నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)పద్మశాలి కులస్తుల అభ్యున్నతికి కృషి చేస్తానని, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతానని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం కమలాపూర్ లోని కమ్యూనిటీ హాలులో శ్రీ మార్కండేయ ఋషి జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మార్కండేయ ఋషి చిత్రపటానికి పూలమాలవేసి జయంతి వేడుకలను ప్రారంభించారు. ఎమ్మెల్సీ ని ఈ సందర్భంగా పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన పద్మశాలి కులస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇన్నేళ్ల పాలనలో ఏ రాజకీయ నాయకుడు పద్మశాలి కులస్తులను గాని కుల సంఘ భవనం, మార్కండేయ గుడి నిర్మాణం కు ముందుకు రాలేదని టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పద్మశాలి కులస్తుల అభ్యున్నతికి కృషి చేసేందుకు మీ బిడ్డగా ముందుకు వచ్చానని కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలని తెలిపారు. మీకు ఏ సమస్య ఉన్న నాకు చెబితే చాలు చేసి పెట్టే బాధ్యత నాదని, ఈనెల 31న మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పద్మశాలి కుల సంఘ భవనం, మార్కండేయ గుడి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయిస్తానని ముందుగా ఈ రెండింటి పనులు ఏడు నెలల్లో పూర్తి చేయించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. కడు పేదరికంలో ఉన్న పద్మశాలి కులస్తులను ఆదుకునేందుకు చొరవ చూపుతా నని, చేనేత రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే దిశగా పాటుపడతానన్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన కు పద్మశాలి కులస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పద్మశాలి కుల సంఘం నిర్మించబోయే స్థలాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, పద్మశాలి కుల సంఘం అధ్యక్షులు బైరి దశరథం, ప్రధాన కార్యదర్శి పులికంటి రాజేందర్, ఉపాధ్యక్షులు దాసి శంకరయ్య, చేరాల సారంగం, సభ్యులు వావిలాల మురళి, తౌటం సుధాకర్, వెల్ది రాము, కూచన దుర్గాప్రసాద్, ఆడెపు విజయ, అభివృద్ధి కమిటీ సభ్యులు బొప్ప శివ శంకర్, మెండు రమేష్, మార్గం బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.