కెనడాలో ఘనంగా జరిగిన త్రిభాషామహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 1250వ అష్టావధానం

తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మరియు తెలుగుతల్లి కెనడా ఆధ్వర్యంలో టొరంటోలో ఉన్న దుర్గా దేవి గుడిలో అష్టావధానం అత్యద్భుతంగా సాగింది. శరవేగంతో జరిగిన పూరణ లేఖకుల కలాలకి అందలేదు. చమత్కారమైన సంభాషణతో మొదలైన సభ, అప్రస్తుత ప్రసంగంతో ఇంకా చురుకై, ఆద్యంతమూ సభ్యులను నవ్వుల జల్లులులో ముంచెత్తింది.

చాలా సంవత్సరాల తరువాత అవధాన ప్రక్రియని వ్యక్తిగతంగా చూడడం ఎంతో ఆనందంగా ఉందని సీనియర్ సిటిజన్లు హర్షం వెలిబుచ్చగా, తెలుగులో ఇలాంటి ప్రక్రియ ఒకటి ఉందని తెలుసుకోవడం తమ అదృష్టమని యువత ఆనందం వ్యక్తం చేసారు. ఆ విధంగా అన్ని వయసుల వారిని ఉర్రూతలూగిస్తూ పద్మాకర్ గారు చేసిన అష్టావధానంతో తెలుగు సాహితీ కాంతులు కెనడాలో వెల్లివిరిసాయి.

గత రెండునెలలుగా బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారు అమెరికా, కెనడా దేశాలలో చేస్తున్న ఆధ్యాత్మిక, సాహితీ పర్యటనలో భాగంగా అమెరికాలో వివిధ రాష్ట్రాలలో ప్రవచానాలు, ఒక అష్టావధానము, ఒక శతావధానము కూడా నిర్వహించి ఇప్పుడు కెనడాలో మరొక అష్టావధానం చేశారు. సమస్య, ఆశువు, వర్ణన, అప్రస్తుతప్రసంగం ఇలా అన్ని అంశాలతో సభను మరింత రక్తికట్టించిన పృచ్ఛకులను, తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మరియు తెలుగుతల్లి కెనడా సంస్థలను శ్రీ పద్మాకర్ గారు ప్రశంసించారు. అత్యంత వైభవంగా నిర్వహించబడిన ఈ సాహితీసదస్సు తెలుగు భాషాప్రియులకు కన్నులపండుగ అని పలువురు వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. 

తెలుగుతల్లి కెనడా వ్యవస్థాపకురాలు శ్రీమతి లక్ష్మి రాయవరపు గారు మాట్లాడుతూ ” ఏ దేశమేగినా ఎందు కాలిడినా చక్కటి తెలుగు మా ప్రాణ ప్రదం, తల్లి భూమి భారతిని గౌరవించడమే జాతికి నిండుతనం అన్న భావంతో తెలుగు తల్లి కెనడా నెలకొల్పబడింది. తెలుగుతల్లి పత్రిక కెనడాలో ఉన్న తెలుగు ప్రతిభనంతా ఒక చోటికి చేర్చే వేదిక” అని చెప్పారు.  

తెలుగువాహిని అధ్యక్షులు శ్రీ త్రివిక్రం సింగరాజు గారు మాట్లాడుతూ ” శ్రీకృష్ణ దేవరాయల ఆముక్త మాల్యద చదవడం నించి, సభ్యులలో భావుకత పెంచే నేటి తరం వచన కవితలు వ్రాయించే దాకా పూచీ తెలుగువాహినిది” అని తెలియజేసారు. 

 

ఓంటారియో తెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు శ్రీ మురళి పగిడేల గారు మాట్లాడుతూ ” ఓంటారియోలో ఉంటున్న తెలుగువారికి కావలసిన సహాయం చేసి, సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడడమే ఓటీ ఎఫ్ ముఖ్య ఉద్దేశ్యమ”ని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version