చెన్నూర్, నేటి ధాత్రి:
చెన్నూరు పరిసర ప్రాంతంలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై దాడి చేసిన పోలీసులు పది మందిని అరెస్టు చేయగా 14.48 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. టాస్క్ ఫోర్స్ సీఐ సంజయ్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఉపేందర్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్నాద్ గ్రామ శివారు మామిడి తోటలో పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న పది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 10 సెల్ ఫోన్లు, రూ. 14.48 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడిలో ధరణి బాపు, అన్నాల తిరుపతి, బడికల లచ్చయ్య, కంచరపు వెంకటేశ్వరరావు, భూ బత్తుల శంకర్, గాండ్ల సంతోష్, పెండాల రాజేందర్, భీమనపల్లి శ్రీనివాస్, దాడి నగేష్ తదితరులను అరెస్టు చేశారు. కొంతమంది కలిసి ఒక టీమ్ గా ఏర్పడి పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, కరీంనగర్, ఆసిఫాబాద్, ప్రాంతాల నుండి పేకాట ఆడే కొంత మంది ఆటగాళ్లను తీసుకువస్తున్నారు. అటవీ ప్రాంతాలలో రోజుకు ఒక ఏరియాలో పేకాట స్థావరాలు ఏర్పాటుచేసి, వచ్చిన ఆటగాళ్ల నుండి కొంత మొత్తంలో వసూలు చేస్తూ పేకాట స్థావరం నిర్వహిస్తున్నారు.ఇందులో నలుగురు లేదా ఐదుగురు కలిసి ఒక కంపెనీగా ఏర్పడి కంపెనీ పెట్టుబడిగా సుమారు 5 లక్షల వరకు పెడుతున్నారు. వచ్చిన ప్లేయర్ల నుండి కొంత మేర కమిషన్ కింద వసూలు చేస్తూ,సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఈ పేకాట నిర్వహిస్తున్నారు. వీళ్ళు ఆడే ప్రదేశానికి చుట్టుపక్కల రహస్యంగా కొంతమంది వ్యక్తులను సెంట్రీలుగా ఏర్పాటు చేసుకుని, ఎవరైనా కొత్త వ్యక్తులు గాని పోలీసులు గాని వస్తే త్వరగా సమాచారం అందించే ఏర్పాటు చేసుకుంటున్నారు.