అటు లంచాలు..ఇటు అరాచకాలు.

మంత్రి ‘‘శ్రీనివాస్‌ రెడ్డి’’ ఆదేశాలు అంటే అంత లెక్క లేకుండా పోతుందా!

-ఒక్కొక్కటిగా బైట పడుతున్న రెవెన్యూ అధికారుల అగడాలు

-నిత్యం వెలుగు చూస్తున్న అనేక మంది ఎమ్మార్వోల బాగోతాలు.

-రాబందులకెక్కువ..రాక్షసులకు తక్కువగా తయారౌతున్నారు.

 

-మానవత్వం మర్చిపోతూ లంచాలకు తెగబడుతున్నారు.

-అక్రమాలు ఆపరు..లంచాలు మానరు.

-రైతులను తిప్పితిప్పి పిప్పి చేయకుండా వుండలేరు.

-ఒకరి భూములు మరొకరికి అంటగట్టకుండా అసలే వుండలేరు.

-రైతుల ఉసురు పోసుకుండా వుండరు.

-ఆఖరుకు రైతు చనిపోతే వచ్చే పరిహారంలో ఫలహారం కోరుతున్న వాళ్లున్నారు.

-ఆత్మకూరు ఎమ్మార్వో నిర్వాకానికి సజీవ సాక్ష్యం.

-పిండాలను కూడ వదలనంత దుర్మార్‌ంగా వ్యవహరిస్తున్నారు.

-2014లో చనిపోయిన రైతుకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు.

-హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా లెక్క చేయలేదు.

-తహసీల్దారుకు జీతభత్యాలు ఆపాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

-మోతె మండల ఎమ్మార్వో అరెస్టు అయ్యారు.

-ఫైళ్లను టాంపరింగ్‌ చేసిన ఆరోపణలు రుజువయ్యాయి.

-ఇంతగా దిగజారి బతకాలా!

-ప్రజలను పీడిరచడమేమైనా హక్కు అనుకుంటున్నారా!

-రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా మారరా?

-ప్రభుత్వాల ఉదాసీనత చేతగాని తనం అనుకుంటున్నారా?

-ప్రజల రక్తం తాగడం మానరా?

-చేసే తప్పులు చేస్తూనే అహంకారమా!

-అశుద్దాన్ని అద్దుకుతింటూ గొప్పలకు పోవడమా?

-మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరంటూ విర్రవీగుతుండడమా?

మీరు మారరా? మీలో మార్పు రాదా? మీలో మానవత్వం లేదా? అంటే మారితే మేమెందుకు అదికారులమౌతాము? మారితే మాకు అక్రమ సంపాదనలు ఎవరు సమకూర్చిపెడతారు? అని ప్రశ్నించే కాలమొచ్చినట్లుంది. అందుకే మమ్మల్ని ఎవరేం చేయలేరు. అవినీతి చేసినప్పుడు దొరికితే మహా అయితే పట్టుబడతాము? జైలుకెళ్తాము..ఇంతకన్నా జరిగేదేముంది? మా కొలువులు పోయేది వుందా? పరువు మర్యాదల కోసం ఆలోచిస్తూ కూర్చుంటే కోట్లు కూడబెట్టుకోవడం కుదుతుందా? అనుకుంటున్నట్లున్నారు. అందుకే అందిన కాడికి ఎక్కడైనా సరే దండుకోవడమే మాకు తెలుసు అన్నట్లుగా కొంత మంది తహసిల్ధార్‌లు వ్యవహరిస్తున్నారు. ఆరోపణలు నీటి మీద రాతలు. విమర్శలు గాలికి కొట్టుకువచ్చే దుమ్మురేణువులు అనుకుంటున్నారు. ఆరోపణలు నాలుగురోజులైతే చెరిగిపోతాయి. విమర్శలు దులిపేసుకుంటే రాలిపోతాయి. కోట్లు కూడబెట్టుకుంటే తరతరాలకు పనికి వస్తాయి. వచ్చే తరాలు హాయిగా బతుకుతాయి. ఇదే కొందరు అధికారులు కోరుకుంటున్నారు. అందుకే విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారు. దొరికితే దొంగ..లేకుంటే దొర..అంతే ఇక్కడ పెద్ద తేడాలేదు. దొరికినప్పుడు చూద్దాం..లే..ముందైతే లెక్క చెప్పు అనే వరకు వచ్చింది. అందుకే లంచాలు తీసుకోవడం కూడా మరింత పెరిగింది. దీనికి పుల్‌ స్టాప్‌ పడుతుందని ఆశించడం కూడా తప్పే అనుకుంటున్నారేమో! జనానిది అవసరం. మాది అదికారం. పాలకులు వచ్చి వెళ్తుంటారు. మేం లోకల్‌.. అన్నట్లుగా వుంది. ఈ మండలం కాకపోతే మరో మండలం..అన్నీ మండలాలు అక్షయపాత్రలే..ఎక్కడ కూర్చున్నా లక్షలు వచ్చిపడేవే.. మా సంతకానికి అంత విలువ. అందుకే లంచాలు తీసుకుంటున్నామనంటున్న వాళ్లు చాలా మంది తహసిల్థార్‌లు వున్నారు. ఎవరికి చెప్పుకున్నా, ఎవరితో మొరపెట్టుకున్నా ఆఖరుకు పనిచేయాల్సింది మేమే..సంతర్పణలు చేసుకోవాల్సింది మాకే అంటూ పని కోసం వచ్చిన వారితో బరితెగించి చెబుతున్నారంటే ఇక పరిస్దితి ఎంత దూరం వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. అలా పేట్రేగిపోయిన వారిలో తాజాగా నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండల ఎమ్మార్వోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తహసిల్ధార్‌ జీతభత్యాలు ఆపేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. కాని అది ఆ తహసిల్ధార్‌కు శిక్ష కాకపోవచ్చు. ఎందుకంటే జీతం మీదే ఆధారపడి బతకాలన్న భయం వుంటే లంచం అన్న మాట వింటేనే ఎవరికైనా చేతులు వణికిపోతాయి. కాని లంచాల ముందు జీతాలు బలాదూర్‌. కొంత మంది తహసిల్ధార్‌ల జల్సాలకు ఒక్క రోజు పెట్టే ఖర్చు జీతంకన్నా ఎక్కువగా వుంటుందని గొప్పలు చెప్పుకునేవారు కూడా వున్నారు. అలాంటి ఎమ్మార్వోలు జీతం ఆగుతుందంటే భయపడతారా? అయినా ఆగిన జీతం ఎంత కాలానికైనా వస్తుందన్న నమ్మకం. అయితే అసలు విషయమేమిటంటే హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని నీరుకుళ్ల గ్రామానికి చెందిన లక్కర్సు మొగిళి 2014లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రైతుకు ప్రభుత్వం నుంచి పరిహారం అందాల్సి వుంది. రైతుకు నష్టపరిహారం అందించడానికి తహసిల్ధార్‌ మెలికపెట్టారు. కాని ఆ పేద రైతు కుటుంబానికి అంత తాహతు లేదు. దాంతో ఏళ్ల తరబడి ఎమ్మార్వో కార్యాలయానికి మృతుడి భార్య తిరుగుతూనే వుంది. కాని ఆ తహిసిల్ధార్‌కు కనికరం కలగలేదు. ఇక విసిగిపోయిన రైతు బార్య లక్ష్మి హైకోర్టును ఆశ్రయించింది. వాదోపవాదాలు విన్న తర్వాత హైకోర్టు మృతుడికి పరిహారం అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసి తీర్పునిచ్చింది. అయినా ఎమ్మార్వో హైకోర్టు ఉత్తర్వులను కూడా పక్కన పెట్టాడు. ఈ విషయాన్ని పదే పదే మృతుడి బార్య ఎంత వేడుకున్నా ఎమ్మార్వో స్పందించలేదు. హైకోర్టు ఆదేశాలనే ఆ ఎమ్మార్వో బేకాతరు చేస్తూ వచ్చారు. దాంతో మళ్లీ రైతు కుటుంబం మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎమ్మార్వోకు జీత భత్యాలు ఆపేయాలంటూ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. జీవో. 173 ప్రకారం మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఉన్నత న్యాయస్దానం ఇచ్చిన తీర్పులను కూడా ఇలా ఎమ్మార్వోలు పక్కన పెట్టే స్ధాయికి చేరుకున్నారంటే , ఇక సామాన్యుల పరిస్దితి ఏమిటి? వారు చెప్పింది వినాల్సిందే..అడిగింది ఇవ్వాల్సిందే..లేకుంటే జీవిత కాలం చెప్పులరిగేలా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే..ఎమ్మార్వో కాళ్లునిత్యం మొక్కాల్సిందే..అయినా ఆఖరుకు ఎమ్మార్వోలు అడిగింది ఇస్తే తప్ప న్యాయం జరగదు. ఇలాంటి దుర్భరమైన పరిస్ధితులు రాష్ట్రంలో వున్నాయంటేనే సిగ్గు చేటు. ఇక మరో ఎమ్మార్వో మరో ఘనకార్యం వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లాకు చెందిన ఎమ్మార్వోల అక్రమాలపై గతంలోనే నేటిధాత్రి అనేక కథనాలు రాసింది. ఆయన చేస్తున్న దుర్మార్గాలను వెలుగులోకి తెచ్చింది. పాపం పండే కాలం రావాలంటే ఇదే మరి. ఆఖరుకు ఆ తహసిల్ధార్‌ జైలుకు వెళ్లాల్సిన పరిస్దితి ఇప్పుడు వచ్చింది. సూర్యాపేట జిల్లాకు చెందిన మోతే మండలంలోని రెవిన్యూ కార్యాలయంలో ఫైళ్ల టాంపరింగ్‌ జరుగుతోందంటూ నేటిధాత్రి వార్తలు రాసిన సందర్భం వుంది. రెవిన్యూ కార్యాలయంలో ఫహానీల టాంపరింగ్‌ జరిగింది వాస్తవమే అంటూ అధికారుల విచారణలో తేలింది. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మోతే మండల తహసిల్ధార్‌పై జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ దృష్టిపెట్టారు. కొంత కాలంగా ఎమ్మార్వోపై వస్తున్న వార్తలను సీరియస్‌గా తీసుకున్నారు. గత కొంత కాలంగా లోతైన విచారణ చాలా పకడ్భందీగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే తహసిల్ధార్‌తోపాటు, ఇద్దరు ఆర్‌ఐలు, కంపూరట్‌ ఆపరేటర్‌, మీ సేవ నిర్వాహకులతోపాటు ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలోనే అరెస్టైయిన తహసిల్ధార్‌ , ఆర్‌ఐలను జైలుకు పంపించారు. ఈ కేసులో దోషులుగా 21మందిని గుర్తించినట్లు తెలుస్తోంది. అంటే ఒక ఎమ్మార్వో మూలంగా వాటాలు పంచుకుతిన్న ఇతర ఉద్యోగులు కూడా బలికావాల్సి వచ్చింది. ఒక్క కార్యాలయం సాక్షిగా 21 మంది దోచుకుతింటున్నారంటే, ఒక్కొ వ్యక్తి వద్ద ఈ ముఠా ఎంతెంత వసూలు చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా వచ్చిన ప్రతి పైసాను వాటాలు వేసుకుంటున్నారంటే, ఏ రేంజ్‌లో అవినీతి చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అసలు రైతుల నుంచి ఇలా లంచాలు తీసుకుంటూ జలగలై రక్తాలు పీల్చుకుతింటున్నారు. అటు లంచాలు తీసుకుంటున్నారు. ఇలా ఫహానీలును టాంపరింగ్‌ చేస్తూ అరాచాలు సాగిస్తున్నారు. నిత్యం ఎక్కడో అక్కడ ఎమ్మార్వోల బాగోతాలు బైటపడుతూనే వున్నాయి. రిజిస్ట్రేషన్ల విషయంలో ఎమ్మార్వోలు సాగిస్తున్న అక్రమాలపై ఇప్పటికే మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి అనేక సార్లు హెచ్చరికలు జారీ చేస్తూనే వున్నారు. ఉపేక్షించే ప్రసక్తి లేదని తేల్చి చెబుతూనే వున్నారు. సమీక్షలు నిర్వహిస్తూ అక్రమార్కుల దుమ్ము దులుపుతూనే వున్నారు. ఇకనుంచి గతంలో లాగా క్షమించాడాలు వుండవని కూడా స్పష్టం చేస్తున్నప్పటికీ ఎమ్మార్వోల అరాచకాలు ఎక్కడా ఆగడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎమ్మార్వోలు రాబందులకెక్కువ..రాక్షసులకు తక్కువగా తయారౌతున్నారని సాక్ష్యాత్తు ప్రజలే నిందిస్తున్నారు. రైతులను, ప్రజలను జలగల్లా పీడిరచుకుతింటున్నారు. రైతు చనిపోతే వచ్చే పరిహారంలో కూడా చేతి వాటం చూపిస్తామనే దాకా దిగిజారి బతుకుతున్నారంటే అంతటి నికృష్టమైన బతుకు అవసరమా? సరే రైతు పరిహారంలో ఒక్క ఎమ్మార్వోకు చేతులు తడిపితే సరిపోతుందా?..ఆ కార్యాలయంలో ఎమ్మార్వో నుంచి కింది స్ధాయి వరకు పంచుకుంటూ పోతే తప్ప చెక్కు చేతికి రాదు. మానవత్వం పూర్తిగా మార్చిపోయారు. లంచాలు కూడా తమ హక్కు అనేకునే స్ధాయికి చేరుకుంటున్నారు. ప్రభుత్వాలు ఎంత బెదిరించినా అక్రమాలు ఆపరు. లంచాలు తీసుకోకుండా వుండరు. ఒకరి భూములు ఒకరికి అంటగట్టి పల్లెలో పంచాయితీలు పెంచుతున్నారు. రైతుల మధ్య పగలకు కారణమౌతున్నారు. రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఇస్తే పెట్టిన పిండాలను కూడా తింటామనే తరహాకు దిగజారిపోతున్నారు. ప్రభుత్వాల ఉదాసీనత చేతిగాని తనంగా తీసుకుంటున్నట్లున్నారు. ఓ వైపు తప్పులు చేస్తూనే దమ్ముంటే పట్టుకొమ్మను అని సవాలు విసురుతున్న ఎమ్మార్వోలు కూడా వున్నారంటే వారి అనైతిక ఎంత దూరం వెళ్తోందో అర్ధంచేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!