raitheraju ninadanne nijam chestunna modi, రైతేరాజు నినాదాన్ని నిజం చేస్తున్న మోడీ

రైతేరాజు నినాదాన్ని నిజం చేస్తున్న మోడీ

రైతే రాజు అనే నినాదాన్ని నరేంద్ర మోడీ నిజం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. నరేంద్ర మోడీ రెండోవసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా రైతులకు భరోసా కల్పిస్తూ ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పధకం ద్వారా 5ఎకరాల రైతులకు మాత్రమే కాకుండా ప్రతి రైతుకి కుడా వర్తించేలా నిర్ణయం తీసుకున్న సందర్బంగా బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు పుల్యాల రవీందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కార్యాలయం వద్ద నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతు నరేంద్ర మోడీ 5సంవత్సరాల స్వచ్చమైన పాలన అందించి మరోమారు ప్రజలమోదం పొంది భారీ మెజారిటీతో గెలిచి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారన్నారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి నిర్ణయంగా రైతులకు భరోసా కల్పిస్తూ గతంలోని ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పథకంలోని 5ఎకరాల స్లాబును తీసివేసి ప్రతి ఒక్క రైతుకు కుడా ఈ పథకం వర్తించేలా చేస్తూ రైతులకు బరోసా కల్పించారన్నారు. అదేవిధంగా 60సంవత్సరాలు నిండిన ప్రతి రైతు నెలకు 3వేల రూపాయిల పెన్షన్‌ ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడం కేవలం నరేంద్ర మోడీకే సాధ్యమైయిందని తెలిపారు. భారతదేశ చరిత్రలో రైతుల సంక్షేమం ఈ ప్రభుత్వం చేయని విధంగా దేశంలో 60శాతం ఉన్న రైతులకు భరోసా కల్పిస్తూ నరేంద్ర మోడీ ఇలాంటి పధకం ప్రవేశపెట్టడం చారిత్రాత్మకమైన నిర్ణయంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గండ్రతి యాదగిరి, కిసాన్‌ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారేపల్లి రామచంద్రరెడ్డి, బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా ప్రధానకార్యదర్శులు కొలను సంతోష్‌రెడ్డి, సంగని జగదీశ్వర్‌, బీజేపీ వరంగల్‌ అర్బన్‌ రాష్ట్ర, జిల్లా నాయకులు మండల సురేష్‌, పాశికంటి రాజేంద్రప్రసాద్‌, గంకిది శ్రీనివాస్‌రెడ్డి, గురజాల వీరన్న, కందగట్ల సత్యనారాయణ, సారంగపాణి, జన్ను ఆరోగ్యం, నానునాయక్‌, దామెర సదానందం, కేసోజు వెంకట్‌, కల్లూరి పవన్‌, గూడెం రవితేజ, రాజేష్‌ఖన్నా, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

pranadathaga maruthunna rajkumar, ప్రాణదాతగా మారుతున్న రాజకుమార్‌

ప్రాణదాతగా మారుతున్న రాజకుమార్‌

అన్ని దానాలకన్నా రక్తదానం మిన్న, రక్తదానం చేయండి ఒక జీవితానికి ప్రాణదాతలు కండి అంటూ ఎందరో మహానుభావులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇందుకు అనుకుంగానే 20సార్లు రక్తదానం చేసి ప్రాణదాతలు నిలుస్తున్నాడు దుగ్గొండి మహిళా సమాఖ్యలో ఎపిఎంగా విధులు నిర్వహిస్తున్నారు డాక్టర్‌ గుజ్జుల రాజ్‌కుమార్‌. ఈ సందర్భంగా ‘నేటిధాత్రి’తో రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని సోమవారం వరంగల్‌ డిఆర్‌డిఎ ఆధ్యర్యంలో వరంగల్‌ రోవర్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో 20సార్లు రక్తదానం చేసినట్లు పెద్దల స్ఫూర్తితో, ప్రజాసేవే ధ్యేయంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ఆయన వివరించారు. విదేశాల్లో, దేశవ్యాప్తంగా పలు అభివద్ధి, యువజన కార్యక్రమాలలో పాల్గొంటున్న సందర్భంగా ప్రభుత్వం డాక్టరేట్‌ అందించిందని తెలిపారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్నందుకు డీఆర్డీఏ పిడి సంపత్‌రావు, ఏపిడి పరమేష్‌, డ్వామా ఏపిడి పారిజాతంలు అభినందించి సంబంధిత ధవీకరణ పత్రాన్ని అందించాలని, మరిన్ని రక్తదాన శిబిరాల్లో పాల్గొననున్నట్లు ఏపీఎం రాజ్‌కుమార్‌ తెలిపారు.

telangana rashtra avatharana dinostava vedukalu, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

హసన్‌పర్తి మండలంలోని వివిధ గ్రామాలలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వార్డుసభ్యులు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారుతెలంగాణగా అభివృద్ధి పథంలో ముందుకు నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపిటిసి, వార్డుసభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

vithanthuvula manobavalanu gouravinchali, వితంతువుల మనోభావాలను గౌరవించాలి

వితంతువుల మనోభావాలను గౌరవించాలి

వితంతువుల మనోభావాలను సమాజంలోని ప్రతి ఒక్కరు గౌరవించాలని జయగిరి గ్రామ సర్పంచ్‌ బొల్లవేణి రాణి అన్నారు. ఆదివారం మండలంలోని జయగిరి గ్రామంలో గ్రామపంచాయితీ కార్యాలయంలో బాలవికాస ఆధ్వర్యంలో గ్రామాభివృద్ది కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ రాణి హాజరై మాట్లాడారు. గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు సహకరించాలని అన్నారు. అదేవిధంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల సమస్య నేడు అధికంగా ఉందని, దాని నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. అనంతరం ఈనెల 23వ తేదీన వితంతువుల దినోత్సవం సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ ఏలీమి రమేష్‌, పంచాయతీ కార్యదర్శి సురేష్‌, వార్డుసభ్యులు వెంకటేష్‌, రాజు, బాలవికాస ప్రతినిధులు బాబూరావు, రాజ్‌కుమార్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు పిట్టల రాజు, కుమారస్వామి, కమిటీ అధ్యక్షుడు, సభ్యులు పాల్గొన్నారు.

vronu nirbandinchina gramastulu, విఆర్‌ఓను నిర్బంధించిన గ్రామస్తులు

విఆర్‌ఓను నిర్బంధించిన గ్రామస్తులు

జయశంకర్‌ జిల్లా చిట్యాల మండలం నవాబుపేట గ్రామస్తులు విఆర్వోను నిర్భంధించారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడంలో విఫలమయ్యాడని నిరసిస్తూ గ్రామ విఆర్వో ఆదినారాయణను గ్రామపంచాయతీ భవనంలో గ్రామస్తులు నిర్బంధించారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్‌ గ్రామస్తులతో మాట్లాడి అందరికీ పట్టా పాస్‌పుస్తకాలు ఇస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించి విఆర్వోను వదిలిపెట్టారు.

rajastanlo policelapia dadi avastavam, రాజస్థాన్‌లో పోలీసులపై దాడి అవాస్తవం

రాజస్థాన్‌లో పోలీసులపై దాడి అవాస్తవం

వరంగల్‌ క్రైం, నేటిధాత్రి : వరంగల్‌ జిల్లాలో దొంగతనాలకు పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన దొంగల ముఠాను పట్టుకునేందుకు వరంగల్‌ జిల్లా సీసీఎస్‌ పోలీసులు రాజస్థాన్‌కు వెళ్లడం జరిగిందని సీసీఎస్‌ పోలీసులు తెలిపారు. దొంగల ముఠా కోసం గాలిస్తుండగా దొంగల ఆచూకి రాజస్థాన్‌లోని బిల్వాడా జిల్లా హెర్నియా గ్రామంలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తుండగా గ్రామస్తులు పోలీసులను అడ్డుకున్నారని తెలిపారు. అడ్డుకునే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొందని, అయినా పట్టువదలకుండా దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు సీసీఎస్‌ పోలీసులు తెలిపారు. ధైర్యసాహసాలతో ఎదురించి దొంగలను పట్టుకున్న పోలీసులను జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. సామాజిక మాధ్యమాలలో పోలీసులను తీవ్రంగా గాయపరిచినట్లు, పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు.

mla gari muddula alludu, ఎమ్మెల్యే గారి ముద్దుల అల్లుడు

ఎమ్మెల్యే గారి ముద్దుల అల్లుడు

– వరంగల్‌ పశ్చిమలో ఆడింది ఆట…పాడింది పాట

– మామ కంటే ఎక్కువ అధికారాన్ని ఉపయోగించేది అల్లుడే

– ఒక్కసారి సర్పంచ్‌గా గెలిచి జనానికి చుక్కలు చూపించాడట…

– భూకబ్జాలు,పైసల వసూళ్ళలో ఇతగాడిదే ప్రధాన పాత్ర..?

– ఇద్దరు రియల్టర్ల మధ్య దూరి పంచాయితీ పరిష్కారం చేసే ప్రయత్నం

– అరవైలక్షలకు ఐదు ఇస్తాడని భాదితుడికి బెదిరింపులు

– పోలీసులు తాను చెప్పిందే వినాలని హుకుం, సమస్య పరిష్కారం కాకుండా కాలయాపన

(సోమవారం సంచికలో…)

prabuthva karyalama…padaka gada…?,ప్రభుత్వ కార్యాలయమా…పడక గదా…?

ప్రభుత్వ కార్యాలయమా…పడక గదా…?

వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌జిల్లా ప్రదాన కార్యాలయంలో పగలంతా సిబ్బంది తమ విధులు ముగించుకొని వెళ్లగానే, కార్యాలయంలోకి రాత్రివేళలో ఓ ఇద్దరు వస్తున్నారని వారు అక్కడే మకాం పెడుతున్నారని, ఆ ఇద్దరు ఎవరై ఉంటారు? వారు రాత్రి అవగానే ఎందుకు వస్తున్నారు..కార్యాలయంలో ఉన్న ఆ రెండు పరుపులు ఎవరివి అయ ఉంటాయ..ఆ రెండు పరుపులు వారిద్దరు పడుకోవడానికే తెచ్చుకొని ఆఫీస్‌లో పెట్టుకున్నారా? ఆఫీస్‌ను తమ వ్యక్తిగత అవసరాల కోసం ఏమైనా వాడుకుంటున్నారా? ఇంటర్మీడియట్‌ వ్వవస్థకు సంబందించిన చాలా ముఖ్యమైన సమాచారం ఉండే కార్యాలయంలో ఈ విదంగా పడుకోటమేంటనే సందేహాలు, ప్రశ్నలు ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్నాయి.

రాత్రివేళలో మకాం పెడుతున్నది ఎవరు

కార్యాలయంలోని సిబ్బంది పగలంతా పనులు ముగించుకొని వెళ్లిన తర్వాత రాత్రి అయితే చాలు ఓ ఇద్దరు కార్యాలయంలోనే పడుకుంటున్నారని చుట్టు ప్రక్కల వాళ్లు, అటు ఇటుగా వెళ్లేవాళ్లు చెబుతున్నారు. అందులో మకాం పెట్టింది ఎందుకోసం, అసలు అందులో రాత్రివేళలో పడుకుంటున్న ఆ ఇద్దరు పురుషులేనా? కాదా? ఇంకెవరైననా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రాత్రి కార్యాలయంలో ఉద్యోగులుంటున్నారా, అధికారి ఉంటున్నాడా? ఎవరెవరు ఉంటున్నారు, ఎందుకుంటున్నారు, ఏ పని కోసం ఉంటున్నారు. ఏ ఉద్దేశ్యంతో ఉంటున్నారు ఇవన్ని కాలనీవాసులతో పాటు బాటసారులను వేదిస్తున్న ప్రశ్నలు.

డిఐఈవోకు పరుపులతో ఏం పని…?

కార్యాలయంలో ఉన్న ఆ రెండు పరుపులు ఎవరివి? ఎవరు కొన్నారు? ఎందుకు కొన్నారు? ఎందుకు కార్యాలయానికి తీసుకువచ్చారు? ఎందుకు కార్యాలయంలోనే ఉంచారు? ఆ రెండు పరుపులను వాడుతున్నదెవరు? ఇలా మిలియన్‌ డాలర్ల ప్రశ్నలు కార్యాలయ సిబ్బందితో పాటు కార్యాలయానికి వచ్చిపోయే వారిని సైతం వేదిస్తున్న ప్రశ్నలు. ఒక వేళ డిఐఈవో మద్యాహ్నం విశ్రాంతి కొరకు తెచ్చుకున్నాడుకున్నా ఆయనకు ఒక్క పరుపు చాలు మరి రెండు పరుపులు ఎందుకు తెచ్చినట్లు? అర్ధం కాని పరిస్థితి. మద్యాహ్నం డిఐఈవో విశ్రాంతి తీసుకునే అవకాశమే ఉండదని తెలుస్తున్నది. అలాంటప్పుడు డిఐఈవోకు పరుపులతో ఏం పని? రాత్రివేళల్లో బస చేసేందుకు ఆ పరుపులు కార్యాలయంలో ఉండొచ్చని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా కార్యాలయ అధికారులు అధికారికంగా ఆ పరుపులు కార్యాలయంలో ఎందుకు ఉన్నాయో చెబుతే తప్పా ప్రజల అనుమానాలకు, ప్రశ్నలకు జవాబు దొరకని పరిస్థితి కనబడుతున్నది.

(సీసీ కెమెరాలు ఎందుకు బంద్‌ చేశారు…త్వరలో)

jayagirilo swachbharath, జయగిరిలో స్వచ్చభారత్‌

జయగిరిలో స్వచ్చభారత్‌

మండలంలోని జయగిరి గ్రామంలో బాలవికాస ఆదర్శ గ్రామ కమిటీల ఆద్వర్యంలో స్వచ్చ గ్రామం నిర్వహించామని బాలవికాస ప్రతినిధులు బాబురావు, రాజ్‌కుమార్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. దీంతో ఎలాంటి అంటువ్యాధులు దరి చెరవని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలవికాస కమిటీ అధ్యక్షుడు అయిల కొమురమ్మ, జ్యోతి, లలిత, అయిలయ్య, కొంరయ్య తదితరులు పాల్గొన్నారు.

modaliana prapancha paryavarana dinostava ustavalu, మొదలైన ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఉత్సవాలు

మొదలైన ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఉత్సవాలు

ఈనెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ప్రారంభం చేసినట్లు జిల్లా అటవీశాఖ అధికారి పురుషోత్తం తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం నుండి ఈనెల 5వ తేదీ వరకు జరిగే ఉత్సవాలను ఉత్సవాలు వరంగల్‌ రూరల్‌ జిల్లా అటవీశాఖ, జన విజ్ఞాన వేదిక, వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ, వన సేవా సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మొదటిరోజున హైదరాబాద్‌ బర్డింగ్‌ ఫాల్స్‌ సొసైటీ బాధ్యులు శ్రీరామ్‌రెడ్డి, గోపాలకష్ణ ఆధ్వర్యంలో పాకాల అభయారణ్యంలో సందర్శించి వివిధరకాల పక్షులను గుర్తించి అందులో నుండి ఇండియన్‌ పక్షిని ప్రత్యేక పక్షిగా గుర్తించామన్నారు. అలాగే 2వ తేదీన బర్డ్‌ ఫెస్టివల్‌, 3వ తేదీన నర్సంపేటలోని అటవీశాఖ కార్యాలయంలో ఉపన్యాస, పాటల పోటీలు, 4వ తేదీన ఆన్‌లైన్‌లో స్లోగన్స్‌, కార్టూన్లు, డ్రాయింగ్‌ పోటీలు నిర్వహిస్తామని, గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు. 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున అటవీ నడక పాకాలలో ఉదయం 6గంటలకు, అలాగే అదేరోజు మొత్తం ప్రకతి శిబిరం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాలను జనవిజ్ఞాన వేదిక, వనసేవా సొసైటీ, ఓరుగల్లు వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ, అటవీశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా చేపడుతున్నట్లు, ఈ కార్యక్రమాలకు పర్యావరణ ప్రేమికులు హాజరై విజయవంతం చేయాలని అటవీశాఖ అధికారి పురుషోత్తం కోరారు. ఈ కార్యక్రమంలో ఓరుగల్లు వైల్డ్‌ లైఫ్‌ సొసైటీ బాధ్యులు శ్యాంసుందర్‌శర్మ, హైదరాబాద్‌ బర్డింగ్‌ ఫాల్స్‌ అధికారిణి అంజుల దేశాయ్‌, రేంజ్‌ అధికారి రమేష్‌, డిప్యూటీ రేంజ్‌ అధికారి ఇజాజ్‌ అహ్మద్‌, ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు, సుధాకర్‌లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

arthikame neramaothunda…?, ఆర్థికమే ‘నేర’మౌతుందా…?

ఆర్థికమే ‘నేర’మౌతుందా…?

ఆర్థిక సమస్యలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. అవసరానికి తీసుకున్న డబ్బులు అప్పుల ఊబిలోకి నెట్టివేస్తే అవే ఆర్థిక అవసరాలు నేరానికి పురిగొల్పుతున్నాయి. అధికవడ్డీలతో చుక్కలు చూస్తూ అవి కట్టలేక కొందరు నేరగాళ్లుగా మారితే, ఇచ్చిన డబ్బులను అధిక వడ్డీతో సహా రాబట్టేందుకు కొందరు ప్రైవేట్‌ ఫైనాన్సర్స్‌ నేరగాళ్లుగా మారుతున్నారు. ఇంకొందరైతే వ్యాపారాలు పెట్టే తమతో ఉన్న భాగస్వాములను నమ్మి లక్షల్లో పెట్టుబడి పెట్టి లెక్కలు తేలక భాగస్వామి చేతిలో మోసపోయి దిక్కుతోచని స్థితిలో పగతో రగిలిపోయేవారు ఉన్నారు. వీరందరిని చేరదీసి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ‘చిచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నమనే’ చందంగా సందట్లో సడేమియాల్లాగా కొంతమంది రాజకీయ నాయకులు దూరి పర్సంటేజిలతో పనులు కానిచ్చేస్తున్నారు. అప్పులు ఎగ్గొట్టేవారికి వీరు అండదండగా ఉంటున్నారు. అధిక వడ్డీల విషయంలో మాత్రం ప్రైవేట్‌ ఫైనాన్సర్స్‌ల తరపున వకాల్తా పుచ్చుకుని పేదప్రజల ఉసురుపోసుకుంటున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో ఆర్థికమే నేరంగా మారుతుంది. మనిషి ప్రాణాలుపోయే వరకు వస్తోంది. ‘ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని గుర్తిస్తారు. వారికి ఏదో సహాయం చేస్తున్నట్లుగా..తీర్చలేని వడ్డీలకు అప్పులు ఇస్తారు. కొంతకాలం తర్వాత తమ అప్పు తీర్చాలంటూ వారి పీకలమీద కూర్చుంటారు. ఒకవేళ తీర్చలేకపోతే బాధిత మహిళలను, వారి కుటుంబంలోని మహిళలను తమ లైంగిక అవసరాలు తీర్చమని బలవంతం చేస్తారు. అలా కాని పక్షంలో ఇళ్లుపీకి పందిరేస్తామని బెదిరిస్తారు. తమకు పోలీసు, రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి…బాధితుల ఎదురుగానే వారితో ఫోన్లో మాట్లాడుతారు. దీంతో ఇష్టం లేకపోయినా రౌడీలు వస్తే ఎక్కడ తమ పరువుపోతుందనే భయంతో వ్యాపారులు చెప్పినట్లు చేస్తారు. దీనిని వీడియో తీసి బాధితుల కుటుంబంలోని యువతులను కూడా తమ దారికి తెచ్చుకుంటారు. ఇదీ వరంగల్‌ నగరంలోని వ్యవహారం. ప్రస్తుతం ఇదే హాట్‌టాపిక్‌. ఇప్పటివరకూ బయటకు పొక్కకపోయినా నగరంలో ఇలాంటి తతంగమే నడుస్తున్నదని చెప్పొచ్చు. రామన్నపేట, కాశిబుగ్గ, కరీమాబాద్‌, రంగశాయిపేట, ఎస్‌ఆర్‌ఆర్‌తోట, గిర్మాజీపేట ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు నగరంలో ఇదే ఫార్ములాను అమలుచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు దీనిపై లోతుగా దష్టి సారిస్తే ఇలాంటి సంఘటనలు బయటకు రావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి నివాసముంటున్నారు. వీరితోపాటు నగరానికి చెందిన అనేకమంది పేద, మధ్యతరగతి ప్రజలు, చిరువ్యాపారులు తరచూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతుంటారు. దీంతో వీరంతా వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి రుణాలు తీసుకుంటూ ఉంటారు. నగరానికి చెందిన వారితోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన ఫైనాన్స్‌ వ్యాపారులు ఇలాంటి వారందరికీ రోజువారీ, వారం, నెలవారీ వాయిదాల తీర్మానంపై అప్పులు ఇస్తుంటారు. ఇందుకోసం తీసుకునే వారి అవసరాన్ని బట్టి వడ్డీ రూ.10నుంచి రూ.15 వరకూ వసూలు చేస్తుంటారు. ఇది ఒకవిధంగా అప్పు తీసుకునే వారికి భారమే అయినప్పటికీ మరో ప్రత్నామ్నాయం లేకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులనే ఆశ్రయిస్తూ వారి ఊబిలో చిక్కుకుంటున్నారు.

నగరంలో వందకుపైగా ఫైనాన్షియర్లు

నగరంలో ఫైనాన్స్‌ ఇచ్చే వ్యాపారుల సంఖ్య వందకుపైగానే వుంటుంది. వీరిలో ఎక్కువ మంది గ్రేటర్‌ వరంగల్‌కి చెందినవారేనని చెప్పొచ్చు. ఆయా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు నగరంలో ఏదో ఒకచోట ఇళ్లు అద్దెకు తీసుకుని కార్యాలయంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రాంతాలవారీగా కలెక్షన్‌ చేసే వారిని నియమించుకుంటున్నారు. ఉదయాన్నే కార్యాలయానికి వచ్చి ముందురోజు కలెక్షన్లను తీసుకువచ్చే బాయ్స్‌ నుంచి కట్టించుకుంటారు. తర్వాత రికార్డులను సరిచేసుకుని తమ కలెక్షన్‌ బాయ్‌లు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫైనాన్స్‌ తీసుకోవాలనుకుంటున్న వారి ఇళ్లకు వెళతారు. అవతలివారి అవసరాన్ని బట్టి వడ్డీలను నిర్ణయించి ఖాళీ ప్రామిసరి నోటు తీసుకుని అప్పులు ఇస్తుంటారు. సాయంత్రం కాగానే కార్యాలయానికి తాళం వేసి తిరిగి వెళతారు. ఇలా ఫైనాన్స్‌ చేస్తున్న వారు నగరంలో వందకుపైగా వుంటారని అంచనా.

వ్యాపారులకు కొంతమంది రాజకీయ నేతల దన్ను

ఫైనాన్స్‌ వ్యాపారులకు నగరంతోపాటు వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న కొంతమంది ఖాకీలు, రాజకీయ నేతల అండదండలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాకీ కట్టలేని వారి పట్ల వ్యాపారులు తమదైన వ్యూహాన్ని అమలుచేస్తుంటారు. ఒకవేళ ఎవరైనా తమ దారికి రాకపోతే వారి ఎదురుగానే తమకు పరిచయం ఉన్న పోలీసులు, రాజకీయ నాయకులకు ఫోన్‌చేసి అత్యంత చనువుగా మాట్లాడుతారు. దీంతో బాధితులు భయపడి వ్యాపారుల ఆగడాలను బయటకు చెప్పలేక లోలోనే కుమిలిపోతున్నారు. ఒకవేళ ఎవరైనా ఎదిరిస్తే రౌడీలను వారి ఇళ్లపైకి పంపించి నానా బీభత్సం సష్టించి భయాందోళనకు గురిచేస్తుంటారు. ఇంట్లోని సామాన్లను వీధిలో పడేస్తుంటారు.

మరికొందరైతే భౌతికదాడులకు దిగి బాధితులకు ఉన్న ఆస్తులను వ్యాపారులకు రాసి ఇచ్చేసినట్లు బలవంతంగా సంతకాలు చేయించుకుంటారు. దీనిపై పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ ఫిర్యాదులు లేనందున తామేమీ చేయలేమంటూ మిన్నకుండిపోతున్నారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలపై పోలీసులు ఇప్పటికైనా దష్టిసారిస్తే నగరంలో చోటుచేసుకున్న సంఘటనలు పునరావతం కాకుండా నియంత్రించేందుకు వీలుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

బాకీ తీర్చలేకపోతే అరాచకమే..

అవసరం కనుక వడ్డీ గురించి ఆలోచించకుండా అప్పులు తీసుకున్నవారు తిరిగి కట్టేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. దినసరి కూలీలు, చిరువ్యాపారులు కావడంతో వాయిదాలను సక్రమంగా చెల్లించే పరిస్థితి ఉండదు. దీంతో వ్యాపారులు తమ బాకీలపై వడ్డీలకు చక్రవడ్డీలను కలిపి బాధితులకు తలకు మించిన భారాన్ని చూపి తీర్చమని ఒత్తిడి తెస్తారు. తీర్చలేకపోతే బాధితులకు ఉన్న ఆస్తులపై కన్నేసి తక్కువ మొత్తానికి వాటిని సొంతం చేసుకుంటారు. బాధితులకు ఆస్తులు ఏవీ లేకపోతే వారి ఇంట్లో ఉండే మహిళలపై వ్యాపారుల కన్నుపడుతుంది. అందంగా ఉన్న వారుంటే అప్పును బూచిగా చూపి వారిని లోబరుచుకునేందుకు పావులు కదుపుతారు. అలా కానిపక్షంలో రౌడీలను పంపించి ఇంట్లోని వస్తువులను ఎత్తుకుపోతామని, వస్తువులను వీధిలో పడేస్తామని బెదిరిస్తారు. ఆ విధంగా జరిగితే చుట్టుపక్కల వారి దగ్గర పరువుపోతుందనే భయంతో వ్యాపారులు చెప్పినట్లు చేస్తున్నారు. వాటిని వీడియో తీసి వారి కుటుంబంలో ఎవరైనా యువతులు వుంటే వారికి వీడియోలను చూపిస్తామని బెదిరించి ఆ యువతులను కూడా తమదారికి తెచ్చుకుంటున్నారు. అయితే దీనిపై బాధితులు ఇప్పటివరకూ ఫిర్యాదు చేసిన సందర్భాలు లేకపోయినా ఇదంతా గుట్టుగా సాగుతున్న వ్యవహారమేనని కొంతమంది బాధితులు పేర్కొనడం గమనార్హం.

sankethika vyavasthalapia purthi parignanam undali, సాంకేతిక వ్యవస్థలపై పూర్తి పరిజ్ఞానం ఉండాలి

సాంకేతిక వ్యవస్థలపై పూర్తి పరిజ్ఞానం ఉండాలి

జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌లలో విధులు నిర్వహించే కానిస్టేబుల్‌, సిసి టిఎన్‌ఎస్‌ రైటర్లు, రిసెప్షనిస్టులకు సాంకేతిక వ్యవస్థలపై పూర్తి పరిజ్ఞానం ఉండాలని సిరిసిల్ల రాజన్న జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్‌స్టేషన్‌లలోని సిబ్బందికి ఒకరోజు శిక్షణా శిబిరం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిసిటిఎన్‌ఎస్‌ రైటర్లు, రిసెప్షనిస్టులకు, పోలీస్‌స్టేషన్‌ టెక్‌ టీమ్‌ సిబ్బందికి సిసిటిఎన్‌ఎస్‌, టెక్‌ డాటమ్‌, రిసెప్షన్‌ సెంటర్‌, 07 ఇంటిగ్రేటెడ్‌ ఫార్మ్స్‌ ఎంట్రీ, పోలీస్‌స్టేషన్‌ సంబంధిత రికార్డుల ఆన్‌లైన్‌ ఎంట్రీ అంశాలపై కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…ప్రస్తుత ఆధునికయుగంలో మారుతున్న, దూసుకుపోతున్న టెక్నాలజీని మనకు అందుబాటులో ఉన్న అంశాలు విరివిగా వాడుకుంటూ మోడరన్‌ పోలీసింగ్‌ చేయాలని తెలిపారు. ప్రతిఒక్కరు విధుల్లో ఉపయోగించే అన్ని సాంకేతిక వ్యవస్థలపై పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలని అన్నారు. జిల్లా పోలీసు సిబ్బంది అందరికి పలు దఫాలలో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని, ఈ శిక్షణ శిబిరాలలో నేర్చుకున్న అంశాలు రోజువారీ విధుల్లో ఉపయోగిస్తూ వేగవంతమైన ఫలితాలు రాబట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతోపాటు సిరిసిల్ల రూరల్‌ సీఐ అనిల్‌కుమార్‌, ఎస్సై రాజశేఖర్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

rashtra avatharana dinostava reharsals, రాష్ట్ర అవతరణ దినోత్సవ రిహార్సల్స్‌

రాష్ట్ర అవతరణ దినోత్సవ రిహార్సల్స్‌

ఈనెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ రిహార్సల్స్‌ కళాశాల మైదానంలో శనివారం జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే పర్యవేక్షణలో జరిగాయి. రేపటి కవాతు రిహార్సల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…యూనిఫార్మ్‌ ధరించి చూపరులను ఆకట్టుకునేలా కవాతు నిర్వహించాలని చెప్పారు. నేడు చేసిన రిహర్సల్స్‌ చాలా బాగున్నాయని, వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉందని తెలిపారు. కళాశాల మైదానంలో జిల్లా బాంబ్‌ డిస్పోజల్‌ టీం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతోపాటు ఇన్‌స్పెక్టర్‌ రజనీకాంత్‌, ప్లాటూన్‌ కమాండర్‌ దామోదర్‌, ఆర్‌ఎస్సై, పోలీసు సిబ్బంది హాజరయ్యారు.

pranam thisina selfie sarda, ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

సెల్ఫీ సరదా ప్రాణాలను మింగేసింది. సరదాగా సెల్ఫీ కోసం చెరువులో దిగి బావ, ఇద్దరు మరదళ్లు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మాపూర్‌ రిజర్వాయర్‌ వద్ద చోటుచేసుకుంది. బొమ్మాపూర్‌ జలాశయంలో పడి ముగ్గురు మృతిచెందారు. మతులు అవినాశ్‌ (32), సంగీత (19), సుమలత (18)లను రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామస్థులుగా గుర్తించారు. ఫొటోలు తీసుకుంటూ ప్రమాదవశాత్తూ ముగ్గురూ జలాశయంలో పడిపోవడంతో ఈ దారుణం చోటుచేసుకుంది.

thimmapurlo padakesina parishudyam, తిమ్మాపూర్‌లో పడకేసిన పారిశుద్ధ్యం

తిమ్మాపూర్‌లో పడకేసిన పారిశుద్ధ్యం

వరంగల్‌ గ్రేటర్‌ మహానగరంలోని ఆరో డివిజన్‌ తిమ్మాపూర్‌ పేరుకే మహానగరంగా పిలువబడుతోంది. తిమ్మాపూర్‌లో పారిశుద్ధ్యం పడకేసింది. డ్రైనేజీల్లో ఎక్కడికి అక్కడ మురుగునీరు నిలిచి కంపు కొడుతున్నాయి. కాలనీలలో ఎక్కడి చెత్త అక్కడే ఉంటుందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీలో విలీనమై ఏళ్లు గడుస్తున్నా స్థానిక కార్పొరేటర్‌, స్థానిక మున్సిపాలిటీ సిబ్బంది పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా స్థానిక కార్పొరేటర్‌, మున్సిపాలిటీ అధికారులు స్పందించాలని తిమ్మాపూర్‌వాసులు వేడుకుంటున్నారు.

board commissioner chebithe vinala, బోర్డు ‘కమీషనర్‌’ చెబితే వినాలా…?

బోర్డు ‘కమీషనర్‌’ చెబితే వినాలా…?

వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో రోజురోజుకు అవినీతి అక్రమాలతోపాటు, డిఐఈవో లింగయ్య ఒంటెద్దుపోకడకు సంబందించిన విషయాలు కూడా బయటికొస్తున్నాయి. డిఐఈవో ఏకరంగా ఇంటర్మీడియట్‌ బోర్డు కమీషనర్‌ ఆదేశాలను సైతం పెడచెవిన పెడుతూ కార్యాలయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని తెలుస్తున్నది. ఒకవైపు క్యాంపు కార్యాలయంలో అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో కొత్తగా నైట్‌ వాచ్‌మెన్‌ రిక్రూట్‌మెంట్‌ విషయం గందరగోళానికి గురిచేస్తున్నది. డిఐఈవో లింగయ్యకు ముందు పనిచేసిన డిఐఈవొ మల్హాల్‌రావు విదులు నిర్వహించిన సమయంలో నైట్‌వాచ్‌మెన్‌ అవసరంలేదని డిఐఈవోతోపాటు ఇంటర్‌బోర్డు కూడా నిర్ణయించింది. అప్పటి నుండి లేని నైట్‌ వాచ్‌మెన్‌ లింగయ్య డిఐఈవోగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇంటర్‌బోర్డు తిరస్కరించి అంశం లింగయ్య మళ్లి తెర మీదికి తెచ్చాడు. నైట్‌వాచ్‌మెన్‌ వద్దన్న ఇంటర్‌బోర్డు నిర్ణయానికి వ్యతిరేఖంగా ఓ వ్యక్తిని లంగయ్యనే స్వయంగా ప్రైవేటుగా నియమించుకోవడంతో కార్యాలయ సిబ్బందితోపాటు ఆర్జేడి కార్యాలయ సిబ్బంది కూడా అవాక్కయినట్లు సమాచారం. బోర్డు కమీనర్‌ ఆదేశాలను లెక్క చేయకుండా ప్రైవేటుగా నియమించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్న పరిస్థితి నెలకొన్నది.

ఆర్డర్‌ కాపీ లేకుండా ఉద్యోగమెలా సాధ్యమయ్యింది..?

ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో పనిచేయాలంటే ఆయా శాఖల ఉన్నతాధికారుల నుండి అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. కాని వరంగల్‌ డిఐఈవో కార్యాలయంలో మాత్రం ప్రభుత్వం నుండి ఎలాంటి ఉత్తర్వులు లేకపోగా వద్దన్న పనినే డిఐఈవో పర్సనల్‌గా నైట్‌ వాచ్‌మెన్‌ను నియమించుకున్నారని ఓ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పనిచేస్తున ప్రభుత్వ ఉద్యోగి కొందరితో అన్నట్లు సమాచారం. ఆర్డర్‌ కాపీ లేకుండా ప్రభుత్వ కార్యాలయంలో నైట్‌ వాచ్‌మెన్‌గా రిక్రూట్‌ చేసుకోవడంతో అతని వద్ద డబ్బులు ఏమన్నా తీసుకొని ఆ విదంగా నియమించుకున్నారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

otuhakku viniyoginchukunna mla narender, ఓటుహక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే నరేందర్‌

ఓటుహక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే నరేందర్‌

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పోరేషన్‌లో కార్పోరేటర్లతో కలిసి ఆయన ఓటు వేశారు.

otuhakku viniyoginchukunna mp dayakar, ఓటుహక్కు వినియోగించుకున్న ఎంపీ దయాకర్‌

ఓటుహక్కు వినియోగించుకున్న ఎంపీ దయాకర్‌

వరంగల్‌ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థలు శాసనమండలి ఎన్నికలలో వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యుడు పసునూరి దయాకర్‌ ఓటుహక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం ఆయన రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్‌తో కలసి తన ఓటును వరంగల్‌లో వేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

courtku hajariana mla aruri, కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే అరూరి

కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే అరూరి

వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ వరంగల్‌ జిల్లా కోర్టుకు శుక్రవారం హాజరయ్యారు. 2014 ఎన్నికల సమయంలో కోడ్‌ ఉల్లంఘనలో భాగంగా నమోదైన కేసు విషయంలో నేడు ఉదయం జిల్లా ప్రత్యేక మేజిస్ట్రేట్‌ ఎక్సైజ్‌ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 9తేదీకి వాయిదా పడింది.

chinuku padithe andakarame, చినుకు పడితే అంధకారమే

చినుకు పడితే అంధకారమే

ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు ఏజెన్సీ మండలాలలో బుధవారం సాయంత్రం 7.30గంటలకు వచ్చిన గాలి దుమారం వల్ల ఏర్పడిన విద్యుత్‌ అంతరాయాన్ని గురువారం వరకు విద్యుత్‌ అధికారులు పునరుద్దరించలేదు. గురువారం రాత్రి 11:30 గంటలు దాటినా విద్యుత్‌ను పునరుద్దరించకపోవడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకపక్క ఉక్కపోత, ఎండ తీవ్రతతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. కరెంటు లేకపోవడంతో తాగడానికి నీరు లేదని కొంతమేర విద్యుత్‌ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. రాత్రి వచ్చిన దుమారానికి ఇప్పటివరకు విద్యుత్తును పునరుద్ధరించుకోవడంతో ఏజెన్సీ ప్రజలు నానాఅవస్థలు పడుతున్నామని అంటున్నారు. మారుమూల మండలాల్లో ఎవరు అడుగుతారులే, ఏ అధికారులు వస్తారులే అనే నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మండలకేంద్రాల పరిస్థితే ఇలాఉంటే గ్రామాలలో పరిస్థితిని ఊహించవచ్చని, సకాలంలో బిల్లులు చెల్లించకుంటే విద్యుత్‌ సరఫరా నిలిపివేసే అధికారులు ఇలాంటప్పుడు ఎందుకు వెంటనే స్పందించారని మండలవాసులు అరొపిస్తున్నారు. తక్షణమే విద్యుత్‌ని పునరుద్దరించి, వచ్చేది వర్షాకాలం కావడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వెంకటాపురం, వాజేడు మండలాల ప్రజలు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version