# మార్కెట్ బైలాను తూచా తప్పకుండా అమలు చేయాలి
# రైతుల వద్ద అధిక కమిషన్ తీసుకునే వ్యాపారుల గుర్తింపు రద్దు చేయాలి
# అమ్మకానికి వచ్చిన రైతుల అన్ని రకాల పంటలను మార్కెట్ లోనే తూకం వేయాలి
# ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్
# మార్కెట్ కార్యదర్శిని కలిసి మెమోరాండం ఇచ్చిన ఏఐకెఎఫ్ ప్రతినిధి బృందం
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి :
వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో బైలాను తూచా తప్పకుండా అమలు చేసి రైతులు పండించిన పంటలను దళారీలు దోచుకోకుండా, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకెఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకెఎఫ్) వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో నెలకొన్న సమస్యలపై మార్కెట్ కార్యదర్శి పోలేపాక నిర్మలను కలిసి మెమోరాండం ఇచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ సీజన్ లో రైతులు అష్ట కష్టాలు పడి పండించిన పంటలు చేతికస్తున్న దశలో అమ్మకానికి మార్కెట్ కు తీసుకువస్తున్నారని ఇలాంటి తరుణంలో రైతుల పంటలకు రక్షణ కల్పిస్తూ అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ కనుగుణంగా రైతుల పంటలకు డిమాండ్ కల్పిస్తూ చర్యలు చేపట్టాలని అన్నారు. రైతులు అమ్మకానికి తీసుకచ్చిన అన్ని రకాల ఉత్పత్తులను మార్కెట్ లోనే తూకం వేయాలని అలాగే మార్కెట్ బైలాను తూచా తప్పకుండా అమలు చేస్తూ అధిక కమిషన్ వసూలు చేసే ఏజెంట్లు వ్యాపారుల లైసెన్సులను శాశ్వతంగా రద్దుపరిచి కఠిన చర్యలు చేపట్టాలని అలాగే రైతుల పంటలను దాచుకునే కోల్డ్ స్టోరేజీలలో అధిక చార్జీలను అరికట్టాలని డిమాండ్ చేశారు. మార్కెట్ లో మౌలిక సదుపాయాలు కల్పించి రైతులను కాపాడాలని, సీసీఐ పత్తి కొనుగోళ్ల సందర్భంలో జరిగే దోపిడిని నివారించేందుకు మార్కెట్ సిబ్బంది పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని కోరారు.రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగిన నష్టం వాటిల్లిన రైతుల పక్షాన ఏఐకేఎఫ్ ముందుండి పోరాడుతుందని తెలిపారు. తన పరిధిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నష్టం జరగకుండా చర్యలు చేపడతారని మార్కెట్ కార్యదర్శి పోలేపాక నిర్మల ఈ సందర్భంగా హామీ ఇచ్చారని తెలిపారు.రైతులకు మార్కెట్ లో కలిగే ఇబ్బందుల గురించి మీ దృష్టికి వచ్చిన విషయాలను తనకు తెలియజేయాలని మార్కెట్ కార్యదర్శి సూచించారని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర బాధ్యులు గోనె కుమారస్వామి, ఏఐసిటియు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నర్ర ప్రతాప్, జిల్లా కార్యదర్శి సుంచు జగదీశ్వర్, ఏఐకేఎఫ్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఇస్మాయిల్,జిల్లా నాయకుడు ఐతం నాగేష్ తదితరులు పాల్గొన్నారు.