అంతా డస్ట్‌తోనే పని…

ఇసుక లేకుండా అంతా డస్ట్‌తోనే పని…

నర్సంపేట పట్టణాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దడానికి మున్సిపల్‌ శాఖ నుండి కోట్లాది రూపాయలు వెచ్చించి పనులను ప్రారంభించారు. అభివద్ధిలో భాగంగా ముందుగా ప్రధాన రహదారుల మధ్య 5కిలోమీటర్ల మేరకు రోడ్డు డివైడర్‌ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించారు. అంబేద్కర్‌ సెంటర్‌ నుండి మల్లంపల్లి రోడ్డు, అమరవీరుల స్థూపం వద్ద నుండి వరంగల్‌ వైపు రోడ్డుకు పనులు చేశారు. అలాగే పాకాల సెంటర్‌ నుండి మహబూబాబాద్‌ రోడ్డు వైపునకు కూడా పనులు ప్రారంభం చేశారు. మహబూబబాద్‌ వైపు వెళ్లే రోడ్డుకు డివైడర్‌ పనుల్లో నాసిరకంగా పనులు నిర్వహిస్తున్నారు. లోన లొటారం…పైన పటారం అన్న చందంగా డివైడర్‌ పనుల రౌతు గోడలను, ఇసుక సిమెంట్‌తో కడుతూ కాంక్రీట్‌ పనులను మాత్రం కంకర డస్ట్‌తో పనులను నిర్వహిస్తున్నారు. ప్లాంట్‌లో తీసుకుంటాడు వరంగల్‌ రూరల్‌ జిల్లాలో నర్సంపేటను స్మార్ట్‌ సిటీగా చేయడానికి స్థానిక శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి గత పాలనలో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ నుండి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివద్ధి పనులను ప్రారంభించారు. కానీ సదరు కాంట్రాక్టర్‌ సంపాదనే ద్యేయంగా నాసిరకంగా పనులు చేపడుతున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. గురువారం నర్సంపేట పట్టణానికి చెందిన కొందరు ప్రజలు ‘నేటిధాత్రి’ ప్రతినిధితో తెలుపగా నిర్మాణ పనులను పరిశీలన చేయగా నాసిరకంగా పనులు చేస్తున్నారని తేలిపోయింది. 20ఎంఎం కంకరకు బదులుగా 40ఎంఎం కంకరను వాడుతున్నారు. ఇసుక, కంకర, సిమెంట్‌తో చేయాల్సిన కాంక్రీట్‌ పనులను ఇసుకకు బదులుగా కంకర డస్ట్‌ వాడుతున్నట్లు, పని నిర్వహించే సూపర్‌వైజర్‌ ధనుంజయ అలాగే కార్మికులు తెలిపారు. డస్ట్‌ వాడకూడదు కదా అని అడగగా సంబంధిత శాఖ, అలాగే కాంట్రాక్టర్లు ఇసుకకు బదులుగా డస్ట్‌ను మాత్రమే వాడాలని చెప్పినట్లు వారు వివరించారు. నిర్మాణ పనుల వద్ద నుండి మున్సిపల్‌ ఏఈ సతీష్‌కు ఫోన్‌లో మాట్లాడగా వెంటనే స్పందించిన ఆయన నిర్మాణ పనుల వద్దకు వచ్చి పరిశీలించారు. నాసిరకంగా రోడ్డు డివైడర్‌ పనులను నిర్వహిస్తున్నారని పరిశీలనలో తేలిపోయింది. పనుల్లో ఇసుకను మాత్రమే వాడాలని, కంకర డస్ట్‌ వాడితే డివైడర్లను కూల్చివేస్తామని హెచ్చరించారు.

‘లేఖ’లో…ఏముంది…?

‘లేఖ’లో…ఏముంది…?

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ డిఐఈవో కార్యాలయంలో భారీ అవినీతి జరిగిందని, అవినీతికి డిఐఈవో లింగయ్య పూర్తి బాధ్యత వహించాలని, విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన వారిని వెంటన సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు వరంగల్‌ అర్బన్‌జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీనికి ‘గుమ్మడికాయ దొంగ ఎవరంటే..భుజాలు తడుముకున్న’ చందంగా ఇంటర్మీడియట్‌ డిఐఈవో లింగయ్య తాము ఏ తప్పు చేయలేదు..తామంతా సత్యహరిశ్చంద్రులమంటూ, తమపై తప్పుడు వార్తలు ప్రచురితం చేస్తున్నారు, తప్పుడు ఫిర్యాదులు వస్తున్నాయి,తమపై లేనిపోని నిందలు వేస్తున్నారని ‘నేటిధాత్రి’ తమపై పనిగట్టుకొని వార్తలను రాస్తున్నారని, వాటిని నమ్మొద్దనే విదంగా డిఐఈవో లింగయ్య ఓ వినతిపత్రాన్ని కలెక్టర్‌కు ఇచ్చారని విశ్వసనీయసమాచారం.

తాము తప్పే చేయలేదని కలెక్టర్‌కు వినతి

నవ్విపోదురు గాక ‘నాకేమి సిగ్గు’ అన్నట్లుగా..డిఐఈవో కార్యాలయంలో అవినీతికి ఆజ్యంపోసి, లక్షల రూపాయాల ప్రభుత్వ సొమ్మును అక్రమంగా దొంగపేర్లతో నొక్కేసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతూ తాము సత్యహరిశ్చంద్రులమంటు తమకు తామే సర్టిఫికెట్‌ పుచ్చుకొని అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా వరంగల్‌ అర్బన్‌జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించుకున్న విషయం బయటికి పొక్కడంతో ఆయన అబద్దాల ఆటలను, మాయలగారడీని, లింగయ్య వ్యవహరించిన తీరుపై విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

డిఐఈవోను వివరణ ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశం..?

తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తమపై తప్పుడు వార్తలు రాస్తున్నారని కలెక్టర్‌కు డిఐఈవో లింగయ్య ఇచ్చిన వినతిపత్రానికి కలెక్టర్‌ స్పందిస్తూ ఏ విషయంలో, ఎవరు తప్పుడు వార్తలు రాశారు, ఏమి రాశారు, ఎందుకు రాశారు, ఏ అంశాలపై రాశారు వివరణ ఇవ్వాలని కలెక్టర్‌ డిఐఈవో లింగయ్యను ఆదేశించినట్లు సమాచారం.

నేటికి స్పందించని డిఐఈవో లింగయ్య

డిఐఈవో లింగయ్య కలెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రంపై వివరణ ఇవ్వాలని డిఐఈవోను కలెక్టర్‌ ఆదేశించినా ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం పట్ల జిల్లాలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి నెలకొన్నది. వివరణ ఇవ్వాలని కలెక్టర్‌ కోరి వారంరోజులు అవుతున్నా నేటి వరకు డిఐఈవో లింగయ్య ఎందుకు వివరణ ఇవ్వలేకపోయాడో అంతుచిక్కని వాతావరణం నెలకొన్నది. ఆయన తప్పే చేయకపోతే, అవినీతికి పాల్పడకపోతే ఇప్పటి వరకు ఎందుకు వివరణ ఇవ్వలేదో అంతుచిక్కడంలేదు. అవినీతికి పాల్పడింది నిజమే అయినందున వివరణ ఇవ్వలేకపోతున్నాడా? వివరణ ఇస్తే ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని వెనకడుగువేస్తున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సమన్వయంతో పనిచేయాలి

సమన్వయంతో పనిచేయాలి

– సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌

వరంగల్‌ ట్రైసిటి పరిధిలో ట్రాఫిక్‌ క్రమబద్దీకరణకు పోలీస్‌, మున్సిపల్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ సూచించారు. వరంగల్‌ పోలీస్‌ అధ్యక్షతన నగరంలో ట్రాఫిక్‌ అభివద్దికోసం తీసుకోవాల్సిన చర్యలపై గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌, ఆర్‌ అండ్‌ బి అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని సోమవారం రాత్రి పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో నిర్వహించారు. వరంగల్‌ ఆర్బన్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రవికిరణ్‌ హాజరయ్యారు. ఈ సమావేశంలో గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషన్‌ పరిధిలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించడంతోపాటు, రోడ్డు ప్రమాదాలను ఆరికట్టడం కోసం తీసుకోవాల్సిన అంశాలపై వరంగల్‌ కమిషనరేట్‌ ట్రాఫిక్‌ విభాగం చేసిన సూచనలపై పోలీస్‌ కమిషనర్‌, కలెక్టర్‌, గ్రేటర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపి గుర్తించిన ట్రాఫిక్‌ సమస్యలపై ట్రాఫిక్‌ ఎసిపి మజీద్‌ పవర్‌ పాయింట్‌ ప్రజేంటేషన్‌ ద్వారా అధికారులకు వివరించారు. ఈ సందర్బంగా ప్రస్తుతం 12 ట్రాఫిక్‌ జంక్షన్లల్లో ఉన్న సిగ్నల్స్‌తోపాటు, మరో అదనంగా 13 జంక్షన్లలో సిగ్నల్స్‌ ఏర్పాటుకు కావల్సిన నిధులపై జిడబ్ల్యూఎంసి అధికారులు పోలీస్‌ అధికారులతో కలసి తగు ప్రణాళికను రూపొందించాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశించారు. నగరంలో సిగ్నల్స్‌ మరమత్తులు, ముఖ్యమైన రోడ్డుమార్గాల్లో డివైడర్ల ఏర్పాటు, జంక్షన్లలో ఐలాండ్‌ మార్పులపై అధికారులకు వివరించారు. అవసరమైన ముఖ్యకూడళ్లల్లో రోడ్డు వెడల్పు, నగరంలో ముఖ్య సూచికబోర్డుల ఏర్పాటుతోపాటు, ముఖ్యమైన ప్రాంతాల్లో విఎంఎస్‌ సైన్‌బోర్డుల ఏర్పాటు చేయడంపై అధికారులను ఆదేశించారు. ట్రైసిటి పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వాహనదారులకు కనిపించే విధంగా వేగం పరిమితి బోర్డులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారుల దష్టికి తీసురావడంతోపాటు, అన్ని ట్రాఫిక్‌ జంక్షన్ల వద్ద స్టాప్‌లైన్స్‌తోపాటు జీబ్రా లైన్స్‌ రూపొందించాల్సిన అవసరం ఉందని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ మాట్లాడుతూ వాహనదారులు ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ట్రాఫిక్‌ నియంత్రణ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడంతోపాటు, కొత్త ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ వరంగల్‌ నగరంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో పోలీస్‌ అధికారులతోపాటు, మనపై కూడా ఉందని అన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ కమిబద్దీకరణ కోసం ట్రాఫిక్‌ పోలీసుల సూచనలపై ఎప్పటికప్పుడు స్పందించాల్సి ఉంటుందని, ఇందుకోసం గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనరేట్‌, ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగానికి నోడల్‌ అధికారిని నియమిస్తామని చెప్పారు. ఈ నోడల్‌ అధికారి ద్వారా ట్రాఫిక్‌ పోలీసులు సూచించే సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వరంగల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు, జిడబ్ల్యూఎంసి, ఆర్‌ అండ్‌ బి, నేషనల్‌ హైవే అధికారులు పాల్గోన్నారు.

ప్రొఫెసర్‌ సార్‌ కబ్జాపురాణం

ప్రొఫెసర్‌ సార్‌ కబ్జాపురాణం

ఆయన పిల్లలకు విద్యాబుద్దులు నేర్పే రిటైర్డు అయిన ప్రొఫెసర్‌. సమాజంలో బాద్యతాయుతమైన, గౌరప్రదమైన స్థానం కలిగినవాడు. చెడుమార్గంలో వెళుతున్న వారిని సరిదిద్ది సక్రమార్గంలో పంపించాల్సిన వాడు. కానీ ఇన్ని సంవత్సరాల ప్రొఫెసర్‌గిరి, అనుభవాన్ని, చదువు, తెలివితేటల సారానంతటిని రంగరించి కబ్జా పురాణానికి తెరలు తీశాడట. పదవివిరమణ జరిగాక చేతినిండా ఏదో పని ఉండాలి అనుకున్నాడో ఏమో తెలియదు కానీ తన ఇంటి పక్కనే ఉన్న స్థలంలో పాగావేసి కబ్జా పురాణాన్ని మహాజోరుగా నడిపిస్తున్నాడట. ఇంటి పక్కనే ఖాళీ జాగ కనపడటంతో తన ప్రొఫెసర్‌ తెలివినంతటిని ఉపయోగించి ఉన్న స్థలానికి ఖాళీ స్థలాన్ని జోడిస్తే విశాలమైన జాగ సొంతం అవుతుందని ఆలోచిస్తున్నాడట. దీంతో ఖాళీస్థలం యజమాని లబోదిబోమంటున్నారు. ప్రొఫెసర్‌ సార్‌ కబ్జా బుద్దితో తాము చుక్కలు చూస్తున్నామని, ఈ స్థలం నీది కాదు…మొర్రో అన్న ఎంత మాత్రం వినడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం…హన్మకొండ నగరంలోని వడ్డేపల్లి సమీపంలోని ఎక్సైజ్‌కాలనీలో సర్వే నెంబర్‌ 298/1లో కోటిచింతల కిరణ్‌కుమార్‌ అనే వ్యక్తి 2018 నవంబర్‌ నెలలో నల్లా ఇమ్మాన్యువల్‌ అనే అతని వద్ద నుండి 346గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. కొనుగోలు చేయగానే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. భూమిని కొనుగోలు చేసిన నంబరులో భూమి వద్దకు వెళ్లి పనులు చేయించడానికి ఉపక్రమించాడు. అంత రిటైర్డు ప్రొఫెసర్‌ రూపంలో ఓ అడ్డుపుల్ల తగిలింది. ఈ భూమి తనదంటూ కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ పనిచేసి పదవివిరమణ పొందిన కె.కొండల్‌రెడ్డి నోటరీ పేపర్‌తో ఈ స్థలాన్ని తాను ఎప్పుడో కొనుగోలు చేశానని స్థలాన్ని కొనుగోలు చేసిన కిరణ్‌కుమార్‌ను బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు బాధితుడికి అనుకూలంగా ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చింది. దీంతోనయిన పని అవుతుందనుకుంటే అదీ కాలేదు. కిరణ్‌కుమార్‌ను సవాల్‌చేస్తూ కొండల్‌రెడ్డి కోర్టుకెక్కాడు. కోర్టు అక్కడ కూడా బాధితుడికే అనుకూలంగా తీర్పు చెప్పింది. ప్రొఫెసర్‌ తీరును తప్పుపట్టించి అయిన ప్రొఫెసర్‌ సార్‌ తన ప్రయత్నాలను మానుకోవడం లేదు. నయానో, భయానో బాధితుడిని తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు. పైరవీకారులు ప్రజాసంఘాల నాయకులు, పార్టీ నాయకుల పేరుతో తిరిగేవారితో సెటిల్‌మెంట్‌కు దిగాడు. అయిన బాధితుడు ససేమిరా అన్నాడు. దీంతో ప్రొఫెసర్‌ సార్‌ కొంతమంది సెటిల్‌మెంట్‌ రాయిళ్ల సూచనలతో అది 298/1 సర్వే నెంబర్‌కాదని 294 సర్వే నెంబర్‌ అని కొత్త పల్లవి అందుకున్నాడు. పక్కా రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌తో 298/1 సర్వేనెంబర్‌లో పక్కా గృహాన్ని నిర్మించుకున్న ప్రొఫెసర్‌ సాబ్‌ తన ప్రహారీగోడ పక్కస్థలాన్ని 294 సర్వే నెంబర్‌ అంటూ కొత్త పల్లవి అందుకోవడంలోనే పక్కా కబ్జా బుద్ది బయటపడుతుందని బాధితుడు అంటున్నాడు. 298/1 సర్వే నెంబర్‌ ప్రొఫెసర్‌కు అతని స్థలాన్ని సంబంధించిన స్తలం డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయని, తన స్థలం కూడా అదే సర్వే నెంబర్‌ కావడంతో ఇది నాది అంటున్నా ప్రొఫెసర్‌ను అప్పుడే రిజిస్ట్రేషన్‌ ఎందుకు చేయించుకోలేదు…? ఇంటి స్థలం కాగితాలు పక్కాగా ఉండి..ఖాళీస్తలం కాగితాలు లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తారని కేవలం నోటరితో స్థలాన్ని కొనుగోలు చేసినట్లు నాటకం ఆడుతున్నాడని బాదితుడు కిరణ్‌కుమార్‌ ఆరోపించాడు. తన స్థలాన్ని అప్పనంగా స్వాధీనం చేసుకోవడానికే రిటైర్డు ప్రొఫెసర్‌ నోటరీతో తనను ఇబ్బందులు పాలుచేస్తున్నాడని కోర్టు తనకు అనుకూల తీర్పు చెప్పిన, సర్వేయర్‌ 298/1 సర్వేనెంబర్‌ భూమి ఇదేనని తేల్చిన వినడం లేదని అన్నాడు.

పట్టింపులేని తహశీల్దార్‌…?

298/1 సర్వేనెంబర్‌లో 346గజాల స్థల విషయంలో ఇంత వివాదం నడుస్తున్న హన్మకొండ తహశీల్దార్‌ మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. సర్వే నెంబర్‌ విషయంలో ప్రొఫెసర్‌ కొండల్‌రెడ్డి కిరికిరి పెడుతుండగా సర్వేయర్‌ అది 298/1 సర్వే నెంబర్‌ అని తేల్చిన చర్యలు తీసుకోవడంలో తహశీల్దార్‌ వెనుకాడుతున్నట్లు సమాచారం. పంచనామా నిర్వహించాలని కోరిన ప్రొఫెసర్‌ సహకరించడం లేదనే సాకుతో నెలలు గడుస్తున్న తహశీల్దార్‌ కనీసం స్పందించడం లేదట. తహశీల్దార్‌ ప్రొఫెసర్‌తో కుమ్మక్కై బాదితుడు ప్రశ్నిస్తున్నప్పుడల్లా పొంతన లేని సమాధానాలు చెప్తున్నట్లు తెలుస్తోంది. తహశీల్దార్‌ పంచనామా నిర్వహించి నివేదిక సమర్పిస్తే స్థల వివాదం ముగుస్తుంది. కానీ తహశీల్దార్‌ అందుకు ఎంతమాత్రం పూనుకోవడం లేదని బాధితుడు కిరణ్‌కుమార్‌ అంటున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఉన్న తగదాను పరిష్కరించి, అది గొడవలకు దారితీయకుండా ఉండేందుకు పంచనామా నిర్వహించాలని స్థానిక పోలీస్‌ అధికారి తహశీల్దార్‌ను కోరిన నిర్లక్ష్యధోరణి తప్ప తహశీల్దార్‌ సమస్య పరిష్కారం చేసేందుకు సహకరించడం లేదని తెలుస్తోంది. ప్రొఫెసర్‌ కొండల్‌రెడ్డి పక్షాన ఉండేందుకు అతను యత్నిస్తున్నట్లు సమాచారం. ఇకనైన తహశీల్దార్‌ పంచనామా నిర్వహించి తమకు న్యాయం చేయాలని, ప్రొఫెసర్‌ పంచనామాకు సహకరించడం లేదనే సాకులు చెప్పవద్దని బాధితుడు కిరణ్‌కుమార్‌ కోరుతున్నాడు.

లోటస్‌ కాలనీలో మరో ఇద్దరు ప్రొఫెసర్ల భూబాగోతం

త్వరలో…

జర్నలిస్టుల అక్రిడేషన్ల దరఖాస్తు గడుపు పొడిగించాలి

జర్నలిస్టుల అక్రిడేషన్ల దరఖాస్తు గడుపు పొడిగించాలి

టియుడబ్ల్యుజె (ఐజెయు) డిమాండ్‌

ఈనెల 30వ తేదితో ముగియనున్న జర్నలిస్టుల అక్రిడేషన్‌ కార్డులు, బస్‌పాసుల గడుపును మరో ఆరు నెలల వరకు పొడిగించాలని టియుడబ్ల్యుజె ( ఐజెయు) వరంగల్‌ ఉమ్మడి జిల్లా కమిటీ అధ్యక్షులు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కంకణాల సంతోష్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో పోరాడి సాధించుకున్న జర్నలిస్టుల హక్కులు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం హరించివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసిఆర్‌ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్‌ కార్డులు ఇస్తామని అనేక సందర్బాలలో ఇచ్చాన హమీలను విస్మరించారని విమర్శించారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తే నిరాశే ఎదురవుతుందని అన్నారు. సిఎం కేసిఆర్‌ కొత్త నిబందనలు సృష్టించి పత్రికలను, ఛానెల్స్‌లను ఎబిసిడి లుగా వర్గీకరించి జర్నలిస్టులకు అక్రిడేషన్లు అందరికీ అందని ద్రాక్షలగా చేస్తున్నారని అన్నారు. అన్‌లైన్‌ అక్రిడేషన్ల ప్రక్రియ ముగిసినందున ఐ అండ్‌ పిఆర్‌ శాఖ వెబ్‌సైట్‌ గత రెండు రోజులుగా సాంకేతిక కారణాలతో వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాలేదని దీంతో అనేక మంది జర్నలిస్టులు అక్రిడేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోలేకపోయారని తెలిపారు. వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని విరమించుకోవాలని, పాత పద్దతిలోనే దరకాస్తు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వెంటనే ఉన్న అక్రిడేషన్స్‌, బస్‌పాసులను మరో ఆరు నెలలు పొడిగించాలని డిమాండ్‌ చేశారు.

లింగయ్యా..ఉల్లంఘనేందయ్యా…?

లింగయ్యా..ఉల్లంఘనేందయ్యా…?

వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో అమర్చిన సీసీ కెమెరాలను మార్చి నుండి ఏఫ్రిల్‌ వరకు ఎందుకు బందు చేశారో నేటి వరకు ఆ విషయంపై ఇంటర్మీడియట్‌ డిఐఈవో లింగయ్య వివరణ ఇవ్వకపోవడంతో సీసీ కెమెరాలను బందు చేయాల్సిన అవసరం ఏం వచ్చింది! ఏదేని అవినీతికి పాల్పడాలనుకున్నప్పుడు ఆ కెమెరాలు అడ్డొచ్చాయా? పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో జరిగిన అవినీతికి సంబందించిన బిల్లులు చేసేటప్పుడు కాని, డబ్బులు పంచుకునేటప్పుడు కాని కెమెరాలల్లో దొరికి పోతామనుకున్నారా? ఇంటర్‌ బోర్డు కమీషనర్‌ అనుమతి లేకున్నా డిఐఆవో లింగయ్య ప్రైవేటుగా తన వ్యక్తిగతంగా పెట్టుకున్న నైట్‌వాచ్‌మెన్‌ బండారం బయటపడుతుందని బంద్‌చేశారా? డిఐఈవోను ఎవరైనా ప్రైవేటుగా కలువడానికి వస్తున్న వ్యక్తులు కెమెరాల్లో రికార్డు కావొద్దన్న ఉద్దేశ్యంతో బంద్‌ చేశారా?.. అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు….! ఏ ఉద్దేశ్యంతో బంద్‌ చేశారో నేటికి చర్చనీయాంశంగానే సీసీ కెమెరాల బంద్‌ విషయం సస్పెన్స్‌గా మిగిలిపోయింది.

-ఆర్టీఐ చట్టమంటే అంత చులకనా…?

కార్యాలయంలో సీసీ కెమెరాలు నెలరోజులకుపైగా ఎందుకు బంద్‌ చేయాల్సి వచ్చిందో వివరణ కావాలని సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం ఇంటర్మీడియట్‌ డిఐఈవో లింగయ్యకు ధరఖాస్తు ద్వారా కోరి 30రోజులు దాటుతున్నా నేటి వరకు సమాచారం ఇవ్వలేదు. ఆర్టీఐ చట్టం ప్రకారం ఏదేని ప్రభుత్వ కార్యాలయంలో సమాచారం కొరకు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు ఇస్తే, సమాచార అధికారి క్లాస్‌ (6) ప్రకారం 30రోజుల్లో సమాచారం ఇవ్వాలని ఆర్టీఐ చట్టం చెబుతున్నది. సీసీ కెమరాలను ఎందుకు బంద్‌ చేశారో సమాచారం కావాలని ఆర్టీఐ ద్వారా కార్యాలయంలో కోరి 30రోజులు దాటుతున్నా నేటివరకు ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి. డిఐఈవోకు ఆర్టీఐ చట్టమంటే గౌరవం లేదా? సమాచారం ఇస్తే తమ బండారం బయటపడుతుందని ఇవ్వటం లేదా? అన్న ప్రశ్న దరఖాస్తు దారుడిని వేదిస్తున్న ప్రశ్న. ఇప్పటికైనా స్పందించి సమాచారం ఇవ్వాలని లేని యెడల సమాచార హక్కు చట్టం కమీషనరేట్‌కు ఫిర్యాదు చేస్తానని అంటున్నారు.

 పోలీస్‌స్టేషన్‌ ముట్టడి

పోలీస్‌స్టేషన్‌ ముట్టడి

చిన్నారి శ్రీహితపై అత్యాచారం చేసిన నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్‌ చేస్తూ చిన్నారి బంధువులు, మహిళలు, వివిధ సంఘాల కార్యకర్తలు హన్మకొండ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఆందోళనతో హన్మకొండ పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. హన్మకొండ చౌరస్తా ప్రాంతం నుంచి పబ్లిక్‌గార్డెన్‌ వరకు ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లించే ప్రయత్నం చేయగా హన్మకొండలోని దాదాపు అన్ని ప్రాంతాలు వాహనాలతో నిండిపోయాయి. ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని తమకు అప్పగిస్తే తామే బహిరంగంగా శిక్షిస్తామని కొంతమంది మహిళా సంఘం నాయకులు పోలీసులను డిమాండ్‌ చేశారు. దీంతో పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా చిన్నారి మృతదేహాన్ని చేతులతో ఎత్తుకుని పోలీస్‌స్టేషన్‌ ముందు ధర్నా చేస్తున్న చిన్నారి తల్లిదండ్రులను చూసి పలువురు కంట తడిపెట్టారు. తొమ్మిదినెలల చిన్నారిని చిదిమేయడానికి మనసేలా వచ్చిందంటూ కొందరు నిందితుడిని శాపనార్థాలు పెట్టారు.

పసిమొగ్గను…చిదిమేశాడు

పసిమొగ్గను…చిదిమేశాడు

హన్మకొండ నగరంలోని టైలర్‌స్ట్రీట్‌ పాలజెండా ప్రాంతంలో దారుణం జరిగింది. తొమ్మిది నెలల పసికందుపై ఓ కామాంధుడు సభ్యసమాజం తలదించుకునేలా ముక్కుపచ్చలారని తొమ్మిదినెలల పసికందు పాపపై అత్యాచారయత్నానికి పాల్పడి హత్య చేశాడు. ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసే ఈ సంఘటన బుధవారం నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… జక్కోజు జగన్‌-రచన దంపతుల కుమార్తె శ్రిత (9నెలలు)తో తమ ఇంటి బంగ్లాపై నిద్రించారు. తెల్లవారుజామున సుమారు 4గంటల సమయంలో కొలేపాక ప్రవీణ్‌ (28) అనే వ్యక్తి వారు నిద్రిస్తున్న బిల్డింగ్‌పైకి వెళ్లి పాపను తీసుకువెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడి హత్య చేశాడు. తల్లిదండ్రులు నిద్రలోంచి మేల్కోని చూసేసరికి పాప కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించారు. బంగ్లాపై పక్కనే స్పృహతప్పి రక్తస్రావంతో తమ కుమార్తె కనిపించడంతో గుండెలవిసేలా బోరునవిలపిస్తూ పాపను చేతుల్లోకి తీసుకుని పరిశీలించగా తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో హుటాహుటిన హన్మకొండ మ్యాక్స్‌కేర్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పాపను పరీక్షించి అప్పటికే మరణించిందని వైద్యులు నిర్థారించడంతో ఆ తల్లిదండ్రుల రోదనకు అంతే లేకుండాపోయింది. ఆసుపత్రి ఆవరణలో వారు రోదిస్తున్న తీరును చూసి ప్రతి ఒక్కరు కన్నీరుమున్నీరయ్యారు. మానవజాతికే మచ్చ తెచ్చిన ఆ కామాంధుడిని నిందిస్తూ శాపనార్థాలు పెడుతూ శోకసముద్రంలో మునిగితేలారు. పాప తల్లిదండ్రులు పాపను తమ చేతుల్లోకి తీసుకుని ఏడుస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కంటనీరు పెట్టించింది.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

తొమ్మిదినెలల పాపపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడు కొలేపాక ప్రవీణ్‌ (24)ను స్థానికులు పట్టుకుని చితకబాది, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ప్రవీణ్‌ను పోలీసులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుడు దామెర మండలానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనంతరం పాప మృతదేహాన్ని వరంగల్‌ ఎంజిఎం ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎంజీఎం మార్చురీ వద్ద పాప తల్లితండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

నిందితుడిని కఠినంగా శిక్షించాలి

ముక్కుపచ్చలారని తొమ్మిదినెలల పసికందుపై అత్యాచారయత్నం, హత్య చేసిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని వివిధ విద్యార్థి, మహిళా, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ భవనం కూడలిలో పెద్దఎత్తున రాస్తారోకో ధర్నా నిర్వహించారు. సంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించడం వల్ల సుమారుగా గంటపాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నా చేస్తున్న వారిని విరమింపజేశారు. అనంతరం వివిధ సంఘాల బాధ్యులు మాట్లాడుతూ కామంతో కళ్లు మూసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడిన ప్రవీణ్‌ను ఉరితీయాలని కొందరు, శిక్షించాలని మరికొందరు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

నిందితుడిపై కేసులు నమోదు చేశాం

– సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌

ఈ సంఘటనకు సంబంధించి మరణించిన చిన్నారి శ్రీహిత మామయ్య హన్మకోండ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు అధారంగా నిందితుడు ప్రవీణ్‌ను అరెస్టుచేసి సెక్షన్‌ 366, 302, 376ఎ, 376ఎబి, 379 ఐ.పి.సి సెక్షన్లతోపాటు 5(యం) రెడ్‌ విత్‌ 6 ఆఫ్‌ పోక్సో యాక్ట్‌ 2012 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

కఠినచర్యలు తీసుకోండి

– దారుణంపై పోలీసులకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశం

హన్మకొండలో చిన్నారిపై దారుణం జరిగిన ఘటనపై పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.

హసన్‌పర్తి పీఎస్‌ను సందర్శించిన హోంమంత్రి

హసన్‌పర్తి పీఎస్‌ను సందర్శించిన హోంమంత్రి

హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ను తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ శనివారం సందర్శించారు. స్మార్ట్‌ సిటీ పోలీస్‌స్టేషన్ల సందర్శనలో భాగంగా శనివారం హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌కు హోంమంత్రి వచ్చారు. పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు, ఉద్యోగుల పనితీరును ఆయన పర్యవేక్షించారు. స్టేషన్‌లోని సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో క్రైం రేట్‌ 90శాతం మేర తగ్గినందుకు ఉద్యోగులను అభినందించారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలను నాటారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా చూడాలని సీఐకు సూచించారు. సీఎం కేసిఆర్‌ ప్రవేశపెట్టిన ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పనితీరు బాగుందని ప్రశంసించారు. ఇంకా బాగా కృషి చేసి తెలంగాణ రాష్ట్రంలో క్రైం రేట్‌ను పూర్తిగా తగ్గించాలని అన్నారు. నిత్యం 3.50లక్షల సీసీ కెమెరాల నిఘాలో హైదరాబాద్‌ నగరం ఉందని, దీంతో హైదరాబాద్‌లో కూడా క్రైం రేట్‌ చాలా తగ్గిందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న సీసీ కెమెరాలు నిందితులను పట్టుకునేందుకు సహకరిస్తున్నాయని అన్నారు. తెలంగాణలో 10500 పోలీసు నియామకాలు జరిగాయని, మరిన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌, వరంగల్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీ కె.ఆర్‌.నాగరాజు, కాజీపేట ఏసీపీ నర్సింగరావు, ఎంపీ పసునూరి దయాకర్‌, వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాష్‌, హసన్‌పర్తి సీఐ పుప్పాల తిరుమల్‌, ఎస్సైలు సుధాకర్‌, రవీందర్‌, రాహుల్‌ గైక్వార్‌, కానిస్టేబుళ్లు నర్సయ్య, నాగేశ్వర్‌రావు, భాస్కర్‌, రాజసమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

చేపల వేటకు వెళితే మొసలి దాడి

చేపల వేటకు వెళితే మొసలి దాడి

చేపల వేటకు వెళ్లిన ఒకరిపై మొసలి దాడి చేయగా ప్రాణాలతో బయటపడ్డాడు ఒక వ్యక్తి. వివరాలలోకి వెళితే… నర్సంపేట మండలం గురిజాల గ్రామానికి చెందిన కొలువుల యాకయ్య అనే వ్యక్తి శనివారం ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులో చేపలవేటకు వెళ్లాడు. సరస్సులో అతను చేపలు పడుతుండగా ఒక్కసారిగా మొసలి దాడిచేసి చేతిని అందుకున్నది. వెంటనే ప్రతిఘటించి తోటి వారి సహాయంతో ప్రాణాలతో బయటకు వచ్చారు. వెంటనే అతడిని నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు.

మోడల్‌ స్కూల్‌ విద్యార్థినికి ఐఐటిలో చోటు

మోడల్‌ స్కూల్‌ విద్యార్థినికి ఐఐటిలో చోటు

పర్వతగిరి మండలంలోని మోడల్‌ స్కూల్‌ విద్యార్థి ఎండి.యాస్మిన్‌కు భాసర ఐఐటిలో సీటు వచ్చింది. ఈ సందర్భంగా యాస్మిన్‌కు బాసర ఐఐటిలో సీటు దక్కడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందం ఆశీర్వదించి అభినందించారు. తన కూతురుకు ఐఐటీలో సీటు రావడంతో యాస్మిన్‌ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలి : మంత్రి మహ్మూద్‌అలీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నదని, పోలీసులకు, వారి కుటుంభాలకు అన్ని విధాలుగా అండగా నిలువడానికి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమ ప్రణాళికలు రూపొందిస్తున్నదని, పోలీసులు విధినిర్వహణలో తమ కర్తవ్యాన్ని నెరవేర్చి ప్రజలకు రక్షణ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహ్మూద్‌అలీ అన్నారు. శనివారం స్మార్ట్‌ పోలీస్‌స్టేషన్ల సందర్శనలో భాగంగా ఆయన వరంగల్‌జిల్లాలో పర్యటించి పలు పోలీస్‌స్టేషన్‌లను పోలీసుల పనితీరును, పోలీస్‌స్టేషన్‌ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా వ్యవహరించి ప్రజలకు భద్రత, భరోసా, విశ్వాసాన్ని కల్పించాలని ఆయన సూచించారు.

అనంతరం 4వ బెటాలియన్‌ నూతన పరిపాలన భవనంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి కలెక్టర్‌ దయానంద్‌, వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ డా.వి రవీందర్‌, అడిషనల్‌ డిజిపి అభిలాష బిస్తు,వరంగల్‌ ఈస్ట్‌జోన్‌ డిసిపి కేఆర్‌ నాగరాజు వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యులు పసునూరి దయాకర్‌, గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాశ్‌, వరంగల్‌ తూర్పు ఎమ్మేల్యే నన్నపునేని నరేందర్‌, వర్ధన్నపేట ఎమ్మేల్యే ఆరూరి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మావోయిస్టు కరపత్రాలు

మావోయిస్టు కరపత్రాలు

వాజేడు మండలకేంద్రంలో శనివారం రాత్రి మావోయిస్టు కరపత్రాలు వెలిశాయి. జల్‌, జంగల్‌, జమీన్‌పై ఆధికారం ప్రజలదేనని నినదిస్తూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఆదివాసులను అడవి నుంచి గెంటివేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేఖంగా ప్రజాస్వామిక వాదులు, ఆదివాసులు, అన్నివర్గాల ప్రజలు పోరాడాలన్నారు. న్యాయస్థానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులను నిర్వాసితులను చేయాలనే కుట్రకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. సాయంత్రం మావోయిస్టులు మండలకేంద్రంలో కరపత్రాలు వదిలివెళ్లడం సంచలనంగా మారింది. ఈ విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

విజయవంతంగా బడిబాట ర్యాలీ…

విజయవంతంగా బడిబాట ర్యాలీ…

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని వరంగల్‌ అర్బన్‌ జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి తల్లిదండ్రులను కోరారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం లష్కర్‌ బజార్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ విద్యార్థి సంపూర్ణ వికాసానికి ప్రభుత్వ పాఠశాలలోని బోధన సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ మండల విద్యాశాఖ అధికారి వీరభద్రనాయక్‌, ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల లష్కర్‌బజార్‌ ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లష్కర్‌బజార్‌ హెచ్‌ఎం శైలజ, మర్కజి ఉన్నత పాఠశాల ఇంచార్జ్‌ హెచ్‌ఎం శ్రీనివాస్‌, పెట్రోల్‌ పంప్‌ హైస్కూల్‌ హెచ్‌ఎం, ప్రభుత్వ అభ్యసన ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం శ్రీరాముల దాత మహర్షి, ప్రభుత్వ అభ్యసన ప్రాథమిక పాఠశాల ఇంగ్లీష్‌ మీడియం హెచ్‌ఎం ఉప్పలయ్య, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మార్కజి హెచ్‌ఎం ఎం.ధర్మయ్య, పెట్రోల్‌పంప్‌ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం, పాఠశాలల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు పెద్దసంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. లష్కర్‌బజార్‌ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పబ్లిక్‌గార్డెన్‌ మీదుగా డైట్‌ కళాశాల మీదుగా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సెంటర్‌కు చేరుకుంది.

పుస్తకాల బరువు మోసేదెలా

పుస్తకాల బరువు మోసేదెలా

విద్యాసంవత్సరం మొదలైంది…పాఠశాల తిరిగి ప్రారంభం కానున్నాయి…విద్యార్థుల పుస్తకాలు కొనటానికి తల్లితండ్రులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది…పాఠశాల యాజమాన్యాలు మాత్రం ప్రతి సంవత్సరం పుస్తక ఏజెన్సీలతో, వస్త్రాదుకాణాల యాజమాన్యాలతో కుమ్మక్కై దోచుకుంటున్నారని విద్యార్థుల తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉల్లాసమైన వాతావరణం…విశాలమైన ఆటస్థలాలు లేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పాఠశాలల ముందు కనీసం పార్కింగ్‌ స్థలం కూడా లేని పాఠశాలలు నగరంలో చాలా వరకు ఉన్నాయి. ప్రభుత్వ విద్యాశాఖ నిబంధనలకు విరుద్దంగా బహుళ అంతస్తులో తరగతులు నిర్వహిస్తూ గాలిలో దీపం పెట్టిన చందంగా విద్యార్థుల ప్రాణాలతో ప్రైవేట్‌ పాఠశాలలు చెలగాటమాడుతున్నాయి. పాఠశాలలో కనీస వసతులు లేకుండా ఇష్టారాజ్యంగా విద్యాశాఖ అధికారులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని అడ్డదారిలో అనుమతులు తెచ్చుకొని విద్యార్థులు, తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నారు. అనుమతులు ఇవ్వటంలో సంబంధిత శాఖలు విఫలమయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కరలేదని విద్యార్థులు, మేథావులు భావిస్తున్నారు.

నిద్రమత్తులో సంబంధిత శాఖ అధికారులు

ప్రైవేట్‌ పాఠశాలలకు అనుమతులను ఇచ్చే ముందు పర్యవేక్షణాధికారులు పాఠశాల పరిసరాలను పరిశీలించి, సానిటేషన్‌, ఫైర్‌, బిల్డింగ్‌ ఫిట్‌నెస్‌, క్రీడా మైదానం, లైబ్రరీ, మూత్రశాలలు, పార్కింగ్‌, విశాలమైన తరగతిగదులు ఉంటేనే అనుమతులు ఇవ్వవలసిన అధికారులు ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా మామూళ్ల మత్తులో అనుమతులు ఇస్తున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రధానంగా బహుళ అంతస్తుల్లో తరగతులు నిర్వహిస్తున్నటువంటి పాఠశాలలో అగ్నిప్రమాదాలు జరిగితే, కనీసం ఫైర్‌ ఇంజన్‌ ప్రాంగణం చుట్టూ తిరగలేని విధంగా పాఠశాలల ఆవరణం, గోడలు ఉంటున్నా అధికారులు పట్టించుకోకుండా విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, మేథావులు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

కాసులకు కక్కుర్తి పడుతున్న అధికారుల ఒక వైపు, ధనార్జనే ద్యేయంగా విద్యను వ్యాపారం చేస్తున్న యజమానులు మరోవైపు. ఈ ఇరువురి మధ్యన అమాయక విద్యార్థులు బలైపోతున్నారు. బహుళ అంతస్తుల్లో తరగతులు నిర్వహిస్తుండటం, వాటికి ప్రహారీగోడలకు రక్షణ వలయాలు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు పైనుండి కిందికి చూసే క్రమంలో, అటు, ఇటు వెళ్లే క్రమంలో అదుపు తప్పి భవనంపై నుండి కింద పడి మృతిచెందిన సందర్భాలు ఉన్నాయి. గతంలో కాశిబుగ్గ పట్టణంలో ఓ ప్రైవేట్‌ పాఠశాలపై నుండి పడి చనిపోయిన విషయం నగర ప్రజలకు, విద్యాశాఖ అధికారులకు, యాజమాన్యాలకు తెలిసిందే. అయినా ప్రైవేట్‌ యాజమాన్యాలు కేవలం డబ్బే లక్ష్యంగా పిల్లల ప్రాణాలను లెక్కచేయకుండా విద్యార్థులకు ఎలాంటి రక్షణ చర్యలు కల్పించకుండా అడ్డగోలు భవనాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల బరువుకు మించిన పుస్తకాల బ్యాగులను తమ వీపుపై మోసుకెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బహుళ అంతస్తుల్లో తరగతులు నిర్వహిస్తున్నప్పుడు ఖచ్చితంగా లిఫ్ట్‌ను ఏర్పాటు చేయాలనే నిబంధనను తుంగలో తొక్కి పోయేవి మా పిల్లల ప్రాణాలా…మా విద్యావ్యాపారం వర్థిల్లితే చాలు అనే విధంగా ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తీరును నగర ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు.

 

ఇంటింటికి బడిబాట

ఇంటింటికి బడిబాట

మండలంలోని కొండాపురం గ్రామంలో అంగన్‌వాడీ కార్యక్రమంలో భాగంగా బడిబాట నిర్వహించారు. ఇంటింటికి అంగన్‌వాడీ కార్యక్రమంలో 5సంవత్సరాలలోపు పిల్లలందరిని అంగన్‌వాడీకి పంపాలని పిల్లల తల్లిదండ్రులకు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలు చిన్నపిల్లల మేథో వికాసాభివృద్దికి ఎంతోగానో తోడ్పడుతాయని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నపిల్లలను చేర్పిస్తే పోషకాహారంతోపాటు ఉచితవిద్య, ఆరోగ్యం, భాష అభివద్ధి గురించి పిల్లల తల్లిదండ్రులలో అవగాహన కలిగించారు. అనంతరం చిన్నపిల్లలకు ఆక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో గ్రామంలోని చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసిడీఎస్‌ సూపర్‌వైజర్‌ రమాదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సావిత్రి, అంగన్‌వాడీ టీచర్‌ సడాలమ, వార్డు మెంబరు రమేష్‌, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

కార్పొరేటర్‌ తండ్రి కావరం

కార్పొరేటర్‌ తండ్రి కావరం

ఆయనో కార్పొరేటర్‌ తండ్రి. కొడుకు ఆవేశానికి గురైతే అలా కాదు…ఇలా అని సర్థిచెప్పాల్సినోడు రాజకీయం అంటే ఏంటో చెప్పి కొడుకు జనం తరుపు నాయకుడిగా ఎదిగేలా చేయాల్సినోడు కానీ కొడుకు కంటే ముందు తండ్రికే ఓపిక లేకుండాపోయింది. తనయుడి కార్పొరేటర్‌ పెత్తనాన్ని తనకు ఉన్న కావరాన్ని కలగలిపి డివిజన్‌ ప్రజలపై విరుచుకుపడ్డాడు. నా కొడుకునే నల్లా నీళ్లు కావాలని అడుగుతారా…డివిజన్‌లో నీటి కొరత ఉందని ఫిర్యాదు చేస్తారా…? కార్పొరేటర్‌ అయిన నా కొడుకు మీ ఇంటికి వస్తాడా అని శివాలెత్తాడు. ట్యాంకర్‌ నీళ్లు ఎందుకు…తంతా లం…కొడుకా ఎవడనుకుని మాట్లాడుతున్నావ్‌ అంటూ బూతు పంచాంగం విప్పాడు. నీళ్లు కావాలని అడిగినంందుకు బూతులతో విరుచుకుపడ్డాడు. వివరాల్లోకి వెళితే…గ్రేటర్‌ వరంగల్‌లోని 19వ డివిజన్‌లో నీటికొరత తీవ్రంగా ఉంది. దీంతో స్థానికులందరు కార్పొరేటర్‌ దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లాలనుకున్నారు. దీంతో స్థానికుడైన బత్తుల సంపత్‌కుమార్‌ కార్పొరేటర్‌ దిడ్డి నాగరాజుకు ఫోన్‌ చేశాడు. వారు ఎదుర్కొంటున్న నీటి సమస్య గూర్చి వివరించి పరిష్కరించాలన్నాడు. అవసరమైతే డివిజన్‌లోని తమ ప్రాంతానికి వచ్చి నీటికొరత ఎలా ఉందో చూడవచ్చు అన్నాడు. అంతే తన కుమారుడిని సంపత్‌కుమార్‌ ఇంటికి రమ్మన్నాడని కార్పొరేటర్‌ దిడ్డి నాగరాజు తండ్రి దిడ్డి నరేందర్‌ చిందులు తొక్కాడు. సంపత్‌కుమార్‌కు ఫోన్‌ చేసి నానాబూతులు తిట్టాడు. నువ్వు ఎంతటివాడవురా నా కొడుకునే ఇంటికి రమ్మని అంటావా, ట్యాంకర్లు పంపుతున్నా సరిపోవడం లేదా అని నానా దుర్బాషలాడాడు. తెల్లవారేసరికి లేపేస్తా, నరికేస్తా అంటూ సభ్యత, సంస్కారం మరచి వయస్సును మరిచి ఫోన్‌లోనే తీవ్రస్థాయిలో వార్నింగ్‌ ఇచ్చాడు. సంపత్‌కుమార్‌ సతీమణి రమ సార్‌…సార్‌ అంటూ ఫోన్లో మర్యాదగా మాట్లాడిన కార్పొరేటర్‌ తండ్రి ఎంతమాత్రం తగ్గలేదు. వాడు…వీడు…చంపేస్తాం…నరికేస్తాం అంటూ అవే డైలాగ్‌లు వినిపించాడు. ఓ ప్రజాప్రతినిధి జనం సమస్యలు చూడడానికి జనం పిలిస్తే వెళ్లకుండా ఏంచేస్తాడో ఇంగిత జ్తానం లేకుండా మీరు పిలిస్తే నా కొడుకు వస్తాడా…? అంటూ కార్పొరేటర్‌ అయిన తన పుత్రరత్నం తరపున వకాల్తా పుచ్చుకుని మతిపోయినట్లుగా మాట్లాడాడు. స్థానికులందరు కలిసి నీటి సమస్య గూర్చి చర్చిస్తుండగానే కార్పొరేటర్‌ తండ్రి ఫోన్‌లో తన బూతు బాగోతాన్ని కొనసాగించాడు. ఇతగాడి వార్నింగ్‌లు, బూతు బాగోతంపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓట్లు వేసి కార్పొరేటర్‌గా గెలిపిస్తే తిట్టు తినాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

గుట్కాల పట్టివేత

గుట్కాల పట్టివేత

వరంగల్‌ క్రైమ్‌, నేటిధాత్రి : మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శంభునిపేట ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేసిన 27వేల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు బుధవారం స్వాదీనం చేసుకున్నామని మిల్స్‌కాలనీ పోలీసులు తెలిపారు. శంభునిపేటకు చెందిన ధర్మపురి రమేష్‌ ఇంట్లో తనిఖీ చేయగా గుట్కాలు లభించాయని, రమేష్‌పై కేసు నమోదు చేశామని మిల్స్‌కాలనీ పోలీసులు తెలిపారు.

కార్మిక చట్టాలు అమలు చేయాలి

కార్మిక చట్టాలు అమలు చేయాలి

నర్సంపేట పట్టణంలో వివిధ దుకాణాలలో పనిచేస్తున్న గుమస్తాలకు కార్మికచట్టాలు అమలుచేయాలని కోరుతూ జిల్లా లేబర్‌ అధికారి రమేష్‌బాబుకు టీఆర్‌ఎస్‌ కెవి ఆద్వర్యంలో అవినీతిపత్రాన్ని అందజేశారు. టిఆర్‌ఎస్‌ కేవి రాష్ట్ర నాయకురాలు నల్లా భారతి, జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజులు మాట్లాడుతూ గుమస్తాలకు ఎనిమిదిగంటల పని విధానం అమలుకావడం లేదని, రోజుకు 12గంటలు పనిచేయడం వల్ల మహిళా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వారాంతపు సెలవులు అమలుకావడం లేదని, కార్మికులు పనిచేసే ప్రదేశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. దుకాణాల్లో ఎస్టబ్లమెంట్‌ యాక్ట్‌ అమలుకావడం లేదని ఒక్క కార్మికుడికి ఎస్‌ ఫాములు లేవని లేబర్‌ అధికారుల తనిఖీలు లేకపోవడం వల్ల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్మికులు, యాజమాన్య సంఘాలతో లేబర్‌ అధికారులు జాయింట్‌ కమిటీని ఏర్పాటుచేసి కార్మిక చట్టాలు యాజమాన్యాలు అమలు చేసే విధంగా చూడాలని, లేనిపక్షంలో టిఆర్‌ఎస్‌ కెవి ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాలడుగుల రమేష్‌ పాల్గొన్నారు.

అంగన్‌వాడి టీచర్ల బడిబాట

అంగన్‌వాడి టీచర్ల బడిబాట

హసన్‌పర్తి మండలంలోని జయగిరి గ్రామంలో అంగన్‌వాడి టీచర్లు బడిబాట కార్యక్రమం చేపట్టారు. ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపేయాలని, 5సంవత్సరాలకు పైబడి ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్పించాలని అంగన్‌వాడీ టీచర్లు గ్రామంలో ర్యాలీ చేపట్టారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు చేపట్టారు. ప్రతి గ్రామంలోని తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ప్రతి పిల్లవాడికి పౌష్టికాహారం, కోడిగుడ్లు, పాలు, విటమిన్లతో కూడిన ఆహారాన్ని పిల్లలకు అంగన్‌వాడీ టీచర్లు పెడుతున్నారని ఈ కార్యక్రమంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన హసన్‌పర్తి మండల జడ్పీటిసి రేణికుంట్ల సునీత, జయగిరి సర్పంచ్‌ రాణి, ఆశవర్కర్లు శారద, టీచర్లు సింగయ్య, ఇంద్ర, రేణిగుంట్ల ఆమని పాల్గొన్నారు.

 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version