chali pidugu miglichina vishadam, చలి పిడుగు మిగిల్చిన విషాదం

చలి పిడుగు మిగిల్చిన విషాదం

ఐనవోలు మండలంలోని వెంకటాపురం గ్రామశివారులో గొర్రెల మందపై పిడుగుపడడంతో పెద్దఎత్తున 35గొర్రెలు మతువాత పడ్డాయి. చీర రాజారామ్‌కు చెందిన భూమిలో మందను నిర్వహించారు. గురువారం రాత్రి అకాలవర్షంలో చలి పిడుగు గొర్రెల మండపై పడింది. పెద్దసంఖ్యలో చిన్న, పెద్ద గొర్రెలు చనిపోవడంతో గొర్రెల కాపరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇందులో మజ్జిగ రాజుకు చెందిన 8గొర్రెలు, దయ్యాల రాజుకు చెందిన 20గొర్రెలు, బండారి చంద్రుకు చెందిన 5గొర్రెలు మృతిచెందాయి. అందులో భాగంగా ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్‌ మజ్జిగ జయపాల్‌, సర్పంచ్‌ దయాకర్‌, ఎంపీటీసీ కావ్య తిరుపతి, చీర గణేష్‌ తదితరులు జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో వెంకటాపురం గ్రామానికి చెందిన నీలం ఫకీర్‌ యాదవ్‌(50) పిడుగుపాటుకు మతిచెందారు.

ashakaryakarthalaku okaroju shikshana karyakramam, ఆశాకార్యకర్తలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం

ఆశాకార్యకర్తలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం

జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణపై వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశాకార్యకర్తలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జిల్లా ఉపవైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో నిర్వహించారు. ఈ శిక్షణకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధికారి డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ దోమల వల్ల మలేరియా, బోద వ్యాధి, డెంగ్యూ, చికెన్‌గున్యా, మెదడువాపు వ్యాధులు వస్తాయని, వీటి నివారణలో ఆశాకార్యకర్తల పాత్ర చాలా ముఖ్యమైనదని అన్నారు. 2030 సంవత్సరానికి మలేరియాను పూర్తిగా నివారించాలనేది లక్ష్యం అన్నారు. మలేరియా వ్యాధి వ్యాప్తి జూన్‌ నుండి నవంబర్‌లో ఎక్కువగా ఉంటుందని, అందరం అప్రమత్తంగా ఉండాలన్నారు. మలేరియా వ్యాధి ఒకరి నుండి మరొకరికి ఈ వ్యాధి కారకం ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. వర్షాకాలంలో దోమలు పెరుగు ప్రదేశాలు ఎక్కువగా వ్యాధి కూడా అదే సమయంలో ఎక్కువ ప్రబలుతుందన్నారు. కొన్ని పరిస్థితుల్లో ఈ వ్యాధి ప్రాణాంతక స్థాయికి చేరుతుందని తెలిపారు. బోధ వ్యాధి, డెంగ్యూ, చికెన్‌ గున్యా, మెదడు వాపు వ్యాధుల లక్షణాలు, చికిత్స, నివారణ చర్యల గురించి వివరించారు. ముఖ్యంగా ఫ్రైడే డ్రైడేగా పాటించాలని, పరిసరాలలో నీరు నిలవకుండా చూడాలని, ప్రతి ఆశా కార్యకర్త గృహ సందర్శనకు వెళ్లినప్పుడు ఇంటి పరిసరాలలో పరిశుభ్రత, డ్రైడే ప్రాముఖ్యత గురించి తెలిపారు. జిల్లా ఉపవైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి.శ్రీ|రాములు మాట్లాడుతూ కీటక జనిత వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యల గురించి వివరించారు. శిక్షణ అనంతరం ఆశా కార్యకర్తలకు రక్తపూత పరీక్షలు ఎలా చేయాలనే దానిపై ల్యాబ్‌ టెక్నిషియన్‌ శిక్షణను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొగ్రామ్‌ ఆఫీసర్లు డాక్టర్‌ సుమన్‌ మోహన్‌రావు, డాక్టర్‌ మహేష్‌, డాక్టర్‌ అనిల్‌కుమార్‌, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సంపత్‌, సిహెచ్‌ఓ శ్రీనివాస్‌రెడ్డి, హెచ్‌ఇఓలు లింగం, ఎల్లంకి శ్రీనివాస్‌, హెచ్‌ఇలు వెంకటేశం, సంపత్‌, డిపిఓ ఉమాదేవి, డిపిహెచ్‌ఎన్‌ దయామని, హెచ్‌ఎస్‌ సుజాత, భరత్‌ పాల్గొన్నారు.

…………………………………..

gudumbha stavaralapia dadulu, గుడుంబా స్థావరాలపై దాడులు

గుడుంబా స్థావరాలపై దాడులు

గుడుంబా స్థావరాలపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎస్సై అశోక్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని బేస్తగూడెం గ్రామంలో, గ్రామం చుట్టుపక్కల గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి 500లీటర్ల పానకం, 10గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పానకాన్ని ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో దుర్గం లక్ష్మిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ దాడుల్లో ఎస్సైతోపాటు సిబ్బంది శ్రీనివాస్‌, నవీన్‌, తిరుపతి, వీరన్న పాల్గొన్నారు.

flatphom bayata kuragayalanu vikrainchakudadu, ప్లాట్‌ఫామ్‌ బయట కూరగాయలను విక్రయించకూడదు

ప్లాట్‌ఫామ్‌ బయట కూరగాయలను విక్రయించకూడదు

కూరగాయల విక్రయదారులు వారికి కేటాయించిన ప్లాట్‌పామ్స్‌లలోనే కూరగాయలను విక్రయించాలని సిరిసిల్ల పురపాలక సంఘం కమీషనర్‌ డాక్టర్‌ కె.వి.రమణాచారి తెలిపారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని 13వ వార్డులో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, ఇతర మౌళిక వసతులు తదితరులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఇంజనీర్‌ విభాగం సిబ్బందికి సూచించారు. అనంతరం మార్కెట్‌ ఏరియాను సందర్శించారు. ప్లాట్‌ఫామ్‌ బయట కూరగాయలను విక్రయించడం మూలంగా రవాణా, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, వారికి కూడా ప్లాట్‌ఫామ్స్‌కు నెంబర్లు కేటాయించి బయట కూర్చున్న విక్రయదారులను కూడా ప్లాట్‌పామ్‌లలోనే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ గుండ్లపెల్లి పూర్ణచందర్‌, పురపాలక సంఘ కార్యాలయ ఆయా విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

 

vathavarana shaka hesharika, వాతావరణ శాఖ హెచ్చరిక

వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఎండలు మండిపోతుండగా..గురువారం వాటి తీవ్రత మరింత పెరుగుతుందని చెప్పారు. ప్రజలు ఎండలో బయటకు రావద్దని వాతావరణశాఖ సహాయ అధికారి వెంకట్రావు సూచించారు. గురువారం ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుందని, దీని వల్ల ఎండలో తిరిగితే వడదెబ్బ తగిలే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రజలు పగలూ ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు.

ellu kabza chesharani atmahatyayatnam, ఇల్లు కబ్జా చేశారని ఆత్మహత్యాయత్నం

ఇల్లు కబ్జా చేశారని ఆత్మహత్యాయత్నం

వరంగల్‌ సిటి : ఇల్లు కబ్జా చేశారని కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన వరంగల్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

వరంగల్‌ కాశిబుగ్గ గ్లోబల్‌ స్కూల్‌ వద్ద తౌటం చక్రపాణి అనే వ్యక్తి అద్దెకు వచ్చి ఇంటిని కబ్జా చేసారంటూ కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఈగ బిక్షపతి, భార్య, కూతురును చుట్టుపక్కల కాలనీవాసులు అడ్డుకున్నారు. కేసును ఇంతేజార్‌గంజ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాదితుడు బిక్షపతి మాట్లాడుతూ అమ్మ, నాన్న సంపాందించిన ఆస్తిలో మేము ఉంటున్నామని, కూలి పని చేసుకుని జీవనం కొనసాగిస్తున్నమని, గత పదిసంవత్సరాల క్రితం తౌటం చక్రపాణి అనే వ్యక్తి మా ఇంట్లోకి అద్దెకు వచ్చాడని తెలిపారు. నాకు పిల్లలు లేరని తెలుసుకుని తౌటం చక్రపాణి, అతని భర్య ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని తీసుకువచ్చి మాకు ఇచ్చారని, కొన్ని రోజుల తరువాత మీకు అమ్మాయిని ఇచ్చామని, మాకు ఆస్తిలో వాటా ఇవ్వాలని ఎన్నో మార్లు వేదింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మాయమాటలు చెప్పి మద్యం అలవాటు చేసి సంతకాలు చేయించుకున్నారని అన్నారు. ఈ విషయంలో మాకు ఎన్నిసార్లు పోలీసులకు పిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని, కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశామని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు బాదితులను పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.

 

atm chorulunnaru, ఏటీఎమ్‌ చోరులున్నారు..

ఏటీఎమ్‌ చోరులున్నారు..

సైబరాబాద్‌ డీసీపీ క్రైమ్స్‌ రోహిణీ ప్రియదర్శిని

బ్యాంకు ఖాతాల నుంచి నగదు కొల్లగొట్టడానికి సైబర్‌ నేరగాళ్లు నయా దారులు వెతుకుతున్నారని సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. సాంకేతికతను వినియోగించుకొని పంజా విసురుతున్నారని, ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఖాతాల్లోంచి వేలాది రూపాయలు ఎగిరిపోతున్నాయని తెలిపారు. ఈ ఘరానా మోసం పేరే ‘స్కిమ్మింగ్‌’ అంటారని చెప్పారు. గతంలో కస్టమర్లకు ఫోన్‌ చేసి బ్యాంక్‌ అధికారులమని నమ్మబలుకుతూ వారి నుంచి ఏటీఎం కార్డు నంబర్‌, పిన్‌ నంబర్‌ తదితర సమాచారాన్ని తెలుసుకొని ఖాతాల నుంచి నగదు కొల్లగొట్టేవారని, బ్యాంకులు ఇలాంటి సైబర్‌ క్రైమ్‌ల పట్ల ఖాతాదారులను అప్రమత్తం చేయడం, వినియోగదారుల్లో అవగాహన కలిగించడంతో మోసగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారని అన్నారు.

ఏమిటీ స్కిమ్మింగ్‌…?

ప్రత్యేక పరికరాలను అమర్చి క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల సమాచారాన్ని తస్కరించడాన్ని ‘స్కిమ్మింగ్‌’ అంటారని, ఇలా కార్డుల సమాచారాన్ని చౌర్యం చేయడానికి ఉపయోగించే పరికరాలను స్కిమ్మర్‌ పరికరాలు అంటారని తెలిపారు. ఎంపిక చేసుకున్న ఏటీఎంలలో మోసగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా వీటిని అమరుస్తారని, కస్టమర్లు ఏటీఎం ద్వారా నగదు తీసుకునేందుకు కార్డును స్వైప్‌ చేసినప్పుడు, కార్డు మ్యాగ్నటిక్‌ స్ట్రిప్‌లోని సమాచారం, పిన్‌ నంబర్‌ స్కిమ్మర్‌ సంగ్రహిస్తుందని తెలిపారు. సేకరించిన సమాచారంతో మోసగాళ్లు ఆ తర్వాత నగదు ఉపసంహరిస్తున్నారని అన్నారు. దీని కోసం కూడా పలు దారులు ఎంచుకుంటున్నారని, ప్రధానంగా నకిలీ కార్డులను తయారుచేసి సుదూర ప్రాంతాల్లోని ఏటీఎంల ద్వారా నగదు తస్కరిస్తున్నారని పేర్కొన్నారు.

మనమేం చేయాలి..

ఏటీఎంలో కార్డు రీడర్‌పై స్కిమ్మర్లను అమరుస్తారని, దీంతోపాటు ఏటీఎం పిన్‌ తెలుసుకోడానికి కీప్యాడ్‌కు వ్యతిరేకంగా పైభాగంలో చిన్న కెమెరాతో కూడిన స్కానర్‌ను కూడా ఉంచుతారని, ఏటీఎంలకు వెళ్లినప్పుడు ఇలాంటి పరికరాలు ఏవైనా ఉన్నాయో పరిశీలించడం ఉత్తమని తెలిపారు. నగర శివార్లలో ఉండే, జనసంచారం ఎక్కువగా లేని, సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలకు వెళ్లకపోవడం మంచిదని సూచించారు. పిన్‌ టైప్‌ చేసేటప్పుడు అరచెయ్యి అడ్డుపెట్టుకోవడం సురక్షితమని, నగదు విత్‌డ్రా చేయగానే మొబైల్‌కు మెసేజ్‌లు వచ్చేలా ఎస్‌ఎమ్‌ఎస్‌ అలర్ట్‌లు పెట్టుకోవాలని వివరించారు. చాలా మంది కస్టమర్లు ఫోన్‌ నంబర్లను మార్చేసినా..ఆ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలిపే విషయంలో నిర్లక్ష్యం వహిస్తారని, ఫోన్‌ నంబరు మార్చితే తక్షణమే బ్యాంకు ఖాతాకు కొత్త నెంబరును అనుసంధానం చేసుకోవడం మరచిపోవద్దుని తెలిపారు. మన ఖాతా నుంచి మన ప్రమేయం లేకుండానే నగదు ఉపసంహరణ జరిగినట్లు గుర్తిస్తే వెంటనే కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి ఏటీఎం సేవలను స్తంభింప చేసుకోవాలని చెప్పారు. వెంటనే సంబంధిత సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు.

raithu samagra serveylo vivaralu namodu chesukovali, రైతు సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాలి

రైతు సమగ్ర సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాలి

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర రైతు సర్వేలో నూతన పట్టాదారు పాస్‌ పుస్తకం పొందిన ప్రతి రైతు వివరాలను నమోదు చేసుకోవాలని ఏఈవో కావ్య తెలిపారు. రైతు సమగ్ర సర్వేలో భాగంగా బుధవారం మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో స్థానిక గ్రామ పంచాయితిలో రైతులకు సమగ్ర సర్వే నమూనాలు అందించి వివరాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 30 వరకు ఈ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సర్వేలో రైతుల భూములకు సంబంధించిన నీటి వసతులు, భూముల రకాలతోపాటు రైతుల ఆధార్‌, మొబైల్‌ నంబర్ల, బ్యాంక్‌ పాసు పుస్తకం జిరాక్సులను ప్రధానంగా సేకరిస్తున్నట్లు తెలిపారు.

21na sravs advaryamlo 10k run, 21న ఎస్‌ఆర్‌ఎవిఎస్‌ ఆధ్వర్యంలో 10కె రన్‌

21న ఎస్‌ఆర్‌ఎవిఎస్‌ ఆధ్వర్యంలో 10కె రన్‌

ఎస్‌ఆర్‌ఎవిఎస్‌ ఫిట్‌నెస్‌ జోన్‌ ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీన 10కె మారధన్‌ రన్‌ నిర్వహిస్తున్నామని నిర్వాహాకురాలు స్రవంతిరెడ్డి తెలిపారు. బుధవారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఎవిఎస్‌ ఫిట్‌నెస్‌ జోన్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ ఐఎంఎ, బంధన్‌ సెరిమిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సౌజన్యంతో ఈ 10కె రన్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రన్‌ ఈనెల 21వ తేదీ ఉదయం 5.30గంటలకు సుబేదారి ఆర్ట్స్‌ కళాశాల ఆడిటోరియం నుండి ప్రారంభమవుతుందని అన్నారు. ఈ రన్‌లో పాల్గొనదలిచిన వారు 500రూపాయలు చెల్లించి తమ పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. పాల్గొన్న వారికి టి-షర్లు, బిడ్‌ నెంబర్‌, సర్టిఫికేట్‌, మెడల్‌, పండ్ల రసాలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ హాజరవుతారని తెలిపారు. ఈ రన్‌లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 10వేల రూపాయలు, ద్వితీయ బహుమతిగా 5వేల రూపాయలు, తృతీయ బహుమతిగా మూడువేల రూపాయలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ఆదాయాన్ని తలసేమియా బాదితులకు అందజేస్తామని ఐఎంఎ రెసిడెంట్‌ నల్ల సురేందర్‌రెడ్డి, బంధన్‌ డైరెక్టర్‌ శ్రవన్‌, స్రవంతిరెడ్డి, టీంసభ్యులు సంగీతనాయుడు, మాధవి తెలిపారు.

మార్కెట్లో కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి.

మార్కెట్లో కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి.

నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌లో హమాలి, కూలి గంప, చీపురు కార్మికులకు కనీస వసతులు కల్పించాలని టీఆర్‌ఎస్‌ కెవి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు. బుదవారం తెలంగాణ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ టీఆర్‌ఎస్‌ కేవీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మార్కెట్‌ చైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లో కోతుల బెడద ఎక్కువగా ఉన్నందున కార్మికులు భోజనం చేయడానికి తీసుకువచ్చిన భోజనాలు ఎత్తుకు వెళ్తున్నాయని, వాటి రక్షణకోసం కార్మికులు సామానులు భద్రపరుచుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక విశ్రాంతి గది ఏర్పాటు చేయాలని, హామాలి కార్మికులకు సైకిల్‌ స్టాండ్‌ ఏర్పాటు చేయాలని, మహిళ కార్మికులు మూత్రవిసర్జనకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి ప్రత్యేక మూత్రశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. రాత్రివేళలో కాంటాలు జరుగుతున్నందున యార్డులో విద్యుత్‌ లైట్స్‌ లేక ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పరిష్కరించాలని చైర్మన్‌ను కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హమాలి యూనియన్‌ జిల్లా ఇంచార్జి కొల్లూరి లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు పాలడుగు రమేష్‌, డివిజన్‌ అధ్యక్షులు బలం ప్రసాద్‌, కార్మికులు మాదాసి భారతమ్మ, ఈశ్వరమ్మ, చిలకమ్మతోపాటు తదితరులు పాల్గొన్నారు.

batasarulaku basataga chalivendram, బాటసారులకు బాసటగా చలివేంద్రం

బాటసారులకు బాసటగా చలివేంద్రం

చలివేంద్రం బాటసారుల దాహార్తిని తీర్చుతూ బాసటగా నిలుస్తుందని ఆడెపు రవీందర్‌ అన్నారు. బుధవారం వరంగల్‌ మట్టెవాడలోని బాలాజీ స్వచ్చంధ సేవా సంస్థ వ్యవస్థాపకులు తోట హైమావతి, భూమయ్య గత 8సంవత్సరాలుగా చలివేంద్రం వేసవికాలంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆడెపు రవీందర్‌ హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాటసారులకు చవివేంద్రం బాసటగా ఉంటుందని అన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున చాలామంది బాటసారుల దాహార్తిని తీర్చడానికి ఇది ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులు రచయిత, దర్శకుడు టి.వి.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ ఎండాకాలంలో దాహార్తులు మంచి పరిశుభ్రమైన నీటిని సేవించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, డీహైడ్రేషన్‌ కాకుండా చూసుకోవాలని, కనీసం ఎక్కువ నీటిని సేవించాలని అన్నారు. భూమయ్య, హైమావతిలు మాట్లాడుతూ బాటసారుల దాహార్తిని తీర్చడం ఎంతో తృప్తిని కలిగిస్తుందని తెలిపారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సరళాదేవి, ఉషారాణి, రాజేశ్వర్‌రావు, కృష్ణమూర్తి, శ్రీదేవి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

vidinirvahanalo alsathvam vahiste cheryalu thappavu, విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిరిసిల్ల రాజన్న జిల్లా పురపాలక సంఘం కమీషనర్‌ డాక్టర్‌ కె.వి.రమణాచారి సిబ్బందిని హెచ్చరించారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని 1,2వ వార్డులలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య, ఇతర మౌళిక వసతులను ఆయన పర్యవేక్షించారు. వార్డులలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగాలేకపోవడంతో సానిటరీ ఇన్‌స్పెక్టర్‌, సానిటరీ జవాన్లను 500రూపాయల జరిమానా విధించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, తిరిగి పునరావృతమైతే విధుల నుంచి తొలగిస్తానని హెచ్చరించారు. పట్టణంలోని ఖాళీ స్థలాల యజమానులకు స్థలాలలో చెత్తచెదారం, పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాలని నోటీసులు జారీ చేయాలని టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందిని ఆదేశించారు. పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, లింక్‌రోడ్ల వద్ద ప్యాచ్‌ వర్క్‌లు త్వరగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్‌ సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యానగర్‌లో నిర్మాణం పూర్తికాబోతున్న మిషన్‌ భగీరథ ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ను సందర్శించి, నేడు సాయంత్రానికి పురపాలక సంఘానికి అప్పగించాలని, రోడ్‌ రిస్టోరేషన్‌ పనులు నాణ్యతాయుతంగా త్వరగా పూర్తి చేయాలని సంబంధిత డిఇ, ఇంజనీర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో 1,2వ వార్డుల కౌన్సిలర్లు రాగుల జగన్‌, బుర్ర నారాయణగౌడ్‌, పురపాలక సంఘ కార్యాలయ ఆయా విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

eddaru vrudulapia gurthuteliyani dundagula dadi, ఇద్దరు వృద్దులపై గుర్తుతెలియని దుండగుల దాడి

ఇద్దరు వృద్దులపై గుర్తుతెలియని దుండగుల దాడి

– ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌ గ్రామంలో దారుణం జరిగింది. ఇద్దరు వద్ధులపై గుర్తు తెలియని దుండగులు అమానుషంగా దాడి చేశారు. దీంతో ఒక వద్ధుడు మతి, మరో వద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దుండగులను తొందరలోనే పట్టుకుంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

rashtra prabuthvam vadda raithu samacharam purthisthailo ledu, రాష్ట్ర ప్రభుత్వం వద్ద రైతు సమాచారం పూర్తిస్థాయిలో లేదు

రాష్ట్ర ప్రభుత్వం వద్ద రైతు సమాచారం పూర్తిస్థాయిలో లేదు

రాష్ట్ర ప్రభుత్వం వద్ద రైతుల పూర్తి సమాచారం అందుబాటులో లేదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు సమగ్ర సమాచార సర్వేలో పాల్గొని పూర్తిస్థాయిలో సహకరించి విజయవంతం చేయాలని నర్సంపేట వ్యవసాయ శాఖ ఏడిఏ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం నర్సంపేట డివిజన్‌లోని దుగ్గొండి మండలకేంద్రంతోపాటు రేకంపల్లి, లక్ష్మీపురం, తిమ్మంపేట గ్రామాలలో రైతు సమగ్ర సమాచార సర్వేను మండల వ్యవసాయ శాఖ అధికారి చిలువేరు దయాకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామాలలో నిర్వహించిన రైతు సమగ్ర సమాచార సర్వే కార్యక్రమానికి ఏడీఏ శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలోని రైతులు పండించే పంటలు, పంటల గిట్టుబాటు ధరలు, భూములు ఉన్నప్పటికీ రైతు బంధు చెక్కులకు సంబంధించిన వివరాలు, పంట భూములకు సంబంధించిన వివరాల పట్ల రెవెన్యూ శాఖలో అనేక ఇబ్బందులు పెడుతున్న విధానం పట్ల వ్యవసాయశాఖ అధికారులతో విన్నవించుకున్నారు. రైతు సమగ్ర సమాచార సర్వేలో ప్రతి రైతు పాల్గొని తమ పట్టా పాసు పుస్తకాలు, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ పాసుబుక్‌ జిరాక్సులను అందించాలన్నారు. రెవెన్యూ శాఖలో పలు అంశాలు త్వరలో పరిష్కారం కానున్నాయని తెలిపారు. రైతులు పండించే వివిధ పంటలకు నష్టం వాటిల్లకుండా వాతావరణ బీమా పథకంలో ప్రతి రైతు చేరాలన్నారు. మండల వ్యవసాయ శాఖ అధికారి దయాకర్‌ మాట్లాడుతూ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నదని తెలిపారు. రైతుల అభివద్ధి కోసం మండల శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ విస్తీర్ణ అధికారులు రాజేష్‌, మాలోతు హనుమంతునాయక్‌, మోడెం విశ్వశాంతి గౌడ్‌, మధు, సర్పంచ్‌లు మోడీ విద్యాసాగర్‌ గౌడ్‌, తోకల మంజుల, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ తోకల నర్సింహారెడ్డిలతోపాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

conductorla ikya vedikanu vijayavantham cheyali, కండక్టర్ల ఐక్య వేదికను విజయవంతం చేయాలి

కండక్టర్ల ఐక్య వేదికను విజయవంతం చేయాలి

సిద్దిపేట పట్టణంలో రేపు జరిగే ఆర్టీసీ కండక్టర్ల ఐక్య వేదిక (ఆత్మీయుల సమ్మేళనం) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నర్సంపేట ఆర్టీసీ డిపో మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు నాగిశెట్టి ప్రవీణ్‌, గొలనకొండ వేణులు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యోగులు, ఆర్టీసీ కండక్టర్లు పోరాటం చేసినా నేడు ఫలితం లేకుండా పోయిందని, ఏదో ఒక కారణంతో ఉద్యోగాలు తొలగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం చర్చించి ఉద్యోగులకు సంపూర్ణ భద్రత కల్పించాలని ప్రకటన ద్వారా కోరారు. రేపు సిద్దిపేటలో జరిగే కండక్టర్ల ఐక్య వేదికను విజయవంతం చేయాలని అన్నారు.

raithulu samagra serveyku sahakarinchali, రైతులు సమగ్ర సర్వేకు సహకరించాలి.

రైతులు సమగ్ర సర్వేకు సహకరించాలి.

ప్రభుత్వం చేపట్టిన రైతు సమగ్ర సర్వేలో ప్రతి రైతులు తప్పక సహకరించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి దయాకర్‌ అన్నారు. మంగళవారం దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి, అడవి రంగాపురం, రేబల్లె, నాచినపల్లి గ్రామాలలో రైతు సమగ్ర సమాచార సర్వేను వ్యవసాయ శాఖ అధికారి దయాకర్‌ ప్రారంభించారు. పంటలు, భూముల రకాలు, పాడి పశువుల వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా దయాకర్‌ మాట్లాడుతూ రైతు సమగ్ర సేకరణ సర్వేలో ప్రతి ఒక్కరూ తమ పట్టా పాసు పుస్తకాలు, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం జిరాక్సులను అందించి సమగ్ర సర్వేలో నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ విస్తీర్ణ అధికారులు మాలోతు హనుమంతునాయక్‌, రాజేష్‌, విశ్వశాంతి, మదుతోపాటు గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

akrama matti tharalimpulapia cheryalu thisukovali, అక్రమ మట్టి తరలింపులపై చర్యలు తీసుకోవాలి

అక్రమ మట్టి తరలింపులపై చర్యలు తీసుకోవాలి

ఊరచెరువులలో ఏలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్‌ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జన్ను నర్సయ్య డిమాండ్‌ చేశారు. అక్రమ మట్టి తరలింపులను అడ్డుకుని చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మహేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామం, నెక్కోండ మండలం బంజరుపల్లి, నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామాల్లో అక్రమమట్టి తరలింపులు జరుగుతున్నప్పటికీ సంబందిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే అక్రమ మట్టి తరలింపులు ఆపి వారిపై చర్యలు తీసుకోకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

mayor pitampai jhansi, మేయర్‌ పీఠంపై ఝాన్సీ…?

మేయర్‌ పీఠంపై ఝాన్సీ…?

గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌గా కొనసాగి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్నపునేని నరేందర్‌ ఎన్నిక కావడంతో వరంగల్‌ మేయర్‌ స్థానం ఖాళీ అయింది. దీంతో నూతన మేయర్‌ను ఎన్నుకునేందుకుగాను ఈనెల 23న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 27న నూతన మేయర్‌ను ఎన్నుకోనున్నారు. మేయర్‌ పీఠం కోసం వరంగల్‌లో ప్రస్తుతం నాలుగుస్తంభాలాట కొనసాగుతోంది. ఈ పదవి కోసం 26వ డివిజన్‌ కార్పొరేటర్‌ గుండా ప్రకాష్‌, 27వ డివిజన్‌ కార్పొరేటర్‌ వద్దిరాజు గణేష్‌, 56వ డివిజన్‌ కార్పొరేటర్‌ నాగమల్ల ఝాన్సీలక్ష్మి, 28వ డివిజన్‌ కార్పొరేటర్‌ యెలగం లీలావతి పోటీపడుతున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్‌లో టిఆర్‌ఎస్‌కు పూర్తి మెజార్టీ ఉండగా ఎన్నిక లాంఛనమే కానుంది. అయితే మేయర్‌ పీఠాన్ని ఎవరూ దక్కించుకోనున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మేయర్‌ పీఠం కోసం నలుగురు కార్పొరేటర్లు పోటీ పడుతున్నా మేయర్‌ పీఠం మాత్రం 56వ డివిజన్‌ కార్పొరేటర్‌ నాగమల్ల ఝాన్సీకి ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు అధిష్టానం సైతం సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ఝాన్సీకే మద్దతు పలుకుతున్నట్లు తెలిసింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ సైతం ఝాన్సీకి మేయర్‌ పదవి పొందేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పోటీలో ఎంతమంది ఉన్నా చివరకు పదవి మాత్రం ఝాన్సీనే వరిస్తుందని గులాబీ వర్గాల్లో చర్చ జోరుగా కొనసాగుతోంది. అయితే ఈ పదవిని దక్కించుకునేందుకు మిగతా కార్పొరేటర్లు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఎవరెన్నీ ప్రయత్నాలు చేసినా మేయర్‌గా ఝాన్సీని టిఆర్‌ఎస్‌ అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలిసింది.

ennikalaku highcourt greensignal, ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలకు మంగళవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలను ఆపలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. పంచాయతీ రాజ్‌ యాక్ట్‌ 285ఏ సెక్షన్‌ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 50శాతం లోబడే ఉండాలని చెపుతుందని తెలిపింది. ఎలక్షన్‌ కమిషన్‌, పంచాయితీ రాజ్‌ ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ, ఎన్నికల సంఘానికి, తెలంగాణ బిసి కార్పొరేషన్‌, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.

asathya pracharalu cheste kesule, అసత్య ప్రచారాలు చేస్తే కేసులే

అసత్య ప్రచారాలు చేస్తే కేసులే

– రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌

సోషల్‌ మీడియాలో ఇవిఎంల గురించి అసత్య ప్రచారాలు చేస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ హెచ్చరించారు. గత కొద్దికాలంగా ఇవిఎంలపై సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న విషయాలను ఆయన ఖండించారు. ప్రజాస్వామిక స్ఫూర్తికి విఘాతం కలిగేలా కొందరు సోషల్‌ మీడియాలో ఈసీపై దుష్ప్రచారం చేస్తున్నారని రజత్‌కుమార్‌ మండిపడ్డారు. పోలింగ్‌ శాతాలతోపాటు పలుచోట్ల ఇవిఎంల తరలింపు తదితర అంశాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నట్టు స్పష్టం చేశారు. పోలింగ్‌ పూర్తయిన వెంటనే సాయంత్రం 5గంటలకు అంచనా వివరాలు ఇస్తామని.. తర్వాతి రోజు మాత్రమే పోలింగ్‌ శాతాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వగలమని పేర్కొన్నారు. పోలింగ్‌ ముగిసే ముందు ఫారం 17సీ కాపీలు పోలింగ్‌ ఏజెంట్లకు అందిస్తామని..దానిపై వాళ్ల సంతకాలు సైతం ఉంటాయని అన్నారు. ఫారం 17ఏ, ఫారం 17సీని సరిచూసుకున్న తర్వాత కూడా అనవసర రాద్ధాంతం చేయడం తగదని అన్నారు. జగిత్యాలలో ఆటోలో తరలించిన ఇవిఎంలు శిక్షణ కోసం వినియోగించినవేనని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. కల్పిత కథనాల వల్ల ప్రతిఒక్కరికీ అనుమానాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఇవిఎంలు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌లో ఫొటోలు తీసుకున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఆ వ్యక్తిపై న్యాయ విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.

 

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version