శ్రీలంక: తుపాను, వరద తీవ్రతలను చూపే 8 ఫోటోలివే…

శ్రీలంక: తుపాను, వరద తీవ్రతలను చూపే 8 ఫోటోలివే…

 

 

ఫొటో క్యాప్షన్,భారీ వర్షాల కారణంగా కొలంబోలోని కడువెల ప్రాంతంలో నీట మునిగిన ప్రాంతం

గమనిక : ఈ కథనంలో కలచి వేసే అంశాలున్నాయి

శ్రీలంకలో దిత్వా తుపాను వల్ల ఇప్పటి వరకు 193 మంది చనిపోయారని, 228 మంది గల్లంతయ్యారని విపత్తు నిర్వహణ విభాగం ప్రకటించింది.

వరదల వల్ల 26,114 కుటుంబాలకు చెందిన 9.68 లక్షల మంది ప్రభావితమయ్యారు. భారీ వర్షాలకు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి.

దిత్వా తుపాను ప్రస్తుతం బంగాళాఖాతంలో చెన్నైకి దక్షిణంగా 250 కి.మీ. దూరం ప్రయాణిస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

అది తమిళనాడు పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా కదులుతోంది. ఆదివారం (నవంబర్ 30) సాయంత్రానికి తీరాన్ని సమీపిస్తుందని అంచనా

ఫొటో క్యాప్షన్,దిత్వా తుపాను కారణంగా తమిళనాడుతోపాటు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులోని అనేక జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన సెన్యార్ తుపాను తూర్పు వైపుకు కదిలి ఇండోనేషియాలో భారీ నష్టాన్ని కలిగించింది.

ఈ వారం బంగాళాఖాతంలో మలక్కా జలసంధి సమీపంలోని సెన్యార్, శ్రీలంకకు దక్షిణంగా దిత్వా అనే రెండు తుపానులు దాదాపు ఒకేసారి వచ్చాయి.

“బంగాళాఖాతంలో ఇది చాలా అరుదైన సంఘటన” అని స్వతంత్ర వాతావరణ శాస్త్రవేత్త శ్రీకాంత్ అన్నారు.

దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులోని కడలూరు, నాగపట్నం, మైలదుత్తురై, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలు, పుదుచ్చేరి, కారైకల్‌లలో కొన్నిచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర తమిళనాడు , పుదుచ్చేరి తీరప్రాంత జిల్లాలలో గంటకు 60 నుండి 70 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఫొటో క్యాప్షన్,దిత్వా తుపాను ప్రభావం తీర ప్రాంతంలో బలమైన గాలులు వీస్తున్నాయి.
ఫొటో క్యాప్షన్,శ్రీలంకలో దిత్వా తుపాను ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌లో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను ప్రభావంతో రానున్న 3 రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

డిసెంబర్ 1న తుపాను వేగం గంటకు 45-55 కి.మీ.లకు (అప్పుడప్పుడు గంటకు 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి) తగ్గుతుంది.

తుపానును దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు.

ఫొటో క్యాప్షన్,శ్రీలంకలోని కాండీ సమీపంలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.

శ్రీలంకలోని కాండీలోని సరసవిగమ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి నలుగురు పిల్లలు సహా 23 మంది తమిళులు మరణించారని స్థానికులు బీబీసీతో చెప్పారు. కొండచరియలు విరిగిపడిన సంఘటన గురువారం రాత్రి జరిగింది.

కొండ చరియలు విరిగి పడినప్పుడు సహాయక చర్యలు ప్రారంభించిన కాసేపటికే మరోసారి భారీ కొండచరియలు విరిగిపడ్డాయని స్థానికులు చెప్పారు.

ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన 14 మంది మృతదేహాలను వెలికితీశారు. మిగతా వారి మృతదేహాలను వెదికేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు.

ఫొటో క్యాప్షన్,కొలంబో శివారు ప్రాంతం వెల్లంపిటియలో వరద నీటిలో సురక్షిత ప్రాంతానికి వెళుతున్న స్థానికులు.

దిత్వా తుపాను శుక్రవారం శ్రీలంకను తాకింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వరద పోటెత్తింది.

బదుల్లా జిల్లాలో (తేయాకు తోటలు ఉన్న ప్రాంతం) కొండచరియలు విరిగిపడి 21 మంది మరణించారని విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది.

కాండీ, అంపారా, బదుల్లా జిల్లాల్లోనే తుపాను కారణంగా ఎక్కువ మరణాలు సంభవించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాలను కలిపే ప్రధాన రహదారులను మూసివేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి కొన్ని ముఖ్యమైనవి మినహా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.

మరోవైపు, రావల్పిండిలో పాకిస్తాన్‌తో జరుగుతున్న ట్వంటీ ట్వంటీ ఇంటర్నేషనల్ ట్రై సిరీస్ ఫైనల్ క్రికెట్‌ మ్యాచ్‌లో తుపాను బాధితుల కోసం శ్రీలంక క్రికెటర్లు ఒక నిముషం మౌనం పాటించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version