` అక్కర లేకున్నా సీసీ రోడ్ల నిర్మాణం
` నెలలు కూడా మన్నికలేని నాసిరకం పనులు
` ఆడిటింగ్ లేని నిధులన్నీ వీధుల పాలు
` ఇసుక ఆదాయంపై అధికారుల కన్ను?
`అయితే రోడ్లు లేకుంటే, సెంట్రల్ లైట్లు?
` మొత్తం మీద ఖజానా ఖాళీ?
` ప్రతి పనికి ఓ రేటు…నో రిబేటు?
` కమీషన్ల కోసం కాంట్రాక్టులు…అనుయాయులుకే పనులు?
` స్ధానిక కంట్రార్లకు కాదని సొంత మనుషులకే వర్క్స్?
` దుబారా ఖర్చులకు కేరాఫ్ అడ్రస్‌గా మండల కేంద్రం
` మహాదేవ్‌పూర్ మండలంలో ఇంజనీర్ లీలలు
హైదరాబాద్( మహాదేవ్‌పూర్),నేటిధాత్రి: అధికారులు తల్చుకుంటే అక్కరకు రాని పనులకు కొదువా? అన్నది నూటికి నూరు పాళ్లు నిజం చేస్తున్నారు పంచాయితీ రాజ్ శాఖ అధికారులు. గ్రామ పంచాయితీలకు సంబంధించి ఆడిటింగ్ లేని పద్దులను దుబారాకు అడ్డాగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు కుమ్మైక్కైతే అక్రమాలకు అడ్డూ అదుపూ ఉంటుందా..?సరిగ్గా ఇక్కడ అదే జరుగుతోందని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.నాసిరకం సీసీ రోడ్లు…అక్కరకు మించి సెంట్రల్ లైట్లు…ఆడిటింగ్‌కు రాని లెక్కలు…అధికారుల దోపిడీకి మార్గాలుగా ఎంచుకుంటున్నారు….అవినీతికి నకళ్లు…సొంత కాంట్రాక్టర్లు….బిట్లు బిట్లుగా పనులు…టెండర్లు అవసరం లేకుండా అనుమతులు…లక్షలకు లక్షలు నేల పాలు చేస్తూ మండల కేంద్రంలో నాసిరకం పనులుకు ఆనవాలుగా మార్చేస్తున్నారు.
అది భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం. అటవీ ప్రాంతం. వాగులు వంకలు బోలెడు. ఇసుక వ్యాపారులకు కల్పతరువు. ప్రభుత్వ ఖజానకు ఆదాయ వనరు. ఇదే అధికారులకు వరంగా మారింది…లెక్కలు లేని పద్దులకు అవకాశం… ఖర్చు చేసినా లెక్కలు చెప్పాల్సిన పనిలేని దోపిడీకి దారులు…అది ఆసరా చేసుకొని పంచాయితీ రాజ్‌కు చెందిన ఏఈలు, డీఈలు కుమ్మక్కై ఇసుక సొమ్ము ఇసుమంతైనా మిగల్చకుండా ఎప్పడికప్పుడు ఖర్చు చేస్తూనే ఉన్నారు.ప్రజలు చెప్పుకునే మాటలో చెప్పాలంటే దుబారా చేస్తున్నారు. చేతులు దులుపుకుంటూ జేబులు నింపుకుంటున్నారు? ఖజానాకు చేరాల్సిన ఇసుక ఆదాయం అధికారులు ఆస్ధులుగా మార్చుకుంటున్నారు.
ఏటా వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం ఆవిరైపోతోంది. కొల్లగొట్టబడుతోంది. పైకి కనిపించేలా మెరుగులు…అవసరం లేకున్నా పనులు. అంతటా నాసిరకం సిసి రోడ్లు…వేసిన నెలల్లోనే పగుళ్లు…పాడైపోయాయన్నా నెపంతో ఎప్పటికప్పుడు మళ్లీ కొత్తగా ప్యాచ్ వర్కులు…ఆ తర్వాత మళ్లీ రోడ్లు…ఇదే తంతు…కారణం ఆ పనులకు క్వాలిటీ కంట్రోల్ అన్నది లేదు. దాన్ని అజాయిషీ చేసే అధికారం ఎవరికీ లేదు. సొమ్ము వృధా అయ్యిందన్న కారణంతో ప్రశ్నించడానికి వీలులేదు..ఇసుక సొమ్ముతో అభివృద్ధి చేసుకోవాలన్న నిబంధనలే అధికారులకు వరమై కూర్చున్నాయి. కోట్లకు కోట్లు ఖర్చుపెట్టొచ్చు. నాసిరకం పనులు చేసినా కూడా పట్టించుకోవాల్సిన అసవరం లేదు. కమీషన్లు ఎంత వచ్చాయన్నది చూసుకుంటే చాలు..జేబులు నిండితే అదే పది వేలు…ఖజానా ఎప్పటికప్పుడ ఖాళీ చేయాలి. వాటాల రూపంలో జేంబులు నిండాలి. ఆస్ధులు కూడబెట్టుకోవాలి. కోట్లు వెనకేసుకోవాలి…
ఈ దుబారా పై అధికారులకు కనిపించదు. జనానికి కనిపిస్తుంది. కాని అడిగేందుకు సగటు వ్యక్తులకు శక్తి లేదు. ప్రశ్నించేందుకు వారికి ధైర్యం చాలదు. ఒక వేళ అడుగుదామనుకున్నా జనానికి అందుబాటులో వుండరు…వున్నా సమాధానం చెప్పరు..? మహాదేవ్ పూర్ మండలంలో నాలుగేళ్లుగా పంచాయితీ రాజ్ ఓ ఇంజనీరు అదే సీటులో కొనసాగుతున్నాడు. ట్రాన్స్‌ఫర్ లేదు. పాతుకుపోయిన తర్వాత, పీకేదెవరు అన్నట్లు సాగుతున్నారు? లెక్కకు మించి బొక్కలు ఖజానాకు పెడుతున్న కన్నంపై అడిగేవారు లేరు. మహదేవ్ పూర్ మండలంలో ఏటా కనీసం కొన్ని కోట్ల రూపాయల ఆదాయం పంచాయితీ రాజ్ శాఖకు ఇసుక ద్వారా వస్తోంది. దాన్ని స్ధానిక పంచాయితీలకు అభివృద్ధికోసం ఖర్చు చేసుకునే అధికారం అధికారులకు వుంది. దాన్ని అధికారులు ఆసరగా చేసుకున్నారు. అవసరానికి మించి సిసి రోడ్లు…వేశారు…నాసిరకం పనులు చేశారు… సగం సగం పనులు కూడా చేసి వదిలేశారు..ఈ విషయం పలుగుల అనే గ్రామం చూస్తే అర్దమౌతుంది. ఇలాంటి అడ్డదిడ్డమైన పనులు మండలంలో అనేకం చేశారు. జనం తిట్టుకుంటున్నారు…అధికారుల తీరును తప్పు పడుతున్నారు. ఉన్నతాధికారులు వాటిని చూస్తే జనం ఏమనుకుంటున్నారన్నది తేలిపోతుంది…అధికారుల దుబారా ఎంత అన్నది లెక్క తేలుతుంది…
స్ధానిక కాంట్రాక్టర్లకు నో…సొంత కాంట్రాక్టర్ యస్?: మహదేవ్‌పూర్‌లో పనులు చేయడానికి కాంట్రాక్టర్లు లేరా? అంటే వున్నారు…కాని వారికి ఇస్తే పనులు టెండర్లు వేయాల్సి వుంటుంది? దాంతో ఎంపిపికి 10శాతం, ఎంపిడివోకు 3 శాతం, ఏఈ, డీఈలకు 5శాతం, డ్రాఫ్పిండ్ సిబ్బందికి 2శాతం, సూపర్ వైజర్లుకు 2శాతం, ఆఖరుకు ఎస్టీవోలకు 1శాతం ఎలా పంపకం జరపాల్సి వుంటుంది. కంట్రాక్టర్లు వున్నదంతా మీకే ఇస్తే మేం పనులేలా చేయాలని ప్రశ్నించారు. దాంతో అప్పటినుంచి వారికి ఇవ్వడం మానేశారు…గతంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నట్లు సమాచారం. దాంతో అధికారులే కాంట్రాక్టు అవతారం ఎత్తారు? బినామీని తెచ్చి పనులు అప్పగిస్తున్నారు? అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో పెడితేనే బాగుంటుంది. ఉమ్మడి కరీం నగర్ జిల్లాకు చెందిన సత్యనారాయణ అనే కాంట్రాక్టరే మండలంలో అన్నీ చేసేది…అందరికీ వాటాలు పంచేది…
మండలంలోని స్ధానిక కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు ఇప్పటికీ సరిగ్గా అందడం లేదని తెలుస్తోంది. దాంతో అప్పుడు పనులు చేయడానికి వాళ్లు ముందుకు రావడం లేదన్న నెపం వారిపై నెట్టేస్తున్నారట. అందుకే ముందుకొచ్చివారికే పనులు అప్పగిస్తున్నామంటున్నారట. తమకు ఇష్టమైన వారికి కాంట్రాక్టు అప్పగించాలి. అందిన కాడికి దోచుకోవాలి. ఇలా కొన్నేళ్లుగా సాగుతున్న వ్యవహారం. ఇలా ప్రజాధనం అధికారులు దుర్వినియోగం చేస్తుంటే, అధికార పార్టీ నాయకులు చూసీ చూడనట్లు వదిలేయడం వల్ల ఆ పార్టీకే తీరని నష్టం జరుగుతుంది. ఆ పార్టీకి చెందిన ఎంపిపికి తప్ప మరో వ్యక్తికి ప్రమేయం లేదని తెలుస్తోంది. దాంతో పార్టీని నమ్ముకొని వున్నవారికి చిన్న చిన్న పనులు ఇచ్చి ప్రోత్సాహించాల్సిన చోట అధికారుల ఇష్టారాజ్యాన్ని చూస్తూ పోవడం కూడా పార్టీకి మంచిది కాదు. సిసి రోడ్ల వంటి పనులు సహజంగా పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఇవ్వాలి. కాని అధికారులే సర్వాధికారులై, ఆ ప్రాంతానికి చెందిన వారిని కాకుండా, బినామీలుగా ఇతరులను పెట్టటం వల్ల అటు కమీషన్లు, ఇటు కాంట్రాక్టు పనుల సొమ్మంతా ఇంజనీర్ల జేబుల్లోకి పోతుందన్న ఆరోపణలున్నాయి. ఇక రోడ్ల లెక్కలు ఇలా వుంటే, లైట్ల లెక్కలు వింటే విస్తుపోవాల్సిందే..! ఆ లైట్లు లెక్కలతో కండ్లు బైర్లు కమ్మాల్సిందే…ధరలెక్కువ…వెలుగు తక్కువ…అగ్గువకు కొనాలే…పిరం లెక్కలు రాయాలే! గోల్ మాల్ చేయాలే? ఖజానా ఖాళీ చేయాలే?? గ్రామ పంచాయతీలను దివాళా తీయించాలే!! ఆ లెక్కా పత్రమేమిటో రేపటి సంచికలో చూద్దాం…!!!