పట్టణాల రూపురేఖల్లో పెను మార్పులు

అద్భుత ఫలితాలను ఇస్తున్న పట్టణ ప్రగతి  అందరి భాగస్వామ్యంతోనే పురాభివృద్ధి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

8,9, 24, 25 వార్డుల్లో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం 

మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు 

మిర్యాలగూడ, నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా అద్భుత ఫలితాలతో పాటు పట్టణాల రూపురేఖల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులను తీసుకురావడమే ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 8, 9, 24, 25 వార్డుల్లో పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భాస్కర్ రావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని అన్నారు. పట్టణాల సమగ్రాభివృద్ధి కోసం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కేసీఆర్ సర్కార్ 2015, ఆగస్టు23న మెదక్ జిల్లా కౌడిపల్లి గ్రామంలో లాంఛనంగా ప్రారంభించిందన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహణ గురించి వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణాభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో రూ.18కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం పనులను చేపడుతున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, 15వ ఆర్ధిక సంఘం నుంచి మంజూరైన రూ.2కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీ నిర్మాణ పనులను వేగవంతం చేసినట్టు చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో 7వేల ఎల్ఈడీ వీధి దీపాలను అమర్చేందుకు నిధులు మంజూరు చేయించినట్టు తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో అస్మదీయులు…తస్మదీయులనే భేదాలు తమకు లేవని భాస్కర్ రావు పునరుద్ఘాటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా అన్ని వార్డుల్లో సమస్యలను గుర్తించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. కరోనా కష్టకంలోనూ ప్రతినెలా గ్రామాల అభివృద్ధి కోసం రూ.339 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.148 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని కొనియాడారు. సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. పట్టణాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించాలనే ధృడ సంకల్పంతో పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో నాలాల పరిశుభ్రత, పొదలు,పిచ్చి మొక్కల తొలగింపు, విద్యుత్ దీపాల పర్యవేక్షణ, వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయుట,పార్కు పరిశుభ్రత, అక్రమ నిర్మాణాల తొలగింపు తదితర పనులను మున్సిపల్ అధికారులు నిరంతర ప్రక్రియగా భావించి నిర్వహించాలని సూచించారు. వార్డు కౌన్సిలర్లు,వార్డు ఇంఛార్జీలు తమ వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే బాధ్యతాయుతంగా పరిష్కరించాలని అన్నారు. గతంలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో భాగంగా పెండింగ్ లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. వానాకాలం లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నదని అన్నారు. జిల్లా మంత్రికి రూ.2కోట్లు, కలెక్టర్ కు కోటి రూపాయలు, జిల్లా మంత్రి అంగీకారం మేరకు సీడీఎఫ్ (నియోజకవర్గ అభివృద్ధి నిధి) నుంచి ఖర్చు చేసేందుకు ఎమ్మెల్సీ,ఎమ్మెల్సీలకు ప్రభుత్వం అధికారాలు మంజూరు చేసిందన్నారు. ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు కోసం వేచి చూడకుండా పట్టణ ప్రగతిలో భాగంగా అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేసేందుకు సీడీఎఫ్ నిధులు ఉపకరిస్తాయని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని భాస్కర్ రావు అన్నారు. రెండేండ్లలో రూ.766కోట్ల 12లక్షల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టామని అన్నారు. డీఎంఎఫ్టీ ద్వారా మున్సిపాలిటీల్లో చెత్త,చెదారం సేకరణ కోసం కోటి 67 లక్షల రూపాయలతో ట్రాక్టర్లు, ఆటోలు, జేసీబీ కొనుగోలు చేసి పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. పట్టణంలో పే అండ్ యూజ్ విధానం ద్వారా రూ.72 లక్షల వ్యయంతో ఆరు పబ్లిక్ టాయిలెట్లను నిర్మించామని చెప్పారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇండ్లకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపామని అన్నారు. త్వరలో సమీకృత మార్కెట్ ను ప్రారంభించనున్నామని అన్నారు. అంతేగాకుండా, ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను మంజూరు చేయించానని అన్నారు. అహ్లాదాన్ని పంచే మినీ ట్యాన్క్ బండ్ నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు సరిపడకపోతే అదనంగా రూ.6కోట్లు కేటాయించినట్టు తెలిపారు. స్థానిక సుందరయ్య పార్కులో సుందరీకరణ పనులు చేపట్టామని చెప్పారు. ఈనెల18 వరకు కొనసాగనున్న 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు క్రియాశీలక పాత్ర పోషించాలని భాస్కర్ రావు కోరారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. మిర్యాలగూడ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీ లో జాబితాలో నిలిపేందుకు ప్రజల సహకారం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్, మున్సిపల్ డీఈ సాయిలక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ కమలి భీమ్లా నాయక్, కుందూరు నాగలక్ష్మి శ్యామ్ సుందర్, వంగాల నిరంజన్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version