కాంగ్రెస్​ పార్టీ కరీంనగర్​ పార్లమెంట్​.!

కాంగ్రెస్​ పార్టీ కరీంనగర్​ పార్లమెంట్​ ఇన్​చార్జి వెలిచాల రాజేందర్​ రావు
నేతృత్వంలో పురుమళ్ల శ్రీనివాస్​పై పీసీసీ అధ్యక్షునికి-కాంగ్రెస్​ ముఖ్యనేతల ఫిర్యాదు

పెద్ద సంఖ్యలో హైదరాబాద్​ తరలివెళ్లిన కాంగ్రెస్​ నాయకులు

కరీంనగర్ నేటిధాత్రి:

పీసీసీ అధ్యక్షునితో గాంధీభవన్​లో భేటి, శ్రీనివాస్​ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చ గత నెల 28 వతేదీ నాటి ఘటనపై నివేదిక తెప్పించుకొని శ్రీనివాస్​పై
చర్యలు తీసుకుంటామని నేతలకు పీసీసీ అధ్యక్షుని హామీ. సానుకూలంగా స్పందించిన మహేశ్​కుమార్​ గౌడ్​. గత నెల 28వ తేదీన కరీంనగర్​లో కాంగ్రెస్​ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా నిర్వహించిన సన్నాహాక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్​పై కరీంనగర్​ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​చార్జి పురుమళ్ల శ్రీనివాస్​ పరోక్షంగా దూషణలకు దిగిన అంశంపై ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్​, పార్టీ పరిశీలకులు, ముఖ్యనేతల నుంచి నివేదిక తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటామని పీసీసీ అధ్యక్షులు మహేశ్​ కుమార్​ గౌడ్​ కరీంనగర్​ కాంగ్రెస్​ పార్టీ ముఖ్య నేతలకు హామీ ఇచ్చారు. పార్టీ పరువు తీసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. పార్టీ పరువు బజారుకు ఈడ్చే వారిపై, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్​లో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, బీజేపీ, బీఆర్​ఎస్​తో లోపాయికార ఒప్పందం చేసుకొని మంత్రి పొన్నం ప్రభాకర్​పై దూషణలకు దిగుతూ, పార్టీ పరువు తీస్తున్న పురుమళ్లను శ్రీనివాస్​ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్​ చేయాలని కాంగ్రెస్​ పార్టీ కరీంనగర్​ పార్లమెంట్​ ఇన్​చార్జి వెలిచాల రాజేందర్​ రావు నేతృత్వంలో కరీంనగర్​ జిల్లాకు రెండు వందల మంది కాంగ్రెస్​ ముఖ్యనేతలు పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్​ ముఖ్యనేతలు రెండు వందల మంది స్వచ్ఛందంగా మూకుమ్మడిగా సంతకాలు సేకరించి హైదరాబాద్ లోని గాంధీభవన్​కు​ తరలివెళ్లారు. వెలిచాల రాజేందర్​ రావు అధ్వర్యంలో కాంగ్రెస్​ ముఖ్యనేతలు గాంధీభవన్​లో పీసీసీ అధ్యక్షులు మహేశ్​కుమార్​ గౌడ్​ను కలిశారు. మంత్రి పొన్నంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పురుమళ్ల శ్రీనివాస్​ను వెంటనే బహిష్కరించాలని, తద్వారా పార్టీని బలోపేతం చేయాలని విన్నవించారు. ఈసందర్భంగా పురుమళ్ల వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడితో సుదీర్ఘంగా చర్చించారు. గత నెల 28వ తేదీన జరిగిన సమావేశంలో పురుమళ్ల మంత్రి పొన్నంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, దూషణలు, మంత్రిపై అక్కసు వెళ్లగక్కుతున్న వైనం, ఆయనతో పార్టీకి జరుగుతున్న నష్టం, తదితర అంశాలను ముఖ్యనేతలు మహేశ్​ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు. అన్ని విషయాలను పీసీసీ అధ్యక్షులు ఓపికగా విన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్​ నేతలతో పీసీసీ అధ్యక్షులు మాట్లాడారు. పురుమళ్ల వ్యవహారాన్ని పార్టీ నేతల నుంచి తెలుసుకున్నానని, వెలిచాల రాజేందర్​ రావు తన దృష్టికి తీసుకొచ్చారని, పూర్తి వివరాలతో నివేదిక తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. మీరు ఏలాంటి ఆందోళన చెందవద్దు, పార్టీలో అధిష్టానమే సుప్రీం, వారి ఆదేశాలను పాటించాలని సూచించారు. బహిరంగంగా విమర్శలు చేస్తూ పార్టీ పరువు తీసే వారిని ఉపేక్షించమని, సీనియర్​ నేత, మంత్రి పొన్నం ప్రభాకర్​పై శ్రీనివాస్​ వ్యక్తిగతంగా దూషణలకు దిగడం పద్దతి కాదని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి సానుకూలంగా చర్చించుకుంటే బాగుంటుందని తెలిపారు. ఇలా వ్యవహరించడం బాగా లేదని, శ్రీనివాస్​ తీరు సరిగా లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, మరో వైపు కాంగ్రెస్​ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పీసీసీ అధ్యక్షులు నేతలకు సూచించారు.
పురుమళ్ల పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు-కాంగ్రెస్​ ముఖ్యనేతలు
పురుమళ్ల శ్రీనివాస్​ వ్యవహారం రోజు రోజుకు శృతిమించుతున్నదని, బీజేపీ, బీఆర్​ఎస్​తో మ్యాచ్​ ఫిక్సింగ్​ చేసుకొని పార్టీలోనే ప్రతిపక్ష నేతలాగా వ్యవహరిస్తున్న తీరు విస్మయం కలుగుతున్నదని పీసీసీ అధ్యక్షుని దృష్టికి కాంగ్రెస్​ నేతలు తీసుకొచ్చారు. కరీంనగర్​లో కాంగ్రెస్​ పరిస్థితి దారుణంగా మారిందని, శ్రీనివాస్​ వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ పెద్దలే తలలు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. గత నెల 28వ తేదీ సోమవారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్​ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా సన్నాహాక సమావేశం జరిగిందనీ, దీనికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్​, డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, పార్టీ పరిశీలకులు, ఇతర ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని వివరించారు. పురుమళ్ల శ్రీనివాస్​ కుట్రపూరితంగా అలజడి సృష్టించేందుకు హాజరై మంత్రి పొన్నంపై పరోక్షంగా దుర్భాషలాడారని పేర్కొన్నారు. సమావేశానికి వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి, పరిశీలకులు, పార్టీ పెద్దల ముందే పార్టీ లైన్​ దాటి తమరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలే శ్రీనివాస్​పై తిరగబడ్డారని తెలిపారు. ఇప్పటికే పార్టీ పెద్దలు ఆయనకు రెండు సార్లు షోకాజ్​ నోటీస్​ అందించారని, అయినా ఆయనపై ఏలాంటి చర్య మాత్రం తీసుకోలేదనీ, పట్టపగ్గాల్లేకుండా నీచంగా పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని విన్నవించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్​ అభ్యర్థి గంగుల కమలాకర్​కు శ్రీనివాస్​ అమ్ముడుపోయారని ఫిర్యాదు చేశారు. బీజేపీ, బీఆర్​ఎస్​తో లోపాయికార ఒప్పందం చేసుకొని పార్టీకి నష్టం చేకూరుస్తున్నారని, ఇలాంటి వ్యక్తిని వెంటనే పార్టీ నుంచి తక్షణం సస్పెండ్​ చేయాలని కోరారు. లేకపోతే కరీంనగర్​లో పార్టీకి భవిష్యత్​ ఉండదని పేర్కొన్నారు. ఈసమావేశంలో కాంగ్రెస్​ పార్టీ కరీంనగర్​ పార్లమెంట్​ ఇన్​చార్జి వెలిచాల రాజేందర్​ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్, పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జనద్ రహమాత్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మడుపు మోహన్, తుమ్మనపల్లి శ్రీనివాస రావు, కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ పురం రాజేశం, జిల్లా గౌడ్ సంఘ అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్​, తాజా మాజీ కార్పొరేటర్లు, నాయకులు ఆకుల నరసన్న నర్మదా, కోటగిరి భూమా గౌడ్, గంట కళ్యాణి శ్రీనివాస్, మల్లికార్జున రాజేందర్, పడిశెట్టి భూమయ్య, పత్తెమ్​ మోహన్, మాచర్ల ప్రసాద్, మాజీ ఎంపీపీ సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, జక్కని ఉమాపతి బొమ్మ ఈశ్వర్ గౌడ్, బోనాల మురళి, గడ్డం శ్రీరాములు, మాచర్ల అంజయ్య గౌడ్, చెప్యాల శ్రీనివాస్ గౌడ్, తాళ్ల పెళ్లి సంపత్ గౌడ్, బత్తిని చంద్రయ్య, అనరాసు కుమార్, కుంబాల రాజ్ కుమార్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈనెల 27న జరిగే బిఆర్ఎస్ సభకు చీమల దండువలే

ఈనెల 27న జరిగే బిఆర్ఎస్ సభకు చీమల దండువలే తరలి వెళ్దాం-భూక్య తిరుపతి నాయక్

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశం గ్రామశాఖ అధ్యక్షులు పైడిపాల సతీష్ అధ్యక్షతన జరిగింది. ఈసమావేశానికి హాజరైన కొత్తపెళ్లి మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్ మాట్లాడుతూ ప్రపంచంలోనే కనీవిని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి పన్నెండు లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని ఈసభ చరిత్రలో నిలిచిపోతుందని ఈసభకు చింతకుంట గ్రామం నుండి చీమల దండులా తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యమే కేసీఆర్‌. ఆయన నాయకత్వమే శ్రీరామరక్ష. ఇది ప్రజల్లో ఉన్న భావన. తెలంగాణ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చాలనేది కేసీఆర్‌ సంకల్పం. ఈదిశగా వరంగల్‌ సభా వేదిక నుంచి ప్రజలకు విశ్వాసం కల్పిస్తారు కెసిఆర్. ఇరవై ఐదువ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న గులాబీ జెండా మరో యాభై ఏళ్ల పాటు కూడా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుంది. వచ్చే రెండు, మూడు దశాబ్దాల పాటు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయి. మన గళం, బలం, దళం, గులాబీ దండు. ఈదండులో చింతకుంట గ్రామం నుండి చీమల దండులా కదలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో యువజన విభాగం మండల అధ్యక్షులు గుర్రాల జయప్రకాశ్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రేణిగుంట రాజు, మైనార్టీ విభాగo అధ్యక్షులు సయ్యద్ చాంద్ పాషా, బిఆర్ఎస్ నాయకులు కర్ణకంటి స్వప్న, గుబిరె సుజాత, వరలక్ష్మి, బిఆర్ఎస్ నాయకులు చిట్టిపల్లి నరేందర్, బెజ్జంకి సంపత్, భానతూ శ్రీకాంత్, మహేష్ గౌడ్, కమల్ గౌడ్, మణిదీప్, మల్లేశం, రవి, భాస్కర్ నాయక్, అమృత్, శంకర్, శశిధర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లా సంస్థాగత ఎన్నికల.!

కరీంనగర్ జిల్లా సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా రఘునాథ్ రెడ్డి..

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా క్యాతనపల్లి మునిసిపాలిటీకి చెందిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ లు కరీంనగర్ జిల్లా పరిశీలకులుగా తనను నియమించినట్లు రఘునాథ్ రెడ్డి తెలిపారు.రానున్న రోజుల్లో తెలంగాణలో సంస్థాగత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామం, మండలం, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేసే తీరును పరిశీలించేందుకు పరిశీలించేందుకు జిల్లా పరిశీలకునిగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.

విద్యాశాఖ కరీంనగర్ మరియు అల్ఫోర్స్ సంయుక్తంగా.

పాఠశాల విద్యాశాఖ కరీంనగర్ మరియు అల్ఫోర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఒలంపియాడ్ ఫౌండేషన్ తరగతులో భాగంగా హాజరై స్టడీ మెటీరియల్ మరియు పుస్తకాలను పంపిణీ చేసిన నిర్వాహకులు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా పరిపాలన అధికారి పామెల సత్పత్తి, ఐఏఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒలంపియాడ్ ఫౌండేషన్ కోచింగ్ లో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని అల్ఫోర్స్ హైస్కూల్ ని సందర్శించి ప్రభుత్వ పాఠశాల 8&9వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, పుస్తకాలను అల్ఫోర్స్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేసిన నిర్వాకులు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వి.నరేందర్ రెడ్డి. విద్యార్థులకు ఇరవై ఒక రోజులపాటు ఉచిత భోజన వసతితో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే చక్కటి ప్రణాళికలతో కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలుపుతూ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మొదటి దశలో మూడు వందల యాభై మంది విద్యార్థులో ఎనభై మంది విద్యార్థులు ఎంపికైనరని ఆఎంపికైన వారికి రెండో దశలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం వ్యాయామం, యోగా, సాయంత్రం డ్యాన్స్ తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థులకు సేవనందించే అవకాశం కల్పించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమెల సత్పతి, ఐఏఎస్ కి, జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్ విఎస్ జనార్దన్ రావుకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ).!

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)కరీంనగర్ నగర నూతనకమిటీఎన్నిక

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

సిపిఐ కరీంనగర్ నగర 11వ మహాసభలో నగర నూతన కమిటీని శుక్రవారం రోజున ఎన్నుకోవడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. సిపిఐ నగర కార్యదర్శిగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులుగా పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, కోశాధికారిగా బీర్ల పద్మలతో పాటు పదకోండు మంది కార్యవర్గ సభ్యులు ఇరవై తోమ్మిది మంది కౌన్సిల్ సభ్యులను నూతనంగా ఎన్నుకోనైనదని వారు తెలిపారు. నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ నగరంలో సిపిఐ పార్టీని వాడవాడనా బలోపేతం చేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ జెండా మున్సిపల్ పై ఎగిరే విధంగా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేస్తామన్నారు. నగరంలో అభివృద్ధి పనుల్లో పూర్తిగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని వీటిపై రానున్న కాలంలో ఉద్యమాలు చేస్తామని వారు పేర్కొన్నారు. నగరంలో వేలాది మంది ప్రజలు ఇండ్లు లేక కిరాయి ఇండ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇండ్లులేని నిరుపేదలకు ఇండ్లు వచ్చేంతవరకు పోరాటాలు చేస్తామని, రేషన్ కార్డులు,పెన్షన్లు ఇతర సంక్షేమ పథకాలన్నీ పేద ప్రజలకు అందేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్నికకు సహకరించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామికి ధన్యవాదాలు తెలియజేశారు.

సిపిఐ కరీంనగర్ నగర11వ మహాసభను జయప్రదం చేయండి.

సిపిఐ కరీంనగర్ నగర11వ మహాసభను జయప్రదం చేయండి.

సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

ఈనెల 18వ తేదీన సిపిఐ కరీంనగర్ నగర పదకోండవ మహాసభ నగరంలోని గణేష్ నగర్ లో గల బద్ధం ఎల్లారెడ్డి భవన్ లో ఉదయం 10:30 గంటలకు జరగనుందని ఈయొక్క మహాసభకు నగరంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహా సభను విజయవంతం చేయాలని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజులు కోరారు.

ఈయొక్క మహాసభకు ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామిలు హాజరై ప్రసంగిస్తారని వారు తెలిపారు. ఈయొక్క నగర మహాసభలో కరీంనగర్ నగరంలోని అరవైవ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయుటకు కార్యకర్తలను సంసిద్ధం చేయడం జరుగుతుందన్నారు.

నగరంలో గత రెండు సంవత్సరాలుగా అభివృద్ధి పనులు అటకెక్కాయని గత ప్రభుత్వం ఆగ మేఘాల మీద అనేక పనులను శంకుస్థాపనలు చేసి వదిలేసిందని చాలా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని ఎన్నికల ముందు చెప్పి పూర్తిగా మరిచిపోయారని ఆరోపించారు.

Congress

స్మార్ట్ సిటీ పనుల్లో పూర్తిగా అవినీతి అక్రమాలు జరిగాయని, మానేర్ రివర్ ఫ్రంట్ తీగల వంతెన పనుల్లో పూర్తిగా నాణ్యత లోపించి రోడ్డు పూర్తిగా ధ్వంసమవుతుందని గత మున్సిపల్ పాలకవర్గం పూర్తిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డందని భూకబ్జాలు, ఇండ్లు కడితే కమిషన్లు, ఇంటి నెంబర్ కు డబ్బులు తీసుకుని నానా రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టారని ఈసమస్యలతో పాటు నగరంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాల కోసం రేషన్ కార్డుల కోసం అర్హులైన వారికి పెన్షన్ల కోసం రానున్న కాలంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్ళుటకు ఈమహాసభ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం, ఆరు గ్యారెంటీలు అర్హులైన వారికి అందే వరకు ఉద్యమాలతో ఒత్తిడి తీసుకువచ్చి పేద ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందే వరకు పోరాట కార్యాచరణ చేస్తామని సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు తెలిపారు. ఈమహాసభ నగర ప్రజల దశ దిశ మార్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. కావున నగర ప్రజలు మహాసభలో అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన సీపీఐ నేతలు.

కరీంనగర్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించిన సీపీఐ నేతలు
అడ్డుకున్న పోలీసులు

అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినా వంటగ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గం- సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో బిజెపి ప్రభుత్వం పేద మధ్యతరగతి సామాన్య ప్రజలపై భారం మోపడానికి వంటగ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమని పేదలపై భారం మోపే దేశ ప్రధాని మోడీకి మూడినట్లేనని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. మంగళవారం కరీంనగర్ లోని కమాన్ చౌరస్తా వద్ద సిపిఐ ఆధ్వర్యంలో పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించిన సిపిఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులకు, సీపీఐ నేతలకు తోపులాట జరగగా సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు తలకు గాయమై రక్తస్రావం అయ్యింది.కొంతమంది కిందపడగా వారికి దెబ్బలు తగిలాయి. ఆందోళన చేస్తున్నంత సేపు వాహనాలు నిలిచిపోయాయి. ఈసందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చమరు ధరలను తగ్గించకుండా ఆయిల్ కంపెనీలకు వత్తాసు పలుకుతుందని, అర్ధరాత్రి వంటగ్యాస్ యాభై రూపాయలు పెంచి పెదాలపై భారం మోపి పెట్రోల్, డీజిల్ పై రెండు రూపాయలు పెంచి వీటిని ఆయా కంపెనీలే భరించాలని కేంద్ర మంత్రి ప్రకటించడం దుర్మార్గమని, ఏదో ఒక రోజు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచదనే గ్యారంటీ లేదని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రధానిగా పదకొండు సంవత్సరాలు గడిచిపోయిందని పదకొండు సంవత్సరాలలో పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలపై పెను భారం మోపడానికి అనేకసార్లు పెట్రోలు, డీజీలు, వంటగ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి పేదల జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా మోడీ పాలన కొనసాగుతుందని, పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకు లాభం చేకూర్చే విధంగా మోడీ ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయని అలాంటి విధానాలకు మోడీ స్వస్తి పలకాలని,తక్షణమే వంటగ్యాస్ ధరలను తగ్గించాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించక తప్పదని వెంకటస్వామి హెచ్చరించారు. వంటగ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఐ నాయకులు శాంతియుతంగా కమాన్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించడానికి అక్కడకు చేరుకున్న సీపీఐ నాయకులపై, కార్యకర్తలపై కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించి, దురుసుగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని, ముఖం కనబడకుండా మాస్కులు వేసుకొని ఆర్ఎస్ఎస్,బిజెపికి తొత్తులుగా కొంతమంది వ్యవహరిస్తూ నాయకులపై, కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించడాన్ని సీపీఐ ఖండిస్తుందని, పేద ప్రజలకు అండగా సీపీఐ నిరంతరం ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తుందని, పోలీసులు ఈవిషయాన్ని గుర్తుంచుకొని వ్యవహరించాలని వెంకటస్వామి అన్నారు. ఈఆందోళన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పైడిపల్లి రాజు, కిన్నెర మల్లవ్వ, సాయవేణి రాయమల్లు, బామండ్లపెల్లి యుగంధర్, న్యాలపట్ల రాజు, బోనగిరి మహేందర్, మచ్చ రమేష్, నాయకులు కొట్టే అంజలి, చెంచల మురళి, తంగెళ్ళ సంపత్, చారి, రాజు, కూన రవి,నల్లగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ధర్నా.

ఉమ్మడి కరీంనగర్ లో బిజెపి సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ధర్నా

 

సిరిసిల్ల 🙁 నేటి ధాత్రి )

 

బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి నేడు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఉమ్మడి కరీంనగర్ బిజెపి కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొనడం జరిగింది.
₹2 లక్షల రుణమాఫీ హామీ అమలు చేయాలని, రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని, వ్యవసాయ కూలీలకు ₹12,000 అందించాలని, పంటల బీమా యోజన అమలు చేయాలని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ బిజెపి జిల్లా కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు

ఎడ్యుకేషనల్ హబ్ గా కరీంనగర్..

ఎడ్యుకేషనల్ హబ్ గా కరీంనగర్..

 

ఇంజినీరింగ్, లా కాలేజ్ మంజూరుతో విద్యారంగం మరింత అభివృద్ధి..

 

విద్యా రంగంలో సీఎం రేవంత్ రెడ్డి విప్లవాత్మక కార్యక్రమాలు..

 

దేశంలోనే అత్యుత్తమ

గుర్తింపు తెస్తున్న ముఖ్యమంత్రి

 

శాతవాహన యూనివర్సిటీకి లా కాలేజీ, హుస్నాబాద్ లో ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఇందుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు

 

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు

 

కరీంనగర్, నేటిధాత్రి:

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగంలో చేపడుతున్న విప్లవాత్మక మార్పులతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాబోయే కాలంలో ఎడ్యుకేషనల్ హబ్ గా మారబోతున్నదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.

కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీకి లా కాలేజీ, హుస్నాబాద్ లో ఇంజినీరింగ్ కాలేజ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇందుకోసం ప్రత్యేకంగా కృషి చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మంగళవారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ కి లా కాలేజ్, హుస్నాబాద్ కు ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

పెద్దపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళాశాలలు ప్రకటించారని, మూడు నెలల లోపే వాటిని మంజూరు చేస్తూ హామీని నిలబెట్టుకోవడం చారిత్రాత్మకమన్నారు.

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కరీంనగర్ జిల్లాలో విద్యారంగం కుంటుపడిందని తెలిపారు.

అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం కరీంనగర్ కు మెడికల్ కాలేజ్ మంజూరు చేయలేదని మండిపడ్డారు. మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం గతంలో ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ కు మెడికల్ కళాశాల మంజూరు చేశారని పేర్కొన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటులో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలకపాత్ర పోషించారని తెలిపారు.

బిఆర్ఎస్ పాలకులు గత పదేళ్ల కాలంలో విద్యారంగాన్ని బ్రష్టు పట్టించారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగ అభివృద్ధికి అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపడుతున్నారని రాజేందర్ రావు తెలిపారు.

ప్రతి ఏటా ప్రభుత్వం బడ్జెట్లో విద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నదని చెప్పారు.

ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ ప్రభుత్వం విద్య శాఖకు ఈ 23,108 కోట్ల రూపాయలు కేటాయిం చిందని రాజేందర్ రావు పేర్కొన్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ దూరదృష్టితో అర్ధ శతాబ్దానికి పూర్వం చెప్పిన ఈ మాటలు నేటికీ మన సమాజానికి వర్తిస్తాయనీ, అందులో భాగంగానే యువతకు శాస్త్ర- సాంకేతిక నైపుణ్యతను పెంపొందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని హైదరాబాదులో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.

డా.బి.ఆర్.అంబేద్కర్ కలలు కన్న విద్యావ్యవస్థను తయారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు.

దీనికోసమే రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి 11, 600
కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం ఒక చారిత్రాత్మకమని పేర్కొన్నారు.

ప్రతి నియోజక వర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నదని తెలిపారు.

శాతవాహన యూనివర్సిటీ పరిధిలో హుస్నాబాద్లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్ సీఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, ఈసీఈ బ్రాంచులను ఏర్పాటు చేయనున్నారని తెలిపారు.

ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి రూ.44.12 కోట్లు కేటాయించగా అందులో రూ.29.12 కోట్లు ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు.

శాతావాహన వర్సిటీలో ఏర్పాటు చేయనున్న లా కాలేజీలో మూడేళ్ల కోర్సు, రెండేళ్ల కోర్సు(మేధో సంపత్తి చట్టం)లో అడ్మిషన్లను ఇవ్వనున్నారని తెలిపారు. ఈకాలేజీ నిర్మాణానికి మొత్తం రూ.22.96 కోట్లు కేటాయించగా..

అందులో ప్రస్తుతం ఐదు కోట్లు మంజూరు చేశారనీ, మొత్తంగా రూ.67.08 కోట్లను ప్రభుత్వం ఈ రెండు కాలేజీలకు కేటాయించనుందని రాజేందర్రావు పేర్కొన్నారు.

లా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇందుకోసం ప్రత్యేకంగా కృషి చేసిన రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వెలిచాల రాజేందర్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

INTUCF నూతన అధ్యక్షులుగా అంబాల శ్రీనివాస్ ఎన్నిక

ఐ ఎన్ టి యు సి ఎఫ్, కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షులుగా అంబాల శ్రీనివాస్ ఎన్నిక

కార్మికుల సమస్యల పట్ల నా వంతు కృషి చేస్తా

నూతన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంబాల శ్రీనివాస్

జమ్మికుంట :నేటిధాత్రి

తెలంగాణ రాష్ట ( ఐ ఎన్ టి యు సి ఎఫ్, )అధ్యక్షులు మురారి బుద్దరం, మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జిర్లపెల్లి రాజు, హైదరాబాద్ కార్మిక సంఘం భవనంలో, కార్మిక సమావేశంలో కరీంనగర్ జిల్లా (ఐ ఎన్ టి యు సి,) అధ్యక్షులు గా హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం, బేతీగల్ గ్రామానికి చెందిన అంబాల శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా.. అంబాల శ్రీనివాస్ మాట్లాడుతూ..
నా నియామకానికి కృషి చేసిన కార్మిక సంఘం నాయకులకు మరియు వివిధ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నియామకం ద్వారా అసంగటిత కార్మికులు మరియు సంగటిత కార్మికుల సమస్యలను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని, వారు అన్నారు.

ఉద్యోగానికి రాజీనామా ఒక డ్రామా!

-హరికృష్ణ త్యాగం ఒక మిధ్య!!

-రాజీనామా చేసినా ఉద్యోగం మళ్ళీ వస్తుంది?

-అలా ఉద్యోగాలు పొందిన వాళ్లు కోకొల్లలు!

mlc candidate harikrishna

-ప్రజలను మభ్యపెట్టి సానుభూతి కోసం ఆరాటం

-ఎన్నికలలో గెలవాలన్న ఆలోచనతో ప్రచారం

-కోచింగ్‌ సెంటర్ల మేలు కోసం సరికొత్త నాటకం

-కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులంతా ఏకమై సాగిస్తున్న రాజకీయం

-ఎమ్మెల్సీ ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నవి

-ఒక సామాన్యమైన ఉద్యోగికి అంత సొమ్మెక్కడిది!

-జీతంలో ముప్పై శాతం సామాజిక కార్యక్రమాలు గొప్పల కోసమే

-ప్రభుత్వాల మీద కోచింగ్‌ సెంటర్ల ఆధిపత్యం కోసం కొత్త ఎత్తుగడ

-విద్యార్థుల జీవితాలు ఫణంగా పెట్టి సంపాదనా మార్గాలకు రాచబాట

అబద్దమాడరాదు..సత్యమునే పలుకవలెను..అని చెప్పాల్సిన గురువులు కొందరు పచ్చి అబద్దాలు చెప్పి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ గౌడ్‌ మాటలు అలాగే వున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో ఆయన కొంత కాలం క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి తాను ప్రజా సేవ కోసం ప్రజల్లోకి వచ్చానని, ప్రజా సేవ కోసం తన ఉద్యోగాన్ని తృణ ప్రాయంగా వదిలేశానని, కొలువుకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని ప్రచారం మొదలు పెట్టారు. సహజంగా ఇలాంటి మాటలు విన్నవారికి ఎవరికైనా సరే అవునా? చాలా గొప్ప వ్యక్తి అన్న భావనే ఏర్పడుంది. చాలా మందికి అసలు నిజం తెలియదు. అంతలోతుగా కూడా ఎవరూ ఆలోచించరు. ఉద్యోగాల విషయంలో ఎలాంటి వెసులు బాటు వుంటుందో కూడా ఇతరులకు పెద్దగా అవగాహన వుండదు. దాంతో ఉన్నతమైన ఉద్యోగం వదిలి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడేమో? అని జనం ఆలోచిస్తుంటారు. కాని అదంతా నిజంకాదు. ఇకపోతే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతోనే గత కొంత కాలంగా చిన్నా చితక సామాజిక కార్యాక్రమాలు చేపడుతూ వస్తున్నానని ఆయనే చెబుతున్నారు. తనకు వచ్చే జీతంలో కొంత శాతం సమాజ సేవ కోసం ఖర్చు చేస్తున్నానంటూ చెబుతుండడం విడ్డూరం. ఆయనకు వచ్చే జీతమెంత? అందులో చేసే ఖర్చెంత? ఎందుకంటే ఆసుపత్రుల్లో పది మంది రోగులకు పండ్లు పంచినా అది సామాజిక సేవే…కాని మన సమాజంలో ఎంతో మంది కొన్ని కోట్ల రూపాయలు సమాజం కోసం ఖర్చు చేస్తూ గుప్త దానాలు చేస్తున్న వారు అనేక మంది వున్నారు. వాళ్లెవరూ ఇలా ప్రచారం చేసుకోరు. అసలు పేదలను ఆదుకునేందుకు విద్యా, వైద్య సహాయ కార్యక్రమాలు చేస్తున్నట్లు కూడా తెలియదు. కాని రాజకీయ భవిష్యత్తుకోసం ఆరాటపడే వాళ్లే ఇలా చిన్నా చితక సాయాలు చేసి పెద్దగా ప్రచారం చేసుకుంటారు. మీడియాలో వార్తలు రాయించుకొని ప్రచారంలో దూసుకుపోతుంటారు. ఉద్యోగానికి రాజీనామా చేసిననాడు కూడా ఇలాగే తన త్యాగం గురించి చెప్పుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేసి, గొప్పలు చెప్పుకున్నారు. ఆ మరునాడు వచ్చిన మీడియా కథనాలను బ్రోచర్‌గా మార్చుకొని రాజకీయ పార్టీల వెంట ప్రసన్న హరికృష్ణ తిరిగారు. ముఖ్యంగా అదికార కాంగ్రెస్‌ పార్టీ చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. కాని కాంగ్రెస్‌ పార్టీ ప్రసన్న హరికృష్ణను నమ్మలేదు. ఎందుకంటే హరికృష్ణ ఉద్యోగ జీవితమే పట్టుమని పదిహేనేళ్లు లేదు. రిటైర్‌ మెంటుకు దగ్గరకూడా లేరు. కాని ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం అడుగులు వేశారు. అందులోనూ పెద్దల సభను ముందుగా ఎంచుకున్నాడు. ఇక్కడే ఆయనలోని అత్యాశ కనిపించింది. ఒక సాధారణ వ్యక్తి రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు చిన్న వయసు నుంచే కార్యకర్తగా మొదలై, అంచెలంచెలుగా ఎదుగుతుంటారు. లేకుంటే రిటైర్‌ అయ్యే సమయంలో రాజీనామాలు చేసి రాజకీయాల్లోకి వస్తుంటారు. కాని ఇంకా ఎంతో ఉద్యగ భవిష్యత్తు వున్న వ్యక్తి రాజీనామా చేశానని చెప్పి, ప్రజలను నమ్మించి రాజకీయాల్లో వస్తున్నానంటే ఎవరూ నమ్మరు. కారణం ఆ ఉద్యోగం ఎటూ పోదు. ఇంకా రెండేళ్లకైనా సరే ఆ ఉద్యోగం మళ్లీ వస్తుంది. అవసరమైతే ఆ జీతమంతా కలుపుకొని కొలువొస్తుంది. ఈ జిమ్మిక్కులు సామాన్యులకు తెలియవు. ఏదొ కారణం చెప్పి కోర్టును ఆశ్రయిస్తారు. ఇలా రాజీనామాలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్లీ కొలువులు తెచ్చుకున్నవారు అనేక మంది వున్నారు. ఇలా ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయడం త్యాగం కాదు. ప్రజలను మోసం చేయడం. అద్యాపక వృత్తిలో వుంటూ నీతి, నిజాయితీని సమాజానికి పంచాల్సిన వ్యక్తి అబద్దాల పునాదుల మీద, అసత్యాలతో రాజకీయాలు చేయాలనుకోవడం తప్పు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ తన కొలువు తిరిగి తెచ్చుకోవడం కోసం న్యాయ స్దానాలను కూడా మోసం చేస్తారు. ఇలా కోర్టులను కూడా మోసం చేయగలిగిన వాళ్లు ప్రజలను మోసం చేయకుండా వుండగలరా? నల్లగొండ ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధికూడా ఇలాగే తన ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకొని, వారు కోరినంత ముట్ట జెప్పి, కోర్టును కూడా ప్రబావితం చేసి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. అందువల్ల హరికృష్ణ చెబుతున్నది అబద్దమని, త్యాగం అసలే కాదని ఇక్కడే తేలిపోయింది. ఇంకా ఆయనను ప్రజలు నమ్ముతారని అనుకోవడం విచిత్రం. ఇక కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంటుగా పోటీకి నామినేషన్‌ వేసిన హరికృష్ణ కొంతకాలంగా తాను బిసినంటూ బిసీ వాదం వినిపిస్తూ వచ్చారు. బిసిలను సంఘటితం చేసి విజయం సాధిస్తాననుకున్నారు. కాని అటు వంటి దారి ఎక్కడా కనిపించలేదు. దాంతో రాత్రికి రాత్రి బిఎస్పీ కండువా కప్పుకున్నారు. బిఎస్పీ కార్యకర్తలైన పట్టుబద్రుల వద్దకు వెళ్లినప్పుడు బిఎస్పీ కండువా కప్పుకుంటున్నారు. ఇతర బిసి పట్టభద్రుల వద్దకు వెళ్లినప్పుడు బిసి కండువాతో ప్రచారం సాగిస్తున్నారు. తాను ఎంత ఊసరవెళ్లి రాజకీయాలను చేయగలనో ఇక్కడే ఆయన చూపించుకుంటున్నారు. ఈ రెండిరటికన్నా మరో భయంకరమైన నిజం హరికృష్ణ రాజకీయంలో దాగి వుంది. గత ప్రభుత్వ సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగాలు లేకున్నా, అప్పటి ప్రభుత్వం చెప్పే మాటలతో కోచింగ్‌ సెంటర్లన్నీ కళకళలాడుతుండేవి. కోచింగ్‌ సెంటర్లు కూడా ఇదిలో ఈ నోటిఫికెషన్‌ వచ్చే, ఆ నోటిఫికేషన్‌ వచ్చే అని ప్రచారం చేసుకోవడానికి వీలుండేది. ప్రభుత్వం నుంచి ఉద్యోగాల కల్పన ప్రకటన వచ్చిన నాటి నుంచి కోచింగ్‌ సెంటర్లప్రచాం మొదలు పెట్టేవి.తెలంగాణ వచ్చిన తర్వాత లక్ష ఉద్యోగాలు ఇస్తామని గత బిఆర్‌ఎస్‌పాలకులు చెప్పడంతో గ్రామీణ ప్రాంతాల పట్టభద్రులు పెద్దఎత్తున నగరాలకు చేరుకుంటూ వుండేవారు. ముఖ్యంగా హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఉమ్మడిజిల్లాల కేంద్రాలలో పెద్దఎత్తున వెలసిన కోచింగ్‌ సెంటర్లలో చేరేవారు. దాంతో కోచింగ్‌ సెంటర్లకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది. కాని ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు వేయడం నిర్ణీత గడువు ప్రకటించడం, పరీక్షలు నిర్వహించడం కోచింగ్‌ సెంటర్లబొచ్చేలో రాయి వేసినట్లైంది. కోచింగ్‌ సెంటర్లు వెలవెలబోతున్నాయి. కొన్ని దశాబ్ధాలుగా ఏటా కిటకిటలాడే కోచింగ్‌ సెంటర్లు మూసుకోవాల్సిన పరిస్ధితి విచ్చింది. ఆ మధ్య డిఎస్సీ, గ్రూప్‌ వన్‌ ల మీద పెద్దఎత్తున సొమ్ము చేసుకోవాలని చూసిన కోచింగ్‌ సెంటర్లు, అభ్యర్ధులను రెచ్చగొట్టి రోడ్లమీదకుతెచ్చింది. పరీక్షలు వాయిదా వేయాలని ఉద్యమాలు చేయించింది. అయినా ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఉద్యోగ పరీక్షలు నిర్వహించింది. దాంతో కోచింగ్‌ సెంటర్ల గొంతులో వెలక్కాయ పడినట్లైంది. ఇకపై ప్రభుత్వం తమ చెఫ్పుచేతుల్లో వుండాలన్న ఆలోచనతో కోచింగ్‌ సెంటర్లన్నీ ఏకమై ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చు భరించేందుకు ముందుకు వచ్చి, హరికృష్ణను రంగంలోకి దింపాయి. గుట్టు చప్పుడు కాకుండా కాంగ్రెస్‌ పార్టీనుంచి టికెట్‌ తెచ్చుకునేలా హరికృష్ణ కూడా వ్యూహం పన్నారు. ఎందుకంటే ఆయన ఓ వైపు కాంపిటీటివ్‌ పరీక్షల కోసం పుస్తకాలు రాస్తూ , అదనపు ఆదాయం సమకూర్చుకుంటుంటారు. కోచింగ్‌ సెంటర్లకు ద్వారా వాటిని అమ్ముకుంటుంటారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ప్రభుత్వం కోచింగ్‌ సెంటర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. పట్టభద్రుల నుంచి కోచింగ్‌ల పేరిట కోట్లు సంపాదించుకోవాలని చూశారు. కాని హరికృష్ణ ఆశలు కాంగ్రెస్‌ పార్టీ ద్వారా తీరలేదు. ఆయనకు టికెట్‌ రాలేదు. అయినా సరే కొండంత అండగా కోచింగ్‌ సెంటర్లు వుండడంతో ఆయన ఇండిపెండెంటుగా నామినేషన్‌ వేశారు. బిఎస్పీ కండువా కంప్పుకొని తిరుగుతున్నారు. ఈ విషయాలు పట్టభద్రులు తెలుసుకుంటే ఆయన అసలు నిజస్వరూపం తెలిసిపోతుంది. చైతన్య వంతులైన పట్టభద్రులను మోసం చేయడం ఎవరి వల్ల కాదన్నది ప్రజల అభిప్రాయం. ఎన్నికలంటేనే ఎన్నెన్నో లెక్కలు..విద్యలు..ఎత్తులు..జిత్తులు…కథలు…నటనలు..సానుబూతి పవనాలు. .ఇన్ని దాగి వుంటాయి. కాని కొన్ని ఎన్నికలు అలా వుండకూడదు. ముఖ్యంగా పెద్దల సభకు జరిగే ఎన్నికలైనా నీతిగా, నిజాయితీ వుండాలని రాజ్యాంగ పెద్దలు కొన్ని నియమనిబంధనలు ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీలు వాటిని కూడా తుంగలో తొక్కడం అలవాటు చేసుకున్నారు. ఎన్నికల వ్యవస్దలో వున్న లొసుగులను ఆసరాగా చేసుకుంటున్నారు. ఇక తీర్పునివ్వాల్సింది పట్టభద్రులే…

అన్న బెదిరింపులు..తమ్ముడి అర్థింపులు!!

`రెండు సంవత్సరాల క్రితమే విఆర్‌ఎస్‌ తీసుకున్న మహేందర్‌ రెడ్డి

`రాజీనామా చేసినా ఉద్యోగ సంఘంలో నాయకుడు చెలామణి

Vanga mahender reddy

`అటు రియలెస్టేట్‌ వ్యాపారం.. ఇటు రాజకీయం

`సులువుగా ఎమ్మెల్సీ కావాలనే దొడ్డి దారి రాజకీయం

`మొత్తానికి టిచర్స్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ గెలవాలన్న తాపత్రయం

`అడ్డదారిలో ఆధిపత్య కుటిల ప్రయత్నం

`పిఆర్‌టియు అభ్యర్థి వంగా మహేందర్‌ రెడ్డి అసత్యాలు ప్రచారం

`అన్నను అడ్డం పెట్టుకొని గెలిచేందుకు పన్నాగం

`అబద్దాలు ప్రచారం చేస్తూ గెలిచేందుకు విచిత్ర విన్యాసం

`పిఆర్‌టియు యూనియన్‌ విస్తుపోతున్న సందర్భం

`అన్న సహకారంతో జరుగుతున్న మంత్రాంగం

`డిఈఓలు, ఎంఈఓలతో ఒత్తిడి రాజకీయాలు

`ఎలాగైనా మహేందర్‌ రెడ్డి గెలవాలని డిఈఓలు, ఎంఈవోలు ఆర్డర్లు

`సైలెంట్‌గా సాగుతున్న మహేందర్‌ రెడ్డి ప్రచారం

`చాపకింద నీరులా సాగిస్తున్న రాజకీయం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాధారణ రాజకీయాలను మించిపోయాయి. ఉద్యోగ సంఘాలు కూడా టిక్కెట్లు అమ్ముకునే స్ధాయికి ఎదిగిపోయాయి. ఇది ఎవరో కాదు సాక్ష్యాత్తు ఓ టీచర్‌ ఎమ్మెల్సీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఒక సామాన్యమైన ఉపాద్యాయుడు కోట్లు పెట్టి టిచర్‌ ఎమ్మెల్సీ టికెట్‌ కొనుక్కునే పరిస్దితి వుంటుందా? అప్పులు చేసినా సాధ్యమౌతుందా? కాని టిక్కెట్ల పంపిణీలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు కూడా స్వయంగా ఆ టీచర్‌ ఎమ్మెల్సీ మీడియా ముఖంగా చెబుతున్నాడంటే రాజకీయాలు ఎంత ఖరైదైపోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఒక సగటు ఉపాధ్యాయుడు కరీంనగర్‌ టీచర్స్‌ ఎమ్మెల్సీ టికెట్‌ కోట్లు పెట్టి ఎలా కొనుగోలు చేశాడు. దాని వెనుకు వున్న నిగూఢమైన రహస్యమేటి? రోజూ స్కూలుకు వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు కోట్ల రూపాయలు సంపాదించడం సాద్యమా? అంటే కొన్ని సార్లు సాధ్యమే..కాని అసలైన ఉపాధ్యాయుడు కాదు…ఉపాధ్యాయ కొలువును అడ్డం పెట్టుకొని రియల్‌ వ్యాపారాలు సాగించి, ఫైనాన్స్‌ వ్యవహారాలు నిర్వహించే వారికి మాత్రమే సాధ్యం. అలా కరీంనగర్‌ ఉపాద్యాయ ఎమ్మెల్సీని పేరు పొందిన ఉపాద్యాయ సంఘం నుంచి వంగ మహేందర్‌ రెడ్డి ఎలా కొనుగోలు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఈ ఎమ్మెల్సీ అభ్యర్ధి స్వయాన అన్న వంగ రవీందర్‌ రెడ్డి. ఆయన తెలంగాణ రెవిన్యూ అసోసియేషన్‌ రాష్ట్ర అద్యక్షుడు. ఈ వ్యవహారమంతా ఆయనే దగ్గరుండి నడిపిస్తున్నాడని అంటున్నారు. అందులో భాగంగా రవీందర్‌ రెడ్డి నాలుగు ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్‌, మెదక్‌, నిజాబామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన డిఈవోలు, ఏంఈవోలపై పెద్దఎత్తున ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. తన తమ్ముడు వంగ మహేందర్‌ రెడ్డి గెలుపుకోసం అందరూ సహకరించాలని ఆయన ఆర్డర్లు వేస్తున్నట్లు చెబుతున్నారు. డీఈవోలు, ఎంఈవోలపై ఒత్తిడి తెచ్చి, ఉపాద్యాయులకు వారితో ఫోన్లు చేయిస్తున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై భారతీయ జనతాపార్టీ ఏకంగా ఎన్నికల కమీషన్‌కు ఉత్తరంకూడ రాశారు. వంగా రవీందర్‌ రెడ్డి తన తమ్ముడు వంగా మహేందర్‌ రెడ్డి గెలుపుకోసం ఉపాద్యాయులు మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నట్లు ఎన్నికల కమీషన్‌కు వివరించారు. ఇక అసలు విషయానికి వస్తే వంగా మహేందర్‌రెడ్డి ఉపాద్యాయ కొలువులో చేరినప్పటినుంచి పిఆర్‌టీయూ యూనియన్‌లో క్రియాశీలకంగా పనిచేయడం మొదలు పెట్టారు. అప్పటికే తన అన్న రవీందర్‌రెడ్డి కూడా ఆయన కొలువు చేస్తున్న శాఖలో నాయకత్వం ఎలా చేస్తున్నాడో చూసిన మహేందర్‌ రెడ్డి కొలువులో చేరిన కొద్ది రోజులకే నాయకుడయ్యారు. చదవు చెప్పడం గాలికి వదిలేశాడు. రేపటి తరాన్ని తీర్చిదిద్దాల్సిన మహేందర్‌ రెడ్డి యూనియన్‌ రాజకీయాలు మొదలు పెట్టారు. చదువు చెప్పాల్సిన అవసరం లేకుండా చేసుకున్నాడు.

అలా అంచెలంచెలుగా యూనియన్‌లో ఎదుగుతూ వచ్చారు. 2004 తర్వాత తెలంగాణలో వచ్చిన రియల్‌ బూమ్‌ను ఆసరా చేసుకున్నాడు. అటు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే రియల్‌ వ్యాపారం మొదలు పెట్టారు. రియల్‌ వ్యాపారాన్ని కూడా టీచర్లతోనే మొదలు పెట్టి, వ్యాపారాన్ని పెంచుకున్నాడు. అలా కొలువును గాలికి వదిలేసి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఇక ఇదిలా వుంటే పేద ప్రజలకు చదువు చెప్పాల్సిన కొలువులో వుంటూ, వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత విస్మరించారు. సిద్దిపేటలో కార్పోరేట్‌ స్కూల్‌ ఏర్పాటు చేశాడు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాను కొలువు చేసే చోట విద్యా కుసుమాలను వికసింపచేయాల్సిందిపోయి, తన ప్రైవేటు స్కూల్‌లో చదువు పేరుతో దోపిడీ మొదలు పెట్టాడు. అటు రియల్‌ వ్యాపారం, ఇటు ప్రైవేటు కార్పోరేట్‌స్కూలు, మహేందర్‌రెడ్డికి మరో సోదరుడి పేరు మీద కొన్ని కళాశాలలో పార్టనర్‌ షిప్‌లో పూర్తిగా విద్యా వ్యాపారం మొదలు పెట్టారు. అన్న రెవిన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడుగా వుండడం, ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలున్నాయో గుర్తించడం, వాటిని తమకు అనుకూలంగా మల్చుకోవడం, అక్కడ రియల్‌ వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. అయితే తమ వ్యాపారాలపై ఎవరి కన్ను పడకుండా ఓ స్వచ్ఛంద సంస్ధను ఏర్పాటు చేశారు. ఈ సంస్ధనిర్వహణకు మరో వైపు పెద్దఎత్తున విరాళాలు సేకరించడం అలవాటు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆ సంస్థ నిర్వహణ కోసం అటు నిధులసేకరణను తోడు చేసుకొని రాజకీయాల్లోకి వచ్చేందుకు మార్గం వేసుకున్నాడు. కొన్ని స్కూళ్లలో వాటర్‌ ప్లాంటులుఏర్పాటుచేసి విద్యా వ్యవస్ధకు మేలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం తన ఉద్యోగానికి వాలెంటరీ రిటైర్‌ మెంటుతీసుకొని ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వ్యూహాలు మొదలు పెట్టారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత కూడా వంగ మహేందర్‌ రెడ్డి ఎలా ఉపాద్యాయ సంఘం నాయకుడుగా వుంటారు. ఎలా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి అర్హుడౌతాడు. కేవలం ఎన్నికల కోసం కొద్ది రోజుల ముందు రాజీనామా చేశారంటే అదీ కాదు. రెండు సంవత్సరాల క్రితమే రాజీనామా చేశారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే ఆ కొలువును అలాగా వదిలేస్తారా? అంటే అదీ వుండదు. అదృష్టం వుండి గెలిస్తే ఎమ్మెల్సీ అవుతారు. లేకుంటే ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకొని మళ్లీ ఉపాద్యాయ కొలువులో చేరుతారు. ఇలాంటి జిత్తుల మారి రాజకీయాలు చాలా మంది చేస్తున్నారు. అందులో వంగా మహేందర్‌ రెడ్డి ఒకరు. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చులో ఎమ్మెల్సీ కావాలనుకునే కొంత మంది ఈ దారిని ఎంచుకున్నారు. అటు అన్న రెవిన్యూ అసోసియేషన్‌ ద్వారా తన పలుకుబడిని ఉయోగిస్తున్నాడు. రవీందర్‌ రెడ్డిపై కూడా పెద్దఎత్తున ఆరోపణలున్నాయి. తన ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్లు సంపాదించారనే అపవాదు వుండనేవుంది. సంపాదించిన ఆస్ధులను కాపాడుకోవాంటే తన తమ్ముడు ప్రజా ప్రతినిధి కావడం ఒక్కటే మార్గం అనుకున్నారు. ఇలా సులువైన మార్గంలో ఎమ్మెల్సీ కావడం రవీందర్‌రెడ్డికి దారి లేదు. తిమ్మిని బమ్మిని చేసి రికార్డులు మార్చి, ఆక్రమణదారులకు సహకరించి, సంపాదించిన సొమ్ముతో తమ్ముడితో రియల్‌ వ్యాపారం రవీందర్‌ రెడ్డి సంపాదించారు. అలా అన్నదమ్ములంతారూ అక్రమంగా సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలంటే టీచర్స్‌ ఎమ్మెల్సీ ఒక్కటే మార్గమని ఎంచుకున్నారు. ఇది టీచర్స్‌ యూనియన్‌లోని సభ్యులే చెబుతున్నమాట.

ఓ ఎమ్మెల్సీ మీడియా సమావేశంలో పూసగుచ్చినట్టు చెప్పిన ముచ్చట. ఒక నిబద్దత గలిగిన గురువు విద్యార్టులకు విద్యతోపాటు విద్యా వ్యవస్ధలో రావాల్సిన నూతన ఆవిష్కరణల గురించి మాట్లాడతారు. ప్రభుత్వ విద్యా వ్యవస్ధ మేలు కోసం పనిచేస్తాడు. అలాంటి ఉపాధ్యాయులను ఎమ్మెల్సీలు చేయడానికి సంఘాలకు కూడా చేతులు రావడం లేదు. టిక్కెట్లు అమ్ముకునే యూనియన్లు వుంటే మహేందర్‌ రెడ్డి లాంటి టీచర్లే ఎమ్మెల్సీ కావాలని కలలు గంటారు. ముఖ్యంగా ఈ దారి ఎంతో సులువైంది. తాను ఉపాద్యాయుడై రేపటి తరానికి దారి చూపుతాననుకునే ఏ ఉపాద్యాయుడు తన వృత్తికి ద్రోహం చేయడు. కాని ఉపాద్యాయ కొలువు పొంది, రాజకీయాలను లక్ష్యంగా చేసుకునే కొంతమంది ఇలా ప్రభుత్వాలను మోసం చేస్తుంటారు. పదవులు అడ్డం పెట్టుకొని కొలువులు చేయకుండా రాజకీయాలు చేస్తుంటారు. లేనిపోని హమీలు ఎంతో చైతన్యవంతులైన ఉపాద్యాయులకే చెబుతుంటారు. సాటి ఉపాద్యాయులను కూడా మోసం చేస్తుంటారు. పాత పెన్షన్‌ విధానం తీసుకురావడం అసలు సాధ్యమా? ప్రభుత్వాలతోనే సాధ్యం కాని ఆ విదానం టీచర్‌ ఎమ్మెల్సీలతో సాధ్యమౌతుందా? దేశ వ్యాప్తంగా అమలౌతున్న కొత్త విధానంలో మార్పు చేయడానికి కేంద్ర ఒప్పుకుంటుందా? అది అమలు రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యపడుతుందా? కేంద్రం అంగీకరించకుండా జరుగుతుందా? విద్య అనేది రాష్ట్ర స్ధాయిలో వుండే అంశం కాదు. ఉమ్మడి అంశం. కేంద్రం జోక్యం లేకుండా ఎలాంటి నిర్ణయాల అమలు సాధ్యంకాదు. కాని తమ రాజకీయ భవిష్యత్తు కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడై వుండి, యూనియన్‌ సభ్యులను మోసం చేసేవారిని ఎలా ఎన్నుకుంటారో కూడా టీచర్లే ఆలోచించుకోవాలి.

భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కరీంనగర్ జిల్లా కలెక్టర్ బి.గోపి

జమ్మికుంట కరీంనగర్ జిల్లా నేటిధాత్రి : 

భారీ వర్షాల దృష్యా లొతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ బి. గోపి అన్నారు. గురువారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని హోసింగ్ బోర్డ్ కాలనీని సిపి సుబ్బారాయుడు, ఆర్డీఓ హరిసింగ్ ఇతర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ బి. గోపి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గోపి మాట్లాడుతూ, జమ్మికుంట పట్టణంలోని హోసింగ్ బోర్డ్ కాలనీలో ఇళ్లలోకి వరదనీరు వెళ్లగా.. కాలనీ పరిసరాలను పరిశీలించి అక్కడి పరిస్థితులను గురించి వాకబు చేశారు. రానున్న 24 గంటల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని. కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలకు ఎటువంటి హాని కలుగకుండా వెంటనే వారిని ఆయా ప్రాంతాల నుండి తరలించడానికి అవసరమైన సహాయక చర్యలతో అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఇంకా పొంగిపొర్లడానికి సిద్ధంగా ఉన్న వాగులు, కాలువలు వద్ద ఎప్పటికప్పుడు నీటి సామర్థ్యాన్ని పరిశీలించాలని, నీటి ఉధృతికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను గురించి తెలుసుకుంటు సంబంధించిన విషయాన్ని తెలియజేయాలని అన్నారు. పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు మాట్లాడుతూ, పోలీస్ అధికారులందరు వారిపరిధిలోనీ సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని. సహాయక చర్యలు అందించడానికి సంసిద్ధంగా ఉండాలని తెలిపారు. రోడ్ల పై నుండి వరద నీరు ప్రవహించే మార్గాలలో రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలని సూచించారు. ఈ పర్యటనలో హుజురాబాద్ ఆర్డీఓ హరిసింగ్, ఎసిపి జీవన్ రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, తహసీల్దార్ బండిరాజేశ్వరి, సిఐ బర్పటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version