దళిత బంధు కమిషన్ల కై పాకులట
బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి
మండలంలోని వివిధ గ్రామాలలో దళిత బందుకు దరఖాస్తు చేసుకున్న వారిని చిన్న,పెద్ద నాయకులు,అధికారులు సైతం దళిత బంధు మీకే ఇప్పిస్తాము!మాకు ఎంత ఇస్తారు?అంటూ, కమిషన్ల కక్కుర్తి తో లబ్ధిదారులకు ఎరవేస్తున్నట్లు మండలంలోని వివిధ గ్రామాలలో ప్రజలు, దరఖాస్తు దారులు చర్చించుకుంటున్న వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత కుటుంబాలకు ఆసరాగా దళిత బంధు పథకమును ప్రవేశపెట్టి వారి జీవితాలలో వెలుగు నింపాలని లక్ష్యంతో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడంతో,ఈ పథకం కోసం మండలంలోని వివిధ గ్రామాలలో చాలావరకు దళితులు దరఖాస్తు చేసుకున్నారు. ఆపై దళిత బంధు కోసం వేచి చూస్తున్నారు. ఇదే అదునుగా భావించి కొందరు చోటా,మోటా నాయకులు, అధికారులు దళిత బంధు మీకే ఇప్పిస్తాము, మాకు లక్ష నుండి రెండు లక్షల వరకు కమిషన్లు ఇవ్వండి అంటూ, వారికి ఎరవేస్తూ కమిషన్ కక్కుర్తి పడుతున్నారని సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆదుకోవాలని ప్రయత్నిస్తుంటే, వీరు మాత్రం వారి డబ్బులకి ఎసరు పెడుతూ,కమిషన్ల కు ఆశపడడం ఎంతవరకు సమంజసం?అని,మండలానికి చెందిన ప్రజలు ప్రశ్నిస్తున్నారు.దళితులకు ఇచ్చే దళిత బంధు దగా చేస్తూ వారిని మోసం చేయడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు అని అంటున్నారు.వీలైతే వారికి సహాయం చేసి దళిత బంధు వచ్చేట్లు చూసి మీ పేరును కాపాడుకోండి అంతే కానీ, ఇటువంటి కమిషన్లకు ఆశపడి దళితుల పథకాలకు గండి కొట్టి కమిషన్ల పేరుతో దరఖాస్తు చేసుకున్న దళితుల నుండి కమిషన్లు వసూలు చేస్తే తర్వాత జరిగే పరిణామాలకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందని, మండలానికి చెందిన కొందరు దళిత నాయకులు,ప్రజలు హెచ్చరిస్తున్నారు.ఏ నాయకుడు, ఏ అధికారి, దరఖాస్తు చేసుకున్న ఎవరెవరికి ఎర వేస్తున్నారు?ఎంత మొత్తంలో కమిషన్లు అడుగుతున్నారో?అందరు గమనిస్తున్నారని!, ఇకనైనా మీ పద్ధతి మార్చుకోకుంటే వాటన్నిటినీ బయటికి తీసి మీ బండారంను బట్టబయలు చేయాల్సి ఉంటుందని ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది జాగ్రత్త! అని, ఈ సందర్భంగా మండలంలోని కొంతమంది నాయకులు, దళిత నాయకులు,ప్రజలు చోటా,మోటా నాయకులను, అధికారులను హెచ్చరిస్తున్నారు.