జైపూర్ నేటి, ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఇందారం గ్రామంలో అనుమతులు లేని మద్యం దుకాణాల దందా జోరుగా కొనసాగుతుందని జామా మసీదు సమీపంలో ప్రాథమిక పాఠశాల ప్రక్కన కల్తీ మద్యం దుకాణాలు విచ్చలవిడిగా నడిపిస్తున్నారని నడిపించే వ్యక్తులపై అలాగే వారికి సహకరించే వ్యక్తులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇందారం గ్రామానికి చెందిన మహమ్మద్ ఇలియాస్ గురువారం రోజున చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామికి వినతిపత్రం అందజేశారు.
ఇంత జరుగుతున్నా అధికారుల నిర్లక్ష్య ధోరణి ఏంటి
అదేవిధంగా జైపూర్ మండలం లోని ప్రతి గ్రామంలో బెల్టు షాపుల దందా ఇష్టానుసారంగా నడుస్తుంది. ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ కూడా బెల్ట్ షాపులు యధావిధిగా కొనసాగుతున్నాయని, వివిధ గ్రామాల్లో బెల్ట్ షాపు యజమానులు ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని, అధిక ధరలకు మద్యాన్ని అమ్ముతూ మద్యం ప్రియుల జేబులు గుల్ల చేస్తూ మరోవైపు వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని,బెల్ట్ షాపు నిర్వాహకులు సిండికేట్ గా మారి అక్రమ మద్యం దందాలను అక్రమంగా నడిపిస్తున్నారని, ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ వాళ్ళు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.గ్రామాలలో ఉదయం నుండి మొదలుకొని రాత్రి పగలు తేడా లేకుండా జోరుగా బెల్ట్ షాపులలో మద్యం ఏరులై పారుతుందని, ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామాల్లో బెల్ట్ షాపులు వందల సంఖ్యలో వెలుస్తున్నాయని, రాబోవు ఎన్నికలు సజావుగా జరగాలంటే గ్రామాలలో బెల్ట్ షాపులను నియంత్రించాలని ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప బెల్ట్ షాప్ యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . గ్రామాలలో పేదలు, కూలీలు, యువకులు, మద్యానికి బానిసై పనులకు సైతం వెళ్లకుండా నిత్యం మద్యం మత్తులోనే వారి జీవితాలు తెల్లారి పోతున్నాయని, కుటుంబ కలహాలు ఎక్కువై సంసారాలు బజారున పడుతున్నాయని, ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి బెల్టు షాపులను నియంత్రించాలని, బెల్ట్ షాపుల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేను కోరారు. వినతిపత్రాన్ని అందుకున్న ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా వీలైనంత తొందరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.