బి.సి. కులగణనపై కోర్టు తీర్పును అమలు చేయాలి

ఆల్ ఇండియా ఒబిసి జాక్ డిమాండ్

ఎన్నో ఉద్యమాల ఫలితంగా, ఇటీవల తెలంగాణ హైకోర్టు బి.సి కుల జనగణనపై ఇచ్చిన తీర్పుననుసరించి తెలంగాణ ప్రభుత్వం మూడు నెలలు లోపు సమగ్ర కుల జనగణన జరిపి, స్థానిక సంస్థలో బి.సి లకు 42 శాతం రిజ్వేషన్లను కల్పించాలని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా కేంద్రం కుమార్ పల్లిలో ఆల్ ఇండియా ఒబీసీ జాక్ కార్యాలయంలో శనివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయపరమైన చిక్కులు లేని విధంగా సమగ్ర కుల జనగణన జరిపి బీసీలకు న్యాయం చేయాలని 50 శాతం సీలింగ్ విధానాన్ని అధిగమించే విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని అన్నారు. కుల జనగణన అంశము కేంద్ర ప్రభుత్వము చూడాల్సిన అంశమని, కావాలనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీదికి నెట్టి బీసీలకు తీరని అన్యాయం చేస్తుందని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ దేశవ్యాప్తంగా సమగ్ర కుల జనగణన జరిపి బీసీల రిజర్వేషన్ల పెంపుకు పార్లమెంటులో చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ సారంగపాణి మాట్లాడుతూ సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు వాటా దక్కడం లేదని, యూనివర్సిటీ ఉపకులాధిపతుల నియామకాల్లో 5O శాతం బీసీలను నియమించాలని డిమాండ్ చేశారు. సమాజ అభివృద్ధికి తోడ్పడే విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆలిండియా ఓబీసీ జాక్ వైస్ చైర్మన్ పటేల్ వనజ మాట్లాడుతూ మహిళా బిల్లులో బిసి మహిళా కోటాకై సగభాగమైన మహిళ లోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు, అనాదిగా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలను అణిచివేస్తున్నారని మహిళా బిల్లులో బీసీ వాటా లేకపోవడం వల్ల బీసీ మహిళలు రాజకీయంగా నష్టపోతారని అన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ జిల్లాల ఫూలే యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ తాడిశెట్టి క్రాంతికుమార్ మాట్లాడుతూ బీసీ కమిషన్ కు కొత్త పాలక మండలిని నియమించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తక్షణమే బిసి కుల జనగణనను ప్రారంభించాలని, కుల జనగణన సవ్యంగా జరగడం కోసం బీసీ కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలని అన్నారు, కామారెడ్డి డిక్లరేషన్ లో పొందుపర్చిన ఈ విధంగా ఎంబీసీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించి బలోపేతం చేయాలని, కులాల వారిగా కార్పొరేషన్ల పాలకమండల్లను నియమించి నిధులు కేటాయించి కులవృత్తులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేయూ విద్యార్థి నాయకుడు గొల్లపల్లి వీరస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ర్యాంకులతో సంబంధం లేకుండా బీసీ విద్యార్థులందరికీ పూర్తి రియంబర్స్మెంట్ చెల్లించాలని, ప్రభుత్వం ఏర్పాటై 8 నెలలు గడుస్తున్న రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యలు విద్యార్థుల టీసీలు, మెమోలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వం తక్షణమే రియంబర్స్మెంట్ విడుదల చేసి మాట నిలుపుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు తాటికొండ సద్గుణ, పి వెంకట చారి, నలబాల రవికుమార్, నారాయణగిరి రాజు, నలుబోల అమరేందర్, అనిశెట్టి సాయి తేజ, నలుబోల సంజయ్ కుమార్, న్యాయవాది ఎగ్గడి సుందర్ రామ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version