మావోయిస్టు కరపత్రాలు

మావోయిస్టు కరపత్రాలు

వాజేడు మండలకేంద్రంలో శనివారం రాత్రి మావోయిస్టు కరపత్రాలు వెలిశాయి. జల్‌, జంగల్‌, జమీన్‌పై ఆధికారం ప్రజలదేనని నినదిస్తూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఆదివాసులను అడవి నుంచి గెంటివేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేఖంగా ప్రజాస్వామిక వాదులు, ఆదివాసులు, అన్నివర్గాల ప్రజలు పోరాడాలన్నారు. న్యాయస్థానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులను నిర్వాసితులను చేయాలనే కుట్రకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. సాయంత్రం మావోయిస్టులు మండలకేంద్రంలో కరపత్రాలు వదిలివెళ్లడం సంచలనంగా మారింది. ఈ విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అక్రమార్కులపై ఎమ్మెల్యే ‘చల్ల’ని చూపు

అక్రమార్కులపై ఎమ్మెల్యే ‘చల్ల’ని చూపు

ఆయనో ఎమ్మెల్యే, రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కాంట్రాక్టర్‌గా పేరుగాంచి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. సహజవనరులను దర్జాగా నమిలి వేస్తూ కోట్లు కూడబెట్టాడు. ఈయనగారు చేస్తున్న దందా ప్రస్తుత తరాలను, భవిష్యత్‌ తరాలను కూడా కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఎంత పెద్ద గుట్టలనైనా అవలీలగా మింగి వేస్తాడు. అనుమతుల సంగతి దేవుడెరుగు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కనుక పనులు చకచక జరిగిపోతాయి. కోట్లాది రూపాయలు జమ అయిపోతుంటాయి. ఇది ఎవరు ఇచ్చిన హక్కో తెలియదు. కానీ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు, మేథావులు, సహజవనరుల రక్షణ ప్రేమికులు నెత్తి, నోరు కొట్టుకున్న ఆ ఎమ్మెల్యే మాత్రం వ్యాపారాన్ని వదలడు. ప్రస్తుతం తాను చేస్తున్న పనికిమాలిన పనే కాకుండా ఇలాంటి పనులు ఎవరు చేసిన తన నియోజకవర్గంలో సహకరించే స్థాయిలో ఈ ఎమ్మెల్యే ఉన్నట్లు తెలిసింది. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో మట్టి మాఫియాకు కింగ్‌లా వ్యవహరించే ఓ మట్టి కాంట్రాక్టర్‌కు ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మిషన్‌ కాకతీయ పేరుతో ఏ చెరువు పని జరిగిన ఆ కాంట్రాక్టర్‌కు అప్పగించడం ఎమ్మెల్యే పనిగా పెట్టుకున్నాడా. మిషన్‌ కాకతీయ పని అప్పగిస్తే పని జరిగితే పర్వా లేదు. కానీ ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయన్న పొగరుతో ఈ కాంట్రాక్టర్‌ ఇష్టారీతిన వ్యవహారిస్తున్నాడట. ప్రస్తుతం ఈ కాంట్రాక్టర్‌ ఆ వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్‌ గ్రామంలో మిషన్‌ కాకతీయ పనులు చేస్తున్నా అంటున్నాడు. ఇక్కడ మిషన్‌ కాకతీయ మంజూరు అయ్యిందా..లేదా అనేది అనుమానంగానే ఉంది. ఈ విషయమై తహశీల్దార్‌ను వివరణ అడిగితే సమాధానం దాటవేస్తారు ఏమో ఉండవచ్చు అంటారు. మట్టి బయటకు తరలిస్తున్నారని ఎఇని అడిగితే లోడ్‌ చేయడం చూడడం వరకే మా పని మట్టి ఎక్కడికి వెళ్తుందో మాకెందుకు అని అంటారు.

ఇటుకబట్టీలకు సరఫరా లక్షల్లో దందా

ఆత్మకూరు మండలం పెద్దాపూర్‌ చెరువులో మిషన్‌ కాకతీయ పనులు జరుగుతుంటే ఇందులో తోచిన మట్టి రైతులకు సరఫరా చేయాలి, లేదంటే చెరువు చుట్టూ కట్ట కోసం వినియోగించాలి కానీ అలా జరగడం లేదు. తోడిన మట్టంతా లారీల కొద్ది వరంగల్‌ నగర శివారుకు తరలుతోంది. నక్కలపెల్లి, గొర్రెకుంట శివారు గీసుగొండ కెనాల్‌ పక్కన నిర్వహిస్తున్న ఇటుకబట్టీలకు మట్టిని ఈ కాంట్రాక్టర్‌ సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఒక్క నక్కలపెల్లి ఇటుకబట్టీకే 75లక్షలకుపైగా మట్టిని సరఫరా చేసినట్లు తెలిసింది. కోటి ఒక లక్ష రూపాయల మిషన్‌ కాకతీయ పని అని చెప్తున్న ఈ కాంట్రాక్టర్‌ ఇటుక బట్టీలకు మట్టి సరఫరా చేస్తూ కోట్ల రూపాయలు వెనకేస్తున్నట్లు తెలిసింది. అక్రమంగానే మట్టి దందా నిర్వహిస్తున్న ఇతగాడికి ఎమ్మెల్యే చల్లని చూపు ఉన్నట్లు తెలిసింది. ఈ మట్టి దందా ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో చేసుకోవడానికి ఎమ్మెల్యేకు భారీగానే ముడుపులు ముట్టజెప్పినట్లు ఆ కాంట్రాక్టర్‌ ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. ఇదే కాంట్రాక్టర్‌ ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ఊకల్‌ చెరువులో మట్టిని తవ్వి దండిగానే దండుకున్నట్లు తెలిసింది. వారం రోజుల క్రితమే ఇక్కడ పనులు ఆపినట్లు తెలిసింది.

మట్టి మాఫియాకు ఇతనే కింగ్‌

వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అక్రమంగా మట్టిదందా నడుపుతున్న వారిలో ఇతగాడు నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నట్లు తెలిసింది. ప్రతీ ఏటా వేసవికాలంలో కోట్ల రూపాయలు దండుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సంవత్సరం ఇప్పటికే ఇతగాడి టార్గెట్‌ 2కోట్లు దాటినట్లు తెలియవచ్చింది. మొత్తానికి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో అక్రమంగా వ్యాపారాలు చేస్తున్న అందరికి సహకరిస్తుండగా ఉత్తిపున్యానికి మట్టిని తవ్వుతూ కోట్ల రూపాయలు వెనకేస్తున్న ఈ మట్టి మాపియా కింగ్‌కు సహకరిస్తుండడం నియోజకవర్గంలో విమర్శలకు దారితీస్తోంది. ఇకనైన ఎమ్మెల్యే వ్యవహారశైలిలో మార్పు రావాలని జనం కోరుకుంటున్నారు. అడ్డగోలుగా మట్టిని తవ్వుతూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్న కాంట్రాక్టర్‌కు ఎందుకు సహకరిస్తున్నాడో అతనికే తెలియాలని అంటున్నారు.

మంత్రి చుట్టూ భజన బృందం

మంత్రి చుట్టూ భజన బృందం

ఇటీవల పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రైవేట్‌ పీఎల వ్యవహారంపై ‘నేటిధాత్రి’ కథనాలను ప్రచురించింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే పీఎల విషయంలో జాగ్రత్త, ప్రైవేట్‌ పీఎల నియామకానికి స్వస్తి పలకండని చెప్పి, ప్రభుత్వం కేటాయించే పీఎలను తానే నియమిస్తానని మంత్రుల ఇష్టా, ఇష్టాలకు సీఎం చెక్‌ పెడితే, అది కాదని చెప్పి ఎర్రబెల్లి ఏకంగా 20మంది పీఎలను నియమించుకున్నట్లు అందిన సమాచారంతో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఓ కథనం వెలువరించాం. ఈ కథనం రాయడం మంత్రి దయాకర్‌రావుకు అంతగా నచ్చలేదు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో ఏకైక మంత్రిని తాను చేస్తున్న పనులను ప్రశ్నిస్తారా…? ఆ పత్రికకు ఎంత ధైర్యం అంటూ అగ్గి మీద గుగ్గిలం అయ్యారట. ఈ మంటను తగ్గించుకోవడం కోసం తాను పిలవగానే ఎస్‌ బాస్‌ అంటూ వాలిపోయే కొంతమంది పెయిడ్‌ జర్నలిస్టులను పిలిపించి తన బాధను వెళ్లగక్కాడట. మంత్రి బాధ బాగానే ఉన్న, కథనం కావాల్సినంత వైరల్‌గా మారి ఎర్రబెల్లి పీఎల వ్యవహారం రాష్ట్రమంతా ప్రచారమైన కొంతమంది కబోదులకు అది మాత్రం కనపడటం లేదు. మంత్రి బాధను మొత్తం విన్న కొంతమంది జర్నలిస్టుల కథనాలను ‘గంజిలో ఈగ’లా తీసిపారేసారట. మీరెంటి…?, మీ హోదా ఏంటీ…?, మీరు ధర్మప్రభువులు, దాన, దయగుణం కలవారంటూ ఎలాంటి మొహమాటం లేకుండా కావాల్సిన తెగ పొగిడేసి ‘నేటిధాత్రి’ సంగతి మేం చూస్తాం అంటూ భరోసా ఇచ్చారట. ‘తాను దుర సందు లేదు..మెడకో డోలు అన్నట్లు’ చేసే దందాలు, వసూళ్ల పర్వాల విషయం…వీరు పనిచేస్తున్న యజమానులకు తెలిసిపోవద్దంటూ బతిలాడి, బామాలి నూరు పట్టుకుని వేలాడుతున్న ప్రబుద్దులు ‘నేటిధాత్రి’కి నీతులు వల్లించే స్థాయికి ఎదిగారట. ఎంత మాత్రం ఆత్మగౌరవం లేకుండా జర్నలిజం విలువలను బజారుకీడ్చి అక్రమార్కులు, రాజకీయ నాయకుల దగ్గర అక్షరాలను తాకట్టు పెట్టిన వీరికి ‘నేటిధాత్రి’ కథనాలను ప్రశ్నించే హక్కు ఎక్కడిదో అర్థం కావడం లేదు. జర్నలిజం వీరి ఇంటి సొత్తు అయినట్లు ‘నేటిధాత్రి’ ఉనికిని ప్రశ్నించే దమ్ము ఎక్కడిదో తెలియాలి. మా సంస్థను మేం కాపాడుకుంటూ ఉన్నంత జర్నలిజాన్ని బతికిస్తూ నిఖార్సయిన వార్తలతో ముందుకు వెళుతున్న మాపై వీరికి ఎందుకు ఇంత కళ్లు కుడుతున్నాయో అర్థం కాదు. సొల్లు వాగుడు, ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు, ప్రెస్‌నోట్లు, గిట్టుబాటు వార్తలు మాత్రమే రాయడం చేతనైనా వీరు అవి కూడా ఘోస్ట్‌రైటర్‌తో రాయించుకుని మా వార్తలను జబ్బలు చరుచుకునే వీరికి ‘నేటిధాత్రి’ని శంకించే హక్కు ఎంత మాత్రం లేదని స్పష్టం చేస్తున్నాం. ‘ఎనకటికి మా తాత ఎల్లగుర్రం ఎక్కాడు..ఏదో కాయ కాసింది’ అని ఇంట్లో సభ్యుల పేర్లు చెప్పుకుని లబ్ధి పొందే ఇద్దరు జర్నలిస్టులు తామే జర్నలిజం, తామే పై నంచి ఊడిపడ్డాం. మాకే సర్వాధికారులు ఉన్నట్లు జర్నలిస్టుల భావప్రకటన స్వేచ్చకు అడ్డు తగిలే విధంగా, ఏ పత్రికలో, ఏ చానల్‌లో మంత్రికి వ్యతిరేక వార్తలు వస్తున్నాయో గుర్తించి మధ్యవర్తిత్వం వహించినట్లు నటించి, తాము చెప్పి కథనాలు రాకుండా చేస్తున్నామని మంత్రి వద్ద నమ్మబలికి లబ్ధిపొందుతున్న విషయం జర్నలిస్టులకు తెలిసిందే. ఇటీవల పెద్దపత్రిక మాది అంటూ బోర్డు తగిలేసుకుని ఊరేగె ఓ జర్నలిస్టు ‘నేటిధాత్రి’తో మాట్లాడాడు. మన జిల్లా మంత్రిగారు అంటూ ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తూ తాను అక్షరాలను వేలం గట్టి లెక్కగట్టి మరీ అమ్మేస్తున్నాం. మీరు వేలం పెట్టండి, అమ్మకానికి సిద్ధం కండి అంటూ రాయబారిగా వచ్చి బేరసారాలు నడిపే ప్రయత్నం చేశాడు. అది ఎంత మాత్రం కుదరకపోవటంతో ‘నేటిధత్రి’ని పట్టించుకోవద్దని మంత్రికి ఉచిత లచ్చాడట. అణచివేయబడ్డ వారు, సామాజికంగా వెనుకబడిన వారు అంటూ డైలాగులు తెగ వల్లించే ఈ జర్నిలిసు ఏ సామాజికవర్గానికి లబ్ధి చేస్తున్నాడో కాస్త గురెరాలి. ప్రజల పొట్ట కొట్టి, అధికారం ఉంది కదా అంటూ దోపిడికి పాల్పడుతూ ప్రజాధనాన్ని అడ్డగోలు స్వప్రయోజనాల కోసం వృతా చేస్తే ఎందుకు ప్రశ్నించకూడదో ఆ జర్నలిస్టు సమాధానం చెప్పాలి. నీతులు వల్లిస్తూ గోతులు తొవ్వే అతగాడికి ‘నేటిధాత్రి’ని కామెంట్‌ చేస్తే అవసరం ఎందుకు వచ్చిందో చెప్పాలి. పత్రిక ఏదైనా జనం కోసం పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిగా ఉంటుందని, కథనం ఏమైన జనం నిజానిజాలు గ్రహించి కీలెరిగి వాత పెడతారనే కనీస అవగాహన ఉండాలి. జర్నలిజం అనగా రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పైరవీలు లబ్ధి పొందడాలు, కాసులు సంపాదించి ఊరేగడం కాదని గుర్తుంచుకోవాలి. వసూళ్ల పర్వాన్ని యథేచ్చగా కొనసాగించడానికి ఇతం జర్నలిస్టులపై దుమ్మేత్తిపోసే నీతి, బాహ్యమైన పనులు చెల్లవనీ ‘నేటిధాత్రి’ హెచ్చరిస్తుంది. నిజం ఎప్పటికైన గెలుస్తుంది. జర్నలిజం జనం పక్షానే ఉండగానే తీరుతుంది. మేం రాసే కథనాలపై అనుమాలు ఉంటే మంత్రైనా ఎంతటివారైన వారికి ‘నేటిధాత్రి’ సమాధానమిస్తుంది. కథనాలపై అభ్యంతరం ఉంటే వారికి సంబంధించిన వివరాలను ‘నేటిధాత్రి’ జర్నలిజం విలువలను గుర్తించి తప్పక ప్రచురిస్తుంది. ఏకపక్షంగా ఎప్పుడు వ్యవహరించదు. ఎవరిపై కథనం వచ్చిన వారు ‘నేటిధాత్రి’తో మాట్లాడుకుంటారు. కానీ కొంతమంది జర్నలిస్టుల పెత్తనం మా కథనాలపై చూపిస్తే సహించమని చెప్తున్నాం. మా ఉనికిని ప్రశ్నించవద్దని చెప్తున్నాం. మా పత్రికకు సంబంధించిన ప్రతినిధి మీడియా సమావేశంలో లేనప్పుడు దొంగచాటుగా మంత్రి దగ్గర భేష్‌ అనిపించుకునేందుకు సభ్యత మరచి కామెంట్లు చేయకూడదని అంటున్నాం. అలా చేస్తే ధీటుగా సమాధానం చెప్పడం మాకు తెలసని చెప్తున్నాం. వ్యక్తులు లేనప్పుడు వారి గురించి ప్రస్తావించడం సంస్కారం కాదని కుసంస్కార స్థాయికి దిగజారిన వారిని కోరుతున్నాం. పాతకాలపు మెదళ్లతో తిరుగుతూ ఎంతమాత్రం అప్‌డేట్‌ కాకుండా ఉండే మీకు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ కంటే ‘వెబ్‌ జర్నలిజం’ అత్యంత వేగంగా దూసుకపోతుందని, వసూళ్లు తప్ప సమాజంంలో వస్తున్న మార్పులపై ఎంత మాత్రం అధ్యాయనం చేయలేని మీకు చెబుతున్నాం.

 

విజయవంతంగా బడిబాట ర్యాలీ…

విజయవంతంగా బడిబాట ర్యాలీ…

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని వరంగల్‌ అర్బన్‌ జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి తల్లిదండ్రులను కోరారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం లష్కర్‌ బజార్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ విద్యార్థి సంపూర్ణ వికాసానికి ప్రభుత్వ పాఠశాలలోని బోధన సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ మండల విద్యాశాఖ అధికారి వీరభద్రనాయక్‌, ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల లష్కర్‌బజార్‌ ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లష్కర్‌బజార్‌ హెచ్‌ఎం శైలజ, మర్కజి ఉన్నత పాఠశాల ఇంచార్జ్‌ హెచ్‌ఎం శ్రీనివాస్‌, పెట్రోల్‌ పంప్‌ హైస్కూల్‌ హెచ్‌ఎం, ప్రభుత్వ అభ్యసన ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం శ్రీరాముల దాత మహర్షి, ప్రభుత్వ అభ్యసన ప్రాథమిక పాఠశాల ఇంగ్లీష్‌ మీడియం హెచ్‌ఎం ఉప్పలయ్య, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మార్కజి హెచ్‌ఎం ఎం.ధర్మయ్య, పెట్రోల్‌పంప్‌ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం, పాఠశాలల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు పెద్దసంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. లష్కర్‌బజార్‌ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పబ్లిక్‌గార్డెన్‌ మీదుగా డైట్‌ కళాశాల మీదుగా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సెంటర్‌కు చేరుకుంది.

ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో రాస్తారోకో

ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో రాస్తారోకో

కాంగ్రెస్‌ను టిఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ ఎస్‌డిఎల్‌సిఇ జంక్షన్‌ వద్ద ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ అలువాల కార్తీక్‌ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీలపై గెలిచి టిఆర్‌ఎస్‌ పార్టీలకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలిచి తమ సత్తా నిరూపించుకోవాలన్నారు. రాష్ట్రంలో తొలిసారి దళితుడు సీఎల్పీ నాయకుడు కావడాన్ని జీర్ణించుకోలేక దొరల అహంకారంతో కాంగ్రెస్‌ను టిఆర్‌ఎస్‌లో విలీనం చేశారన్నారు. అనంతరం వరంగల్‌ జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ పల్లకొండ సతీష్‌ మాట్లాడుతూ 25మంది ఇంటర్‌ విద్యార్థులు మృతిచెందిన పట్టించుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ స్పందించకుండా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను బ్లాక్‌మెయిల్‌ చేసి పార్టీలో చేర్పించుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో మానుకోట వద్ద విద్యార్థులపై తూటాలు పేల్చిన తెలంగాణ ద్రోహి జగన్‌తో మమేకమై సీఎం కేసిఆర్‌ నేడు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే మలిదశ తెలంగాణ ఉద్యమానికి పురుడుపోస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ జిల్లా జనరల్‌ సెక్రటరీ ప్రేమ్‌చంద్‌, యశ్వంత్‌, చరణ్‌, టోని, నాగరాజ్‌, శ్రవణ్‌, వంశీ, రాజు, దినకర్‌, తిరుపతి, రవి, రమేష్‌, నగేష్‌, తేజ తదితరులు పాల్గొన్నారు.

పుస్తకాల బరువు మోసేదెలా

పుస్తకాల బరువు మోసేదెలా

విద్యాసంవత్సరం మొదలైంది…పాఠశాల తిరిగి ప్రారంభం కానున్నాయి…విద్యార్థుల పుస్తకాలు కొనటానికి తల్లితండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది…పాఠశాల యాజమాన్యాలు మాత్రం ప్రతి సంవత్సరం పుస్తక ఏజెన్సీలతో, వస్త్రాదుకాణాల యాజమాన్యాలతో కుమ్మక్కై దోచుకుంటున్నారని విద్యార్థుల తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉల్లాసమైన వాతావరణం…విశాలమైన ఆటస్థలాలు లేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పాఠశాలల ముందు కనీసం పార్కింగ్‌ స్థలం కూడా లేని పాఠశాలలు నగరంలో చాలా వరకు ఉన్నాయి. ప్రభుత్వ విద్యాశాఖ నిబంధనలకు విరుద్దంగా బహుళ అంతస్తులో తరగతులు నిర్వహిస్తూ గాలిలో దీపం పెట్టిన చందంగా విద్యార్థుల ప్రాణాలతో ప్రైవేట్‌ పాఠశాలలు చెలగాటమాడుతున్నాయి. పాఠశాలలో కనీస వసతులు లేకుండా ఇష్టారాజ్యంగా విద్యాశాఖ అధికారులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని అడ్డదారిలో అనుమతులు తెచ్చుకొని విద్యార్థులు, తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నారు. అనుమతులు ఇవ్వటంలో సంబంధిత శాఖలు విఫలమయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కరలేదని విద్యార్థులు, మేథావులు భావిస్తున్నారు.

నిద్రమత్తులో సంబంధిత శాఖ అధికారులు

ప్రైవేట్‌ పాఠశాలలకు అనుమతులను ఇచ్చే ముందు పర్యవేక్షణాధికారులు పాఠశాల పరిసరాలను పరిశీలించి, సానిటేషన్‌, ఫైర్‌, బిల్డింగ్‌ ఫిట్‌నెస్‌, క్రీడా మైదానం, లైబ్రరీ, మూత్రశాలలు, పార్కింగ్‌, విశాలమైన తరగతిగదులు ఉంటేనే అనుమతులు ఇవ్వవలసిన అధికారులు ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా మామూళ్ల మత్తులో అనుమతులు ఇస్తున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రధానంగా బహుళ అంతస్తుల్లో తరగతులు నిర్వహిస్తున్నటువంటి పాఠశాలలో అగ్నిప్రమాదాలు జరిగితే, కనీసం ఫైర్‌ ఇంజన్‌ ప్రాంగణం చుట్టూ తిరగలేని విధంగా పాఠశాలల ఆవరణం, గోడలు ఉంటున్నా అధికారులు పట్టించుకోకుండా విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, మేథావులు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

కాసులకు కక్కుర్తి పడుతున్న అధికారుల ఒక వైపు, ధనార్జనే ద్యేయంగా విద్యను వ్యాపారం చేస్తున్న యజమానులు మరోవైపు. ఈ ఇరువురి మధ్యన అమాయక విద్యార్థులు బలైపోతున్నారు. బహుళ అంతస్తుల్లో తరగతులు నిర్వహిస్తుండటం, వాటికి ప్రహారీగోడలకు రక్షణ వలయాలు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు పైనుండి కిందికి చూసే క్రమంలో, అటు, ఇటు వెళ్లే క్రమంలో అదుపు తప్పి భవనంపై నుండి కింద పడి మృతిచెందిన సందర్భాలు ఉన్నాయి. గతంలో కాశిబుగ్గ పట్టణంలో ఓ ప్రైవేట్‌ పాఠశాలపై నుండి పడి చనిపోయిన విషయం నగర ప్రజలకు, విద్యాశాఖ అధికారులకు, యాజమాన్యాలకు తెలిసిందే. అయినా ప్రైవేట్‌ యాజమాన్యాలు కేవలం డబ్బే లక్ష్యంగా పిల్లల ప్రాణాలను లెక్కచేయకుండా విద్యార్థులకు ఎలాంటి రక్షణ చర్యలు కల్పించకుండా అడ్డగోలు భవనాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల బరువుకు మించిన పుస్తకాల బ్యాగులను తమ వీపుపై మోసుకెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బహుళ అంతస్తుల్లో తరగతులు నిర్వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా లిఫ్ట్‌ను ఏర్పాటు చేయాలనే నిబంధనను తుంగలో తొక్కి పోయేవి మా పిల్లల ప్రాణాలా…మా విద్యావ్యాపారం వర్థిల్లితే చాలు అనే విధంగా ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తీరును నగర ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు.

 

ప్రజా రక్షణే…మా ధ్యేయం

ప్రజా రక్షణే…మా ధ్యేయం

వరంగల్‌ పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలో పోలీసులు ప్రజలకు భరోసాను కల్పించడమే కాకుండా నిత్యం నగరంలో శాంతిభద్రతలకై కంటిమీదకునుకు లేకుండా ప్రశాంత వాతావరణం కోసం రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నాము. నగరంలో నేరాలను నియంత్రించడం కోసం వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ డి.వి రవీందర్‌ ఆదేశాల మేరకు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటూ మా కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాము. పోలీసులంటే బయపెట్టేవారు కాదు..పోలీసులంటే ప్రజాసేవకులమని నిరూపించుకుంటున్నామని, ఫ్రెండ్లీ పోలీసుతో ప్రజలకు మేము మరింత చేరువయ్యామని, ప్రజలకు పోలీసులపై అపారనమ్మకం ఏర్పడిందని సుబేదారి స ర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.సదయ్య అన్నారు. శుక్రవారం ‘నేటిధాత్రి’ క్రైం ప్రతినిధితో ఇంటర్వూలో పై విదంగా స్పందించారు.

‘నేటిధాత్రి’ : సుబేదారి పరిధిలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయి?

సీఐ, సదయ్య : సుబేదారి పరిధిలో శాంతిభద్రతలు చాలా చక్కగా ఉన్నాయి. నిత్యం పెట్రోలింగ్‌ ద్వారా ప్రజలకు రక్షణ కల్పిస్తూ, ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందుగానే పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు.

‘నేటిధాత్రి’ : సీసీ కెమెరాల పట్ల ప్రజల మద్దతు ఎలా లభిస్తున్నది?

సీఐ సదయ్య : నగరంలో సీసీ కెమెరాల ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతున్నది. ప్రతి గల్లీలో ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవడానికి ముందుకొస్తున్నారు. ఒక్క సీసీ కెమెరా వందమందితో సమానం. లక్షల రూపాయలు పెట్టి ఇండ్లు నిర్మించుకుంటున్న ప్రజలు అలాగే ప్రతి వాడకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాలను తగ్గించడమే కాకుండా దొంగల బారి నుండి కూడా కెమెరాలు ఎంతో ఉపయోగపడుతాయి.

‘నేటిధాత్రి’ : రాత్రి వేళలో పెట్రోలింగ్‌ ఎలా ఉంటున్నది?

సీఐ సదయ్య : సుబేదారి పరిధిలో రెవిన్యూకాలనీ, జూలైవాడ, పోస్టల్‌కాలని, ప్రకాశ్‌రెడ్డిపేట, బ్యాంక్‌కాలని, టీచర్స్‌కాలని, వడ్డేపెల్లి, వికాస్‌నగర్‌, స్నేహనగర్‌, రాంనగర్‌, అంబేద్కర్‌సెంటర్‌ తదితర ప్రాంతాల్లో రాత్రివేళలో ఇంటర్‌సెప్టర్‌ వెహికల్‌ ద్వారా పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారు.

‘నేటిధాత్రి’ : ప్రజలకు మీరిచ్చే సలహా?

సీఐ సదయ్య : ప్రజలకు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. పోలీసులకు ఏదైనా సమాచారం అందించాలన్నా, ప్రజలు తమ సమస్యలను పోలీసులకు 100 డయల్‌ ద్వారా సమాచారం అందించవచ్చు. పోలీసులకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం కూడా జరుగుతుంది. పోలీసులంటే ప్రజలకు నిత్యసేవకులు, పోలీసులున్నదే ప్రజలకు రక్షణ కల్పించడానికి, ప్రజలు కూడా పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.

‘షాని’కెళ్లద్దు…బిడ్డో….!

‘షాని’కెళ్లద్దు…బిడ్డో….!

వద్దు బిడ్డా..లేనిదానికి కానిదానికి వెళ్లద్దు…ఉన్నంతలోనే వుండాలి. అందేకాడికే అందుకోవాలి, ఉన్నంతలోనే సర్దుకోవాలి. బయటికి కనిపించేదంతా అద్భుతం కాదు..మెరిసేదంతా బంగారం కాదు..ఇలాంటి మాటలు మన పెద్దోళ్లు చాలా మందికి చెబుతుంటారు. అయినా పెడచెవిన పెడుతూ కొందరు మెరిసేదంతా బంగారమే అన్నట్లు ఊహలలో తేలిపోతుంటారు. అసలు విషయం తెలుసుకునేలోపే జరగాల్సి నష్టం, సమయం అన్ని జరిగిపోతాయి. తీరా తలలు పట్టుకుంటే ఏం లాభం..? ఇది జగమెరిగిన సత్యం.నగరంలో పేద, మద్యతరగతి కుటుంబాల్లో తమ పిల్లలను ఓ ప్రైవేటు స్కూల్‌కు పంపాలంటే బెంబేలెత్తిపోతున్నారు.అక్కడ ఫీజుల వివరాలు తెలుసుకున్న వారంతా వామ్మో..? ఇంత ఫీజా..? అని గుండెలు బాదుకుంటున్నారు.

అసలు పేర్లు మార్చి మాయచేస్తున్న ‘మోసగాడు’

హన్మకొండలో ఓ ప్రైవేటు స్కూల్‌ దందా అంతా ఇంతా కాదు..దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న పాలసీని వీరు అక్షరాల నిజంచేస్తున్నారు. ఒక స్కూల్‌ యజమాని పాతస్కూళ్లను కొనేసి అసులుపేరును మాయంచేసి, అనుమతిలేకున్నా ఒకే పేరుతో పాతస్కూళ్ల బోర్డులను కమ్మి ఈ స్కూల్‌ కూడా ‘మా’ స్కూలే అంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసంచేస్తున్నారు. అసలు విషయం తెలియక విద్యార్థులను ‘ఆ’ స్కూలే అనుకొని ఫీజులు భారమైనా అందులో చేర్చుతున్నారు. కొందరేమో తప్పదు కాబట్టి చేర్పిస్తున్నామని, మరికొందరేమో అసలు విషయం తెలుసుకొని పలానా స్కూల్‌ వీరు చెప్పిన స్కూల్‌ కాదుకదా..? అని ఆలోచిస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా అసలు ‘షాని’కెళ్లడమే తప్పు లేనిదానికి, కానిదానికి ఎందుకు వెళ్లాలి అంటూ నగరంలో తల్లిదండ్రులు గుసగుసలాడుకుంటున్నారు.

ఇంటింటికి బడిబాట

ఇంటింటికి బడిబాట

మండలంలోని కొండాపురం గ్రామంలో అంగన్‌వాడీ కార్యక్రమంలో భాగంగా బడిబాట నిర్వహించారు. ఇంటింటికి అంగన్‌వాడీ కార్యక్రమంలో 5సంవత్సరాలలోపు పిల్లలందరిని అంగన్‌వాడీకి పంపాలని పిల్లల తల్లిదండ్రులకు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలు చిన్నపిల్లల మేథో వికాసాభివృద్దికి ఎంతోగానో తోడ్పడుతాయని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నపిల్లలను చేర్పిస్తే పోషకాహారంతోపాటు ఉచితవిద్య, ఆరోగ్యం, భాష అభివద్ధి గురించి పిల్లల తల్లిదండ్రులలో అవగాహన కలిగించారు. అనంతరం చిన్నపిల్లలకు ఆక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో గ్రామంలోని చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసిడీఎస్‌ సూపర్‌వైజర్‌ రమాదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సావిత్రి, అంగన్‌వాడీ టీచర్‌ సడాలమ, వార్డు మెంబరు రమేష్‌, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

కార్పొరేటర్‌ తండ్రి కావరం

కార్పొరేటర్‌ తండ్రి కావరం

ఆయనో కార్పొరేటర్‌ తండ్రి. కొడుకు ఆవేశానికి గురైతే అలా కాదు…ఇలా అని సర్థిచెప్పాల్సినోడు రాజకీయం అంటే ఏంటో చెప్పి కొడుకు జనం తరుపు నాయకుడిగా ఎదిగేలా చేయాల్సినోడు కానీ కొడుకు కంటే ముందు తండ్రికే ఓపిక లేకుండాపోయింది. తనయుడి కార్పొరేటర్‌ పెత్తనాన్ని తనకు ఉన్న కావరాన్ని కలగలిపి డివిజన్‌ ప్రజలపై విరుచుకుపడ్డాడు. నా కొడుకునే నల్లా నీళ్లు కావాలని అడుగుతారా…డివిజన్‌లో నీటి కొరత ఉందని ఫిర్యాదు చేస్తారా…? కార్పొరేటర్‌ అయిన నా కొడుకు మీ ఇంటికి వస్తాడా అని శివాలెత్తాడు. ట్యాంకర్‌ నీళ్లు ఎందుకు…తంతా లం…కొడుకా ఎవడనుకుని మాట్లాడుతున్నావ్‌ అంటూ బూతు పంచాంగం విప్పాడు. నీళ్లు కావాలని అడిగినంందుకు బూతులతో విరుచుకుపడ్డాడు. వివరాల్లోకి వెళితే…గ్రేటర్‌ వరంగల్‌లోని 19వ డివిజన్‌లో నీటికొరత తీవ్రంగా ఉంది. దీంతో స్థానికులందరు కార్పొరేటర్‌ దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లాలనుకున్నారు. దీంతో స్థానికుడైన బత్తుల సంపత్‌కుమార్‌ కార్పొరేటర్‌ దిడ్డి నాగరాజుకు ఫోన్‌ చేశాడు. వారు ఎదుర్కొంటున్న నీటి సమస్య గూర్చి వివరించి పరిష్కరించాలన్నాడు. అవసరమైతే డివిజన్‌లోని తమ ప్రాంతానికి వచ్చి నీటికొరత ఎలా ఉందో చూడవచ్చు అన్నాడు. అంతే తన కుమారుడిని సంపత్‌కుమార్‌ ఇంటికి రమ్మన్నాడని కార్పొరేటర్‌ దిడ్డి నాగరాజు తండ్రి దిడ్డి నరేందర్‌ చిందులు తొక్కాడు. సంపత్‌కుమార్‌కు ఫోన్‌ చేసి నానాబూతులు తిట్టాడు. నువ్వు ఎంతటివాడవురా నా కొడుకునే ఇంటికి రమ్మని అంటావా, ట్యాంకర్లు పంపుతున్నా సరిపోవడం లేదా అని నానా దుర్బాషలాడాడు. తెల్లవారేసరికి లేపేస్తా, నరికేస్తా అంటూ సభ్యత, సంస్కారం మరచి వయస్సును మరిచి ఫోన్‌లోనే తీవ్రస్థాయిలో వార్నింగ్‌ ఇచ్చాడు. సంపత్‌కుమార్‌ సతీమణి రమ సార్‌…సార్‌ అంటూ ఫోన్లో మర్యాదగా మాట్లాడిన కార్పొరేటర్‌ తండ్రి ఎంతమాత్రం తగ్గలేదు. వాడు…వీడు…చంపేస్తాం…నరికేస్తాం అంటూ అవే డైలాగ్‌లు వినిపించాడు. ఓ ప్రజాప్రతినిధి జనం సమస్యలు చూడడానికి జనం పిలిస్తే వెళ్లకుండా ఏంచేస్తాడో ఇంగిత జ్తానం లేకుండా మీరు పిలిస్తే నా కొడుకు వస్తాడా…? అంటూ కార్పొరేటర్‌ అయిన తన పుత్రరత్నం తరపున వకాల్తా పుచ్చుకుని మతిపోయినట్లుగా మాట్లాడాడు. స్థానికులందరు కలిసి నీటి సమస్య గూర్చి చర్చిస్తుండగానే కార్పొరేటర్‌ తండ్రి ఫోన్‌లో తన బూతు బాగోతాన్ని కొనసాగించాడు. ఇతగాడి వార్నింగ్‌లు, బూతు బాగోతంపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓట్లు వేసి కార్పొరేటర్‌గా గెలిపిస్తే తిట్టు తినాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

గుట్కాల పట్టివేత

గుట్కాల పట్టివేత

వరంగల్‌ క్రైమ్‌, నేటిధాత్రి : మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శంభునిపేట ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేసిన 27వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు బుధవారం స్వాదీనం చేసుకున్నామని మిల్స్‌కాలనీ పోలీసులు తెలిపారు. శంభునిపేటకు చెందిన ధర్మపురి రమేష్‌ ఇంట్లో తనిఖీ చేయగా గుట్కాలు లభించాయని, రమేష్‌పై కేసు నమోదు చేశామని మిల్స్‌కాలనీ పోలీసులు తెలిపారు.

నేనే మేయర్‌…నేనే ఎమ్మెల్యే నేనంటే నేనే

నేనే మేయర్‌…నేనే ఎమ్మెల్యే

నేనంటే నేనే

కార్పొరేటర్‌ నుంచి మేయర్‌గా, ఆ తరువాతి సమీకరణలతో వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నన్నపనేని నరేందర్‌ వరంగల్‌ తూర్పుతో సహా గ్రేటర్‌ వరంగల్‌ అంతా తన పెత్తనం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పెత్తనం ఎక్కడి వరకు వెళ్లిందంటే గ్రేటర్‌ కాకుండా వరంగల్‌ ఉమ్మడి జిల్లా మొత్తంగా తన పరపతి ఏంటో చూపించుకునే స్థాయికి నరేందర్‌ గూర్చి ఆ పార్టీ నాయకులే కొంతమంది ఎమ్మెల్యేకు ముందు, ఎమ్మెల్యే తరువాత అని చర్చించుకునేలా తయారయ్యిందట. మేయర్‌గా బాద్యతలు చేపట్టి, తన వర్గాన్ని పెంచుకున్న నన్నపనేని ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కూడా అదే విధానాన్ని పాటిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘రామన్న’ ఫోన్‌ చేశాడు జాగ్రత్త…!

ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ తన మాట వినని వారికి కేటిఆర్‌ పేరు చెప్పి వారికి తెచ్చుకుంటాడనే ప్రచారం కొనసాగుతుంది. తనకు సంబంధించిన సొంత పనులు చేయకుండా ఎవరు నిర్లక్ష్యం చేసిన రామన్న ఇప్పుడే ఫోన్‌ చేశాడు…నీ గూర్చి ఫిర్యాదులు వెళ్లాయట అని బెదిరించి తన స్వకార్యాన్ని చక్కబెట్టుకుంటాడట. మేయర్‌గా కొనసాగిన కాలంలో సైతం అధిష్టానానికి అతిదగ్గరగా ఉండే ఓ పార్టీ సీనియర్‌ నేత ఏదో పని విషయమై సంప్రదిస్తే కేటిఆర్‌ పేరు చెప్పి ఆ నేతను హడలెత్తించాడట. పార్టీ మొదలుకుని ఇంటా, బయట ఎక్కడ పనికావాలన్న అవసరం ఉన్నా, లేకున్నా కేటిఆర్‌ పేరును వాడుతూ పనులన్నీ చక్కబెట్టుకుంటున్నాడని, ఎమ్మెల్యే పనులు ఏమోగానీ కేటిఆర్‌ పేరువాడి తలవంపులు తెస్తున్నాడని కొందరు పార్టీ నాయకులే తమలో తాము చర్చించుకుంటున్నారు. తన సన్నిహితుల వద్ద కేటిఆర్‌ నా అన్న…నేను ఎంత చెపితే అంతా అంటూ వ్యాఖ్యానిస్తాడట. నన్నపనేని అనుసరిస్తున్న ఈ విధానంతో వరంగల్‌ తూర్పులో పార్టీ నాయకులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది.

బల్ధియాను వదలడు

మేయర్‌గా కొనసాగుతూనే ఎమ్మెల్యేగా గెలిచిన నన్నపనేని మాత్రం ఇప్పటికి మేయర్‌ పదవి నుంచి ఇంకా బయట పడలేదట. గ్రేటర్‌ పరిధిలో ఏం పనికావాలన్న కార్పొరేటర్లు తననే సంప్రదించాలనే ఆలోచనలో ఉన్నాడట. వివిధ డివిజన్లలో అభివృద్ది పనుల విషయంలో నన్నపనేని జోక్యం రోజురోజుకు మితిమీరిపోతున్నట్లు తెలిసింది. కార్పొరేటర్లు తనను కాదని ఏ పని చేసినా దానికి కావాల్సిన కొర్రీలు పెట్టడం ఆయనకు అలవాటుగా మారిందట. మేయర్‌గా గుండా ప్రకాష్‌రావు కొనసాగుతున్న ఎమ్మెల్యే నన్నపనేని మాత్రం షాడోలా ప్రవర్తిస్తున్నాడని కొందరు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యే ఇంట గ్రేటర్‌ సిబ్బంది

మేయర్‌గా నన్నపనేని కొనసాగినపుడు ప్రభుత్వం కేటాయించిన గ్రేటర్‌ సిబ్బందిని ఇప్పటికి వారి విధుల్లోకి వెళ్లకుండా తన వద్దే పనిచేయించుకుంటున్నట్లు తెలిసింది. సీసీ వినయ్‌, ఆపరేటర్‌ రాజు, డ్రైవర్‌ సంపత్‌, ఇద్దరు వంటమనుషులు గ్రేటర్‌ సిబ్బంది అయిన నన్నపనేని వద్దే విదులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గ్రేటర్‌ అధికారులు ఎమ్మెల్యే తీరుతో భయపడి తమ సిబ్బందిని తాము వెనక్కి పిలిపించుకోని స్థితిలో ఉన్నారట. ఒకవేళ ఎవరైన అధికారి నన్నపనేని వద్ద ఉన్న సిబ్బందిని వెనక్కి పిలిస్తే ఏమవుతుందోనని భయపడిపోతున్నారట. అధిష్టానం అండదండలు తనకు పుష్కలంగా ఉన్నాయని అందరికి సంకేతాలు పంపే ఎమ్మెల్యే నరేందర్‌ను ఇదేంటని ప్రశ్నించే అధికారి తీరట. కమిషనర్‌ సైతం చెప్పినట్లు చేయకుంటే కేటిఆర్‌ పేరు చెప్పి బెదిరింపులకు గురిచేసినట్లు విశ్వసనీయ సమాచారం.

అధిష్టానానికి పితూరీలు

వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న టిఆర్‌ఎస్‌ నాయకులపై అధిష్టానానికి పితూరీలు చెప్పడం ఎమ్మెల్యే నన్నపనేనికి అలవాటయిందట. హైదరాబాద్‌ వెళ్లిందంటే చాలు తనకు గిట్టనివారి గూర్చి ఏదో ఒకటి పితూరీ చెప్పి బేష్‌ అనిపించుకునే ప్రయత్నం చేస్తాడని తెలిసింది. తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా వేరే నియోజకవర్గాల్లో వేలు పెడుతూ అధిష్టానం పేరుతో పెత్తనం చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఇంత జరుగుతున్న అధిష్టానం నన్నపనేని వ్యవహారంలో చూసిచూడనట్లు వ్యవహారించడం సీనియర్లలో ఆందోళన కలిగిస్తోంది. వ్యక్తి చెప్పే పితూరీలతో అధిష్టానం తన నిర్ణయాలను మార్చుకుంటుందా…? అని వారు ప్రశ్నిస్తున్నారు.

కార్మిక చట్టాలు అమలు చేయాలి

కార్మిక చట్టాలు అమలు చేయాలి

నర్సంపేట పట్టణంలో వివిధ దుకాణాలలో పనిచేస్తున్న గుమస్తాలకు కార్మికచట్టాలు అమలుచేయాలని కోరుతూ జిల్లా లేబర్‌ అధికారి రమేష్‌బాబుకు టీఆర్‌ఎస్‌ కెవి ఆద్వర్యంలో అవినీతిపత్రాన్ని అందజేశారు. టిఆర్‌ఎస్‌ కేవి రాష్ట్ర నాయకురాలు నల్లా భారతి, జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజులు మాట్లాడుతూ గుమస్తాలకు ఎనిమిదిగంటల పని విధానం అమలుకావడం లేదని, రోజుకు 12గంటలు పనిచేయడం వల్ల మహిళా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వారాంతపు సెలవులు అమలుకావడం లేదని, కార్మికులు పనిచేసే ప్రదేశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. దుకాణాల్లో ఎస్టబ్లమెంట్‌ యాక్ట్‌ అమలుకావడం లేదని ఒక్క కార్మికుడికి ఎస్‌ ఫాములు లేవని లేబర్‌ అధికారుల తనిఖీలు లేకపోవడం వల్ల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్మికులు, యాజమాన్య సంఘాలతో లేబర్‌ అధికారులు జాయింట్‌ కమిటీని ఏర్పాటుచేసి కార్మిక చట్టాలు యాజమాన్యాలు అమలు చేసే విధంగా చూడాలని, లేనిపక్షంలో టిఆర్‌ఎస్‌ కెవి ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాలడుగుల రమేష్‌ పాల్గొన్నారు.

అంగన్‌వాడి టీచర్ల బడిబాట

అంగన్‌వాడి టీచర్ల బడిబాట

హసన్‌పర్తి మండలంలోని జయగిరి గ్రామంలో అంగన్‌వాడి టీచర్లు బడిబాట కార్యక్రమం చేపట్టారు. ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపేయాలని, 5సంవత్సరాలకు పైబడి ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్పించాలని అంగన్‌వాడీ టీచర్లు గ్రామంలో ర్యాలీ చేపట్టారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. ప్రతి గ్రామంలోని తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ప్రతి పిల్లవాడికి పౌష్టికాహారం, కోడిగుడ్లు, పాలు, విటమిన్లతో కూడిన ఆహారాన్ని పిల్లలకు అంగన్‌వాడీ టీచర్లు పెడుతున్నారని ఈ కార్యక్రమంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన హసన్‌పర్తి మండల జడ్పీటిసి రేణికుంట్ల సునీత, జయగిరి సర్పంచ్‌ రాణి, ఆశవర్కర్లు శారద, టీచర్లు సింగయ్య, ఇంద్ర, రేణిగుంట్ల ఆమని పాల్గొన్నారు.

 

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

మండలంలోని అన్నారం షరీఫ్‌లోని యుపిఎస్‌ పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సోమేశ్వర్‌ మాట్లాడుతూ నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని అన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, 2జతల దుస్తువులు, అన్ని రకాల సౌకర్యాలు గల ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ విద్యాసంవత్సరం నుండి 1వ తరగతి నుండి ఇంగ్లీష్‌ మీడియంలో బోధన చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయిలు, సాంబయ్య, వెంకటరమణ, శ్రీనివాస్‌, రవీందర్‌, విజయలక్ష్మి, కల్పన, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

 

పోతరాజు విగ్రహం ధ్వంసం

పోతరాజు విగ్రహం ధ్వంసం

మండలంలోని అన్నారం షరీఫ్‌ గ్రామ చెరువుకట్టపై గల పెద్దమ్మతల్లి గుడిలోని పోతరాజు విగ్రహాన్ని బుధవారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని ముదిరాజ్‌ కులసంఘము నేతలు ఘటనాస్థలికి చేరుకుని ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారినుండి ఫిర్యాదును స్వీకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

దుండగుల దాడిలో వ్యక్తి మృతి

దుండగుల దాడిలో వ్యక్తి మృతి

జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్‌ సెంటర్‌లోని శ్రీరామ సంతోష్‌లాడ్జ్‌లో గుర్తుతెలియని దుండగుల దాడిలో వ్యక్తి మృతిచెందాడు. అంబెడ్కర్‌ సెంటర్‌లోని టీ స్టాల్‌ యజమాని నాగరబోయిన కనకరాజు(50)ని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.

గ్రామ అభివద్ధిపై సమీక్షా సమావేశం

గ్రామ అభివద్ధిపై సమీక్షా సమావేశం

గ్రామంలోని పలు సమస్యల పట్ల, గ్రామాబివద్ధి లక్ష్యంగా సమీక్ష సన్నివేశాన్ని సర్పంచ్‌ బరిగెల లావణ్య అధ్యక్షతన గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించారు. గ్రామంలోని అంతర్గతరోడ్లు, మంచినీటి సౌకర్యం, గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని పనుల పట్ల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కెసిఆర్‌ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అన్నిరకాల వర్గాల ప్రజలకు అందేవిధంగా ప్రతి ఒక్కరు సహకరించుకోవాలని తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రుతి, ఉపసర్పంచ్‌ బాషబోయిన శ్రీనివాస్‌, వార్డుసభ్యులు ఉప్పుల రాజు, శ్యామల, రజితలతోపాటు కారోబార్‌ కొల్లాపురం కోటిలింగంలతోపాటు పలువురు పాల్గొన్నారు.

ప్రైవేటు పాఠశాలల బస్సులు రావద్దు

ప్రైవేటు పాఠశాలల బస్సులు రావద్దు

మా ఊరికి ప్రైవేటు పాఠశాలల బస్సులు రావద్దు, ప్రభుత్వ పాఠశాలల విద్యాబోధనే మాకు ముఖ్యమని మందపల్లి గ్రామస్తులు ప్రైవేటు పాఠశాల బస్సును అడ్డుకున్నారు. నర్సంపేట డివిజన్‌లోని దుగ్గొండి మండలం మందపల్లి గ్రామంలో గురువారం నర్సంపేట మండలం లక్నేపల్లి శివారులోని న్యూవిజన్‌ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు రావడంతో ఆ గ్రామానికి చెందిన గ్రామస్తులు, గ్రామసర్పంచ్‌, పంచాయతీ వార్డుసభ్యులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మొగ్గం మహేందర్‌, గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యను అందిస్తారని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో హంగులు, ఆర్భాటాలు మాత్రమే ఉంటాయని, ఇక నుండి మా ఊరిలోకి ప్రైవేటు పాఠశాలల బస్సులు రాకూడదని హెచ్చరించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామ్మూర్తి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, నాణ్యమైన బోధన అందించి విద్యార్థులను ఉన్నతస్థాయి స్థితిలో చేర్చే బాధ్యత తమదని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

బడి బస్సులు భద్రమేనా…?

బడి బస్సులు భద్రమేనా…?

పాఠశాలలు మొదలయ్యాయి…పిల్లల ఫీజులు, పుస్తకాలు కొనటంలో విద్యార్థుల తల్లితండ్రులు తలమునకలు అవుతున్నారు. పుస్తకాల రేట్లు ఎమ్మార్పీ రేటుకు ఎక్కువ ఉన్నా, అసలు పుస్తకాలపై రేటు లేకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులుచేసి కొనవలసి వస్తుందని తల్లితండ్రుల వాదన. దూరప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు పాఠశాల యాజామాన్యం బస్సులు ఏర్పాటు చేస్తుంది. కానీ వాటికి ఫిట్‌నెస్‌ పరీక్షల నిమిత్తం ఆర్టీఏ కార్యాలయానికి రావాల్సిన బస్సులు నేటివరకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకునేందుకు కార్యాలయం మొహం చూసిన పాపానపోలేదు. ఫిట్‌నెస్‌ పరీక్షలు చేసేందుకు అధికారులు సన్నద్ధమైనా…కళాశాల, పాఠశాలల యాజమాన్యలు మాత్రం ఫిట్‌నెస్‌ చేయించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆర్టీఏ యంత్రాంగం పాఠశాలకు చెందిన బస్సులు సభలకు, ఇతర కార్యక్రమాలకు వినియోగించరాదని నిబంధన ఉన్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. దీంతో ఇంజన్లు మరమ్మతులకు గురై ఆకస్మాత్తుగా కళాశాల, పాఠశాలల బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఎక్కడో ఒకచోట తరచూ పాఠశాలల బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు ప్రమాదాల బారినపడుతూనే ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలతో పిల్లలకు బంగారు భవిష్యత్‌ అందించాలనే కల నెరవేరకపోగా తల్లిదండ్రులకు కడుపుకోతే మిగులుతోంది. రాష్ట్రప్రభుత్వం పాఠశాల, కళాశాల బస్సుల ప్రమాదాలను నివారించేలా నిబంధనలు ఈ విద్యాసంవత్సరంలో కఠినతరం చేసింది అని చెప్పొచ్చు. దీంతో అధికారులు అప్రమత్తమై వాహనాల పనితీరు, సామర్థ్యాన్ని, నిబంధనల అమలుతీరును గుర్తించే పనిలోపడ్డారు. బస్సుల సామర్థ్య నిర్థారణ విషయంలో నిబంధనలు మేరకు అన్నీ సక్రమంగా ఉంటేనే ధ్రువీకరణపత్రం ఇవ్వాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, జిల్లా రవాణాశాఖ అధికారులు మాత్రం తూతూ మంత్రంగానే ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆ శాఖ ఉన్నతాధికారులకు కొన్ని విద్యాసంఘాలు చేసిన ఫిర్యాదుల మేరకు ఉన్నతాధికారులు పరిశీలన నిమిత్తం నేటి నుండి బస్సులపై ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నామని ఆర్టీఏ అధికారులు తెలిపారు. బడి సమయంలో కాకుండా రోడ్డుపై తిరిగే స్కూల్‌ బస్సులను సీజ్‌చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అలాగే, సభలు, ఇతరత్రా కార్యక్రమాలకు వెళ్లే బడిబస్సులను కూడా రవాణాశాఖ సరికొత్త నిబంధనలతో సీజ్‌ చేస్తున్నట్టు తెలిసింది. ఇదిలాఉండగా, జిల్లాలో వివిధ విద్యాసంస్థలకు వెయ్యికి పైగా బస్సులు ఈ పదిరోజుల్లో వరంగల్‌లోని అన్ని పాఠశాల, కళాశాలలు బస్సులు సామర్థ్యం పరీక్షలలో అర్హత పొందాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ కేవలం పదులసంఖ్యలో మాత్రమే అర్హత పత్రాలు పొందాయి. ఈ ఏడాది అధికారులు నిబంధనలు కఠినతరం చేసిన వాటిని కచ్చితంగా అమలు చేస్తుండటంతో ఫిట్‌నెస్‌ పరీక్షలకు యాజమాన్యాలు ఆసక్తి చూపడంలేదని చెప్పొచ్చు. దీంతో గడువు ముగిసే సమయానికి అన్ని బస్సుల పరిశీలన పూర్తయ్యే విదంగా పని చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు దీంతో ఆర్టీఏ అధికారులు హైరానా పడాల్సివస్తోంది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు చివరిరోజు వరకు ఆగి ఆ తర్వాత పైపైన పరీక్షలతో ధ్రువపత్రాలను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

బడి బస్సు సామర్థ్య పరీక్ష చేయించాలంటే ముందుగా సంబంధిత వెబ్‌సైట్‌లో చలానా ఇంకా బస్సు వివరాలు పొందుపరచాలి. ఆ ప్రక్రియ పూర్తయ్యాక బస్సును తనిఖీకి ఏ సమయంలో తీసుకెళ్లాలో వివరాలు వస్తాయి. ఆ మేరకు సంబంధిత రవాణాశాఖ కార్యాలయానికి వెళ్ళి సామర్థ్య పరీక్ష పూర్తి చేయించుకోవాల్సివుంటుంది. గతంలో ఎలా ఉన్న ఈసారి మాత్రం నిబంధనలు కఠినతరం చేయడంతో గడువు ముగిసేనాటికి బడి బస్సులన్నింటికీ సామర్ధ్య నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలంటూ ఆర్టీఏ అధికారి చెప్పారు. నిబంధనలు పాటించకపోయినా, సకాలంలో ధ్రువీకరణ పత్రం పొందకపోయినా యాజమాన్యాలపై కఠినచర్యలు తీసుకుంటామంటూ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ పురుషోత్తం తెలిపారు.

నిబంధనలు ఇవే…

బడి బస్సు వయస్సు 15 ఏళ్ళులోపు ఉండాలి. కచ్చితంగా బీమా కలిగి ఉండాలి.

వాహనం ముందు వెనుక పాఠశాల బస్సు అని, సంస్థపేరు రాయించాలి. దాని పక్కనే పిల్లల చిత్రాలు ఉండాలి.

సీట్లు సౌకర్యవంతంగా ఉండాలి. బస్సు వెనుక వైపు అత్యవసర ద్వారం తప్పనిసరి.

పిల్లలు ఎక్కటానికి వీలుగా ఫుట్‌బోర్డు మొదటిమెట్టు నేల నుంచి 325 మి.మీ. లోపు ఎత్తు ఉండాలి.

అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స పరికరాలు అవసరమైన మందులు ఉంచాలి.

బస్సుల ముందు భాగంలో తెలుపు, వెనుక ఎరుపు, పక్కనే పసుపు రంగు రేడియం స్టిక్కర్లు అమర్చాలి.

బ్రేక్‌, హారన్‌, ఇంజన్‌ కండిషన్‌ సక్రమంగా ఉండేలా చూడాలి.

డ్రైవర్‌ ఫోటో, లైసెన్స్‌ వివరాలను అందరికీ తెలిసేలా బస్సులోపల బోర్డు ఏర్పాటు చేయాలి.

నిత్యం ప్రయాణించే విద్యార్థుల జాబితాను బస్సులో ఉంచాలి.

విద్యార్థులను ఎక్కించేందుకు దించేందుకు ప్రతీ బస్సుకు ఒక అటెండర్‌ను ఏర్పాటు చేయాలి.

రోజూ రాకపోకలు రూట్‌మ్యాప్‌ బస్సులో అతికించాలి.

పాఠశాల ఆవరణలో పార్కింగ్‌ చేసేలా చర్యలు చేపట్టాలి.

యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి కమిటీని ఏర్పాటు చేసి ప్రతీ నెలా బస్సు స్థితిని పరీక్షించాలి.

ప్రతీరోజూ ప్రయాణించే మార్గాన్ని ప్రధానోపాధ్యాయులు పరిశీలించాలి.

ఉపాధ్యాయుల నుంచి ఒకరు, పిల్లల తల్లిదండ్రుల నుంచి మరోకరు బస్సులో ప్రయాణించాలి.

సమస్యలుంటే నేరుగా రవాణాశాఖ అధికారులకు కమిటీ సభ్యులు ఫిర్యాదు చేయాలి.

ఆర్టీఏ అధికారులు, విద్యార్థుల తల్లితండ్రులు పైన పేర్కొన్న విధంగా పాటిస్తే విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు దారి వేయొచ్చని చెప్పొచ్చు.

5బస్సులు సీజ్‌చేసిన అధికారులు

నేటివరకు సామర్థ్య నిర్దారణ పాటించని పాఠశాల బస్సులను వరంగల్‌ అర్బన్‌ రూరల్‌ జిల్లా మిత్తం మీద 5 బస్సులు సీజ్‌ చేసినట్టు డిటిసి పురుషోత్తం తెలిపారు. ఇంకా ఈ తనికీలు జరుగుతాయని వీలైనంత త్వరగా కార్యాలయంలో ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలని, లేదంటే బస్సులను సీజ్‌ చేయటం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version