పదే పదే చెప్పినా వినకపోతిరి…పక్కన పెట్టేదాకా తెచ్చుకుంటిరి?

నలభై మందికి పైగా టిక్కెట్టు కట్‌?

గత ఏడాది నుంచే హెచ్చరిస్తున్న నేటిధాత్రి…!

 

పార్టీమీద సానుభూతి వున్నా, ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత?

పధకాల మీద నమ్మకం…ఎమ్మెల్యేలపై ప్రతికూల ప్రభావం?

ప్రతి ఇంటికీ ఏదో ఒక పధకం… ఎమ్మెల్యేల తీరుపై నిర్వేదం…?

చెప్పంగ విననోడిని చెడంగ చూడాలని పెద్దలు ఊరికే అనలేదు. అసలు తెలంగాణ అన్న పదంలోనే ఒక వైబ్రేషన్‌ వుంది. అందులో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులంటే ప్రజల్లో ఒకరకంగా చెప్పాలంటే ఆరాధన భావం వుండేది. కాని క్రమేణా నాయకుల తీరుతో ప్రజల్లో వున్న ఆ అభిప్రాయం చెరుగిపోతూ వస్తోంది. తెలంగాణ కోసం పనిచేసినంత కాలం కనిపించిన అంకిత భావం ఇప్పుడు కొంత మందిలో కనిపించకపోవడమే అందుకు కారణం. తెలంగాణ రావడం, రాష్ట్రరాజకీయాల్లో సమూలమైన మార్పులు రావడం, కొత్త తరం రాజకీయాలకు శ్రీకారం జరిగింది. ఉద్యమ కారులు పాలనలో పాలు పంచుకున్నారు. గ్రామ స్ధాయి నుంచి రాష్ట్ర స్ధాయి దాకా ఉద్యమకారులు పాలకపక్షంగా సమాజంలో గౌరవాన్ని సంతరించుకున్నారు.

ప్రజల్లో నమ్మకాన్ని కల్గించారు. వారి విశ్వాసం చూరగొన్నారు. నాయకులయ్యారు. ప్రజలకు చేరువయ్యారు. ఇంత వరకు బాగానే వుంది. కాని రెండోసారి టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక, కొందరు ఎమ్మెల్యేల మూలంగా పార్టీకి ఇబ్బందులు తలెత్తేదాకా వచ్చాయి. అందుకే ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత వుందో అక్కడ ఖచ్చితంగా అభ్యర్దులను మార్చకపోతే ఇబ్బందే అన్నది తేలిపోయింది. ఆ స్ధానాలలో కొత్తవారికి అవకాశం కల్పిస్తే టిఆర్‌ఎస్‌కు మరోసారి తిరుగులేదు. ప్రతిపక్షాలకు మరో దశాబ్థంపాటు ఆశలు కూడా పెట్టుకోలేరు. 

                               అసలు తెలంగాణ కోసం ఎందుకు ఉద్యమం చేశామన్నది కూడా కొందరు నాయకులు మర్చిపోయినట్లున్నారు. అప్పటి పరిస్ధితులు కూడ అప్పుడే మర్చిపోయినట్లున్నారు. ఒకనాడు నీటి కోసం, సాగు కోసం, కరంటు కోసం పడిన వేదన, యాతన వారికి గుర్తులేవా? హైదరాబాద్‌లో కూడా కరంటు కోతలు తప్పని రోజులు. పల్లెల్లో పది నిమిషాలు కూడా కరంటు లేని కాలం మర్చిపోయారు. పంటలు ఎండి, తిండి గింజలకు కరువైన రోజులు గుర్తుకులేవు. తెలంగాణలో నీళ్లు లేక, వానలు రాక, పంటలు పండక కరువు కాలంలో పనికి ఆహారపథకం అమలతో నాలుగు మెతుకులు తిన్న రోజులు గుర్తున్నాయా? అవి ప్రజలకు ఎన్నడైనా గుర్తుచేస్తున్నారా? 

                              నిన్నటి తెలంగాణ. నేటి తెలంగాణ. రేపటి తెలంగాణ. ఇది సమాజంలో తరంతరం, నిరంతరం జరగాల్సిన చర్చ. అప్పుడే భవిష్యత్తుకు కొత్త భరోసా. అరవైఏండ్ల కొట్లాటే నీళ్లకోసం. నిధుల కోసం…అభివృద్ధి కోసం….గత రెండు దశాబ్ధాల క్రితం బిజేపి హయాంలో ఏర్పడిన రాష్ట్రాలు ఎలా వున్నాయి? తెలంగాణ రాకముందు ఎలా వుంది? ఇప్పుడు ఎలా వుంది? కొత్తగా ఏర్పాటైన చత్తీస్‌ఘఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌లు ఎలా వున్నాయి? తెలంగాణ పురోగతి ఎలా వుంది? ప్రగతి ఎలావుంది? ప్రజల జీవన ప్రమాణాలు ఎలా వున్నాయి? వ్యవస్ధలు ఎలా వున్నాయి? కొత్తగా అందుబాటులోకి వచ్చిన వసతులు ఎలా వున్నాయి? అన్నది ఆయా రాష్ట్రాలను చూస్తే తెలుస్తుంది. అక్కడి పరిస్ధితులు అధ్యయనం చేస్తే అర్ధమౌతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని, అధ్భుతమైన సంక్షేమ పథకాలు అమలౌతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. నిరంతరం కరంటు సరఫరా అవుతోంది. సాగుకు నీరందుతోంది. చెరువులు కూడా పూడికకు నోచుకోని తావుల్లో చెరువులు కళకళలాడుతున్నాయి. కొత్త కొత్తరిజర్వాయర్లనిర్మాణంతో భూగర్భజలాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎండిన బావులన్నీ ఎల్లబోస్తున్నాయి. కరంటుతో చిరు వ్యాపారులక భరోసా, వ్యాపార వేత్తలకు, పారిశ్రామిక వేత్తలకు మరింత ప్రోత్సాహంగా మారింది. 

                              దేశంలో ఎక్కడా లేని పేదింటి అమ్మాయి పెళ్లికి ప్రభుత్వం లక్షరూపాయలు నగదు అందిస్తోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సుమారు 13లక్షల మందికి కళ్యాణ లక్ష్మి అందింది. అంటే ఆ కుటుంబాలన్నీ తెరాసకు అనుకూలంగా వుంటాయి. 58లక్షల పెన్షన్లు, 48 లక్షల మందికి రైతు బంధు…అందుతున్నాయి. తాజాగా దళిత బంధు కూడా ప్రతి నియోజకవర్గంలో 1300మందికి తొలి విడత అబ్ధి చేకూరింది. మరి ఇన్ని రకాలైన సంక్షేమపథకాలు అమలౌతున్నా, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత పెరుగుతోంది. అందుకు వారి వ్యక్తిగత వ్యవహరశైలి కారణంగా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఒకటికి రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలతోపాటు, ఉద్యమ కాలం నుంచి కూడా గెలుపొందుతూ వస్తున్న కొందరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో సానుకూలత లేదని తెలుస్తోంది. ఓ ఎమ్మెల్యే ఎన్‌ఆర్‌ఐ భూములను చెరపట్టడం, వారిని ఇబ్బందులకు గురి చేయడం వంటివి చేస్తూ అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. పార్టీ పరువును తీస్తున్నారు. ఎంతో నమ్మకంతో అటు పార్టీ, ఇటు ప్రజల గుండెల్లో పెట్టుకుంటే, ఆస్ధుల పెంపకం యావతప్ప, జనం గోసలు చూడలేకపోతున్నాడట. దాంతో పార్టీమీద ఎంత ప్రేమ వున్నా, ఆ నాయకుడి వ్యవహారశైలితో పార్టీకి నష్టం జరిగే అవకాశం వుందంటున్నారు. ఒక మరో ఎమ్మెల్యే ఓ రియలెస్టేట్‌ దిగ్గజం తన వ్యాపారాన్ని విస్తరించుకునే ప్రయత్నంలో వుండగా, సగం వాటా ఇస్తే తప్ప అడుగపెట్టనివ్వనన్నాడట? దాంతో ఆ వ్యాపారి కోట్లు పెట్టి కొనుగోలు చేసిన భూముల వదిలేసి, అనువైప్పుడే వ్యాపారం చేసుకుంటానని అనుకుంటున్నాడట. ఇలా ఎమ్మెల్యేలు ఆస్ధులు కూడబెట్టుకోవడానికే రాజకీయాలు చేస్తున్నట్లు తయారైయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నవే. అందుకే ఈసారి సుమారు 40పైగా ఎమ్మెల్యేలకు టిక్కెట్లు కట్‌ అన్న హెచ్చరికలు అందుతున్నాయి.  

                            నేటిధాత్రి దిన పత్రిక మొదటి నుంచి ఈ విషయం చెబుతూనే వస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ హెచ్చరిస్తూనే వస్తున్నాడు. అయినా కొందరు ఎమ్మెల్యేలు పెడచెవిన పెడుతూనే వచ్చారు. అటు కాంగ్రెస్‌, ఇటు బిజేపికి బలం లేకపోయినా, బలగం లేకపోయినా, సోషల్‌ మీడియా ద్వారా చేస్తున్న విష ప్రచారాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టే పరిస్ధితుల్లో లేకుండాపోతున్నారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నవారిని బెదిరించడం అలవాటు చేసుకున్నారు. అది కాదు చేయాల్సింది వారికి ధీటైన సమాధానమివ్వాలి. అప్పుడు వారిలో సహజమైన మార్పు తీసుకురావొచ్చు. ఇబ్బందులకు గురిచేస్తే, వ్యతిరేక ప్రచారం ఆపుతారని అనుకోవడం కూడా సరైంది కాదు…ఎంత సేపు ఎమ్మెల్యేలు తమ వ్యాపారాలు, కాంట్రాక్టులు తప్ప, జనం కోసం పనిచేసే తీరిక చూపించడంలేదు. ప్రశ్నించిన ప్రజలపై కన్నెర్ర చేయడం కాదు, వారిని దగ్గరకు తీసుకొని, సామరస్యపూర్వక సమాధానం చెబితే సావదానంగా వినని వారు ఎవరూ వుండరు. వారికి కళ్లముందు పారుతున్న నీళ్లు, అందుతున్న రైతు బంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి పథకాల గురించి చెప్పి, వాళ్ల ఇంటికి అందుతున్న పథకాలు గుర్తు చేస్తే చాలు…? ప్రశ్నించేవారు కనిపించరు? కాని ఎమ్మెల్యే స్ధాయి నాయకులు కూడా దిగజారి, సామాన్యులను బెదిరించడం అలవాటు చేసుకుంటున్నారు. ఇది కూడా ఆ ఎమ్మెల్యేలకు మైనస్‌గా మారుతోంది. ఇక అధికాయ యంత్రాంగంలో పెద్దఎత్తున పెరిగిపోతున్న అవినీతి కూడా ప్రభుత్వం మీద తీవ్ర ఫ్రభావం చూపుతోందనడం లో సందేహం లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ఎమ్మెల్యేలు పట్టించుకోకవడంలో కూడా అనుమానాలు కల్గుతున్నాయి. అధికారుల నుంచి ఎమ్మెల్యేలు వాటాలు పంచుకుంటున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అధికారులు పెద్దఎత్తున లంచాలకు తెగబడుతున్నా, ఎమ్మెల్యేలు కనీసం వివరాలు కూడా తెలుసుకునే పరిస్దితుల్లో లేరు. అధికారులను కంట్రోల్‌లో పెట్టలేకపోతున్నారు. అంతే కాకుండా ఎమ్మెల్యేలు ఆడమన్నట్లు ఆడతున్న అధికారులే పెద్దఎత్తున అవినీతికి పాల్పడతున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. దాంతో తమ పనులు చేయించుకుంటూ, అధికారుల తప్పులను చూసీ చూడనట్లు ఎమ్మెల్యేలు వ్యవహరించడం కూడా ఆరోపణలకు తావిస్తోంది. అంతిమంగా అది ప్రభుత్వం మీద ప్రభావం పడుతోంది. ఆఖరుకు అధికారులు కూడా ప్రశ్నించిన ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం, వారిపై కేసులు నమోదు చేయడం వంటివి కూడా ప్రజల్లో ఆగ్రహానికి గురికావాల్సివస్తోంది. ఓట్లేసి ఎన్నుకున్న ప్రజలకు అండగా నిలవాల్సిన నాయకులు, అధికారులకు వంత పాడడం అన్నది పార్టీకి తీరని నష్టం తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదు. నిత్యం మీడియాలో కూడా అనేక వార్తలు వస్తున్నాయి. నాయకులు పట్టించుకోక, పై స్ధాయి అధికారులకు భయం లేకపోవడం వల్ల, కింది స్ధాయి యంత్రాంగంలో విచ్చలవడి తనం పెరిగిపోయింది. ఇది పరోక్షంగా ప్రభుత్వంపై ప్రభావం చూపుతుంది. ఇక ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి, గెలుస్తామనుకునే రోజులు కాదు…ప్రజల నమ్మకాలు కూడా ఎంతో అవసరం. వారి విశ్వాసం చూరగొనడం అత్యవసరం. ఇప్పటికైనా మారండి. ప్రభుత్వ ప్రథకాలు ప్రచారం చేయండి. ప్రతిపక్షాలను అసత్య ప్రచారాలను తిప్పికొట్టండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!