కరీంనగర్, నేటిధాత్రి:
నిత్యవసర వస్తువుల ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయని, ధరల పెరుగుదలను పసిగట్టి నిత్యవసర వస్తువులను బ్లాక్ చేస్తే వ్యాపారుల గోదాములపై సీపీఐ ఆధ్వర్యంలో దాడులు చేసి వాటిని పేదలకు పంచుతామని,ధరల నియంత్రణ కోసం తక్షణమే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అధికారుల,రాజకీయ పార్టీల తో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి డిమాండ్ చేశారు. పెంచిన నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని, బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం కరీంనగర్ నగరంలోని అనభేరి ప్రభాకర్ రావు విగ్రహం నుండి కూరగాయల మార్కెట్, ప్రకాశం గంజి వరకు ధరలు పెరిగిన ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, నూనె ప్యాకెట్లు తలపై పెట్టుకొని, మెడలో వేసుకొని విన్నూత్ననంగా నిరసన తెలిపారు. ఈసందర్భంగా మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మూడవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ పేద ప్రజలను పట్టించుకోవడంలేదని,ఆదానీ, అంబానీ,కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధంగా వ్యవహరిస్తున్నాడని, విచ్చలవిడిగా నిత్యవసర వస్తువుల ధరలు పెరిగినా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నాడని, పన్నెండు శాతం ట్యాక్సీ పెంచి పేదల జీవన ప్రమాణాలపై దెబ్బతీస్తున్నాడని, దానికనుగుణంగా వ్యాపారస్తులు విచ్చలవిడిగా ధరలు పెంచారని, ఇరవై రూపాయలు ఉన్న ఉల్లిగడ్డ ఎనబై రూపాయలు పెరిగిందని, వంద రూపాయలు ఉన్న ఎల్లిగడ్డ నాలుగు వందలకు పెరిగిందని, ఐదు వందలు ఉన్న జిలకర తోమ్మిది వందలకు పెరిగిందని, నూటపది రూపాయలు ఉన్న వంట నూనె నూట ముప్పైకి పెరిగిందని, ఎనబై ఐదు రూపాయలు ఉన్న శనిగపప్పు నూటపది రూపాయలు పెరిగిందని, నాలుగు వేలు ఉన్న బిపీటీ బియ్యం ఐదు వేలకు పెరిగిందని ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం వంటకు ఉపయోగపడే ప్రతి వస్తువు ధరలు విపరీతంగా పెరిగాయని ధరలను నియంత్రించడంలో బిజెపి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వెంకటస్వామి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా ప్రజల జీవన ప్రమాణాలను పెంచకపోగా పెరిగిన నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణకు ఏమాత్రం కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని,రాష్ట్రంలో వాటిని నియంత్రించడం లేదని, నిత్యవసర వస్తువుల ధరలపై అధికారుల నియంత్రణ కొరబడిందని, ధరలను నియంత్రించడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అధికారులతో,రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని,ధరల పెరుగుదలను ఆసరాగా చేసుకొని వ్యాపారస్తులు గోదాముల్లో నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్ చేస్తున్నా అధికారులు దాడులు చేయడం లేదని, అక్రమంగా వ్యాపారస్తులు నిత్యావసర వస్తువులను బ్లాక్ మార్కెట్ చేసి గోదాముల్లో నిల్వ ఉంచినట్లయితే సీపీఐ ఆధ్వర్యంలో గోదాముల పై దాడులు నిర్వహించి అందులో ఉన్న నిత్యావసర వస్తువులను పేద ప్రజలకు పంచిపెట్టక తప్పదని వెంకటస్వామి హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి,జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపెల్లి రాజు,కిన్నెర మల్లవ్వ,బీర్ల పద్మ,బోయిని తిరుపతి,పిట్టల సమ్మయ్య, బ్రామండ్లపెల్లి యుగంధర్,కంది రవీందర్ రెడ్డి, బోనగిరి మహేందర్, నాయకులు చెంచల మురళి, నల్లగొండ శ్రీనివాస్,ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, పారునంది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.