ఏసీబీ వలలో విఆర్వో
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని మద్దివంచ విఆర్వో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బుధవారం మద్దివంచ గ్రామ విఆర్వో శివరావు 1.40లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ వలలో విఆర్వో
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని మద్దివంచ విఆర్వో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బుధవారం మద్దివంచ గ్రామ విఆర్వో శివరావు 1.40లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
బహిరంగంగా ఉరితీయాలి..
యాదాద్రి జిల్లా వలిగొండలో వికలాంగురాలైన మైనర్ బాలికపై అత్యాచారం చేసిన మహేందర్‌ను వెంటనే ఉరితీయాలని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాజు అన్నారు. సోమవారం చిలుకూరు మండల రామాపురం గ్రామంలో అత్యాచారం చేసిన వ్యక్తి మహేందర్‌పై ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా పోలిసులు వ్యవహరించిన తీరుపై వికలాంగుల సంఘాలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ఐనవోలు మండలకేంద్రంలో సింగారం గ్రామంలో తెలంగాణ వికలాంగుల ఫోరం ముఖ్యకార్యకర్తల సమావేశంలో జన్ను రాజు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర హోంమంత్రి వెంటనే స్పందించాలని, తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగ మహిళలపై రోజుకు ఒక్కో ప్రాంతంలో ఏదో చోట అత్యాచారాలకు పాల్పడుతున్న సకలాంగులపై చర్యలు తీసుకోవడంలో, వికలాంగుల మహిళలకు రక్షణ కల్పించడంలో తెలంగాణా రాష్ట్ర పోలీసు యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. వికలాంగుల మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ముఖ్యమంత్రి, హోంమంత్రి, డిజిపి స్థాయిలో సమీక్షా నిర్వహించి వికలాంగ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన 2016 వికలాంగుల చట్టాన్ని అమలుచేయాలని, తీసుకువచ్చేందుకు కషి వలిగోండలో వికలాంగురాలు బాలికపై అత్యాచారం చేసిన మహేందర్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు. బాధితురాలు ఫిర్యాదు చేస్తే పట్టించుకోనీ పోలీసులను ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికీ న్యాయం జరగకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వాలు వికలాంగులకు ఒక న్యాయం, సకలాంగులకు మరో న్యాయంలా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సకలాంగుల మహిళపై అత్యాచారాలు జరిగితే నిర్భయ చట్జాలు తెచ్చిన ప్రభుత్వాలు, వికలాంగుల మహిళలపై అత్యాచారాలు జరిగితే అదే రీతిలో ఎందుకు స్పందించారని అన్నారు. గతంలో జానారెడ్డి హోంశాఖ మంత్రిగా ఉన్న సమయంలో వరంగల్ జిల్లాలో ప్రణీత, స్వప్నిక అనే ఇద్దరు యువతులపై యాసిడ్ దాడీ జరిగితే అప్పటీ ప్రభుత్వం అత్యాచారం చేసిన వారిపై ఎన్కౌంటర్ చేసిందనీ, మరి ఇప్పుడు వికలాంగుల మహిళలపై రోజురోజూకు అత్యాచారాలు జరుగుతున్నా ఎందుకు ప్రభుత్వాలు ఎన్‌కౌంటర్‌కు సహకరించడం లేదని, ప్రభుత్వాలు వికలాంగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో టివిఎఫ్ వరంగల్ జిల్లా ఇంచార్జ్ మడిగె నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగారపు స్వామి, మండల అధ్యక్షుడు తాటికాయల రమేష్, సారయ్య, ఎల్లయ్య, హైమవతి, సతీష్, కుమార్, రమ్య తదితరులు పాల్గొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 96వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నర్సంపేట పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నర్సంపేట మండల పార్టీ అధ్యక్షుడు అజ్మీర శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివద్ధి చెందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దూపాటి ఆనంద్, బొందయ్య, దుగ్గొండి మండల తెలుగు యువత అధ్యక్షుడు పెంచాల సతీష్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.
దుగ్గొండిలో…
దుగ్గొండి మండలకేంద్రంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు, మల్లంపల్లి సర్పంచ్ చుక్క రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హర్షం రాజయ్య, బూర్గు రవీందర్‌గౌడ్, రమేష్‌లతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ధర్నాను విజయవంతం చేయాలి
హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో పోరాటకారులను విడిపించుట కోసం ఈనెల 31న చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజాఫ్రంట్ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు జనగాం కుమారస్వామి అన్నారు. మంగళవారం నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ఆ సంఘం ఆధ్వర్యంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సలేంద్ర వెంకటేశ్వర్లు, గుంటి ప్రకాష్, చింతకింది శ్రీను, నల్ల రవీందర్, గొడిశాల ప్రత్యుష, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్, మన్నే రామ్మోహన్, సనవులుల స్వామి, మర్రి రాజు, కోమండ్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఇళ్లకు కరెంట్ కట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పథకం కార్యక్రమంలో మరుగుదొడ్లను నిర్మాణం పనులు పూర్తిచేయని లబ్ధిదారుల ఇళ్ల విద్యుత్తు కనెక్షన్లను గ్రామపంచాయతీ అధికారులు తొలగించారు. ప్రభుత్వం గతం నుండే మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేయని వారి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని హెచ్చరించినప్పటికీ కొందరు లబ్ధిదారులు నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహించడంతో వారు అన్నంత పని చేశారు. నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయని లబ్ధిదారులను ఇటీవల గుర్తించి స్థానిక ఎంపిడిఓ కొద్ది రోజుల వ్యవధిలోనే నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని తెలిపిన విషయం తెలిసిందే. మంగళవారం చంద్రయ్యపల్లి జూనియర్ పంచాయతీ కార్యదర్శి శతి ఆధ్వర్యంలో మరుగుదొడ్ల తనిఖీలను నిర్వహించారు. లబ్ధిదారులు నిర్మాణ పనులను ఏమాత్రం చేయకపోగా నిర్లక్ష్యంగా మాట్లాడడంతో వారి ఇంటి విద్యుత్తు కనెక్షన్లను సిబ్బంది సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 31లోపు పూర్తిచేసుకోవాలని లేనిపక్షంలో ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బరిగెల లావణ్య కిషోర్, ఉపసర్పంచ్ బాషబోయిన శ్రీనివాస్, రాజేశ్వర్రావుపల్లి సర్పంచ్ యువరాజు, కారోబార్ కొల్లాపురం కోటిలింగం, ఫీల్డ్ అసిస్టెంట్ మాటేటి శ్రీను, సిబ్బంది రజనీకర్, ఎల్లయ్యలు పాల్గొన్నారు.
హనుమాన్ జయంతి ఉత్సవాలు
హసన్‌పర్తి మండలంలోని సూదన్‌పల్లి గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని ప్రతి ఒక్కరు కొబ్బరికాయతో ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. రామనామస్మరణతో గ్రామమంతా మార్మోగింది. గ్రామంలోని ఆలయానికి పెద్దఎత్తున హనుమాన్ దీక్షా స్వాములు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.
ప్రత్యేక అధికారిణికి సన్మానం
దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో పదవతరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించగా ఆ పాఠశాల ప్రత్యేక అధికారిణి మంజులను జిల్లా కలెక్టర్ గుండ్రాతి హరిత, ఆర్జేడీ, జిల్లా విద్యాశాఖ అధికారి రాజీవ్‌లు హరిత ప్రసాదం (మొక్క), శాలువాతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారిణి మంజుల మాట్లాడుతూ కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో నిరుపేద విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారని, వారి భవిష్యత్తు కోసం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉన్నతవిద్యను అందిస్తున్నామన్నారు. పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని తెలిపారు. అందుకు గుర్తించిన ప్రభుత్వం అవార్డుతో పాటు పాఠశాల అభివద్ధి కోసం 50వేల నగదు పారితోషికాన్ని అందిస్తున్నదని అన్నారు. నగదు బహుమతిని జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కలెక్టర్ చేతుల మీదుగా అందుకోనున్నట్లు ప్రత్యేకాధికారిణి మంజుల తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకురాళ్లు సుభాషిని, స్రవంతిలు పాల్గొన్నారు.
సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ ఆణిముత్యమని, ఆయన చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో సురవరం ప్రతాపరెడ్డి 123వ జయంతి వేడుకలను గ్రంధాలయ సంస్థ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సురవరం ప్రతాపరెడ్డి నిజాంకాలంలోనే గోల్కొండ పత్రిక ద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పారని గుర్తుచేశారు.
తెలంగాణలో కవులు లేరనే విమర్శను సవాల్‌గా స్వీకరించి 354మందితో గోల్కొండ కవుల సంకలనం ద్వారా మన మట్టి గొప్పతనాన్ని చాటారన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనకంటూ ఒక చరిత్రను సష్టించుకున్న సురవరం తెలంగాణ ఆణిముత్యమని కొనియాడారు. తెలంగాణలో తెలుగురాదని వాదన ఉన్న సమయంలో సురవరం గోల్కొండ పత్రిక స్థాపించి ప్రజాసమస్యలను పత్రికలో ప్రచురించి ప్రజలపక్షాన నిలిచారన్నారు. నిజాం నిరంకుశపాలన కాలంలోనే సురవరం తెలుగుపత్రికను స్థాపించి తెలంగాణవాణిని వినిపించారన్నారు.
సాంఘిక సంస్కర్తగా ఆయన బడుగు, బలహీనవర్గాల పక్షాన నిలిచారని, రెడ్డిహాస్టల్ ద్వారా ఎందరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా ఆయన రచనా సమగ్రాన్ని తెలంగాణ ప్రజలలోకి తీసుకెళ్లేందుకు తద్వారా సురవరం గౌరవాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం కషి చేస్తుందన్నారు. జిల్లా ప్రజాసంబంధాల అధికారి మామిండ్ల దశరథం మాట్లాడుతూ సురవరం బహుముఖ ప్రజ్ఞాశాలి అని, పత్రికా సంపాదకుడిగా, రచయితగా, గ్రంథాలయోద్యకారుడిగా, రెడ్డి హాస్టల్ నిర్వాహకుడిగా, ఆంధ్ర మహాసభ అధ్యక్షుడిగా విశేష కషి చేశారన్నారు. తెలంగాణలో సాహిత్య చైతన్యాన్ని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. గొల్కొండ పత్రిక, గొల్కొండ కవుల సంకలనంతోపాటు తొలి జానపద సాహిత్యాన్ని సురవరం ప్రతాపరెడ్డి ప్రచురించారన్నారు.
అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించాలి
అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మంద శ్రీకాంత్ అన్నారు. మంగళవారం శాయంపేట మండలకేంద్రంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు. అదేవిధంగా మిషన్ భగీరథ నల్లాలు పూర్తిగా నిర్మించాలని చెప్పారు. ఈ సమావేశంలో యాదవ్, ప్రసాద్, ప్రభాస్, వికాస్, మోహన్, కపిల్ రామ్ పాల్గొన్నారు.
గోవులతో వెళుతున్న లారీ పట్టివేత
అక్రమంగా గోవులను తరలిస్తున్న రెండు కంటైనర్ల పెట్టే గల వాహనాలను మంగళవారం వెంకటాపురం యువకులు పట్టుకున్నారు. పట్టుకున్న రెండు లారీలలో గోవులు ఉండటాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. వెంకటాపురం యువకులు పట్టుకున్న రెండు లారీలు, గోవులను పోలీసులకు అప్పగించారు. రెండు లారీలు, పశువులు పోలీసుల అదుపులో ఉన్నాయి.
ఎంహెచ్‌ఎంపై అవగాహన కార్యక్రమం
మెన్‌స్ట్రాల్ హైజినిక్ డేను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల పట్టణ కేంద్రంలో మహిళలతో ర్యాలీ చేపట్టారు. మంగళవారం పట్టణకేంద్రంలోని పొదుపు భవన్లో ఎంహెచ్‌ఎంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సమావేశాన్ని ఉద్ధేశించి మాట్లాడుతూ గ్రామాల్లో ఎంహెచ్‌ఎంపై అవగాహన లేకపోవడంతో చాలామంది మహిళలు, కిశోర బాలికలకు పరిశుభ్రత లేకపోవడం వల్ల అనేకరకాల ఆరోగ్యసంబంధమైన శారీరక, మానసిక ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. ఎన్నో అపోహాలతో ఆ రోజుల్లో బయటకు వెళ్లవద్దని మూఢనమ్మకాలను పాటిస్తున్నారని తెలిపారు. గ్రామగ్రామాల్లో అనేక అవగాహన కార్యక్రమాలను చేపట్టి మహిళలు, కిషోర బాలికలలో అవగాహన కల్పించాలని చెప్పారు. సానిటరి పాతపద్దతులను మానేసి కొత్త పద్దతులు అవలంభించేలా, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా మార్పు తీసుకురావాలని, గ్రామాల్లో మరుగుదొడ్లు, ఎయిడ్స్‌పై విస్తృత ప్రచారం చేసినవిధంగానే ఎంహెచ్‌ఎంపై ప్రచారం చేయాలని వివరించారు. డిడబ్ల్యుఓ మాట్లాడుతూ కిషోర బాలికలకు, మహిళలకు రుతుస్రావ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. అదేవిధంగా సరైన పోషకాహారం తీసుకోకపోవడంతో రక్తహీనతకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. అదనపు డిఆర్డిఓ మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా ప్రతి సమావేశంలో ఎంహెచ్‌ఎంపై చర్చించి పేదప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్టుమెంట్ ఆర్‌బిలు, వైద్యులు, హెల్త్ ఎడ్యుకేటర్లు, ఎస్బిఎం కన్సల్టెంట్ సురేష్, సిడిపిఓలు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, డిఎం అండ్ హెచ్ఓలు, ఎఎన్ఎంలు, ప్రేమ్‌కుమార్, నిహారిక, రమ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
ప్రజల అవసరాలకు తగ్గట్లుగా పనిచేయాలి
ప్రజల మనోభావాలు, అవసరాలకు తగ్గట్లుగా పోలీసు అధికారులు విధులు నిర్వర్తించాల్సి వుంటుందని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పోలీసుల పనీతీరుపై రాష్ట్ర డీజీపీ మంగళవారం రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతోపాటు స్టేషన్ హౌజ్ ఆఫీసర్లయిన ఇన్స్‌స్పెక్టర్లు, సబ్-ఇన్స్పెక్టర్లతో హైదరాబాద్ డిజీపీ కార్యాలయం నుండి వీడియో సమావేశాన్ని నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్‌తోపాటు కమిషనరేట్‌కు చెందిన అధికారులు పాల్గోన్న ఈ సమావేశంలో గత తొమ్మిదినెలల కాలంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన శాసన, పార్లమెంటరీ, పంచాయితీ, పరిషత్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంతోపాటు, ఎలాంటి సంఘటన జరగకుండా ఎన్నికల విధులు నిర్వహర్తించినందుకు డీజీపీ వరంగల్ పోలీస్ కమిషనర్‌తోపాటు అధికారులు, సిబ్బందిని అభినందించారు. అనంతరం రానున్న తెలంగాణ పోలీసుల ముందున్న లక్ష్యాలపై డీజీపీ వివిధస్థాయి పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం అనంతరం తెలంగాణ పోలీస్ దేశంలోనే నెంబర్ వన్ పోలీస్‌గా నిలిచిందని, ఈ స్థాయికి తెలంగాణ పోలీస్‌ను తీసుకరావడంలో పోలీస్ ఆధికారులు, సిబ్బంది సమిష్టిగా పనిచేయడమే ఇందుకు కారణమని. ఫిర్యాదుదారుడు రాష్ట్రంలోని ఏ పోలీస్‌స్టేషన్‌కు, ఏ సమయంలో వెళ్లిన ఒకే విధమైన స్పందన వుండాలని, ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే మనమందరం జీతాలందుకుంటున్నామని, ప్రజలను మన యజమానులుగా భావించాల్సి వుంటుందని తెలిపారు. అధేవిధంగా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించే విధంగా పోలీసు అధికారులు పనిచేయాలని, విధినిర్వహణలో భాగంగా ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినకుండా పోలీసులు విధులు నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా చట్టాలను అమలుపర్చే ముందుగా పోలీసులు, అధికారులు చట్టాలను పాటించాల్సి వుంటుందని, ముందుగా ట్రాఫిక్ సంబంధించి ప్రతి పోలీస్ అధికారులు విధిగా ద్విచక్రవాహనంపై ప్రయాణించే సమయంలో హెల్మేట్ ధరించాల్సి వుంటుందని సూచించారు. అధేవిధంగా కారుడ్రైవింగ్ చేసే సమయంలో సీటుబెల్ట్ తప్పక ధరించే విధంగా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డీజీపీ తెలిపారు. ఈ సమావేశంలో పోలీస్స్టేషన్లతోపాటు పోలీస్ కార్యాలయాల్లో పనితీరుతోపాటు, పరిసరాలను మెరుగుపర్చేందుకు ప్రవేశపెట్టిన 5ఎస్ అమలుతీరుపై రాష్ట్ర డీజీపీ అడిగిన ప్రశ్నకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కిషన్ తెలిపిన వివరణపై రాష్ట్ర డీజీపీ సంతోషాన్ని వ్యక్తం చేయడంతోపాటు ఇన్స్పెక్టర్ను అభినందించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు వచ్చినప్పుడు తప్పకుండా కమిషనరేట్ పరిధిలో 5ఎస్ ఆమలుతీరును పరిశీలిస్తానని డీజీపీ పోలీస్ కమిషనర్‌కు తెలిపారు. ఈ సమావేశంలో ఎసిపిలు చక్రవర్తి, శ్రీనివాస్, జనార్థన్, శ్యాంసుందర్ సింగ్, మాజీద్, బాబురావు, శ్రీనివాస్‌తోపాటు ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్ఐలు, సబ్-ఇన్స్‌స్పెక్టర్లు, పరిపాలన సిబ్బంది పాల్గోన్నారు.
సూపరింటెండెంట్ ‘సాయిబాబా’ను సస్పెండ్ చేయాలి
వరంగల్ అర్బన్ జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సాయిబాబా పేపర్ వాల్యూయేషన్ క్యాంపు పేరిట అవినీతికి పాల్పడినాడని, క్యాంపులో జరిగిన అవినీతిపై తక్షణమే విచారణ కమిటీని నియమించి ప్రభుత్వ సొమ్మును కాజేసిన అవినీతి ఉద్యోగులను గుర్తించి వెంటనే వారిని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని దళిత బహుజన విధ్యార్థి మోర్చా రాష్ట్ర కన్వీనర్ గురుమిళ్ల రాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాయ్స్ పేరిట, స్టేషనరీ, ట్రావెలింగ్, టిఏ, డిఏ, లెక్చరర్లకు పేపర్ వాల్యుయేషన్ చేసినందుకు ఉన్న లెక్చరర్ల కంటే ఎక్కువ మంది లెక్చరర్లు వాల్యుయేషన్ చేసినట్టుగా పేర్లను సృష్టించి సంతకాలు లేకుండానే బిల్లులు చెక్కుల ద్వారా డ్రా చేశారని, దీనికి డిఐఈవో కూడా సహకరించడం వల్లనే ఇది సాధ్యమయ్యిందని రాజు తెలిపారు. తక్షణమే క్యాంపు కార్యాలయంలో జరిగిన అవినీతిపై విచారణ కమిటీని వేసి అవినీతికి పాల్పడిన ఉద్యోగులను సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కమీషనర్‌ను కలవనున్న విద్యార్థి సంఘం నేతలు
అవినీతికి పాల్పడిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని, ప్రధాన సూత్రదారి అయిన సూపరింటెండెంట్ ‘సాయిబాబా’ను, అతనికి సహకరించిన డిఐఈవో లింగయ్యను సస్పెండ్ చేయాలని కోరుతూ తమ వద్ద ఉన్న ఆదారాలతో ఇంటర్మీడియట్ బోర్డు కమీషనర్‌ను కలువనున్నట్లు గురుమిళ్ల రాజు తెలిపారు. కార్యాలయంలో జరిగిన అవినీతిపై వెంటనే విచారణ కమిటీని నియమించాలని అన్ని విధ్యార్థి సంఘాలను కలుపుకొని కమీషనర్‌ను కలువనున్నట్లు ఆయన తెలిపారు.
ఆర్జేడీగా అవినీతిపరులను నియమించొద్దు
ఇటీవల గుండెపోటుతో మరణించిన ఇంటర్మీడియట్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ హనుమంతారావు మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతికి దళిత బహుజన విధ్యార్థి మోర్చా తరుపున సంతాపం తెలుపుతున్నాము. ఆయన మరణంతో ఖాళీ అయిన ఆర్జేడి బాధ్యతలను ఇంటర్‌బోర్డుకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చే వారిని నియమించాలి. ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో అవినీతిపరులకు సహకరించిన ఓ అధికారి పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తున్నదని ఆయనకు ఎట్టి పరిస్థితులల్లో ఇవ్వవద్దని ఇంటర్మీడియట్ బోర్డు కమీషనర్‌కు మా తరుపున కోరుతున్నాం. ఆయనపై ఓ మహిళ పలు పోలీస్స్టేషన్లల్లో ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారంఉందని వాటి వివరాలను త్వరలో కమీషనర్‌కు అందిస్తామని డిబివిఎం రాష్ట్ర కన్వీనర్ గురుమిళ్ల రాజు తెలిపారు.
హనుమాన్ జంక్షన్ గుడిసెల కహానీ…!
ఓ కమ్యూనిస్టు పార్టీ పోరాటం ప్రారంభిస్తుంది. గుడిసెల పోరాటం చేస్తుంది అంటే కమిటీతో చర్చించి, సాధ్య, అసాధ్యాలను పరిశీలించి ముందుకు కదులుతారు. అదే భూపోరాటం చేయాలంటే, పేదప్రజలకు ఇంటిస్థలాలు ఇప్పించాలంటే ఆ భూమి సర్వే నెంబర్ ప్రభుత్వ భూమా…? ప్రైవేట్ భూమా…? కబ్జాలో ఎవరైనా ఉన్నారా…లేదా…తదితర వివరాలను పరిశీలించి భూమిపైకి వెళ్తారు. కానీ వరంగల్ నగరంలో భూపోరాటాలకు సీపీఐ నేతలు చెప్తున్న కొన్ని పోరాటాలు వాటి వెనుక నడిచిన తతంగాలను చూస్తే నవ్వొస్తుంది. గుడిసెల పోరాటంలో పావులుగా మిగిలిపోయి మోసపోయిన పేదప్రజలను చూస్తే ఆవేదన కలుగుతుంది. ఎంతో కొంత ప్రతిఫలం అందుకుని మూట, ముల్లే సర్థుకుని శల్యసారథ్యం వహించిన సీపీఐ నాయకులు నగరంలో అనేక పోరాటాలకు పుల్‌స్టాప్ పెట్టారు. అందినకాడికి దండుకుని బయటపడ్డారు. నిజానికి చెప్పాలంటే లక్షల్లో వెనకేసుకున్నారు. చెప్పేది శ్రీరంగ నీతులు…చేసేది ఏదో పని అన్నట్లు కామ్రేడ్లు కనికరం లేకుండా పేదప్రజల నిలువ నీడ అనే సెంటిమెంట్‌తో ఇల్లు అనే ఆశతో ఓ ఆట ఆడుకున్నారు.
ఇదీ హనుమాన్ జంక్షన్ కథ
సరిగ్గా 18సంవత్సరాల క్రితం వరంగల్ ములుగురోడ్డు సమీపంలో కాకతీయ కెనాల్ దాటాక ప్రస్తుతం హనుమాన్ జంక్షన్‌గా పిలుస్తున్న ప్రాంతం కాకతీయుల కట్ట 701, సర్వే నెంబర్ 45/బి. ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిలో అప్పటి సీపీఐ నాయకులు పాటూరి సుగుణమ్మ, సదాలక్ష్మి, జ్యోతి, మోతె లింగారెడ్డి, సిరిబోయిన కరుణాకర్‌లు, కేఎల్ మహేంద్రనగర్ వాసులు ఈ భూమిలో జెండాలు పాతి తుమ్మకంపలు కొట్టి గుడిసెలు వేశారు. ఇల్లును సాధించుకోవాలనే పట్టుదలతో ఎన్ని కష్టాలు వచ్చిన పేదలు ధైర్యం కోల్పోలేదదు. పోలీసు, రెవెన్యూ అధికారులు పలుమార్లు గుడిసెలు తొలగించాలని బెదిరించిన పోరాటాన్ని కొనసాగించారు.
పోరాటం ఎందుకు ముగిసింది…?
నెలరోజులపాటు గుడిసెలు వేసి ఇళ్ల స్థలాల కోసం పోరాటం ఉద్ధృతంగా నడిచిన అది రాజీమార్గం పట్టింది. కారణం డబ్బులతో సీపీఐ నాయకులను ఓ భూమి కొనేయడమే కారణమని ఆరోపణ ఉంది. 4లక్షల రూపాయలకు 2వందల మంది గుడిసెవాసుల ఆశలను తాకట్టు పెట్టినట్లు తెలిసింది. సీపీఐకి చెందిన ప్రధాన నాయకులు భూస్వామితో కుమ్మక్కు కాగానే అతని అనుచరులు ఇతర నాయకులను బెదిరించారు. గుడిసెలు తీసేయాలి..మీ నాయకులతో మాట్లాడమని హుకుం జారీ చేశారు. దీంతో పార్టీలో గొడవ ముదిరిపోయిందట. గుడిసెలు ఎలా తీస్తారని కొందరు ప్రశ్నిస్తే పార్టీ ఫండ్ ఇస్తారట అని సమాధానం లభించిందట. ఇక్కడ అర్థంకానీ విషయం ఏంటంటే గుడిసెలు వేసేటప్పుడు ప్రభుత్వభూమి రికార్డుల్లో చూశాం అని వాదించిన సీపీఐ నాయకులు, అప్పటి కార్యదర్శితోసహా వెంటనే మాటమార్చి అది ప్రైవేట్‌భూమిని వారికి వారే నిర్థారణకు ఎలా వచ్చారో తెలియదు. కాకతీయుల కోట కట్ట అని ఊదరగొట్టిన నాయకులు పార్టీలోనే ఇతరులు ఈ విషయాన్ని ప్రస్తావిస్తే వెళ్లి ఆ భూస్వామినే అడగండి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చేవారని తెలిసింది. ఈ విషయం సీపీఐకి రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. పైగా అతన్నే జిల్లా కార్యదర్శిగా కొనసాగించారు. ఆ తరువాత ఆ భూమి నాది పట్టాదారు అంటూ సీపీఐ నాయకులకు కావాల్సింది ముట్టజెప్పిన భూస్వామి పోలీసులతో తన అనుచరులను పంపి అక్కడ ఉన్న పేదప్రజలను తరిమివేసి గుడిసెలు దగ్ధం చేశారు. సీపీఐ నాయకులు మాత్రం ఆ సీన్లోకి ఎంటర్ కాకుండా ఇంట్లోనే హాయిగా ఉండిపోయారు. దీంతో హనుమాన్ జంక్షన్ గుడిసెల కథ ముగిసిపోయింది. ఇంటిస్థలం ఆశతో జనం లాఠీ దెబ్బలు తిన్నారు. ఖర్చుల పాలయ్యారు. సీపీఐ నాయకులు మాత్రం కావల్సింది అందుకుని జేబులు నింపుకున్నారు. చివరకు ఓడింది మాత్రం పేదప్రజలే.
ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి
గీసుగొండ మండలకేంద్రంలో ప్రభుత్వ బడిలోనే పిల్లలను చేర్పించాలని కోరుతూ ఉపాధ్యాయులు స్థానిక నాయకులు తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య అందుతుందని, అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సూర్యకళ, ఉపాధ్యాయులు రామ్మూర్తి, ప్రభాకర్, స్థానికులు చాడ కొమురరెడ్డి, లక్ష్మినారాయణ తదితరులు ఉన్నారు.
భానుడి భగభగ…జనం విలవిల
రోజురోజుకు భానుడి ప్రతాపం పెరుగుతోంది…భానుడి భగభగకు జనం విలవిలలాడుతున్నారు. వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రెండురోజుల వ్యవధిలో సుమారుగా 15మంది మృతిచెందారు. ఇదేవిధంగా భానుడు ప్రతాపం చూపితే ప్రజలు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొన్నది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ 45డిగ్రీలు దాటి 50డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు వెళ్లొచ్చని, ప్రస్తుతం ఉన్న ఎండ తీవ్రతను బట్టి అంచనా వేయవచ్చు. ఈ ఉష్ణోగ్రతలకు ప్రజలు ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. అసలు మధ్యాహ్నం వేళల్లోనైతే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి. రోజువారి పనుల్లో భాగంగా ప్రజలు తమ పనులను ఉదయం 11గంటలలోపే పూర్తి చేసుకుంటున్నారు. తిరిగి అత్యావసర పనుల నిమిత్తం సాయంత్రం 7 తరువాత మాత్రమే బయటకు వస్తున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది.
జాగ్రత్తలు తీసుకోవాలి
పనికి వెళ్లే వారు ఉదయం, సాయంకాలం వేళల్లో తమ పనులను చూసుకోవాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఎండలో బయటకు వెళ్లేవారు తెల్లని కాటన్ వస్త్రాలను తలపాగాగా చేసుకుని వెంట తాగేందుకు నీటిని తీసుకువెళ్లాలని తెలిపారు. అదేవిధంగా ఒదులుగా ఉన్న కాటన్ వస్త్రాలను ధరించాలని, తలకు తప్పనిసరిగా చేతిరుమాలు చుట్టుకోవాలని, మధ్యాహ్నం వేళల్లో రోడ్లపై రాకుండానే మంచిదని హెచ్చరిస్తున్నారు.
పుట్టినరోజు వేడుకలు
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లిబోర్డు వేణునగర్ వద్దగల సేవాజ్యోతి శరణాలయంలో వరంగల్ జిల్లా వాస్తవ్యుడు, సగర జాతీయ సగర సేవా, ఉద్యోగుల సంఘం గౌరవ సలహాదారు, నేటిధాత్రి దినపత్రిక అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత, ధాత్రి గ్రూప్స్ చైర్మన్ కట్టా రాఘవేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం శరణాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు గజ్జెల్లి శ్రీదేవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలో ఒకరోజు మీరోజు కావాలని కోరుతున్నామని అన్నారు. అభాగ్యుల సేవకు ఆలయంగా నిరంతరం సేవలు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శవంతమైన విధంగా జరగాలని, మీ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖసంతోషాలతో సమాజానికి ఆదర్శంగా జీవించాలని కోరారు. సేవా జ్యోతి శరణాలయం నుండి ఆశీర్వాదం ఎప్పుడూ మీకు, మీ కుటుంబానికి ఉంటుందని అన్నారు. మంచిర్యాల జిల్లా జాతీయ సగర సేవా, ఉద్యోగుల సంఘం సభ్యుడు ఆసం ముత్తయ్య తిర్యాణి ఎఇఓ మాట్లాడుతూ భారతదేశం ఘనత ప్రపంచానికి పరిచయం చేసిన మహత్ముల పుణ్యభూమిలో పుట్టిన సగరుడు సర్వమానవుల సంక్షేమం కోసం పాటుపడటం అనేకరకాల బాధ్యతలను కూడా స్వీకరించి తదనుగుణంగా ముందుకు వెలుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి సేవా ప్రముఖ్ గజ్జెల్లి మల్లేశం, గజ్జెల్లి సత్యకేశవ్ జిత్, నిర్వాహాకులు కొంకటి స్వప్న, కష్ణ కొంకటి, కుటుంబ రమేష్, రాజ్‌కుమార్, సర్వమాధవ్ జిత్, నాగమణి, రాజేశ్వరి, విద్యార్థులు, మానసిక వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా హనుమాన్ ఇరుముడి మహోత్సవం
మండల రోజులు దీక్ష పూర్తి చేసుకున్న హనుమాన్ మాలాదారులు సోమవారం ఇరుముడి మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. నర్సంపేట డివిజన్లోని దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లి గ్రామంలోని హనుమాన్ భక్తులు మాలాధారణతో మండల దీక్ష పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో గణపతి హోమం, నవగ్రహాల పూజలను వేదపండితులు గణేశ్‌శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండి నిర్వహించుకున్నారు. అనంతరం ఇరుముడి మహోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. గ్రామంలోని మహిళలు, కుటుంబసభ్యులతో కలిసి ఇరుముడి ప్రాంగణం వద్ద భక్తిశ్రద్ధలతో పూజలను నిర్వహించారు. బుధవారం జరిగే హనుమాన్ జయంతి సందర్భంగా ద్విచక్రవాహనాలపై భద్రాచలానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కందుల కుమారస్వామి, కామెడీ మల్లారెడ్డి, ఈర్ల కొమ్మాలు, గడ్డమీది కుమారస్వామి, శరత్, రుదీర్, రామకష్ణ, శ్రీనివాస్‌లతోపాటు పలువురు ఉన్నారు.
గుడిసెలు వేయించి…బేరం కుదుర్చుకో…
నిలువ నీడలేని పేదలను కొందరిని చేరదీస్తారు. చెప్పింది వినాలంటారు. ప్రభుత్వభూమినో, ప్రైవేటు భూమినో చూపిస్తారు. ఇందులో మీకు జాగ ఖాయం అంటారు. దీనిని చదును చేస్తే మనం గుడిసెలు వేసుకోవచ్చని నమ్మకంగా చెప్తారు. నిలువ నీడ దొరుకుతుంది. నగరంలో ఓ ఇల్లు కట్టుకోవచ్చని పేదలు చెప్పిన ప్రతీ దానికి తలలూపుతారు. మరీ భూమిని చదును చేయాలి, జెండాలు పాతాలి, పోలీసులను ఎదుర్కొవాలి. ఇదంతా చేయాలంటే ముందుగా చేతిలో ఎంతో కొంత పైకం ఉండాలి. ఇంకేముంది చేరదీసిన ప్రజల వద్ద నుంచే తలా కొన్ని పైసలు వసూలు చేస్తారు. ఇక్కడ మొదలవుతుంది. వసూళ్ల పర్వం వంద నుంచి మొదలైన ఈ పర్వం డిమాండ్‌ను బట్టి వేలకు చేరుకుంటుంది. పొద్దస్తమానం కష్టపడి సంపాదించిన సొమ్మును నిలువ నీడ కోసం పేదలు అక్కడి నాయకులకు సమర్పించుకుంటారు. కష్టనష్టాలకోర్చి గుడిసెలు వేసుకుంటారు. ఒకటి, రెండు రోజులు చూసి ప్రభుత్వభూమి అయితే రెవెన్యూ అధికారులు, పోలీసుల సహాయంతో గుడిసెలు తొలగిస్తారు. అడ్డుకుంటే ఈడ్చి అవతల పారేస్తారు. డబ్బులు వసూలు చేసి గుడిసెలు వేయడానికి నాయకత్వం వహించిన నాయకులు సైతం అధికారులకు ఎదురుతిరుగుతారు. పోలీస్ వ్యాన్ ఎక్కుతారు. ఇదంతా బాగానే ఉన్నా తెల్లవారి నుంచి గుడిసెల పోరాటం మాట వినపడదు. చివరకు పేదలు, గుడిసె కోసం చెమటోడ్చి తమ కష్టార్జితం చేతిలో పెట్టినవారు నష్టపోతారు. నాయకులు మాత్రం వసూళ్ల పైసలతో హాయిగా ఉంటారు. ఇక ప్రైవేట్ స్థలం అయితే కథ వేరే విధంగా ఉంటుంది. వారం, పదిరోజులపాటు గుడిసెలు వేసి తమకు పేద ప్రజల అండ ఉందని నిరూపించుకుని బేరసారాలకు దిగుతారు. యజమానితో కుమ్మకైతారు. అదే రియలెస్టేట్ వెంచర్ అయితే డిమాండ్ భారీగానే పెట్టి తమ జేబులు నింపుకుని గుడిసెలు వేసిన వారికి ఏవో మాయమాటలు చెప్పి తప్పుకుంటారు. గుడిసెల స్థలంలో వారం, పదిరోజుల్లో అందమైన భవంతులు, అపార్టుమెంట్లు వెలుస్తాయి. ఇక్కడ చివరకు పేదలే ఓడిపోతారు. నాయకులు ఆర్థికంగా లాభపడి హాయిగా ఉంటారు. ఇదంతా గుడిసెల పేరుతో జరుగుతున్న పోరాటాల్లో తరుచుగా కనపడుతున్న మోసాలు. నిలువ నీడ లేని పేదలకు ఎంతో కొంత జాగ కోసం పోరాటం చేయడం సరైందే అయిన కేవలం తమ పార్టీల కోసం డబ్బులు రాబట్టుకోవడం కోసం కొందరు కమ్యూనిస్టుల పేరుతో ఎర్రజెండాను అడ్డుగా పెట్టుకుని దిగజారుడు పద్దతులు అవలంభించడం నిజంగా క్షమించరాని నేరం.
బ్రహ్మూెత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ
దుగ్గొండి మండలంలోని కేశవాపురం గ్రామంలో వెంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మూెత్సవాలు జరుగుతున్న సందర్భంగా నర్సంపేట శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నూతనంగా ఎంపికైన మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవితలు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, ఆలయ ధర్మకర్త వారికి ఘనంగా స్వాగతం పలికారు. వారికి పుష్పగుచ్చాలను అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జడ్పీటిసి అభ్యర్థి ఆకుల శ్రీనివాస్, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, బీరం సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ మురళి, హేమచందర్‌గౌడ్, కమలాకర్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.