అనుచరులు జారిపోగళ్ల జాగ్రత్త బేతి!?
బేతికి ఎర్త్ పెట్టేందుకు బొంతు బిజీబిజీ?
గతంలోనే ఉప్పల్ టిక్కెట్ కోసం అలక?
ఆఖరు దాకా కొట్లాట?
ఈసారి టిక్కెట్ నాకే?
ఇప్పటి నుంచే మద్దతు కూడగట్టు”కొనుట”!?
బేతి అనుచరులకు గాలం?
వ్యతిరేకుల చేత పెంచనున్న గళం!?
పరాయి పార్టీకైనా సపోర్ట్ చేస్తా!?
నాకు రాకుంటే బేతిని ఓడిస్తా?
ఉప్పల్ లోనే ఇక మకాం వేస్తా?
తాడో పేడో తేల్చుకుంటా!?
ఇక బేతి మీదే గురి, ఉప్పల్ ఇక నాదే మరి!?
కొత్త రాజకీయానికి తెరతీత…కోవర్టు రాజకీయాలకు మేత…సొంత పార్టీలోనే కుతకుత…బేతికి భవిష్యత్తు లేకుండా చేస్తా!? ఇదీ ఉప్పల్ పై కన్నేసిన బొంతు ప్రతినట? ఉప్పల్ టిఆర్ఎస్ లో గుసగుస….
విద్యార్థి తెలంగాణ ఉద్యమ రాజకీయాలలో ఎవరికీ దక్కని అవకాశం దక్కింది. ఎంతో మంది కలలు గనే హైదరాబాదు మేయర్ పదవి ఎదురొచ్చి వరించింది. పదవులు రాక ఎంతో మంది నేతలు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడడప్పుడా అని ఇంకా కళ్లల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. కానీ మేయర్ పదవిలో వుండగానే బొంతు రామ్మోహన్ కు ఎమ్మెల్యే కావాలని కోరిక కదిలింది. విద్యార్థి ఇతర ఉద్యమకారులలాగా ఏ పదవి రాకుంటే ఏదో పదవి కోసం ఎదురుచూడడం జరిగేది. కాని వెతకని తీగ కాళ్లకు తగిలి మేయర్ అయ్యాడు. వెతికితే ఇంకెంత పెద్ద తీగ తగులుతుందో అని ఆశ పడ్డాడు. ఎమ్మెల్యే కావాలని ఆశపడ్డాడు. పదవిలో వుంటూనే మరో పదవా? ఆశకైనా ఓ హద్దు వుండాలని చాలా మంది చీదరించుకున్నారట అప్పట్లో… అయినా పట్టు వదలని విక్రమార్కుడిని నేను అని అండర్ గ్రౌండ్ కు వెళ్లాడు. పార్టీ కనికరించలేదు. ముఖ్యమంత్రి కేసిఆర్ కన్నెర్ర చేశాడు. బేతి సుభాష్ రెడ్డి ఉద్యమ కారుడు. అనేక త్యాగాలు చేశాడు. అంతకుముందు ఎన్నికల(2014)లో పోటీ చేసి ఓడిపోయాడు. ఎన్నికలలో బోలెడు ఖర్చు చేసుకున్నాడు. క్యాడర్ ను కాపాడుకుంటూ వచ్చాడు. ఇవన్నీ తెలిసి కూడా బొంతు అప్పుడే కిరికిరి పెట్టాడు. అనంతరం మళ్లీ మేయర్ కావాలన్నాడు. పార్టీ ఒప్పుకోలేదు. తన సతీమణిని జిహెచ్ ఎంసి. ఎన్నికలలో నిలబెట్టాడు. అయినా తన ప్రయత్నం తాను చేశాడు. వీలు పడలేదు. తర్వాత కాలంలో ఎమ్మెల్సీ కావాలనుకున్నాడు కుదరలేదు. కనీసం మేడ్చల్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వాలని చూశాడు. ఇక ఆఖరు అస్ర్తంగా పార్టీలో చిచ్చు పెడితే తప్ప, ఎమ్మెల్యే కు ఎర్తు పెడితే తప్ప తనకు మార్గం సుగమం కాదని నిర్ణయించుకున్నట్లున్నాడు. ఇప్పటికే ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పై ప్రత్యేకంగా, పరోక్షంగా కార్పొరేటర్ శ్రీదేవితో ఆరోపణలు చేయిస్తూనే వున్నారు. కాకపోతే ఇటీవల ఇక పూర్తి స్థాయిలో ఉప్పల్ రాజకీయాలలో బొంతు కీలకం కావాలని నిర్ణయం తీసుకున్నారట.
నాయకుల పెదాలమీద కనిపించే ప్లాస్టిక్ నవ్వులే కాదు, మాటున వాడిన నవ్వులు కూడా దాగి వుంటాయి. పైకి మాత్రమే అలాయ్ బలాయ్..లోపలంతా లడాయే! ఉప్పల్ నియోజకవర్గం లో టిఆర్ఎస్ లో అంతర్గత పోరు శెభాష్ రెడ్డి అని బేతి సుభాష్ రెడ్డి అనిపించుకుంటుండడం కొందరికి ఇష్టం లేదు. ఎలాగైనా బేతి సుభాష్ రెడ్డి పరపతి తగ్గించాలి. పలున చేయాలి. అనుచరులను దూరం చేయాలి. ప్రజల చేత మాటలనిపించాలి. ఇతర ప్రతిపక్షాలను ఎగదోసి వివాదాలు సృష్టింపజేయాలి. అందుకు ఎలాగైనా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అనుచర వర్గాన్ని మచ్చిక చేసుకోవడం, వ్యతిరేక వర్గాన్ని ఎగదోసే కార్యక్రమానికి శ్రీకారం జరుగుతోందని సమాచారం. ప్రస్తుత ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి మళ్లీ టిక్కెట్ రావొద్దు. ఎవరు గెలిచినా పరవాలేదు. బేతి సుభాష్ రెడ్డికి టిక్కెట్ రావొద్దు. అసంతృప్తిని ఎగదోయాలి. వాళ్లందరినీ ఏకం చేయాలి. నివురుగప్పిన నిప్పులా ఎన్నికల నాటికి ఒక్కసారిగా బేతిపై తిరుగుబాటు చేయించాలి. టిక్కెట్ దక్కించుకోవాలి. ఇదీ ఓ నాయకుడి పన్నాగం అని విశ్వసనీయ సమాచారం. గతంలో ఆ నాయకుడు ప్రధమ పౌరుడి స్థానంలో కూర్చున్న సమయంలో బేతికి ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నాలు అనేకం చేశాడు. కానీ ముఖ్యమంత్రి కేసిఆర్ కు, బేతి సుభాష్ రెడ్డి వున్న సాన్నిహిత్యం ముందు ఆ నేత పాచికలు పారలేదు. కుయుక్తులు చెల్లలేదు. అయినా ఆఖరు నిమిషం దాకా ఉప్పల్ టిక్కెట్ కోసం చేయని ప్రయత్నాలు లేవు. అఖరుకు అలక పానుపు కూడా ఆశ్రయించాడు. కాకపోతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రంగంలోకి దిగి భుజ్జగించారు. కానీ ఆ నాయకుడు బేతి సుభాష్ రెడ్డి గెలుపుకోసం పెద్దగా పని చేసింది లేదన్నది బహిరంగ రహస్యమే. ఇక ఈసారి ఎన్నికల బరిలో దిగాలంటే బేతి సుభాష్ రెడ్డి అనుచరులను దూరం చేయాలి. ఆయన వ్యతిరేకులను ఏకం చేయాలి. నిత్యం మీడియాలో కనిపించాలి. అందుకోసం ఇటీవల ఎక్కడా లేని విధంగా ఉప్పల్ నియోజకవర్గ స్థాయి జర్నలిస్టు యూనియన్ కార్యకలాపాలను అనువుగా బొంతు మల్చుకునే ప్రయత్నం చేశాడు. సక్సెస్ అయినట్లు అర్థం చేసుకున్నాడు. ఇక ఉప్పల్ ప్రెస్ క్లబ్ డైరీ ఆవిష్కరణ పేరుతో రాజకీయానికి తెరలేపినట్లు చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ కార్యక్రమాలలో మేయర్. విజయలక్ష్మి. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి పాల్గొనాలి. కానీ మల్లారెడ్డి ఇతర కార్యక్రమాల వల్ల హజరు కాలేదు. బొంతు రామ్మోహన్ ను కూడా జర్నలిస్టులు ఆహ్వనించినట్లు తెలిసి ఎమ్మెల్యే హజరు కాలేదు. మేయర్ రానని ముందే చెప్పేశారు. ఇదే జరుగుతుందని బొంతు ముందే ఊహించాడు. తను హజరై వన్ మ్యాన్ షో చేశాడు. ఇదేదో బాగుందన్న నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. జర్నలిస్టులతో వేదికలు పంచుకుంటూ ఎమ్మెల్యే వ్యతిరేకులతో కలిసి సాగుతూ, తన మార్క్ రాజకీయం ఇప్పటినుంచే మొదలు పెడితే తప్ప క్లైమాక్స్ లో టిక్కెట్ నాకు దక్కదని బలంగా నిర్ణయించుకున్నాడట…పార్టీ పెద్దలు ఆలోచిద్దాం…అని చెప్పినట్లు ప్రచారం చేసుకుంటున్నారట…!