thiragabadda voterlu…, తిరగబడ్డ ఓటర్లు…!

తిరగబడ్డ ఓటర్లు…!

ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామరైతులు అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పోలింగ్‌ను బహిష్కరించి రెవెన్యూ అధికారులపై తిరగబడ్డారు. గ్రామంలో గత 80సంవత్సరాలుగా తాత, ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను 200ఎకరాల భూములు మావి కాదని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే పేరుతో స్థానిక విఆర్వో తమను వేధిస్తున్నాడని, తాము సాగు చేసుకుంటున్న భూముల్లో జెండాలు పాతించి ఇవి ప్రభుత్వ భూములని చెప్పి తమకు జీవనాధారం లేకుండా చేస్తున్నాడని గ్రామస్తులు అంటున్నారు. రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ గ్రామంలో ఓటింగ్‌ను బహిష్కరించి ధర్నాకు దిగారు. తమ సమస్యను పరిష్కరించేంత వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. గ్రామస్తులంతా ఏకమై ఓటింగ్‌ను బహిష్కరించడంతో పోలింగ్‌ కేంద్రం మొత్తం బోసిపోయింది. మధ్యాహ్నం వరకు ఓటు వేసే వారు లేక పోలింగ్‌ సిబ్బంది ఓటర్ల కోసం ఎదురుచూస్తూ ఖాళీగా కూర్చున్నారు.

బుజ్జగించిన తహశీల్దార్‌

గ్రామస్తులు ఓటింగ్‌ను బహిష్కరించిన విషయం తెలుసుకున్న నూగూరు వెంకటాపురం తహశీల్దార్‌ గ్రామానికి చేరుకుని గ్రామస్తులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ట్రైబల్‌ ఏరియాలో నాన్‌ట్రైబ్‌కు భూమి ఇచ్చే రూల్‌ లేదని ప్రభుత్వం ఎలా చెపితే తాను అలా చేస్తానని, విఆర్వోను తాను జెండాలు పాతమని చెప్పలేదని గ్రామస్తులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే గ్రామస్తులు మాత్రం గత 80సంవత్సరాలుగా తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములు ప్రభుత్వ భూములు ఎలా అవుతాయని ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం సాగు చేసుకుంటున్న గిరిజనేతరుల భూములను తాము స్వాదీనం చేసుకోమని తహశీల్దార్‌ హామీ ఇచ్చారు. ఇక ముందు గిరిజనేతరులు ఎవరు భూములను ఆక్రమించుకోకూడదని సూచించారు. అయినా రైతులు శాంతించలేదు. దీంతో జోక్యం చేసుకున్న వెంకటాపురం ఎస్సై తిరుపతి సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని, తాను సహకరిస్తానని ఓటు వేయాలని కోరడంతో రైతులు శాంతించారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారు

– శేషగిరిరావు, రైతు

బెస్తగూడెం గ్రామంలోని 200ఎకరాల్లో విఆర్వో రాజేందర్‌ జెండాలు పాతించి తమను వేధిస్తున్నాడని గ్రామ రైతు శేషగిరిరావు ఆరోపించారు. ఈ విషయం తహశీల్దార్‌కు ఫిర్యాదు చేస్తే అవి గిరిజనుల భూములు మీరు చచ్చిపోండని బాధ్యతారహిత్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెస్తగూడెం గ్రామానికి చెందిన అనేకమంది రైతులు గత 80సంవత్సరాలుగా తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వం తమను కరుణించి సమస్య పరిష్కారం చేయాలన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *