తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా కమిటీ డిమాండ్
నేటిధాత్రి, వరంగల్
తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సమావేశం వరంగల్ నగరం అబ్బనికుంటలో, రైతు సంఘ భవనంలో సోమిడి శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘ నిర్మాణ ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను నేటికీ 75% మందికి ఉపాధినిస్తున్న మన వ్యవసాయం, సంక్షోభంలోకి నెట్టి వేయబడుతుంది. మారుతున్న సాంకేతిక నాగరిక విలువలకు తగిన విధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు ప్రణాళిక బద్ధంగా నిర్మానితంగా పనిచేయడంలో చిత్తశుద్ధిని చూపలేకపోయిన కారణంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా నష్టాలలోనే మూతపడ్డాయి. లక్షలాది మంది కార్మికులు ఉద్యోగులు నిరుద్యోగులుగా మారిపోయారు. ప్రభుత్వాలు రైతాంగానికి అరకొర సదుపాయాల పేరుతో నగదు సహాయాలను అందిస్తూ రైతాంగం వ్యవసాయాన్ని నెట్టుకు వచ్చేలా చూస్తున్నారు కానీ, శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వాలు ఆలోచించక పోవడం దురదృష్టకరమని తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షులు సోమీడి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కమిటీ ఈ కింది డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని లాభచాటుగా మార్చాలని చిత్తశుద్ధి ఉంటే ఈ కింది డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరారు. మద్దతు ధరను చట్టబద్ధత చేయాలి, వ్యవసాయ రంగానికి జాతీయ ఉపాధి హామీ పథకం వర్తింప చేయాలి, రైతుల పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, మద్దతు ధర వ్యవస్థను రద్దు చేయాలి, వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారికి ఉచిత విద్య పైద్యం అందించాలి, ప్రభుత్వం గ్యారంటీతో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు 75% సబ్సిడీతో ప్రభుత్వమే అందించాలి. పై డిమాండ్లు అమలు కొరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంఘ ఆధ్వర్యంలో గ్రామ మండల కమిటీలను నియమించుకోవాలని సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ, పై డిమాండ్లు అమలయే వరకు పోరాటం కొనసాగించాలని కమిటీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారు జిల్లా ప్రధాన కార్యదర్శి వదల రాజయ్య, కోశాధికారి సెల్ల రవీందర్, ఉపాధ్యక్షుడు అంశాల్ రెడ్డి, కమిటీ సభ్యులు బరపటి రవీందర్, సోమిరెడ్డి సాంబయ్య, పేరయ్య, బుల్లయ్య, రాజమౌళి, పైడి, జెండా అంబయ, బుచ్చిరెడ్డి ఇంకా తదితరులు పాల్గొన్నారు.