– ఎంపీగా పార్లమెంట్ లో అడుగిడిన వద్దిరాజు
– తొలిరోజే రాష్ట్రపతి ఎన్నికల్లో దక్కిన ఓటు
– సీఎం కేసీఆర్ కల్పించిన అదృష్టమన్న ఎంపీ
నేటిధాత్రి న్యూఢిల్లీ
భారత అత్యున్నత ప్రజాస్వామిక వేదిక అది.. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎందరో రాజకీయ
ఉద్ధండులు ఆ వేదికకు ప్రాతినిధ్యం వహించారు.. అక్కడ జరిగిన అనేక చారిత్రక పరిణామాలకు అలనాటి యోధాను యోధులంతా ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు. అలాంటి ఉద్ధండుల సరసన చోటు దక్కించుకున్న వద్దిరాజు రవిచంద్ర మరోసారి చరిత్రకెక్కారు. ఖమ్మం జిల్లా నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ.. ఆయన సోమవారం పార్లమెంటులో అడుగు పెట్టిన తొలిరోజే.. భారత 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు దక్కించుకున్నారు. దీంతో ఆయన ఒకే రోజున రెండు చారిత్రక సంఘటనల్లో నమోదయ్యారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు నేతృత్వంలో సహచర ఎంపీలతో కలిసి రవిచంద్ర పార్లమెంట్ భవన్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన జీవితంలో ఒకే రోజు రెండు అత్యున్నత చారిత్రక సంఘటనలు జరగడం అదృష్టంగా భావిస్తున్నానని ఎంపి వద్దిరాజు పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం కేసిఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.