్జెట్‌లో చెప్పారు. దేశంలో 14.75 కోట్ల మంది రైతులు ఉండగా వాస్తవంగా కిసాన్‌ సమ్మాన్‌ పథకం 8 కోట్ల మందికి పంపిణీ చేస్తూ సన్న,చిన్నకారు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. ఫసల్‌భీమా 4 కోట్ల మందికి ఉపయోగపడుతున్నదని ప్రకటించారు కానీ వాస్తవానికి 2.85 కోట్ల మందికి మాత్రమే ఫసల్‌ బీమా క్లైంలువస్తున్నాయవి అన్నారు. ప్రీమియంతో ఇన్సూరెన్స్‌ కంపెనీలు వేలకోట్లు లాభాలు అర్జించడాన్ని గమనించి తెలంగాణతో సహా 8 రాష్ట్రాలు ఫసల్‌భీమా నుండి 2000 సంవత్సరంలోనే బయటకు వచ్చాయని అన్నారు. దేశవ్యాప్తంగా 1361 మండీ (మార్కెట్‌లలో) 3 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు, అలాగే మొత్తం దేశంలో వ్యవసాయోత్పత్తుల మార్కెట్‌ 18 లక్షల కోట్లకు చేరి, కనీస మద్దతు ధరలు రైతులకు లభిస్తున్నట్లు బడ్జెట్‌లో చెప్పారు. ఇది ముమ్మాటికి రైతులను భ్రమలకు గురిచేసే ప్రకటన మాత్రమేనని విమర్శించారు.18 లక్షల కోట్ల వ్యాపారంలో కనీస మద్దతు ధర లభించక రైతులు ఏటా 4 లక్షల కోట్లకు నష్టపోతున్నట్లు ఆర్థిక వేత్తలు తెలియజేశారని అన్నారు. నానో యూరియా ద్వారా ఎరువుల బ్లాక్‌ మార్కెట్‌ ఆగిపోయిందని, నానో డిఏపిని తెస్తామని బడ్జెట్‌లో చెప్పారు ఇప్పటికీ దేశానికి అవసరమైన ఎరువులలో 60 శాతం ఎరువులతో పాటు 100 శాతం పొటాష్‌ను ఇతర దేశాల నుండి దిగుమతులు చేసుకుంటున్నాం. డాలర్‌ విలువతో పోటీ పడి రూపాయి విలువ తగ్గడంతో ఎరువుల ధరలు పెరిగిపోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. ఒకవైపున ఎరువుల ధరలు పెరిగిపోతుండగా 2022- 23లో రూ.2,54,841 కోట్లు సబ్సిడీ ఇవ్వగా, 2024 – 25 బడ్జెట్‌లో రూ.1,68,130 కోట్లకు కేంద్రం ప్రభుత్వం తగ్గించారని పేర్కొన్నారు. లక్ష కోట్లు తగ్గించి ఎరువులు అందుబాటులోకి తెచ్చామని కేంద్రం చెప్పడం హశ్యాస్పదమని విమర్శించారు.80 కోట్ల మంది ప్రజలకు ఉచిత ఆహార పథకాన్ని అమలు జరిపే ప్రభుత్వం ఆహార ధాన్యాల ఉత్పత్తిని విస్తృతంగా పెంచాలి. కానీ, ఆహార సబ్సిడీల కొరత, ఉపాధిహామి పథకం కోతతో పాటు వ్యవసాయ ఎగుమతి`దిగుమతుల వ్యాపారాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడం వల్ల ఉపకరణాల ధరలు పెరిగి వ్యవసాయోత్పత్తుల ధరల తగ్గిపోతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆదేశించినట్లు 18 శాతం పంట రుణాలు, 22 శాతం దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదని, బడ్జెట్‌లో మార్కెట్‌ జోక్యం పథకం కింద కేటాయింపులే లేవని చెప్పారు. దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల నివారణకు బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చూపలేదని, దేశాన్ని వ్యవసాయ దిగుమతులకు కేంద్రంగా తయారు చేస్తూ, వ్యవసాయోత్పత్తులపై కార్పొరేట్‌ సంస్థలకు ఆధిపత్యం కలిగే విధంగా నిధులు తగ్గిస్తున్నారని విమర్శించారు. గతంలో ఉపసంహరించుకున్న 3 నల్ల చట్టాలను మరో కోణంలో అమలు జరపడాన్ని తెలంగాణ రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే రుణాల మాఫీతోపాటు కనీస మద్దతు ధరలను శాస్త్రీయంగా నిర్ణయించాలని ఈసంపెల్లి బాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాద్యక్షులు కోరబోయిన కుమార స్వామి,అక్కపెల్లి సుధాకర్, గొర్రె సంజీవరెడ్డి, గట్ల నర్సింహ్మ రాములు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version