బంతి బాబుది, కోర్టు కాంగ్రెస్‌ ది?


రేవంత్‌ ఆట… కాంగ్రెస్‌కు కటకట?
`స్వలాభం, శత్రునాశనం రేవంత్‌ ఏక కాల రాజకీయం?


`బాబు కనుసన్నల్లోనే రేవంత్‌ టిక్కెట్లు?
`ఆట మొదలుపెట్డిన తెలుగు బి టీమ్‌?
`బాబు ఆట, రేవంత్‌ సయ్యాట?


`సీనియర్ల వాదన అరణ్య రోధనే?
`ఆరునెలల ముందు టిక్కెట్లు లేవు?
`ఎన్నికల ముందు సీనియర్లకు రేవంత్‌ ఇవ్వనున్న రaలక్‌?
`టిడిపి బినామీలకే పెద్ద పీట?
`జగ్గారెడ్డికి టిక్కెట్‌ కట్‌?


`కొమ్మూరి కోసం, పొన్నాలకు పొగ?
`జానాకు సైతం జాంతానై?
`నాయనికి నో?
`రాఘవరెడ్డి కి రాంరాం?
`కోమటిరెడ్డి కోటలో కొత్తవారికి చోటు?
` సీనియర్లే ఆటలో అరటిపండ్లు?
`ఎర్రబెల్లిని కొండాతో డీ కొట్టించాలి?
`ఎట్లైనా మల్లారెడ్డి నోడిరచాలి?
`రేవంత్‌ లెక్క…కాంగ్రెస్‌ బొక్కబోర్లా?
`బాబు కోసం భజంత్రీలు…రేవంత్‌ కృతజ్ఞతలు!
హైదరాబాద్‌,నేటిధాత్రి:
తలుగు నాది కాదు, బర్రె నాది కాదు. కట్టేసుకుంట…పాలు పిండేసుకుంట…అమ్మేసుకుంట…ఒట్టిపోతే వదిలేసుకుంట….అంగట్లకు కొట్టుపోయి బ్యారానికి పెడత… నా దారి నేను చూసుకుంట…తిరుగుడు కొత్త కాదు… దుంకుడు కొత్తకాదు…కొత్త జెండాలు ఎత్తుడు కొత్త కాదు…రంగులు మార్చుడు వింతేం కాదు…కండువాలు మార్చుడు చాలా సులువు….నేనొక్కడినే మొదటోన్ని కాదు…ఆఖరోన్ని అసలే కాదు…నీళ్లు వడ్డ కాడ ఎవుసం చేస్త…గిట్టుబాటు కాడికి అమ్ముకుంట…వచ్చిందంతా దోచుకుంట…నమ్మినపార్టీలను నట్టెట ముంచుతుంట…ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడాలేకుండా, సొంత పార్టీ నేతలు కూడా చెప్పుకుంటున్న మాట..దుమ్మెత్తి పోస్తున్న మాట…పిపిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గురించి! అదెంత నిజమో! ఎంతవరకు అబద్దమో!! వారికే తెలియాలి…ఎందుకంటే మంత్రి మల్లారెడ్డి బహిరంగంగానే దూసిస్తూ, రేవంత్‌ను తూర్పారపట్టిండు…. తిట్టిన తిట్టు తిట్టకుండా పొట్టు పొట్టు తిడుతున్నడు. ఇక కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ల సంగతి తెలియంది కాదు…నిన్నటిదాకా ఆటాడుకున్నారు. కాకపోతే ఓ రెండురోజులు సైలెంటుగా వున్నారు. మళ్లీ నిన్న మొన్న వాళ్లూ మొదలు పెట్టారు. ఇప్పుడు వాళ్లు కూడా పద్దతి మార్చుకున్నారు. వింతగా మాట్లాడుతున్నారు. అయితే అధిష్టానం అలుసు చూసుకొని రేవంత్‌ రెడ్డి ఎగిరెగిరి పడుతున్నాడంటూ కూడా ఆరోపణలు చేస్తూనే వున్నారు. కాని ఒక రకంగా చెప్పాలంటే రేవంత్‌ రెడ్డి సీనియర్లను చెడుగుడు ఆడుకుంటున్నాడు. వారిని చెల్లా చెదురు చేస్తున్నాడు. పుట్టకొకలు, చెట్టుకొకలు పారిపోయేలా చేస్తున్నాడు. వారి మీద కోవర్టు ముద్రలేస్తున్నాడు.
దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో కొంత సక్సెస్‌ అవుతున్నాడు…
మరి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు?
ఎందుకోసం చేస్తున్నాడు? ఎవరి కోసం చేస్తున్నాడు? తన కోసమే చేస్తున్నాడా? మరెవరి కోసమైనా చేస్తున్నాడా? అన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారిపోతోంది. పార్టీలో దశబ్ధాలుగా పాతుకుపోయిన వారిని దూరం చేసి, పార్టీని ఏం చేయాలనుకుంటున్నాడు. తన అనుచరులను నింపాలనుకుంటున్నాడా? లేక తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రంగు రుద్దేందకు కంకణం కట్టుకున్నాడా? కాంగ్రెస్‌లో తెలంగాణ వాదులను దూరం చేసి పసుపు నేతలను నింపాలనుకుంటున్నాడా? అంటే అవుననే చాలా మంది అంటున్నారు. తెలంగాణ రావడంతో చెల్లాచెదురైన తెలుగుదేశానికి పూర్వ వైభవం రావాలంటే కాంగ్రెస్‌ కండువా ముసుగులో రాజకీయం చేస్తే తప్ప పచ్చజెండా మళ్లీ పురుడు పోసుకోదు…అందుకే ఇదంతా రేవంత్‌ చేస్తున్నాడన్న మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ చెంత చేరినట్లే చేరి ఆపార్టీకి రేవంత్‌ వాతలు పెడుతున్నాడు? కాంగ్రెస్‌ బ్లడ్‌ అని చెప్పుకునే కరుడుగట్టిన నేతలకు కండువా దూరం చేస్తున్నాడు? అన్న విమర్శలు రేవంత్‌ మీద పెరుగుతున్నాయి. కాంగ్రెస్‌ సీనియర్లను పార్టీ వదిలించుకునేలా తీట కోగిల కాయ రుద్దినట్లు కోవర్టు ముద్రలేస్తున్నాడు…సీనియర్ల నోటి దూలను అలుసుగా చేసుకొని వారిని దూరం పెడుతున్నాడు. ఆట మాత్రం భలేరంజుగా ఆడుతున్నాడు. చంద్రబాబు డైరెక్షన్‌లో ఆట ఆడుతున్నాడు. తొండాటతో కాంగ్రెస్‌ను నట్టేట ముంచేస్తున్నాడు? నమ్మి పార్టీ ప్రెసిడెంటును చేసిన కాంగ్రెస్‌ కంటే, పెత్తనం చంద్రబాబులో పెట్టి రుణం తీర్చుకుంటున్నాడు.. కాంగ్రెస్‌ పార్టీని .తోలుబొమ్మలాట చేసి ఆడిస్తున్నాడు…
.రేవంత్‌రెడ్డి ఆడుతున్న పుంజీతంలో సీనియర్లు పావులౌతున్నవారు..ఆటలో అరటిపండ్లౌతున్నారు.
చంద్రబాబు చలవ, రేవంత్‌ మాట…ఈ రెండే కాంగ్రెస్‌లో ఇప్పుడు నాయకులను కాపాడేదాకా తెచ్చిందట. ఈ రెండే టిక్కెట్లకు బాట అంటున్నారట. రేవంత్‌ను చాలా చాకచక్యంగా చంద్రబాబు తన బాటలో నడిపిస్తున్నాడని అంటున్నారు. సీనియర్లను ఒక్కొక్కరిగా దూరం పెడుతూ వస్తున్నాడు. ఇంత చేస్తూనే నవ్వుతూ, సరదాగా కనిపిస్తూనే, నమ్మకం వుంటూనే సీనియర్లకు చెక్‌ పెడుతున్నాడు. వరంగల్‌సభతో కాంగ్రెస్‌ వచ్చిన జోష్‌ను మొత్తం తన ఖాతాలో వేసుకొని సీనియర్లను వెర్రివెంగళప్పలను చేసి, అధిష్టానం వద్ద మార్కులు కొట్టేస్తున్నాడు. ఇందంతా ఎందుకు ఆడుతున్నాడు. అంతా చంద్రబాబు కోసం అంటున్నారు. కాంగ్రెస్‌ అంటే ఓ మహాసముద్రం. ఎంత పెద్ద నాయకుడైన సరే కాంగ్రెస్‌లో ఎవరు ఎప్పుడు తెరమీదకొచ్చి నాయకులౌతారో తెలియని పరిస్ధితి. ఇంత కష్టపడి సీనియర్లతో మాటలు పడి, లాగేస్తున్న నిచ్చెనలనుంచి పడుతూ, లేస్తూ పార్టీని గెలిపిస్తే రేవంత్‌ ముఖ్యమంత్రి అవుతారన్నది గ్యారెంటీ లేదు. ధైర్యంచేసి నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకోలేడు. అందుకే సీనియర్లందరినీ ఎన్నికల మందే పక్కక పెట్టేస్తే, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులను ముందు వరుసలో పెట్టేస్తే రేవంత్‌ వ్యూహానికి తిరుగుండదు. రాజకీయానికి ఎదురుండదు? అందుకే జిల్లాల వారిగా సీనియర్లకు చోటు లేకుండా చేస్తున్నాడు.
పార్టీకి ఇంత జోష్‌ను తెచ్చిన వరంగల్‌ సభకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు.
కాని క్రెడిట్‌ రేవంత్‌ కొట్టేసుకున్నాడు. అంత చేసినా ఎన్నికల నాటికి ఎవరి టిక్కెట్‌ ఇస్తారన్నది కూడా తెలియకుండా వుంది. ప్రజల్లో వున్నవారికే టిక్కెట్లు అంటూ చాట్ల తవుడు పోసి, కొట్లాట పెట్డడమే అవుతుంది. కుటిల రాజకీయం దాగి వుంది. సహజంగా కాంగ్రెస్‌ పార్టీలో ఆధిపత్య రాజకీయాలు సహజం. దాంతో నాయకుల్లో నాయకులే ఒకరి కాళ్లు ఒకరు లాగేసుకునే పరిస్ధితి వుంటుంది. ఇదే అదునుగా మీలో మీరే తేల్చుకోండని కొన్ని స్ధానాల్లో, సీనియర్లకు మిగతా స్ధానాల్లో రాజకీయాన్ని రంజుగా రేవంత్‌ ఆడిస్తున్నాడు. కాని అది విఫల ప్రయత్నం అని తెలిసికూడా బెడిసికొట్టేదాకా తెచ్చుకుంటున్నాడు. హుజూరాబాద్‌లో ఇదే చేశాడు…పార్టీకి ఓట్లు రాకుండా చేశాడు. గత ఎన్నికల్లో 60 వేల ఓట్లు వచ్చిన కాడ 3 వేలు వచ్చేలా చేసి, ముక్కు మీద వేలేసుకునేలా చేశాడు. అయినా తొండి రాజకీయం రేవంత్‌ ఆడుతూనే వున్నాడు.
ఇక్కడ రెండు రకాలైన ఆటలు కూడా రేవంత్‌ మొదలు పెట్టారు.
తెలుగుదేశంపార్టీని వీడి పార్టీకి మోసం చేశారన్న ముద్ర వేసి, కొందరి నాయకులను టార్టెట్‌ చేశాడు. అందులో ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒకరు. ఆయనను కాంగ్రెస్‌లో జంగా రాఘవరెడ్డి ఇప్పటి వరకు ఢీ అంటే ఢీ అంటూ ఎదుర్కొంటున్నాడు. జిల్లాలు పెరగడంతో జంగా రాఘవరెడ్డి జనగామ జిల్లా అధ్యక్షుడై జనగామాలో పట్టు పెంచుకున్నాడు. ఇప్పుడు అటు పాలకుర్తి కాకుండా, ఇటు జనగామ కాకుండా రాఘవరెడ్డికి రాజకీయం లేకుండా రేవంత్‌ చేస్తున్నాడు. అయినా వరంగల్‌సభకు రాఘవరెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేశాడు. శక్తికి మించి ఖర్చు చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను సభకు తరలించాడు. ఇక అదే పాలకుర్తి విషయంలో సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ లకావత్‌ లక్ష్మీ నారాయణ ఆశలు పెట్టుకున్నాడు. ఆ ప్రాంతంలో పట్టున్న నాయకుడు. వరంగల్‌ సభకు ఆయన కూడా చేయాల్సినంత ఖర్చు చేశాడు. కాని ఇప్పుడు పాలకుర్తిలో మంత్రి దయాకర్‌రావుకు పోటీగా కొండా మురళీదర్‌రావును దింపుతున్నారట. జూన్‌ నెలలో సభ ఏర్పాట్లు జరుగుతున్నాయట. అంటే తన వ్యక్తిగత రాజకీయం కోసం కూడా పార్టీని రేవంత్‌రెడ్డి ఇలా వాడుకుంటూ, నాయకలకు అన్యాయం చేస్తున్నాడన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇలాగే నాయని రాజేందర్‌కు కూడా ఈసారి హ్యాండ్‌ ఇచ్చేలావున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు.
ఇక పిపిసి అధ్యక్షుడిగా పార్టీకి కొన్ని దశాబ్ధాలుగా సేవ చేస్తున్న పొన్నాలకు గత ఎన్నికల్లో గడబిడే జరిగింది.
ఈసారి అంత దూరం రాకుండా ముందే కొమ్మూరి ప్రతాపరెడ్డిని తెచ్చి ముందు పెట్టి రసవత్తరమైన ఆట ఆడుతున్నాడు. అటు జంగాకు, ఇటు పొన్నాలకు ఏక కాలంలో చెక్‌ పెడుతున్నాడు. ఇక ఆది నుంచి వివాలకు కేంద్ర బిందువైన జగ్గారెడ్డికి కూడా టికెట్‌ కట్‌ అన్న మాటలే వినిపిస్తున్నాయి. ఇక పార్టీలో అత్యంత సీనియర్‌ నాయకుడు జానారెడ్డి కూడా రెండు రోజుల క్రితమే రుసరుసలాడినట్లుకూడా ప్రచారం జరుగుతోంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైన, అతి ప్రధానమైన వర్గమైన కోమటిరెడ్డి బ్రదర్స్‌ అడ్డు ఎలా తొలగించుకోవాలన్నదానిపై కూడా రేవంత్‌ అనేక స్కెచ్‌లు వేస్తున్నట్లే చెప్పుకుంటున్నారు. వరంగల్‌సభకు ముందు ఎలాంటి ముందస్తు సమచారం లేకుండానే నల్లగొండ పర్యటన పెట్టుకోవడం, అక్కడ కూడా తనకు పెద్దఎత్తున ఫాలోయింగ్‌ వుందని రేవంత్‌ చూపించుకోవడం వెంకట్‌ రెడ్డికి రుచించలేదు. ఇలా అందరికీ కొరకరాని కొయ్యగా మారిన పిపిసి అధ్యక్షుడు గతంలో ఎవరూలేదు. నాయకులకు నచ్చని ముఖ్యమంత్రులే కాంగ్రెస్‌ పార్టీలో పదవుల్లో కొనసాగలేదు. అలాంటిది కూర్చున్న కోమ్మనే నరుక్కునే విధంగా నాయకులను దూరం చేసుకుంటూ, పార్టీకి దూరం చేస్తూ, రేవంత్‌ రెడ్డి తానొక్కడినే పార్టీకి దిక్కనుకోవడం నిండా మునగడమో! పార్టీని ముంచడమో తప్ప, గెలవడం అన్నది మాత్రం కలలో జరిగేది కాదంటున్నారు. ఈ విషయం ఇప్పటికైనా రేవంత్‌ తెలుసుకుంటే పార్టీకి మంచింది. మంది మాటలు పట్టకొని మార్మానం పోతే ఏమైందన్న సామెత అందరికీ తెలిసిందే…ఇదే రేపటి రోజు కాంగ్రెస్‌కు పట్టే గతి…తేరుకుంటారో…తేల్చుకుంటారో…మేమంతే అనుకొని అందరూ మునుగుతారో… ఆలోచించుకోండి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *